సాక్షి, నారాయణపేట రూరల్: పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు మినహాయింపు ప్రక్రియ ఇటు ప్రభుత్వం ప్రకటించడానికి, అటు అధికారులు చెప్పుకోవడానికి మాత్రమే పరిమితమైంది. ఏటా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం నోటిఫికేషన్‌లో వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు మినహాయింపును చేర్చుతూనే వస్తోంది. కానీ నిబంధనల ప్రకారం ఏ ఒక్కరికీ అది ఉపయోగపడటం లేదు. పొంతనలేని వార్షిక ఆదాయం కారణంగా ప్రతి ఒక్కరూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
టెన్త్ విద్యార్థులు ఇలా..
జిల్లా వ్యాప్తంగా 11 రకాలైన విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. వాటిలో సింగారం క్రాస్‌రోడ్డులో ఉన్న సీబీఎస్‌ఈ విద్యాలయం మినహాయిస్తే మిగితా వాటిలోని పదో తరగతి విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ పరీక్షలకు హాజరవుతారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 753 మంది, 70 లోకల్‌బాడీ స్కూల్‌లలో 5,280, మూడు ఎయిడెడ్ స్కూళ్లలో 102 మంది, 45 ప్రైవేటు పాఠశాలల్లో 1,315 మంది, 11 కేజీబీవీల్లో 504 మంది, ఒక జ్యోతిరావుఫూలే స్కూల్‌లో 73మంది, రెండు మాడల్ స్కూల్‌లలో 192 మంది, రెండు మైనార్టీ గురుకులలో 135, ఆరు సోషల్ వెల్ఫేర్‌లో 480, ఒక ట్రైబల్ వెల్ఫేర్‌లో 79మందితో కలుపుకుని మొత్తం 4,354 మంది బాలురు, 4,597 మంది బాలికలతో కలిసి 8,961 మంది టెన్త్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
చదవండి: (రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 706 రోజుల తర్వాత..)
వెనకబడిన వారికి మినహాయింపు
అన్నిరకాల యాజమాన్య పాఠశాలల్లో ఈ ఏడాది మే 11నుంచి 17వరకు జరిగే టెన్త్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వార్షిక ఫీజు మినహాయింపు సౌకర్యాన్ని ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఆయా పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి ఈ అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఫీజు చెల్లింపుతో పాటు విద్యార్థి వారి కుటుంబ ఆదాయ ధ్రువపత్రం అందించాల్సి ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ.20వేలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.24 వేలలోపు వార్షిక ఆదాయం నిబంధన విధించడంతో ఏ ఒక్కరికీ ఈ ప్రయోజనం చేకూరడంలేదు.
రాష్ట్రంలో ఏ పథకమైనా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ప్రభుత్వం వర్తింపజేస్తుంది. ఇందుకు గరిష్ఠ ఆదాయం రూ.లక్షకు పైగానే ఉంటుంది. కానీ టెన్త్ విద్యార్థులకు వచ్చేసరికి ఇంత తక్కువగా కేటాయించారు. అయితే గత 30ఏళ్లుగా ఇదే డిజిట్ కొనసాగిస్తున్నారని, 2015 నుంచి మార్చాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసిన మార్పు జరగడంలేదని తెలుస్తోంది. దీంతో 8,165 మంది వెనకబడిన కులాల విద్యార్థులకు ప్రయోజనం లేకుండాపోతుంది.
హాస్టల్‌లో చదువుతున్న వారికి ప్రత్యేకం
బీసీ విద్యార్థులు ప్రభుత్వ వసతిగృహాల్లో ఉండి చదువుతున్న విద్యార్థులకు ఆ శాఖ కమిషనర్ ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు కొందరు ఫీజు రాయితీ పొందగలిగారు. మక్తల్ గరŠల్స్‌లో 8, బాయ్స్‌లో 17, ఊట్కూర్ బాయ్స్‌లో 9, మద్దూర్ గరŠల్స్‌లో 14, కన్మనూర్ 5, ధన్వాడ మాడల్ స్కూల్‌లో 1, నారాయణపేట వైదిక పాఠశాలలో 4 చొప్పున 58మంది, అదేవిధంగా కేజీబీవీల్లో చదువుతున్న మొత్తం 504 మంది బాలికలకు ఫీజు రాయితీ వచ్చింది. కానీ పేరెంట్స్ వార్షిక ఆదాయ ధ్రువపత్రంతో మాత్రం కాదనేది విస్పష్టం. అదేవిధంగా 14 సంవత్సరాల వయస్సు కంటే తక్కువగా ఉన్న వారు మెడికల్ సర్టిఫికెట్‌తో పాటు రూ.300 చెల్లించి ప్రభుత్వ పరీక్షల విభాగానికి చలాన్ కట్టి జిల్లాలో 55మంది పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత తీసుకున్నారు.
పరీక్ష ఫీజు చెల్లింపు ఇలా..
ఏటా అక్టోబర్‌లోనే టెన్త్ పరీక్ష ఫీజు షెడ్యూల్డ్ విడుదల చేసే బోర్డు అధికారులు రెండేళ్లుగా కరోనా కారణంగా ఆలస్యంగా విద్యాబోధన ప్రారంభం కావడంతో ఈసారి సైతం పరీక్ష ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ టెన్త్ బోర్డు గతనెల చివరన విడుదల చేశారు. అయితే రెగ్యులర్ విద్యార్థులు రూ.125 చెల్లించాల్సి ఉండగా సప్లమెంటరీ విద్యార్థులు 3సబ్జెక్టులోపుకు రూ.110, మూడు దాటితే రూ.125 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు రూ.185 కట్టాల్సి ఉంటుంది. వీటిని సంబందిత హెచ్‌ఎంలకు ఈనెల 14 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించాల్సి ఉండగా, రూ.50 జరిమానాతో ఫిబ్రవరి 24వరకు చెల్లించాల్సి ఉండింది. ఇక రూ.200తో మార్చి 4వరకు, ఆఖరులో రూ.500 అపరాధ రుసుం చెల్లిస్తే మార్చి 14వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం..
ప్రభుత్వం సూచించిన ఆదేశాల ప్రకారం ఎస్‌ఎస్‌సీ బోర్డు ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం జిల్లాలోని అన్నియాజమాన్య పాఠశాలల హెచ్‌ఎంలకు వాటి ప్రతిని అందించాము. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు పరీక్ష ఫీజు మినహాయింపు పొందాలంటే తప్పకుండా వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కుటుంబానికి రూ.20వేలు, పట్టణాల్లో రూ.24వేలు దాటకూడదు. అలాంటి దరఖాస్తు ఒక్కటి కూడా రాలేదు. కేవలం బీసీ హాస్టల్‌కు చెందిన 58, కేజీబీవీలకు చెందిన 504తో కలిపి 531మంది ఫీజు రాయితీతో పరీక్షకు హాజరవుతున్నారు.
– రాజేంద్రకుమార్, జిల్లా పరీక్షల విభాగ అధికారి
Comments
Please login to add a commentAdd a comment