
ప్రపంచంలో ఇంకా సూటిగా చెప్పాలంటే భారతదేశంలో పేదరికం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గుతున్న నేపథ్యంలో అదే సమయంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై ఇప్పుడు చర్చ కేంద్రీకృతమౌతోంది. దేశంలో దారిద్య్రం మాయమౌతున్న క్రమంలో ప్రజల్లో ఆర్థిక వ్యత్యాసాలు వృద్ధి చెందడం అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తుందని కొందరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కిందటి దశాబ్దంలో (2011–2021) ఇండియాలో వరుసగా 2014, 2015లో అనావృష్టి పీడించింది.
2020 - 22 మధ్య కొవిడ్-19 మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసింది. ఫలితంగా పేదరిక నిర్మూలక లక్ష్యం అనుకున్నంతగా ముందుకు సాగలేదు. సదుద్దేశంతో అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ) దశాబ్దం చివర్లో ఆర్థిక వ్యవస్థను కొంత ఇబ్బంది పెట్టినా తర్వాత ఆర్థికరంగం తిరిగి ప్రగతిపథంలో పయనించింది. ఇప్పుడు పారిశ్రామిక దేశాల్లో మాదిరిగానే ఇండియాలో కూడా ఆర్థిక అసమానతలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయనే మాటలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి.
గత మూడు దశాబ్దాల్లో ఆర్థిక ప్రపంచీకరణ వల్ల అత్యధిక దేశాల్లో పేదరికం గణనీయంగా తగ్గింది. పూర్వం వర్ధమాన దేశంగా ముద్రపడిన ఇండియాలో దారిద్య్రం మున్నెన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో అంతరించింది. కాని, కొవిడ్ మహమ్మారి ఫలితంగా ప్రపంచంలో ఆర్థిక అసమానతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని ప్రపంచ ఆర్థిక అసమానత నివేదిక–2022 వెల్లడించింది. 1990ల మధ్య నుంచీ ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఒక శాతం జనాభా ప్రపంచంలో 38 శాతం సంపదను తమ చేతుల్లోకి తెచ్చుకోగలిగారు. 2020 తర్వాత ఇదే ధోరణి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది.
పేదరిక నిర్మూలనే మొదటి లక్ష్యం కావాలి, అసమానతలు తర్వాత రూపుమాపవచ్చు!
అయితే, ఆర్థిక అసమానతలు రూపుమాపడం కన్నా ఇండియాకు పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ఉండాలని నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త, అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అరవింద్ పనగఢియా ఇటీవల ఓ ఇంగ్లిష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘అసలు ఆర్థిక అసమానతలు ప్రతి దేశంలో ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాయి.
ఇక ఇండియా విషయానికి వస్తే నేను ఎక్కువగా పట్టించుకునేది అక్కడ ఇంకా పూర్తిగా తొలగిపోని పేదరికం. నా లెక్క ప్రకారం దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు ఆందోళన కలిగించే స్థాయిలో కనపడడం లేదు. వాస్తవానికి 2021 - 22 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (ఏటా చేసే శ్రామికశక్తులపై అధ్యయనం) చూస్తే భారత్‌లో అసమానతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) నగర ప్రాంతాల్లో కేంద్రీకృతమవ్వడం వల్ల ఆర్థిక సంక్షోభాల ప్రభావం ఆ కాలంలో రవాణా, నిర్మాణ రంగాలపై పడింది.
దీంతో ధనికవర్గంపై ఇది ప్రతికూల ప్రభావం చూపింది. ఆర్థిక వ్యత్యాసాలు దీని వల్ల కొద్దిగా తగ్గాయి,’ అని పనగఢియా ఈ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. మొదట దారిద్య్రం బాగా తగ్గిపోయి పూర్వపు పేదల ఆదాయాలు పెరిగితే, ఆర్థిక అసమానతలను తర్వాత రూపుమాపడం కష్టమేమీ కాదనేది అత్యధిక ఆర్థికవేత్తల అభిప్రాయంగా కనిపిస్తోంది. అదీగాక, ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా ఆసియా ఖండం మారుతున్న నేపథ్యంలో భారతదేశానికి అనేక ఆర్థిక అవకాశాలు చేతికందుతున్నాయి. తయారీ, సేవల రంగంలో ఇండియాలో ఉత్పత్తి, ఎగుమతులు పెంచడానికి కొత్త పరిస్థితులు దోహదం చేస్తున్నాయి.
(ఇదీ చదవండి: బంగారం కొనుగోళ్లకు డాలర్‌కు సంబంధమేంటి?)
దేశంలో సంపద సృష్టించే కార్యక్రమాన్ని వేగవంతం చేయడం ద్వారా పేదరికం మరింత తగ్గించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వాలు, ఆర్థికవేత్తలు–ఆర్థిక అసమానతలపై కన్నా దారిద్య్ర నిర్మూలనపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం ద్వారా మన లక్ష్యాన్ని సాధించవచ్చు. పేదరికం లేని నవభారతాన్ని నిర్మించవచ్చు.
-విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ, రాజ్యసభ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment