సైకిళ్ల కొనుగోళ్లకు నిరుపేదలకు రుణాలివ్వాలి: హీరో సైకిల్స్
హైదరాబాద్: దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న పేదలు సైకిళ్లు కొనుగోలు చేయడానికి వారికి మైక్రోఫైనాన్స్ ద్వారా తగిన ఆర్థిక తోడ్పాటునందించాల్సిన అవసరం ఉందని హీరో సైకిల్స్ కో-చైర్మన్, ఎండీ పంకజ్ ముంజాల్ పేర్కొన్నారు. ఇందుకు తాము ఆర్థిక సంస్థలతో భాగస్వాములు కావడానికి సిద్ధంగా వున్నామని చెప్పారు. దేశంలోదారిద్య్రరేఖకు దిగువన 40 కోట్లమంది ప్రజలున్నారని, సైకిళ్లు వారికి అందించగలిగితే వారి జీవనానికి అవి ఉపయోగపడతాయన్నారు.
రాష్ట్రపతి 79వ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో ముంజాల్ పాల్గొన్నారని హీరో సైకిల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రణబ్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా రాష్ట్రపతి భవన్ సిబ్బందికి 50 కస్టమైజ్‌డ్ హీరో సైకిళ్లను బహుమతిగా ప్రదానం చేశామని పేర్కొంది. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఉన్న రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయ పిల్లలకు స్కాలర్‌షిప్‌లను ముంజాల్ ప్రదానం చేశారని వివరించింది.