న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత పేద రాష్ట్రాలు బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ మేరకు తన తొలి జాతీయ బహుముఖీన పేదరిక సూచిక(ఎంపీఐ) నివేదికను తాజాగా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం బిహార్ జనాభాలో సగానికి పైగా.. అంటే 51.91 శాతం మంది నిరుపేదలే ఉన్నారు. జార్ఖండ్‌లో 42.16 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 37.79 శాతం మంది దారిద్య్రం అనుభవిస్తున్నారు. జనాభాలో 36.65 శాతం మంది పేదలతో నాలుగో స్థానంలో మధ్యప్రదేశ్, 32.67 శాతం మంది పేదలతో ఐదు స్థానంలో మేఘాలయ ఉన్నాయి.
ఇక అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో కేరళ(0.71 శాతం), గోవా(3.76 శాతం), సిక్కిం(3.82 శాతం), తమిళనాడు(4.89 శాతం), పంజాబ్(5.59 శాతం) ముందు వరుసలో నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రానగర్ హవేలిలో 27.36 శాతం, జమ్మూకశ్మీర్, లద్ధాఖ్‌లో 12.58 శాతం, డయ్యూ డామన్‌లో 6.82 శాతం, చండీగఢ్‌లో 5.97 శాతం మంది పేదలు ఉన్నారు.
అతి తక్కువగా పుదుచ్చేరిలో 1.72 శాతం మంది పేదరికం అనుభవిస్తున్నారు. లక్షద్వీప్‌లో 1.82 శాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో 4.30 శాతం, ఢిల్లీలో 4.79 శాతం మంది పేదలు ఉన్నట్లు తేలింది. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న ప్రజల సంఖ్యలోనూ బిహార్‌దే అగ్రస్థానం కావడం గమనార్హం. దేశంలో బహుముఖీన పేదరిక సూచికను తయారు చేయడానికి ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి చేసిన మెథడాలజీని ఉపయోగించినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. 2015–16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలను ఆధారంగా తీసుకున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment