మరో సమరానికి సిద్ధమవ్వాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్న నేపథ్యంలో.. అందుకు వ్యతిరేకంగా మరో స్వాతంత్య్ర సమరానికి సిద్ధం కావాల్సి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా పేదలకు ఆర్థిక స్వాతంత్య్రం రాలేదన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం మఖ్దూంభవన్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం చాడ మాట్లాడుతూ... ధరల పెరుగుదల, అవినీతి, ప్రజాస్వామ్య విలువలు, లౌకిక వ్యవస్థపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పల్లా వెంకటరెడ్డి, సిద్ధి వెంకటేశ్వర్లు, పశ్య పద్మ, కె.శ్రీనివాసరెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, ఉజ్జిని రత్నాకరరావు, టి.వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.