Oxfam: India Richest 1% Own More Than 40% Of Total Wealth - Sakshi
Sakshi News home page

Oxfam: 1 శాతం మంది గుప్పిట్లో... 40% దేశ సంపద!

Published Tue, Jan 17 2023 5:06 AM | Last Updated on Tue, Jan 17 2023 9:36 AM

Oxfam: India richest 1percent own more than 40percent of total wealth - Sakshi

దావోస్‌: ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 1 శాతం మంది చేతిలో ఉన్న సంపద అంతా కలిపితే ఎంతో తెలుసా? మిగతా వారందరి దగ్గరున్న దానికంటే ఏకంగా రెట్టింపు! ఈ విషయంలో మన దేశమూ ఏమీ వెనకబడలేదు. దేశ మొత్తం సంపదలో 40 శాతానికి పైగా కేవలం 1 శాతం సంపన్నుల చేతుల్లోనే పోగుపడిందట!! మరోవైపు, ఏకంగా సగం మంది జనాభా దగ్గరున్నదంతా కలిపినా మొత్తం సంపదలో 3 వంతు కూడా లేదు! ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్‌ అనే హక్కుల సంఘం వార్షిక అసమానతల నివేదికలో పేర్కొన్న చేదు నిజాలివి.

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు తొలి రోజు సోమవారం ఈ నివేదికను ఆక్స్‌ఫాం విడుదల చేసింది. 2020 మార్చిలో కరోనా వెలుగు చూసినప్పటి నుంచి 2022 నవంబర్‌ దాకా భారత్‌లో బిలియనీర్ల సంపద ఏకంగా 121 శాతంపెరిగిందని అందులో పేర్కొంది. అంటే రోజుకు ఏకంగా రూ.3,608 కోట్ల పెరుగుదల! భారత్‌లో ఉన్న వ్యవస్థ సంపన్నులను మరింతగా కుబేరులను చేసేది కావడమే ఇందుకు కారణమని ఓక్స్‌ఫాం ఇండియా సీఈఓ అమితాబ్‌ బెహర్‌ అభిప్రాయపడ్డారు.

ఫలితంగా దేశంలో దళితులు, ఆదివాసీలు, మహిళలు, అసంఘటిత కార్మికుల వంటి అణగారిన వర్గాల వారి వెతలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయన్నారు. భారత్‌లో పేదలు హెచ్చు పన్నులు, సంపన్నులు తక్కువ పన్నులు చెల్లిస్తుండటం మరో చేదు నిజమని నివేదిక తేల్చింది. ‘‘2021–22లో వసూలైన మొత్తం రూ.14.83 లక్షల కోట్ల జీఎస్టీలో ఏకంగా 62 శాతం ఆదాయ సూచీలో దిగువన ఉన్న 50 శాతం మంది సామాన్య పౌరుల నుంచే వచ్చింది! టాప్‌ 10లో ఉన్న వారినుంచి వచ్చింది కేవలం 3 శాతమే’’ అని పేర్కొంది.

‘‘దీన్నిప్పటికైనా మార్చాలి. సంపద పన్ను, వారసత్వ పన్ను తదితరాల ద్వారా సంపన్నులు కూడా తమ ఆదాయానికి తగ్గట్టుగా పన్ను చెల్లించేలా కేంద్ర ఆర్థిక మంత్రి చూడాలి’’ అని బెహర్‌ సూచించారు. ఈ చర్యలు అసమానతలను తగ్గించగలవని ఎన్నోసార్లు రుజువైందన్నారు. ‘‘అపర కుబేరులపై మరింత పన్నులు వేయడం ద్వారానే అసమానతలను తగ్గించి ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోగలం’’ అని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గాబ్రియేలా బుచ్‌ అభిప్రాయపడ్డారు.

‘‘భారత్‌లో నెలకొన్న అసమానతలు, వాటి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు సేకరించిన పరిమాణాత్మక, గుణాత్మక సమాచారాలను కలగలిపి ఈ నివేదికను రూపొందించాం. సంపద అనమానత, బిలియనీర్ల సంపద సంబంధిత  గణాంకాలను ఫోర్బ్స్, క్రెడిట్‌సుసీ వంటి సంస్థల నుంచి సేకరించాం. నివేదికలో పేర్కొన్న వాదనలన్నింటికీ కేంద్ర బడ్జెట్, పార్లమెంటు ప్రశ్నోత్తరాలు తదితరాలు ఆధారం’’ అని ఆక్స్‌ఫాం తెలిపింది.

కేంద్రానికి సూచనలు...
► అసమానతలను తగ్గించేందుకు ఏకమొత్త సంఘీభావ సంపద పన్ను వంటివి వసూలు చేయాలి. అత్యంత సంపన్నులైన 1 శాతం మందిపై పన్నులను పెంచాలి. పెట్టుబడి లా భాల వంటివాటిపై పన్ను పెంచాలి.
► వారసత్వ, ఆస్తి, భూమి పన్నులను పెంచాలి. నికర సంపద పన్ను వంటివాటిని ప్రవేశపెట్టాలి.
► ఆరోగ్య రంగానికి బడ్జెట్‌ కేటాయింపులను 2025 కల్లా జీడీపీలో 2.5 శాతానికి పెంచాలి.
► ప్రజారోగ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి.
► విద్యా రంగానికి బక్జెట్‌ కేటాయింపులను ప్రపంచ సగటుకు తగ్గట్టుగా జీడీపీలో 6 శాతానికి పెంచాలి.
► సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులందరికీ కనీస మౌలిక వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఈ కనీస వేతనాలు గౌరవంగా బతికేందుకు చాలినంతగా ఉండేలా చూడాలి.


నివేదిక విశేషాలు...
► భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 2020లో 102 ఉండగా 2022 నాటికి 166కు పెరిగింది.
► దేశంలో టాప్‌–100 సంపన్నుల మొత్తం సంపద ఏకంగా 660 బిలియన్‌ డాలర్లకు, అంటే రూ.54.12 లక్షల కోట్లకు చేరింది. ఇది మన దేశ వార్షిక బడ్జెట్‌కు ఒకటిన్నర రెట్లు!
► భారత్‌లోని టాప్‌ 10 ధనవంతుల సంపదలో 5 శాతం చొప్పున, లేదా టాప్‌ 100 ధనవంతుల సంపదలో 2.5 శాతం చొప్పున పన్నుగా వసూలు చేస్తే ఏకంగా రూ.1.37 లక్షల కోట్లు సమకూరుతుంది. ఇది కేంద్ర కుటుంబ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు కేటాయించిన మొత్తం నిధుల కంటే ఒకటిన్నర రెట్ల కంటే కూడా ఎక్కువ! ఈ మొత్తం దేశంలో ఇప్పటిదాకా స్కూలు ముఖం చూడని చిన్నారులందరి స్కూలు ఖర్చులకూ సరిపోతుంది.
► 2017–21 మధ్య భారత కుబేరుడు గౌతం అదానీ ఆర్జించిన (పుస్తక) లాభాలపై పన్ను విధిస్తే ఏకంగా రూ.1.79 లక్షల కోట్లు సమకూరుతుంది. దీనితో 50 లక్షల మంది టీచర్లను నియమించి వారికి ఏడాదంతా వేతనాలివ్వొచ్చు.
► వేతనం విషయంలో దిన కూలీల మధ్య లింగ వివక్ష ఇంకా ఎక్కువగానే ఉంది. పురుషుల కంటే మహిళలకు 37 శాతం తక్కువ వేతనం అందుతోంది.
► ఇక ఉన్నత వర్గాల కూలీలతో పోలిస్తే ఎస్సీలకు, పట్టణ కూలీలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల వారికీ సగం మాత్రమే గిడుతోంది.
► సంపన్నులపై, కరోనా కాలంలో రికార్డు లాభాలు ఆర్జించిన సంస్థలపై మరింత పన్ను విధించాలని 2021లో జరిపిన ఫైట్‌ ఇనీక్వాలిటీ అలియన్స్‌ ఇండియా సర్వేలో 80 శాతం మందికి పైగా డిమాండ్‌ చేశారు.
► అసమానతలను రూపుమాపేందుకు సార్వ త్రిక సామాజిక భద్రత, ఆరోగ్య హక్కు తదితర చర్యలు చేపట్టాలని 90 శాతానికి పైగా కోరారు.


5 శాతం మందిపై పన్నుతో.. 200 కోట్ల మందికి పేదరికం నుంచి ముక్తి
ప్రపంచవ్యాప్తంగా ఒక్క శాతం సంపన్నుల వద్దనున్న మొత్తం, మిగిలిన ప్రపంచ జనాభా సంపద కంటే రెండున్నర రెట్లు అధికంగా ఉన్నట్టు ఆక్స్‌ఫాం నివేదిక తెలిపింది. వారి సంపద రోజుకు ఏకంగా 2.7 బిలియన్‌ డాలర్ల చొప్పున పెరుగుతున్నట్టు పేర్కొంది. అది ఇంకేం చెప్పిందంటే...
► ప్రపంచంలోని మల్టీ మిలియనీర్లు, బిలియనీర్లపై 5 శాతం పన్ను విధిస్తే ఏటా 1.7 లక్షల కోట్ల డాలర్లు వసూలవుతుంది. ఈ మొత్తంతో 200 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేయొచ్చు.
► 2020 నుంచి ప్రపంచమంతటా కలిసి పోగుపడ్డ 42 లక్షల కోట్ల డాలర్ల సంపదలో మూడింత రెండొంతులు, అంటే 26 లక్షల కోట్ల డాలర్లు కేవలం ఒక్క శాతం సంపన్నుల దగ్గరే పోగుపడింది!
► అంతేకాదు, గత దశాబ్ద కాలంలో కొత్తగా పోగుపడ్డ మొత్తం ప్రపంచ సంపదలో సగం వారి జేబుల్లోకే వెళ్లింది!!
► మరోవైపు పేదలు, సామాన్యులేమో ఆహారం వంటి నిత్యావసరాలకు సైతం అంగలార్చాల్సిన దుస్థితి నెలకొని ఉంది.
► వాల్‌మార్ట్‌ యజమానులైన వాల్టన్‌ కుటుంబం గతేడాది 850 కోట్ల డాలర్లు ఆర్జించింది.
► భారత కుబేరుడు గౌతం అదానీ సంపద ఒక్క 2022లోనే ఏకంగా 4,200 కోట్ల డాలర్ల మేరకు పెరిగింది!
► కుబేరులపై వీలైనంతగా పన్నులు విధించడమే ఈ అసమానతలను రూపుమాపేందుకు ఏకైక మార్గం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement