tukaram
-
ఆవిష్కరణ..: పవర్ బుల్స్ సృష్టించారు!
గాలి మార్పు కోసం సొంత గ్రామానికి వెళ్లారు ఈ దంపతులు. గాలిలో మార్పు సంగతి ఏమిటో గానీ... పేదరైతు జీవితంలో మార్పుకు శ్రీకారం చుట్టే యంత్రాన్ని ఆవిష్కరించారు. ‘ఎలక్ట్రిక్ బుల్’ ఇచ్చిన ఉత్సాహంతో సామాన్య రైతుకు ఉపయోగపడే మరిన్ని యంత్రాల రూపకల్పనకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు... కోవిడ్ కరకు మేఘాలు దట్టంగా అలుముకున్న రోజులవి. ఎటు చూసినా వర్క్ ఫ్రమ్ హోమ్లే! ‘ఊరెళదామా... కాస్త మార్పుగా ఉంటుంది’ భర్త తుకారామ్‌ను అడిగింది సోనాలి వెల్జలి. ‘ఇది సరిౖయెన టైమ్. కచ్చితంగా వెళ్లాల్సిందే’ అన్నాడు తుకారామ్. మార్పు సంగతి ఏమిటోగానీ, ఊరికెళ్లాలి అనే వారి నిర్ణయం పేదరైతు వ్యవసాయంలో కొత్త మార్పునకు శ్రీకారం చుట్టింది. వృత్తిరీత్యా పుణె(మహారాష్ట్ర)లో నివసించే సోనాలి–తుకారామ్ దంపతులు తమ స్వగ్రామం అందేర్సల్కు వెళ్లారు. పండగలకో, పబ్బాలకో ఊరికి వెళ్లినా... ఇలా వెళ్లి అలా వచ్చేవారు. ఈసారి మాత్రం చాలా తీరిక దొరికింది. ఆ తీరిక ఎన్నో విషయాలు తెలుసుకునేలా చేసింది. సోనాలి ఏ రైతుకుటుంబాన్ని పలకరించినా ఒకేలాంటి కష్టాలు. పెద్దరైతులు తప్ప రెండెకరాలు, మూడెకరాలు ఉన్న పేదరైతులు యంత్రాలను ఉపయోగించే పరిస్థితి లేదు. అలా అని పశువులు అందుబాటులో లేవు. కూలీల కొరత మరో సమస్య. కూలీలు అందుబాటులో ఉన్నా డబ్బు మరో సమస్య. ఒకరోజు చిన్నరైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి భర్తతో మాట్లాడింది సోనాలి. దంపతులు ఇద్దరూ ఇంజనీర్లే. ఆ మాటా ఈ మాటా మాట్లాడుకున్న తరువాత వారికి ‘ఎలక్ట్రిక్ బుల్’ అనే ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో రాత్రనకా, పగలనకా ఆ కాన్సెప్ట్‌పై పనిచేయడం మొదలు పెట్టారు. విషయం తెలిసి ఊళ్లో వాళ్లు గుంపులు గుంపులుగా వీరి ఇంటికి వచ్చేవాళ్లు. వారందరూ పేదరైతులే. పనిలో పనిగా తమ సమస్యలను ఏకరువు పెట్టేవాళ్లు. ‘నా పొలంలో ట్రాక్టర్‌లాంటి పెద్ద యంత్రాలను ఉపయోగించడం వీలు కాదు. ఎద్దుల ద్వారా మాత్రమే సాధ్యం అయ్యే వ్యసాయం మాది. కానీ అవి మా దగ్గర లేవు’ అన్నాడు ఒక రైతు. నిజానికి ఇది ఈ రైతు సమస్య మాత్రమే కాదు ఎందరో రైతుల సమస్య. తయారు కాబోతున్న ‘ఎలక్ట్రిక్ బుల్’ గురించి పేదరైతుల ఆసక్తి గమనించిన తరువాత సోనాలి– తుకారామ్లలో పట్టుదల మరింతగా పెరిగింది. వారి కృషి ఫలించి ఎట్టకేలకు ‘ఎలక్ట్రిక్ బుల్’ తయారైంది. సాంకేతిక నిపుణుల బృందం ఈ యంత్రాన్ని పరీక్షించి ఓకే చెప్పింది. పేదరైతులకు అందుబాటు ధరలలో ఉండే ఈ బుల్‌తో విత్తనాలు చల్లడం నుంచి పిచికారి చేయడం వరకు ఎన్నో పనులు చేయవచ్చు. రైతుకు ఖర్చు బాగా తగ్గు తుంది. ఒక్కసారి ఫుల్‌గా రీఛార్జి చేస్తే నాలుగు గంటల పాటు పనిచేస్తుంది. ‘ఆరు, ఏడు మంది కూలీలతో మూడు రోజులలో చేసే పొలం పనిని ఈ యంత్రం ద్వారా గంటల వ్యవధిలోనే పూర్తి చేయగలిగాను. ట్రాక్టర్ కొనలేని, అద్దెకు తెచ్చుకోలేని చిన్న రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది’ అంటున్నాడు సుభాష్ చవాన్ అనే రైతు. పరీక్షదశలో భాగంగా అతడు ఎలక్ట్రిక్ బుల్‌ను ఉపయోగించి ‘శభాష్’ అంటూ కితాబు ఇచ్చాడు. తమ స్టార్టప్ ‘కృషిగటి’ ద్వారా ఎలక్ట్రిక్ బుల్ల అమ్మకానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు సోనాలి–తుకారామ్ దంపతులు. ‘నాలోని ఇంజనీరింగ్ స్కిల్స్ పేదరైతులకు మేలు చేయడానికి ఉపయోగపడినందుకు సంతోషంగా ఉంది. ఎలక్ట్రిక్ బుల్ దగ్గరే ఆగిపోవాలనుకోవడం లేదు. రైతులకు రకరకాలుగా ఉపయోగపడే ఆరు రకాల యంత్రాలను రూపొందించనున్నాం. మన దేశంలోనే కాదు, ఎన్నోదేశాల్లో ఉన్న రైతులకు ఉపకరించే యంత్రాలు రూపొందించాలనేది మా భవిష్యత్ లక్ష్యం’ అంటుంది సోనాలి. -
2 కొత్త జాతుల సాలీళ్లకు 26/11 హీరో కాప్ పేరు
ముంబై : శాస్త్రవేత్తలు సాలీళ్లలో రెండు కొత్త జాతుల్ని కనుగొన్నారు. మహారాష్ట్రలో కనుగొన్న ఈ రెండు కొత్త జాతులకు 26/11 టెర్రరిస్ట్ దాడిలో మృతి చెందిన ఏఎస్ఐ తుకారామ్ ఓంబుల్ పేరు పెట్టారు. ‘‘ ఐసియస్ తుకారామి’’ అని వీటికి నామకరణం చేశారు. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కుశ్వాన్ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘‘ మనం శోధించాల్సిన పకృతి ఇంకా ఎంతో మిగిలి ఉంది.. మహారాష్ట్రలో కనుక్కోబడిన సాలీళ్లలోని రెండు కొత్త జాతులకు పోలీసు అమరవీరుడు తుకారామ్ పేరు వచ్చేలా ‘‘ ఐసియస్ తుకారామి’’ అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఇలా అమర వీరులను గౌరవించుకోవటం చాలా మంచిది’’ అని పేర్కొన్నారు. కాగా, ముంబైకి చెందిన తుకారామ్ ఓంబుల్ 2008లో తాజ్హోటల్లో జరిగిన టెర్రరిస్ట్ దాడిలో మృత్యువాతపడ్డారు. 26/11న నిరాయుధుడైన తుకారామ్ కసబ్‌ను పట్టుకోవటానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కసబ్ జరిపిన కాల్పుల్లో తుకారామ్ వీర మరణం పొందారు. 2009లో భారత ప్రభుత్వం ఆయనకు అశోక చక్ర ఇచ్చి గౌరవించింది. చదవండి : వీడియో వైరల్: భారీగా బరువు తగ్గిన కిమ్ జాంగ్ So much nature yet to explore & a good way to pay respect to martyr. A new species of jumping spider is documented Icius tukarami from Maharashtra. Named after the martyr Tukaram by researchers. @Dhruv_spidy pic.twitter.com/VQEbB9xbyE — Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 28, 2021 -
హైదరాబాద్ యువకుడి ప్రపంచ రికార్డు!
సాక్షి, హైదరాబాద్: దేశంకాని దేశాలకు అతడు సందేశాలను తీసుకెళ్తున్నాడు. వాటిని పర్వతమంత ఎత్తున సమున్నతంగా నిలుపుతున్నాడు. ఈ ఫీట్ సాధించడానికి పర్వతారోహణపర్వం కొనసాగిస్తున్నాడు తుకారాం. అత్యంత పిన్నవయసులోనే అత్యున్నత రికార్డులు సృష్టిస్తున్నాడు. 7 ఖండాల్లోని 7 ఎత్తయిన పర్వతాల్లో నాలుగింటిని 10 నెలల్లో అధిరోహించి వరల్డ్ రికార్డు స్థాపించాడు. మరిన్ని శిఖర సమాన విజయాలను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు ఈ నగర యువకుడు. దక్షిణాది నుంచి మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించినవారిలో పిన్నవయస్కుడు తుకారాం. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కళాశాలలో పొలిటికల్ సైన్స్‌లో పోస్టుగాడ్యుయేట్ చేస్తున్న తుకారాంది వ్యవసాయ కుటుంబం. తాజాగా కేంద్రమంత్రిని కలసి అభినందనలు అందుకున్న తుకారాం ‘సాక్షి’తో తన మనోభావాలు పంచుకున్నాడిలా... ఆయన మాటల్లోనే.. ధైర్యే సాహసే విజయం... రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కెళ్లపల్లి తండా స్వస్థలం. ట్రైబల్ వెల్ఫే ర్ రెసిడెన్షియల్ స్కూల్లో 10 వతరగతి వరకూ చదువుకున్నా. చిన్నప్పటి నుంచి సాహసోపేతమైన ఆటలంటే నాకు ఇష్టం. ఏదో సాధించాలి, ఏదో చేయాలనే కోరిక ఉండేది. కష్టం గురించి ఆలోచించేవాడిని కాదు. ఒంటికాలు మీద కబడ్డీ ఆడే లంగ్డీ ఆటలో జాతీయస్థాయి ప్లేయర్‌ని. కర్రతో జిమ్నాస్టిక్స్ మల్లకంబ్ కూడా జాతీయ స్థాయిలో ఆడాను. ఇవన్నీ స్కూల్ స్థాయిలోనే చేశా. కాలేజీలో చదువుతుండగా ఎన్సీసీ శిక్షణలో భాగంగా ఉత్తర కాశీలో మౌంట్ ఇంజనీరింగ్ చేస్తూ 3 బంగారు పతకాలు సాధించాను. అప్పటి నుంచి పర్వతారోహణ మీదే దృష్టి పెట్టాను. సామాజిక ప్రయోజనం ఉండాలని... ప్రతి సాహసం నాకు లక్ష్యసిద్ధిగా మిగిలిపోకూడదని, దానికి సామాజిక ప్రయోజనం కూడా ఉండాలనే ఆలోచనతో విభిన్న సందేశాలను, సందర్భాలను జో డిస్తూ పర్వతారోహణను మరింత అర్థవంతంగా మార్చాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తూ హిమాచల్‌ప్రదేశ్‌లోని నర్బు అనే పర్వతం అధిరోహించాక, తెలంగాణ రాష్ట్ర పతాకాన్ని అక్కడ ఎగరవేశాను. బతుకమ్మలను ప్రతిష్టించి ఇక్కడి సంప్రదాయాలను తెలియజెప్పాను. రోజువారీగా ఖాదీ వాడాలని పిలిపిస్తూ గంగోత్రిలోని మౌంట్ రుడుగారియా పర్వతారోహణను పూర్తి చేశాను. దేశభక్తిని చాటి చెబుతూ లడ్డాఖ్‌లోని మౌంట్ స్టాకన్గిరిపైకి 19 అడుగుల జాతీయ పతాకాన్ని తీసుకెళ్లి ఎగరవేశాను. పంచభూతాలను కాపాడుకోవాలంటూ సందేశమిస్తూ అత్యంత క్లిష్టమైన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాను. మరికొన్ని సందేశాలివీ... ► ‘హెల్మెట్ మన కోసం కాదు.. మన కుటుంబం కోసం’అనే సందేశంతో ఆఫ్రికాలోని కిలిమంజారో ఎక్కాను. ► డ్రగ్స్ నిషేధించాలంటూ రష్యాలోని ఎల్బ్రస్ పర్వతారోహణ పూర్తి చేశాను. ► దేశ సర్వసత్తాక సార్వభౌమత్వానికి సూచికగా జనవరి 26న సౌత్ అమెరికాలోని మౌంట్ అకాంజాగువా అధిరోహించాను. ► ఆస్ట్రేలియా దేశంలో కార్చిచ్చు కారణంగా ఏర్పడుతున్న బుష్ ఫైర్స్ తదనంతర సమస్యలు, బాధితుల కోసం ఆస్ట్రేలియాలోని కొజియాస్కో పర్వతాన్ని ఎక్కాను. దీనిని ఆస్ట్రేలియా మంత్రి అభినందించారు. ప్రోత్సాహకాలూ.. పురస్కారాలూ... కేవలం 10 నెలల్లో 4 విభిన్న ఖండాలలో శిఖరాలను అధిరోహించిన పిన్న వయస్కుడిగా ప్రపంచరికార్డు స్థాపించాను. రాష్ట్రపతి చేతుల మీదుగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణలో బెస్ట్ స్పోర్ట్స్‌మెన్‌షిప్ అవార్డు 2 సార్లు అందుకున్నా. జమ్మూ, కశ్మీర్ ప్రభుత్వం నుంచి తొలి దక్షిణాది బెస్ట్ ఇన్ టెక్నిక్ అవార్డ్ అందుకున్నా. పర్వతారోహణ అనేది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చేసేది మాత్రమే కాదు అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది కూడా. నాకు పురస్కారాలు మాత్రమే కాకుండా ఆర్థికంగా పలువురు స్పాన్సరర్లు లభించారు. ప్రస్తుతం చినజీయర్స్వామిసహా మరికొందరు నన్ను స్పాన్సర్ చేస్తున్నారు. ఇక నార్త్ అమెరికాలోని మౌంట్ డెనాలీ, అంటార్కిటికాలోని మౌంట్ విమ్సన్లు అధిరోహించాలనే లక్ష్యాలు మిగిలాయి. పర్వతారోహణవైపు యువతను బాగా ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను. అందుకు ప్రభుత్వ సహకారం కూడా కావాలి. -
మాస్టర్ తుకారాంకు రాష్ట్రపతి అభినందన
సాక్షి, న్యూఢిల్లీ : పిన్నవయస్సులోనే కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ గిరిజన యువకుడు మాస్టర్ ఆంగోత్ తుకారాంను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభినందించారు. కిలిమాంజారో పర్వతంపై జాతీయ గీతాలాపనతో 18 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ హెల్మెట్ వాడకంపై తుకారాం సందేశాన్నిచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి రామచంద్ర తేజావత్ ఆధ్వర్యంలో తుకారాం రాష్ట్రపతిని బుధవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా తుకారాం ధైర్య సాహసాలను, సామాజిక స్పృహను కోవింద్ ప్రశంసించారు. సౌత్ కౌల్ రూట్ నుంచి ఎవరెస్టును ఎక్కబోతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్లో ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్ర తేజావత్‌లు తుకారాంను ఘనంగా సన్మానించారు. ఆగస్టు 5న ఐఐటీహెచ్‌కి రాష్ట్రపతి రాక సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని కందిలో ఉన్న ఐఐటీ హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ రానున్నారు. ఆగస్టు 5న ఐఐటీలో జరిగే స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. -
నిజామాబాద్‌లో భారీ చోరీ
నిజామాబాద్ : నిజామాబాద్ నగరం న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని వినాయకనగర్‌లో గురువారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. రియల్ఎస్టేట్ వ్యాపారి తుకారం ఇంటి వెనుక గది కిటికీ చువ్వలు తొలగించి దుండగులు ఇంట్లోకి జొరబడ్డారు. అనంతరం బీరువాలో ఉంచిన రూ.1,50 లక్షల నగదు, 8 తులాల బంగారు నగలు, రెండు కిలోల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. ఆ విషయాన్ని గురువారం ఉదయం తుకారాం గమనించి... నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చోరీ జరిగిన సమయంలో తుకారం కుటుంబ సభ్యులతో కలసి ఇంటి ముందుబాగంలో నిద్రిస్తున్నట్లు చెప్పారు. -
నలుగురు ఉపాధ్యాయుుులపై క్రిమినల్ కేసులు
బెజ్జూర్, న్యూస్‌లైన్ : అక్రమాలకు పాల్పడిన ఉపాధ్యాయులపై పంచ్ పడింది. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పాఠశాల నిధులు స్వాహా’ కథనంపై ఆర్వీఎం పీవో యాదయ్య స్పందించారు. బెజ్జూర్ మండలంలోని పర్దాన్‌గూడ, బారెగూడ, తొర్రంగూడ, అందుగూలగూడ గిరిజన పాఠశాలలకు చెందిన నలుగురు ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఎంఈవో సోమయ్యకు శనివారం ఆదేశాలు అందాయి. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రొసిడింగ్ నంబర్ ఎ2/2616/2/201314 ఆర్డర్‌ను ఎంఈవోకు పంపించారు. దీంతో బారెగూడ ఉపాధ్యాయుడు తుకారాం, పర్దాన్‌గూడ ఉపాధ్యాయుడు లక్ష్మణ్, తొర్రంగూడ ఉపాధ్యాయుడు ధర్మయ్య, అందులగూడ ఉపాధ్యాయుడు గోపాల్ నుంచి డబ్బులు రికవరీ చేయడమే కాకుండా వేతనాలు నిలిపివేయాలని అందులో ఆదేశాలు జారీ చేశారు. నలుగు రు ఉపాధ్యాయులపై రెండ్రోజుల్లో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామ ని ఎంఈవో సోమయ్య తెలిపారు. తొర్రంగూడ పాఠశాల ఉపాధ్యాయు ని నుంచి రూ.7 లక్షల 73 వేలు, అందులగూడ నుంచి రూ.3 లక్షల 36 వేలు, పర్దాన్‌గూడ నుంచి రూ.2 లక్షల 38 వేల 750, బారెగూడ ఉపాధ్యాయుని నుంచి రూ.2 లక్షల 86 వేల 500 రికవరీ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు చెప్పారు. కాగా.. పర్దాన్‌గూడ పాఠశాల ఉపాధ్యాయు డు లక్ష్మణ్ ఇప్పటికే రూ.2.38 లక్షల డీడీ అందించినట్లు సమాచారం.