దావోస్: పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలను ప్రతిబింబిస్తూ.. మన దేశ జనాభాలో 70 శాతం (సుమారు 95.3 కోట్ల మంది) జనాభాతో పోలిస్తే 1 శాతం కుబేరుల సంపద ఏకంగా నాలుగు రెట్లు పైగా ఉంది. దేశీయంగా 63 మంది బిలియనీర్ల మొత్తం సంపద విలువ.. పూర్తి ఆర్థిక సంవత్సర బడ్జెట్ పరిమాణాన్ని (2018–19లో రూ. 24.42 లక్షల కోట్లు) మించింది. ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యుల పక్షం వహించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ మానవ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా ’టైమ్ టు కేర్’ పేరిట ఆక్స్‌ఫామ్ దీన్ని విడుదల చేసింది. దీని ప్రకారం.. ప్రపంచ జనాభాలో సుమారు 60 శాతం (460 కోట్లు) ప్రజలకు మించిన సంపద 2,153 మంది బిలియనీర్ల దగ్గర ఉంది. ‘అసమానతలను తొలగించే కచ్చితమైన విధానాలు లేకుండా సంపన్నులు, పేదల మధ్య వ్యత్యాస సమస్యలను పరిష్కరించడం కుదరదు. కానీ చాలా కొన్ని ప్రభుత్వాలు మాత్రమే ఈ దిశగా కృషి చేస్తున్నాయి‘ అని ఆక్స్‌ఫాం ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ పేర్కొన్నారు. 24 వరకూ జరగనున్న డబ్ల్యూఈఎఫ్ సదస్సులో భారత్ నుంచి పలువురు వ్యాపార దిగ్గజాలు, ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు.
నివేదికలోని మరికొన్ని ఆసక్తికర అంశాలు..
► టెక్నాలజీ సంస్థ సీఈవో ఓ ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని ఆర్జించాలంటే సాధారణ మహిళా పనిమనిషికి 22,277 ఏళ్లు పడుతుంది. ఆమె ఏడాది సంపాదనను.. సెకనుకు రూ. 106 చొప్పున టెక్ సీఈవో 10 నిమిషాల్లో సంపాదిస్తున్నారు.
► మహిళలు, బాలికలు రోజుకు 326 కోట్ల గంటల పనిని ఎలాంటి భత్యాలు లేకుండా చేస్తున్నారు. దీనికి లెక్కగడితే ఏటా రూ. 19 లక్షల కోట్లవుతుంది. ఇది 2019లో దేశీ విద్యారంగానికి కేటాయించిన మొత్తం బడ్జెట్ (రూ. 93,000 కోట్లు)కు 20 రెట్లు ఎక్కువ.
► సంక్షేమ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచడంద్వారా 1.1 కోట్ల మేర కొత్త ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. తద్వారా 2018లో కోల్పోయిన 1.1 కోట్ల ఉద్యోగాలను తిరిగి సృష్టించవచ్చు.
► అంతర్జాతీయంగా చూస్తే మొత్తం ఆఫ్రికాలో మహిళల దగ్గరున్న సంపద కన్నా ప్రపంచంలో టాప్ 22 మంది బిలియనీర్ల వద్ద ఉన్న సంపదే ఎక్కువ.
► వచ్చే 10 ఏళ్ల పాటు ఒక్క శాతం కుబేరులు తమ సంపదపై అదనంగా కేవలం 0.5 శాతం పన్ను చెల్లించిన పక్షంలో.. వృద్ధులు, బాలల సంక్షేమం, విద్యా, వైద్యం వంటి రంగాల్లో 11.7 కోట్ల పైచిలుకు ఉద్యోగాల కల్పనకు అవసరమైన పెట్టుబడులకు సరిసమానంగా ఉంటుంది.
సోషల్ మొబిలిటీలో అట్టడుగున భారత్..
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలు కూడా ఉన్నత స్థాయిలకు చేరేందుకు అనువైన పరిస్థితులను సూచించే సోషల్ మొబిలిటీ సూచీలో భారత్ అట్టడుగు స్థానంలో ఉంది. డబ్ల్యూఈఎఫ్ రూపొందించిన కొత్త సూచీలో .. 82 దేశాల జాబితాలో 76వ స్థానంలో నిల్చింది. అయితే, దీన్ని మెరుగుపర్చుకోగలిగితే అత్యధికంగా లాభపడే దేశాల్లో చైనా, అమెరికా తర్వాత భారత్ కూడా ఉంటుందని సంబంధిత నివేదికలో డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ఆర్థిక, సామాజిక నేపథ్యంతో పనిలేకుండా అందరూ పూర్తి స్థాయిలో ఎదిగేందుకు సమాన అవకాశాలు ఏ దేశంలో ఎంత మేర లభిస్తున్నాయన్నది తెలిపేందుకు ఈ సూచీ ఉపయోగపడుతుంది. ప్రధానంగా విద్య, వైద్యం, టెక్నాలజీ తదితర 5 అంశాల ప్రాతిపదికన దీన్ని లెక్కిస్తారు. ఈ విషయాల్లో డెన్మార్క్ టాప్‌లో ఉంది.
డబ్ల్యూఈఎఫ్ సదస్సు ప్రారంభం...
ప్రపంచ దేశాల అధినేతలు, విధానకర్తలు, వ్యాపార దిగ్గజాలు, ఇతరత్రా ప్రముఖులు హాజరవుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లాస్ ష్వాబ్ ఈ సందర్భంగా ఆహూతులకు స్వాగతం పలికారు. ‘ఈ 50వ వార్షిక సదస్సులో పాల్గొంటున్న అన్ని దేశాలు, భాగస్వాములు, సభ్యులు, సాంస్కృతిక సారథులకు, యువ నేతలకు స్వాగతం‘ అని ఆయన పేర్కొన్నారు.
వ్యాపార సంస్థలు కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఫోరం ఏర్పడిందని, ఇప్పటికీ అదే స్ఫూర్తితో కొనసాగుతోందని ష్వాబ్ చెప్పారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణె సహా పలువురు ప్రముఖులకు క్రిస్టల్ అవార్డ్స్ పురస్కారాలను ప్రదానం చేశారు. మానసిక ఆరోగ్యం ఆవశ్యకతపై అవగాహన పెంచేందుకు కృషి చేసినందుకు గాను పదుకొణె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వివిధ దేశాల నుంచి 3,000 పైగా ప్రతినిధులు సదస్సులో పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment