ఐక్యరాజ్యసమితి: కరోనా వైరస్ దీర్ఘకాలంగా కొనసాగుతూ ఆర్థిక రంగంపై తీవ్రంగా చూపిస్తున్న ప్రభావం వల్ల 2030 నాటికి అదనంగా మరో 20.7 కోట్ల మంది దుర్భర దారిద్య్రంలోకి పడిపోతారని ఐక్యరాజ్య సమితి తాజా అధ్యయనం వెల్లడించింది. వీరిలో మహిళల సంఖ్య 10.2 కోట్లు ఉంటుందని పేర్కొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం నిరుపేదల సంఖ్య 100 కోట్లు దాటిపోతుందని ఐక్యరాజ్య సమితి డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ) నివేదికలో తెలిపింది.
కోవిడ్ వివిధ దేశాలపై చూపిస్తున్న ప్రభావం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను దెబ్బ తీస్తున్న విధానం వంటివి వచ్చే దశాబ్ద కాలంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో ఆ అ«ధ్యయనం అంచనా వేసింది. వచ్చే పదేళ్లలో 4.4 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు వెళతారని గతంలో ఐఎంఎఫ్ అంచనా వేసింది. తాజాగా యూఎన్‌డీపీ అన్ని కోణాల నుంచి సమాచారాన్ని సేకరించి, విశ్లేషణ చేసి అదనంగా 20.7 కోట్ల మంది పేదరికంలోకి వెళతారని, కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం మరో పదేళ్లు ఉంటుందని యూఎన్‌డీపీ అధ్యయనం అంచనా వేసింది. ప్రపంచ దేశాలన్ని కలసికట్టుగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు డిజిటలైజేషన్, సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత రంగాల్లో పెట్టుబడుల్ని పెంచితే 14.6 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకి తీసుకురావచ్చునని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment