సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల (ఆహార భద్రత) కోసం లబ్ధిదారుల పడిగాపులు తప్పడం లేదు. ప్రభుత్వం ఇటీవల కార్డులు జారీ చేస్తామని ప్రకటించడంతో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు మీ–సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని నాలుగు నెలలు దాటినా ఇంతవరకు ఒక్కరికీ కొత్త రేషన్‌కార్డు జారీ కాలేదు. విచారణ దశలోనే దరఖాస్తులు మగ్గిపోతున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన, కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో రెవెన్యూ అధికారులు గత తీరికలేకుండా ఉండటంతో కార్డుల మంజూరు, దరఖాస్తుల వెరిఫికేషన్ మరుగున పడింది. ఈ ప్రక్రియను పూర్తిచేయడంలో జాప్యం కారణంగా దాదాపు 90 శాతం దరఖాస్తులు మండల స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. ఫలితంగా రేషన్ సరుకులు అందక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు.
అన్నీ పరిశీలన దశలోనే..
- ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా మొత్తం 26,080 దరఖాస్తులు గ్రామ స్థాయి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పరిశీలనలోనే ఆగిపోయాయి. మరో 11,522 దరఖాస్తులు తహసీల్దార్ల పరిశీలనలో, 993 దరఖాస్తులు అసిస్టెంట్ కమిషనర్ పరిశీలనలో, 1,768 దరఖాస్తులు డీఎస్‌ఓ పరిశీలనలో ఉన్నాయి.
- ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 23,511 దరఖాస్తులు రాగా జిల్లా సివిల్ సప్లైస్ అధికారులకు కేవలం 148 దరఖాస్తులు (హార్డ్ కాపీలు) మాత్రమే చేరాయి. వాటిని ఓకే చేసి కమిషనరేట్‌కు పంపించారు. మిగతావి వివిధ దశల్లో రెవెన్యూ అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 39,795 కుటుంబాలు దరఖాస్తు చేసుకోగా 31,908 దరఖాస్తులను అధికారులు పరిశీలించాల్సి ఉంది.
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల కోసం 42,188 దరఖాస్తులు వచ్చాయి. అందులో 32,030 దరఖాస్తులు విచారణలో ఉన్నాయి.
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 29,539 దరఖాస్తులు రాగా వాటిలో 28,713 మండల స్థాయిలో, మిగతా దరఖాస్తులు వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
- ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఈ ఏడాది కొత్త కార్డులకు, మార్పుచేర్పుల నిమిత్తం 28,777 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో వచ్చాయి. తహసీల్దార్ల వద్ద, డీఎస్‌ఓ, కమిషనరేట్ పరిధిలో 27,845 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం 932 దరఖాస్తులకు మోక్షం లభించింది.
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 83,536 దరఖాస్తులు రాగా అందులో 83,412 దరఖాస్తులు వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. మిగతా వాటిలో కొన్ని ఆమోదం పొందగా మరికొన్నింటిని తిరస్కరించారు.
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో 27,294 దరఖాస్తులు వస్తే 23,175 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
- ఉమ్మడి కరీనంగర్ జిల్లాలో 81,386 దరఖాస్తులు రాగా అందులో 68,816 దరఖాస్తులను అధికారులు పరిశీలనలోకి తీసుకున్నారు. వాటిలో 8,406 దరఖాస్తులకు ఆమోదం లభించగా 60,410 పెండింగ్‌లో ఉన్నాయి.
నాలుగేళ్లుగా ఎదురుచూపు
నాకు గతంలో రేషన్ కార్డు ఉండేది. ఆన్‌లైన్ విధానం వచ్చాక దాన్ని తొలగించడంతో సరుకులు రావడం లేదు. దీంతో కొత్త రేషన్ కార్డు కోసం 2014 నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటికీ కార్డు రాలేదు. మూడు నెలల కిందట మీ–సేవ ద్వారా మరోసారి దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ అదే పరిస్థితి.
– బూర్ల వెంకటేష్, దండేపల్లి, మంచిర్యాల జిల్లా
రెండుసార్లు దరఖాస్తు చేసిన
నాకు రేషన్ కార్డు లేదు. గతంలో తల్లిదండ్రులతో 2002లో ఇచ్చిన కార్డులో నా పేరు ఉంది. నాకు మూడేళ్ల క్రితం పెళ్లి కావడంతో భార్యాపిల్లలతో వేరుగా ఉంటున్న. ఇప్పటివరకు రెండుసార్లు రేషన్ కార్డు కోసం తహసీల్దార్ కార్యాలయంలో, మరోసారి మీ–సేవలో దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటివరకు రేషన్ కార్డు ఇవ్వలేదు.
– రౌతు రాజేందర్, మోతుగూడ, ఆసిఫాబాద్ మండలం
అంతా ఆన్‌లైన్‌లోనే..
రేషన్ కార్డుల మంజూరు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం విచారణ జరిపి రేషన్ కార్డు జారీ చేస్తున్నాం. ఒక్కోసారి ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇబ్బందులు వస్తున్నాయి.
– కష్ణప్రసాద్, డీఎస్‌ఓ, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment