economic inequalities
-
పెచ్చురిల్లుతున్న ఆర్థిక అంతరాలు!
ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటోంది. యూఎస్, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ఇండియా జీడీపీ దూసుకుపోతోంది. కానీ ప్రజల ఆదాయాలు, వారి సంపద మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ఇటీవల హురున్ ఇండియా దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసింది. జులై 31 నాటికి రూ.1,000 కోట్ల సంపద కలిగిన వారిని పరిగణనలోకి తీసుకుని దీన్ని రూపొందించారు. దాని ప్రకారం ఈ ఏడాది దేశంలోని కుబేరుల సంఖ్య 220 పెరిగి 1,539కు చేరింది. వీరి వద్ద రూ.159 లక్షల కోట్ల సంపద మూలుగుతుంది. ఏడాది ప్రాతిపదికన వీరి ఆస్తులు 46 శాతం వృద్ధి చెందాయి. దేశంలో దాదాపు 140 కోట్ల జనాభా ఉంది. కేవలం 1539 మంది వద్దే ఇన్ని కోట్ల రూపాయలు పోగవ్వడం సామాజిక అంశాతికి దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పెరుగుతున్న ఆర్థిక అసమానతలు బ్రిటిష్ కాలంలో కంటే ఇప్పుడు ఎక్కువయ్యాయి. కొన్ని నివేదికల ప్రకారం దేశంలోని ఒక శాతం జనాభా చేతుల్లోకి 40.1 శాతం సంపద చేరుతుంది. వివిధ వర్గాల ఆదాయ సంపదల్లో అసమానతలు ఉన్నప్పటికీ, అందరి వాస్తవ ఆదాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే ప్రజల ఆదాయాలతో పాటే వాటి మధ్య అంతరాలు అధికమవుతున్నాయి. అందుకు 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలే కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిని అమలు చేయకముందు వరకు దేశ జీడీపీ మూడు శాతం వద్దే ఆగిపోయింది. ఈ సంస్కరణల తర్వాత జీడీపీ 6-8 శాతం పెరిగింది. అయినా గరిష్ఠ సంపద తక్కువ మంది చేతుల్లోకే వెళుతుంది.భారత్‌తోపాటు అనేక దేశాల్లో ఈ ఆర్థిక అసమానతలకు సంబంధించిన సమస్యలు ఎక్కవవుతున్నాయి. ఇవి మరింత పెరిగితే సామాజిక అశాంతి నెలకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ అంతరాలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అత్యంత ధనవంతులపై విధించే పన్నులు పెంచాలని చెబుతున్నారు. కుబేరులకు వారసత్వంగా వచ్చే సంపదపై పన్ను విధించాలంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు.. ఇందుకు సహకరించాలని కోరుతున్నారు.ఇదీ చదవండి: అంబానీను దాటేసిన అదానీ..దురదృష్టవశాత్తు పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలను పరోక్షంగా నడిపించేది ధనవంతులే. దాంతో చట్ట సభల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ధైర్యం చేయడానికి ప్రజా ప్రతినిధులు సహకరించడం లేదు. కానీ ఆర్థిక అసమానతల వల్ల భవిష్యత్తులో రాబోయే సామాజిక అశాంతిని దృష్టిలో ఉంచుకుని ఈమేరకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
1 శాతం కుబేరుల దగ్గరే 40 శాతం సంపద
న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాలుగా (2000 తొలి నాళ్ల నుంచి) భారత్‌లో ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరిగాయి. 2022–23 గణాంకాల ప్రకారం మొత్తం ఆదాయాల్లో 22.6 శాతం వాటా, అలాగే సంపదలో 40.1 శాతం వాటా కేవలం ఒక్క శాతం ప్రజలదే ఉంటోంది. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికా వంటి దేశాలతో పోలి్చనా ఇది చాలా ఎక్కువ. ’1922–2023 మధ్య కాలంలో భారత్‌లో ఆదాయ, సంపద అసమానతలు: పెరిగిన బిలియనీర్ల రాజ్యం’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ముఖ్యంగా 2014–15 నుంచి 2022–23 మధ్య కాలంలో కొందరి వద్దే అత్యధికంగా సంపద కేంద్రీకృతమవ్వడమనేది మరింతగా పెరిగింది. థామస్ పికెటీ (ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్), లూకాస్ చాన్సెల్ (హార్వర్డ్ కెనెడీ స్కూల్, వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్), నితిన్ కుమార్ భారతి (న్యూయార్క్ యూనివర్సిటీ, వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్) ఈ నివేదికను రూపొందించారు. నికర సంపద దృష్టికోణం నుంచి చూస్తే భారత ఆదాయపు పన్ను వ్యవస్థ తిరోగామి విధానంగా అనిపించవచ్చని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆదాయం, సంపదను పరిగణనలోకి తీసుకునేలా పన్ను విధానాన్ని పునర్వ్యవస్థీకరించడం, ఆరోగ్యం.. విద్య..పౌష్టికాహారంపై ప్రభుత్వం మరింతగా పెట్టుబడులు పెట్టడం ద్వారా కేవలం సంపన్న వర్గాలే కాకుండా సగటు భారతీయుడు కూడా గ్లోబలైజేషన్ ప్రయోజనాలను పొందేలా చూడాల్సిన అవసరం ఉందని తెలిపింది. అలాగే అసమానతలపై పోరాడేందుకు 2022–23లో అత్యంత సంపన్నులుగా ఉన్న 167 కుటుంబాలపై 2 శాతం ‘సూపర్ ట్యాక్స్‘ని విధిస్తే దేశ ఆదాయంలో 0.5 శాతం మేర సమకూరగలదని, సామాన్య ప్రజానీకానికి ఉపయోగకరంగా ఉండే పెట్టుబడులు పెట్టేందుకు ఆర్థికంగా వెసులుబాటు లభించగలదని నివేదిక వివరించింది. -
ఆర్థిక అసమానతల తగ్గింపు కన్నా పేదరిక నిర్మూలనకే ప్రాధాన్యం
ప్రపంచంలో ఇంకా సూటిగా చెప్పాలంటే భారతదేశంలో పేదరికం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గుతున్న నేపథ్యంలో అదే సమయంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై ఇప్పుడు చర్చ కేంద్రీకృతమౌతోంది. దేశంలో దారిద్య్రం మాయమౌతున్న క్రమంలో ప్రజల్లో ఆర్థిక వ్యత్యాసాలు వృద్ధి చెందడం అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తుందని కొందరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కిందటి దశాబ్దంలో (2011–2021) ఇండియాలో వరుసగా 2014, 2015లో అనావృష్టి పీడించింది. 2020 - 22 మధ్య కొవిడ్-19 మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసింది. ఫలితంగా పేదరిక నిర్మూలక లక్ష్యం అనుకున్నంతగా ముందుకు సాగలేదు. సదుద్దేశంతో అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ) దశాబ్దం చివర్లో ఆర్థిక వ్యవస్థను కొంత ఇబ్బంది పెట్టినా తర్వాత ఆర్థికరంగం తిరిగి ప్రగతిపథంలో పయనించింది. ఇప్పుడు పారిశ్రామిక దేశాల్లో మాదిరిగానే ఇండియాలో కూడా ఆర్థిక అసమానతలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయనే మాటలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. గత మూడు దశాబ్దాల్లో ఆర్థిక ప్రపంచీకరణ వల్ల అత్యధిక దేశాల్లో పేదరికం గణనీయంగా తగ్గింది. పూర్వం వర్ధమాన దేశంగా ముద్రపడిన ఇండియాలో దారిద్య్రం మున్నెన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో అంతరించింది. కాని, కొవిడ్ మహమ్మారి ఫలితంగా ప్రపంచంలో ఆర్థిక అసమానతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని ప్రపంచ ఆర్థిక అసమానత నివేదిక–2022 వెల్లడించింది. 1990ల మధ్య నుంచీ ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఒక శాతం జనాభా ప్రపంచంలో 38 శాతం సంపదను తమ చేతుల్లోకి తెచ్చుకోగలిగారు. 2020 తర్వాత ఇదే ధోరణి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. పేదరిక నిర్మూలనే మొదటి లక్ష్యం కావాలి, అసమానతలు తర్వాత రూపుమాపవచ్చు! అయితే, ఆర్థిక అసమానతలు రూపుమాపడం కన్నా ఇండియాకు పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ఉండాలని నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త, అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అరవింద్ పనగఢియా ఇటీవల ఓ ఇంగ్లిష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘అసలు ఆర్థిక అసమానతలు ప్రతి దేశంలో ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే నేను ఎక్కువగా పట్టించుకునేది అక్కడ ఇంకా పూర్తిగా తొలగిపోని పేదరికం. నా లెక్క ప్రకారం దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు ఆందోళన కలిగించే స్థాయిలో కనపడడం లేదు. వాస్తవానికి 2021 - 22 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (ఏటా చేసే శ్రామికశక్తులపై అధ్యయనం) చూస్తే భారత్‌లో అసమానతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) నగర ప్రాంతాల్లో కేంద్రీకృతమవ్వడం వల్ల ఆర్థిక సంక్షోభాల ప్రభావం ఆ కాలంలో రవాణా, నిర్మాణ రంగాలపై పడింది. దీంతో ధనికవర్గంపై ఇది ప్రతికూల ప్రభావం చూపింది. ఆర్థిక వ్యత్యాసాలు దీని వల్ల కొద్దిగా తగ్గాయి,’ అని పనగఢియా ఈ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. మొదట దారిద్య్రం బాగా తగ్గిపోయి పూర్వపు పేదల ఆదాయాలు పెరిగితే, ఆర్థిక అసమానతలను తర్వాత రూపుమాపడం కష్టమేమీ కాదనేది అత్యధిక ఆర్థికవేత్తల అభిప్రాయంగా కనిపిస్తోంది. అదీగాక, ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా ఆసియా ఖండం మారుతున్న నేపథ్యంలో భారతదేశానికి అనేక ఆర్థిక అవకాశాలు చేతికందుతున్నాయి. తయారీ, సేవల రంగంలో ఇండియాలో ఉత్పత్తి, ఎగుమతులు పెంచడానికి కొత్త పరిస్థితులు దోహదం చేస్తున్నాయి. (ఇదీ చదవండి: బంగారం కొనుగోళ్లకు డాలర్‌కు సంబంధమేంటి?) దేశంలో సంపద సృష్టించే కార్యక్రమాన్ని వేగవంతం చేయడం ద్వారా పేదరికం మరింత తగ్గించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వాలు, ఆర్థికవేత్తలు–ఆర్థిక అసమానతలపై కన్నా దారిద్య్ర నిర్మూలనపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం ద్వారా మన లక్ష్యాన్ని సాధించవచ్చు. పేదరికం లేని నవభారతాన్ని నిర్మించవచ్చు. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
చిలీ అధ్యక్షుడిగా గాబ్రియెల్
శాంటియాగో: వామపక్ష భావజాలమున్న గాబ్రియెల్ బొరిక్ చిలీ కొత్త అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో ఆర్థిక అసమానతలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో 36 ఏళ్ల బొరిక్ రాకతో ప్రజల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి. ఆర్థికంగా సంపన్న దేశమైన చిలీలో అసమానతలు ఎక్కువగా ఉండడంతో తరచూ ఆందోళనలు జరుగుతుంటాయి. పదిహేడేళ్ల పాటు మిలటరీ నియంతృత్వం రాజ్యమేలి, రక్తపాతం జరిగిన చిలీలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించి నాలుగేళ్లే అయింది. బొరిక్ తన కేబినెట్లో 14 మంది మహిళల్ని చేర్చుకొని తమది ఫెమినెస్ట్ కేబినెట్ అని చాటి చెప్పారు. మరో 10 మంది పురుషులు మంత్రులుగా ప్రమాణం చేశారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 56% ఓట్లతో కన్జర్వేటివ్ అయిన జాస్ ఆంటోనియా కాస్ట్‌పై గాబ్రియెల్ బొరిక్ విజయం సాధించారు. -
ఆక్స్‌ఫాం నివేదిక.. చేదు నిజాలు
ఏటా విడుదలయ్యే నివేదికల్లో ప్రపంచవ్యాప్తంగా వున్న ఆర్థిక అసమానతలనూ, వాటి పర్యవసానంగా ఏర్పడే ఇతరత్రా అంతరాలనూ ఆక్స్‌ఫాం ఏకరువు పెడుతుంది. ఏడాదిగా ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడిస్తోంది గనుక ఈసారి నివేదిక మరింత గుబులు పుట్టించేదిగా వుంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్లు్యఈఎఫ్) సదస్సు సందర్భంగా ఆక్స్‌ఫాం నివేదికలు విడుదలవుతుంటాయి. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణలు మామూలు గానే అన్ని దేశాల్లోనూ వ్యత్యాసాలు పెంచాయి. కానీ సంక్షోభం తలెత్తినప్పుడు, విలయం విరుచుకు పడినప్పుడు ఇక చెప్పేదేముంటుంది? కొన్ని నెలలక్రితం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై నివేదిక వెలువరిస్తూ తీవ్రమైన ఒత్తిళ్ల ఫలితంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ తలకిందులు కాబోతున్నాయని, కోట్లాదిమంది పేదరికంలోకి జారుకునే ప్రమాదం వున్న దని హెచ్చరించింది. ఆ నివేదిక వచ్చాక మన దేశంతో సహా అనేక దేశాలు సంక్షోభాన్ని అధిగమిం చటం కోసం ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాయి. అట్టడుగు వర్గాలకు చేయూతనందించే అనేక పథ కాలు రూపొందించాయి. వేరే దేశాల మాటెలావున్నా మన దేశంలో మాత్రం వాటివల్ల పెద్దగా ఫలితం రాలేదని తాజా ఆక్స్‌ఫాం నివేదిక తెలియజెబుతోంది. భారత్‌ను అసమానత అనే వైరస్ పట్టి పీడిస్తున్నదని, పర్యవసానంగా సంపన్నులు మరింత సంపద పోగేసుకోగా, అంతో ఇంతో పొట్ట పోషించుకునేవారు సైతం ఉపాధి కోల్పోయి కొత్తగా దారిద్య్రంలోకి జారుకున్నారని నివేదిక వ్యాఖ్యా నించటం గమనించదగ్గది. కరోనా వైరస్ విజృంభిస్తున్న కాలంలో ఆ వైరస్‌ను కొందరు ‘సోషలిస్టు వైరస్’గా చమత్కరిం చారు. ధనిక, పేద తేడా లేకుండా అందరినీ అది కాటేసిందని, దాని పర్యవసానంగా అందరూ ఒక్క లాగే ఇబ్బందులు పడ్డారని అనుకున్నారు. సంపన్నుల్లోనూ ఆ వ్యాధి వచ్చినవారూ, మరణించిన వారూ వుండొచ్చు. కానీ ఆ వర్గానికి అందుబాటులో వుండే ఆధునిక వైద్య సౌకర్యాలు ఇతరులకు లేవు. అలాగే వారికుండే ఆర్థిక వెసులుబాటు ఇతరులకు వుండదు. ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలతో పాటు జెండర్ మొదలుకొని అనేకానేక అంశాల్లో వుండే అసమానతల వల్ల మనలాంటి సమాజాల్లో ఏర్పడే ఏ సంక్షోభాలైనా వాటిని మరింత పెంచుతాయి. అందువల్లే భిన్న రంగాలను శాసిస్తున్న మోతుబరులు లాక్డౌన్ కాలంలో తమ సంపద అపారంగా పెంచుకుంటే సాధారణ పౌరులు మాత్రం బతుకు భయంతో తల్లడిల్లారని ఆక్స్‌ఫాం నివేదిక ఎత్తిచూపుతోంది. మన దేశంలో లాక్డౌన్ సమయంలో భాగ్యవంతుల సంపద 35 శాతం పెరగ్గా లక్షలాదిమంది సాధారణ పౌరులు జీవిక కోల్పోయారని గణాంకాలంటున్నాయి. నిరుడు మార్చి మొదలుకొని ఇంతవరకూ వందమంది శత కోటీశ్వరుల సంపద 12,97,822 కోట్ల మేర పెరగ్గా... ఒక్క ఏప్రిల్ నెలలోనే ప్రతి గంటకూ 1,70,000 మంది చొప్పున సాధారణ పౌరులు ఉపాధి కోల్పోయారని నివేదిక వెల్లడిస్తోంది. అంటే శత కోటీశ్వరులు వున్న సంపదను కాపాడుకోవటమే కాదు... దాన్ని మరిన్ని రెట్లు పెంచుకోలిగారు. కరోనా ప్రమాదం ముంచుకొచ్చాక మన దేశంలో కఠినమైన లాక్డౌన్ అమలైంది. అది ప్రభుత్వాల సంసిద్ధతను పెంచటంతోపాటు, వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తుందని అందరూ ఆశించారు. కానీ ఆ రెండు అంశాల్లోనూ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. ఇటలీవంటిచోట్ల మన మాదిరిగా వలస కార్మికుల సమస్య లేదు గనుక లాక్డౌన్ అక్కడ సమర్థవంతంగా అమలైంది. మన దేశంలో మాత్రం పనిలేక, ఆకలిదప్పులకు తట్టుకోలేక భారీ సంఖ్యలో వలస కార్మికులు స్వస్థలాలకు నడక దారిన తరలివెళ్లటం మొదలుపెట్టారు. వారిని ఎక్కడికక్కడ నిలువరించటానికి పోలీసులు ప్రయత్నించటం, వారి కళ్లుగప్పి గమ్యస్థానాలు చేరడానికి సాధారణ ప్రజానీకం ప్రయత్నించటం కొన్ని నెలలపాటు మన దేశంలో నిత్యం కనబడిన దృశ్యం. దారిపొడవునా ఆ క్రమంలో బలైనవారెందరో! దానికితోడు సరైన పోషకాహారం లభించక, జాగ్రత్తలు పాటించటం సాధ్యంకాక ఎందరో కరోనా బారినపడ్డారు. ఎన్నో రాష్ట్రాల్లో వైరస్ కేసుల సంఖ్య చూస్తుండగానే పెరిగి కలవరపరిచింది. ఆ మహమ్మారి కాటేసిన దేశాల వరసలో అమెరికా తర్వాత మనదే రెండో స్థానం. కోటీ 6 లక్షలమందికిపైగా జనం కరోనా బారిన పడితే 1,53,525 మంది మరణించారు. కానీ ప్రాణాలు నిలబెట్టుకున్నవారి స్థితిగతులు దుర్భరంగా మారాయని ఆక్స్‌ఫాం నివేదిక చాటుతోంది. త్వరలో 2021–22 సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫాం నివేదికలోని అంశాలు పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వపరంగా చేయాల్సివేమిటో ఆలోచించటం అవసరం. లాక్డౌన్ పర్యవసానంగా ఏర్పడ్డ సంక్షోభాన్ని అధిగమించటానికి ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలు ఏమేరకు ప్రభావం కలిగించాయన్నది కూడా సమీక్షించాలి. నిరుడు ఏప్రిల్–నవంబర్ మధ్య కేంద్ర ప్రభుత్వ వ్యయం వాస్తవ గణాంకాల ఆధారంగా లెక్కేస్తే తగ్గిందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అంతక్రితం సంవత్సరం అదే కాలంతో పోలిస్తే ఈ ఎనిమిది నెలలకాలంలో ప్రభుత్వ వ్యయం 4.7 శాతం పెరిగినట్టు కనబడుతున్నా, 6 శాతంకన్నా ఎక్కువగా వున్న ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నాక ఆ వ్యయం గణనీయంగా తగ్గిన వైనం వెల్లడవుతోంది. విద్య, వైద్యం, ఉపాధి వగైరా రంగాలన్నిటా ఇప్పటికే వున్న వ్యత్యాసాలను కరోనా అనంతర పరిస్థితులు ఎన్ని రెట్లు పెంచాయో ఆక్స్‌ఫాం నివేదిక తేటతెల్లం చేస్తోంది. ఈ రంగాల్లో ప్రభుత్వ వ్యయం అపారంగా పెరిగితే తప్ప... నేరుగా ప్రజానీకం చేతుల్లో డబ్బులుండేలా చర్యలు తీసుకుంటే తప్ప ఈ వ్యత్యాసాలు ఆగవు. సంక్షోభాలకు మూలం ఎక్కడుందో తెలుసుకుని సకాలంలో నివారణ చర్యలు తీసుకున్నప్పుడే సమాజం సజావుగా సాగు తుంది. లేనట్టయితే అది అశాంతిలోకి జారుకుంటుంది. -
ఆ 63 మంది కుబేరుల ముందు... బడ్జెట్ దిగదుడుపు!
దావోస్: పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలను ప్రతిబింబిస్తూ.. మన దేశ జనాభాలో 70 శాతం (సుమారు 95.3 కోట్ల మంది) జనాభాతో పోలిస్తే 1 శాతం కుబేరుల సంపద ఏకంగా నాలుగు రెట్లు పైగా ఉంది. దేశీయంగా 63 మంది బిలియనీర్ల మొత్తం సంపద విలువ.. పూర్తి ఆర్థిక సంవత్సర బడ్జెట్ పరిమాణాన్ని (2018–19లో రూ. 24.42 లక్షల కోట్లు) మించింది. ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యుల పక్షం వహించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ మానవ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా ’టైమ్ టు కేర్’ పేరిట ఆక్స్‌ఫామ్ దీన్ని విడుదల చేసింది. దీని ప్రకారం.. ప్రపంచ జనాభాలో సుమారు 60 శాతం (460 కోట్లు) ప్రజలకు మించిన సంపద 2,153 మంది బిలియనీర్ల దగ్గర ఉంది. ‘అసమానతలను తొలగించే కచ్చితమైన విధానాలు లేకుండా సంపన్నులు, పేదల మధ్య వ్యత్యాస సమస్యలను పరిష్కరించడం కుదరదు. కానీ చాలా కొన్ని ప్రభుత్వాలు మాత్రమే ఈ దిశగా కృషి చేస్తున్నాయి‘ అని ఆక్స్‌ఫాం ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ పేర్కొన్నారు. 24 వరకూ జరగనున్న డబ్ల్యూఈఎఫ్ సదస్సులో భారత్ నుంచి పలువురు వ్యాపార దిగ్గజాలు, ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు. నివేదికలోని మరికొన్ని ఆసక్తికర అంశాలు.. ► టెక్నాలజీ సంస్థ సీఈవో ఓ ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని ఆర్జించాలంటే సాధారణ మహిళా పనిమనిషికి 22,277 ఏళ్లు పడుతుంది. ఆమె ఏడాది సంపాదనను.. సెకనుకు రూ. 106 చొప్పున టెక్ సీఈవో 10 నిమిషాల్లో సంపాదిస్తున్నారు. ► మహిళలు, బాలికలు రోజుకు 326 కోట్ల గంటల పనిని ఎలాంటి భత్యాలు లేకుండా చేస్తున్నారు. దీనికి లెక్కగడితే ఏటా రూ. 19 లక్షల కోట్లవుతుంది. ఇది 2019లో దేశీ విద్యారంగానికి కేటాయించిన మొత్తం బడ్జెట్ (రూ. 93,000 కోట్లు)కు 20 రెట్లు ఎక్కువ. ► సంక్షేమ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచడంద్వారా 1.1 కోట్ల మేర కొత్త ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. తద్వారా 2018లో కోల్పోయిన 1.1 కోట్ల ఉద్యోగాలను తిరిగి సృష్టించవచ్చు. ► అంతర్జాతీయంగా చూస్తే మొత్తం ఆఫ్రికాలో మహిళల దగ్గరున్న సంపద కన్నా ప్రపంచంలో టాప్ 22 మంది బిలియనీర్ల వద్ద ఉన్న సంపదే ఎక్కువ. ► వచ్చే 10 ఏళ్ల పాటు ఒక్క శాతం కుబేరులు తమ సంపదపై అదనంగా కేవలం 0.5 శాతం పన్ను చెల్లించిన పక్షంలో.. వృద్ధులు, బాలల సంక్షేమం, విద్యా, వైద్యం వంటి రంగాల్లో 11.7 కోట్ల పైచిలుకు ఉద్యోగాల కల్పనకు అవసరమైన పెట్టుబడులకు సరిసమానంగా ఉంటుంది. సోషల్ మొబిలిటీలో అట్టడుగున భారత్.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలు కూడా ఉన్నత స్థాయిలకు చేరేందుకు అనువైన పరిస్థితులను సూచించే సోషల్ మొబిలిటీ సూచీలో భారత్ అట్టడుగు స్థానంలో ఉంది. డబ్ల్యూఈఎఫ్ రూపొందించిన కొత్త సూచీలో .. 82 దేశాల జాబితాలో 76వ స్థానంలో నిల్చింది. అయితే, దీన్ని మెరుగుపర్చుకోగలిగితే అత్యధికంగా లాభపడే దేశాల్లో చైనా, అమెరికా తర్వాత భారత్ కూడా ఉంటుందని సంబంధిత నివేదికలో డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ఆర్థిక, సామాజిక నేపథ్యంతో పనిలేకుండా అందరూ పూర్తి స్థాయిలో ఎదిగేందుకు సమాన అవకాశాలు ఏ దేశంలో ఎంత మేర లభిస్తున్నాయన్నది తెలిపేందుకు ఈ సూచీ ఉపయోగపడుతుంది. ప్రధానంగా విద్య, వైద్యం, టెక్నాలజీ తదితర 5 అంశాల ప్రాతిపదికన దీన్ని లెక్కిస్తారు. ఈ విషయాల్లో డెన్మార్క్ టాప్‌లో ఉంది. డబ్ల్యూఈఎఫ్ సదస్సు ప్రారంభం... ప్రపంచ దేశాల అధినేతలు, విధానకర్తలు, వ్యాపార దిగ్గజాలు, ఇతరత్రా ప్రముఖులు హాజరవుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లాస్ ష్వాబ్ ఈ సందర్భంగా ఆహూతులకు స్వాగతం పలికారు. ‘ఈ 50వ వార్షిక సదస్సులో పాల్గొంటున్న అన్ని దేశాలు, భాగస్వాములు, సభ్యులు, సాంస్కృతిక సారథులకు, యువ నేతలకు స్వాగతం‘ అని ఆయన పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఫోరం ఏర్పడిందని, ఇప్పటికీ అదే స్ఫూర్తితో కొనసాగుతోందని ష్వాబ్ చెప్పారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణె సహా పలువురు ప్రముఖులకు క్రిస్టల్ అవార్డ్స్ పురస్కారాలను ప్రదానం చేశారు. మానసిక ఆరోగ్యం ఆవశ్యకతపై అవగాహన పెంచేందుకు కృషి చేసినందుకు గాను పదుకొణె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వివిధ దేశాల నుంచి 3,000 పైగా ప్రతినిధులు సదస్సులో పాల్గొంటున్నారు. -
మరో సమరానికి సిద్ధమవ్వాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్న నేపథ్యంలో.. అందుకు వ్యతిరేకంగా మరో స్వాతంత్య్ర సమరానికి సిద్ధం కావాల్సి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా పేదలకు ఆర్థిక స్వాతంత్య్రం రాలేదన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం మఖ్దూంభవన్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం చాడ మాట్లాడుతూ... ధరల పెరుగుదల, అవినీతి, ప్రజాస్వామ్య విలువలు, లౌకిక వ్యవస్థపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పల్లా వెంకటరెడ్డి, సిద్ధి వెంకటేశ్వర్లు, పశ్య పద్మ, కె.శ్రీనివాసరెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, ఉజ్జిని రత్నాకరరావు, టి.వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. -
భారత్ లో ఆర్థిక అసమానతలు అధికం
♦ ఐఎంఎఫ్ నివేదిక వెల్లడి ♦ ఆసియా పసిఫిక్‌లో భారత్, చైనాల్లోనే అత్యంత దుర్భరమని విశ్లేషణ సింగపూర్: భారత్, చైనాల్లో ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఆసియా పసిఫిక్ దేశాల్లో- ఈ రెండుదేశాల్లోనే ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నట్లు ఐఎంఎఫ్ పేర్కొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలయినప్పటికీ ఈ దేశాల్లో ఆర్థిక సమతౌల్యతలు తగిన విధంగా లేవని పేర్కొంది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు.. ♦ భారత్, చైనాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పేదరికమూ తగ్గుతోంది. అయితే ధనిక, పేద మధ్య వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ♦ గతంలో ఆసియాలో వృద్ధి పంపిణి తగిన స్థాయిలో ఉండేది. అయితే భారత్, చైనాలు ఇటీవల పేదరికం తగ్గుతున్నా.... సమానత్వ సాధన ద్వారా వృద్ధి చెందడంలో వెనకబడుతున్నాయి. ♦ పట్టణ ప్రాంతాల్లో మధ్య తరగతి ఆదాయాల పెరుగుదలలో చైనా, థాయ్‌లాండ్‌లు కొంత విజయం సాధించగలిగాయి. అయితే భారత్, ఇండోనేసియాలు అధిక ఆదాయ స్థాయిలవైపు ఈ వర్గాన్ని తీసుకువెళ్లడంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ♦ భారత్, చైనాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల ఆదాయాల్లో సైతం వ్యత్యాసం తీవ్రంగా పెరిగింది. చైనాలో వేగవంతమైన పారిశ్రామికీకరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కోస్తా ప్రాంతాలపై దృష్టి పెట్టడం వంటి అంశాలు మారుమూల ప్రాంతాల వృద్ధికి విఘాతంగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అధిక ద్రవ్యోల్బణం పరిస్థితులు కూడా పట్టణ-గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వ్యత్యాసానికి కారణం. ♦ పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు కూడా బలహీనంగా ఉన్నాయి. ♦ కాగా ఆదాయ వ్యత్యాసాలను తొలగించడానికి, ఆర్థిక పారదర్శకతను నెలకొల్పడానికి రెండు దేశాలు తగిన ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఇవి రానున్న కాలంలో కొంత సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. భారత్‌లో అందరినీ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకురావడానికి ప్రారంభించిన జన్‌ధన్ యోజన ప్రశంసనీయమైనది. దీనితోపాటు, ఆధార్, మొబైల్ ఆధారిత సేవలు, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ కింద కార్యకలాపాలు ఆర్థిక స్వావలంభన దిశలో ముఖ్యమైనవి. భారత్ వృద్ధి 7.4 శాతం: హెచ్ఎస్బీసీ న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) ఈ ఏడాది(2016-17) 7.4% వృద్ధిని సాధిస్తుందని ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- హెచ్ఎస్బీసీ తన పరిశోధనా నివేదికలో అంచనావేసింది. వచ్చే ఆరు త్రైమాసికాల్లో తయారీ రంగం పేలవంగా ఉండే అవకాశం ఉందనీ, అయితే అదే సమయంలో తగిన వర్షపాతం వల్ల వ్యవసాయ రంగం మంచి ఫలితాలను అందించే అవకాశం ఉందని వివరించింది. మొత్తం జీడీపీలో ఈ రంగాల వాటా వరుసగా 17, 15 శాతాలుగా ఉండే వీలుందని నివేదిక పేర్కొంది. ఇక బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల సమస్య కొనసాగుతుందని పేర్కొంది. తగిన వర్షపాతం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.6%గా నమోదవుతుందని ఆర్బీఐ అంచనావేసింది. ఆర్థికశాఖకు సంబంధించి ఈ అంచనాలు 7-7.75%గా ఉన్నాయి. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) అంచనాలు కూడా హెచ్ఎస్బీసీ అంచనాల స్థాయిలోనే 7.4%గా ఉన్నాయి. వృద్ధికి సంస్కరణలు కీలకం: కొటక్: కాగా భారత్ సత్వర వృద్ధికి సంస్కరణలు కీలకమని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ తన పరిశోధనా నివేదికలో పేర్కొంది. చైనాలో మందగమన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల దృష్టిని భారత్ దిశగా మళ్లించడానికి భారత్‌లో వ్యవస్థాగత సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా వస్తు సేవల పన్ను, దివాలా కోడ్ అమలు, కార్మిక చట్ట సంస్కరణల అవసరాన్ని ఉద్ఘాటించింది. విద్యా, ఉపాధి రంగాల్లో మెరుగుదల, సామాన్యునికి సత్వర న్యాయం దిశలో చర్యలు అవసరమని సూచించింది.