ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటోంది. యూఎస్, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ఇండియా జీడీపీ దూసుకుపోతోంది. కానీ ప్రజల ఆదాయాలు, వారి సంపద మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ఇటీవల హురున్ ఇండియా దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసింది. జులై 31 నాటికి రూ.1,000 కోట్ల సంపద కలిగిన వారిని పరిగణనలోకి తీసుకుని దీన్ని రూపొందించారు. దాని ప్రకారం ఈ ఏడాది దేశంలోని కుబేరుల సంఖ్య 220 పెరిగి 1,539కు చేరింది. వీరి వద్ద రూ.159 లక్షల కోట్ల సంపద మూలుగుతుంది. ఏడాది ప్రాతిపదికన వీరి ఆస్తులు 46 శాతం వృద్ధి చెందాయి. దేశంలో దాదాపు 140 కోట్ల జనాభా ఉంది. కేవలం 1539 మంది వద్దే ఇన్ని కోట్ల రూపాయలు పోగవ్వడం సామాజిక అంశాతికి దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెరుగుతున్న ఆర్థిక అసమానతలు బ్రిటిష్ కాలంలో కంటే ఇప్పుడు ఎక్కువయ్యాయి. కొన్ని నివేదికల ప్రకారం దేశంలోని ఒక శాతం జనాభా చేతుల్లోకి 40.1 శాతం సంపద చేరుతుంది. వివిధ వర్గాల ఆదాయ సంపదల్లో అసమానతలు ఉన్నప్పటికీ, అందరి వాస్తవ ఆదాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే ప్రజల ఆదాయాలతో పాటే వాటి మధ్య అంతరాలు అధికమవుతున్నాయి. అందుకు 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలే కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిని అమలు చేయకముందు వరకు దేశ జీడీపీ మూడు శాతం వద్దే ఆగిపోయింది. ఈ సంస్కరణల తర్వాత జీడీపీ 6-8 శాతం పెరిగింది. అయినా గరిష్ఠ సంపద తక్కువ మంది చేతుల్లోకే వెళుతుంది.
భారత్‌తోపాటు అనేక దేశాల్లో ఈ ఆర్థిక అసమానతలకు సంబంధించిన సమస్యలు ఎక్కవవుతున్నాయి. ఇవి మరింత పెరిగితే సామాజిక అశాంతి నెలకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ అంతరాలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అత్యంత ధనవంతులపై విధించే పన్నులు పెంచాలని చెబుతున్నారు. కుబేరులకు వారసత్వంగా వచ్చే సంపదపై పన్ను విధించాలంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు.. ఇందుకు సహకరించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: అంబానీను దాటేసిన అదానీ..
దురదృష్టవశాత్తు పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలను పరోక్షంగా నడిపించేది ధనవంతులే. దాంతో చట్ట సభల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ధైర్యం చేయడానికి ప్రజా ప్రతినిధులు సహకరించడం లేదు. కానీ ఆర్థిక అసమానతల వల్ల భవిష్యత్తులో రాబోయే సామాజిక అశాంతిని దృష్టిలో ఉంచుకుని ఈమేరకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment