గాలి మార్పు కోసం సొంత గ్రామానికి వెళ్లారు ఈ దంపతులు. గాలిలో మార్పు సంగతి ఏమిటో గానీ... పేదరైతు జీవితంలో మార్పుకు శ్రీకారం చుట్టే యంత్రాన్ని ఆవిష్కరించారు. ‘ఎలక్ట్రిక్ బుల్’ ఇచ్చిన ఉత్సాహంతో సామాన్య రైతుకు ఉపయోగపడే మరిన్ని యంత్రాల రూపకల్పనకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు...
కోవిడ్ కరకు మేఘాలు దట్టంగా అలుముకున్న రోజులవి. ఎటు చూసినా వర్క్ ఫ్రమ్ హోమ్‌లే!
‘ఊరెళదామా... కాస్త మార్పుగా ఉంటుంది’ భర్త తుకారామ్‌ను అడిగింది సోనాలి వెల్జలి.
‘ఇది సరిౖయెన టైమ్. కచ్చితంగా వెళ్లాల్సిందే’ అన్నాడు తుకారామ్.
మార్పు సంగతి ఏమిటోగానీ, ఊరికెళ్లాలి అనే వారి నిర్ణయం పేదరైతు వ్యవసాయంలో కొత్త మార్పునకు శ్రీకారం చుట్టింది.
వృత్తిరీత్యా పుణె(మహారాష్ట్ర)లో నివసించే సోనాలి–తుకారామ్ దంపతులు తమ స్వగ్రామం అందేర్‌సల్‌కు వెళ్లారు. పండగలకో, పబ్బాలకో ఊరికి వెళ్లినా... ఇలా వెళ్లి అలా వచ్చేవారు. ఈసారి మాత్రం చాలా తీరిక దొరికింది. ఆ తీరిక ఎన్నో విషయాలు తెలుసుకునేలా చేసింది.
సోనాలి ఏ రైతుకుటుంబాన్ని పలకరించినా ఒకేలాంటి కష్టాలు.
పెద్దరైతులు తప్ప రెండెకరాలు, మూడెకరాలు ఉన్న పేదరైతులు యంత్రాలను ఉపయోగించే పరిస్థితి లేదు. అలా అని పశువులు అందుబాటులో లేవు. కూలీల కొరత మరో సమస్య. కూలీలు అందుబాటులో ఉన్నా డబ్బు మరో సమస్య.
ఒకరోజు చిన్నరైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి భర్తతో మాట్లాడింది సోనాలి. దంపతులు ఇద్దరూ ఇంజనీర్లే. ఆ మాటా ఈ మాటా మాట్లాడుకున్న తరువాత వారికి ‘ఎలక్ట్రిక్ బుల్’ అనే ఆలోచన వచ్చింది.
ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో రాత్రనకా, పగలనకా ఆ కాన్సెప్ట్‌పై పనిచేయడం మొదలు పెట్టారు. విషయం తెలిసి ఊళ్లో వాళ్లు గుంపులు గుంపులుగా వీరి ఇంటికి వచ్చేవాళ్లు.
వారందరూ పేదరైతులే.
పనిలో పనిగా తమ సమస్యలను ఏకరువు పెట్టేవాళ్లు.
‘నా పొలంలో ట్రాక్టర్‌లాంటి పెద్ద యంత్రాలను ఉపయోగించడం వీలు కాదు. ఎద్దుల ద్వారా మాత్రమే సాధ్యం అయ్యే వ్యసాయం మాది. కానీ అవి మా దగ్గర లేవు’ అన్నాడు ఒక రైతు. నిజానికి ఇది ఈ రైతు సమస్య మాత్రమే కాదు ఎందరో రైతుల సమస్య.
తయారు కాబోతున్న ‘ఎలక్ట్రిక్ బుల్’ గురించి పేదరైతుల ఆసక్తి గమనించిన తరువాత సోనాలి– తుకారామ్‌లలో పట్టుదల మరింతగా పెరిగింది. వారి కృషి ఫలించి ఎట్టకేలకు ‘ఎలక్ట్రిక్ బుల్’ తయారైంది. సాంకేతిక నిపుణుల బృందం ఈ యంత్రాన్ని పరీక్షించి ఓకే చెప్పింది. పేదరైతులకు అందుబాటు ధరలలో ఉండే ఈ బుల్‌తో విత్తనాలు చల్లడం నుంచి పిచికారి చేయడం వరకు ఎన్నో పనులు చేయవచ్చు. రైతుకు ఖర్చు బాగా తగ్గు తుంది.
ఒక్కసారి ఫుల్‌గా రీఛార్జి చేస్తే నాలుగు గంటల పాటు పనిచేస్తుంది.
‘ఆరు, ఏడు మంది కూలీలతో మూడు రోజులలో చేసే పొలం పనిని ఈ యంత్రం ద్వారా గంటల వ్యవధిలోనే పూర్తి చేయగలిగాను. ట్రాక్టర్ కొనలేని, అద్దెకు తెచ్చుకోలేని చిన్న రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది’ అంటున్నాడు సుభాష్ చవాన్ అనే రైతు. పరీక్షదశలో భాగంగా అతడు ఎలక్ట్రిక్ బుల్‌ను ఉపయోగించి ‘శభాష్’ అంటూ కితాబు ఇచ్చాడు.
తమ స్టార్టప్ ‘కృషిగటి’ ద్వారా ఎలక్ట్రిక్ బుల్‌ల అమ్మకానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు సోనాలి–తుకారామ్ దంపతులు.
‘నాలోని ఇంజనీరింగ్ స్కిల్స్ పేదరైతులకు మేలు చేయడానికి ఉపయోగపడినందుకు సంతోషంగా ఉంది. ఎలక్ట్రిక్ బుల్ దగ్గరే ఆగిపోవాలనుకోవడం లేదు. రైతులకు రకరకాలుగా ఉపయోగపడే ఆరు రకాల యంత్రాలను రూపొందించనున్నాం. మన దేశంలోనే కాదు, ఎన్నోదేశాల్లో ఉన్న రైతులకు ఉపకరించే యంత్రాలు రూపొందించాలనేది మా భవిష్యత్ లక్ష్యం’ అంటుంది సోనాలి.
Comments
Please login to add a commentAdd a comment