Inequalities
-
పెచ్చురిల్లుతున్న ఆర్థిక అంతరాలు!
ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటోంది. యూఎస్, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ఇండియా జీడీపీ దూసుకుపోతోంది. కానీ ప్రజల ఆదాయాలు, వారి సంపద మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ఇటీవల హురున్ ఇండియా దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసింది. జులై 31 నాటికి రూ.1,000 కోట్ల సంపద కలిగిన వారిని పరిగణనలోకి తీసుకుని దీన్ని రూపొందించారు. దాని ప్రకారం ఈ ఏడాది దేశంలోని కుబేరుల సంఖ్య 220 పెరిగి 1,539కు చేరింది. వీరి వద్ద రూ.159 లక్షల కోట్ల సంపద మూలుగుతుంది. ఏడాది ప్రాతిపదికన వీరి ఆస్తులు 46 శాతం వృద్ధి చెందాయి. దేశంలో దాదాపు 140 కోట్ల జనాభా ఉంది. కేవలం 1539 మంది వద్దే ఇన్ని కోట్ల రూపాయలు పోగవ్వడం సామాజిక అంశాతికి దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పెరుగుతున్న ఆర్థిక అసమానతలు బ్రిటిష్ కాలంలో కంటే ఇప్పుడు ఎక్కువయ్యాయి. కొన్ని నివేదికల ప్రకారం దేశంలోని ఒక శాతం జనాభా చేతుల్లోకి 40.1 శాతం సంపద చేరుతుంది. వివిధ వర్గాల ఆదాయ సంపదల్లో అసమానతలు ఉన్నప్పటికీ, అందరి వాస్తవ ఆదాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే ప్రజల ఆదాయాలతో పాటే వాటి మధ్య అంతరాలు అధికమవుతున్నాయి. అందుకు 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలే కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిని అమలు చేయకముందు వరకు దేశ జీడీపీ మూడు శాతం వద్దే ఆగిపోయింది. ఈ సంస్కరణల తర్వాత జీడీపీ 6-8 శాతం పెరిగింది. అయినా గరిష్ఠ సంపద తక్కువ మంది చేతుల్లోకే వెళుతుంది.భారత్‌తోపాటు అనేక దేశాల్లో ఈ ఆర్థిక అసమానతలకు సంబంధించిన సమస్యలు ఎక్కవవుతున్నాయి. ఇవి మరింత పెరిగితే సామాజిక అశాంతి నెలకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ అంతరాలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అత్యంత ధనవంతులపై విధించే పన్నులు పెంచాలని చెబుతున్నారు. కుబేరులకు వారసత్వంగా వచ్చే సంపదపై పన్ను విధించాలంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు.. ఇందుకు సహకరించాలని కోరుతున్నారు.ఇదీ చదవండి: అంబానీను దాటేసిన అదానీ..దురదృష్టవశాత్తు పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలను పరోక్షంగా నడిపించేది ధనవంతులే. దాంతో చట్ట సభల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ధైర్యం చేయడానికి ప్రజా ప్రతినిధులు సహకరించడం లేదు. కానీ ఆర్థిక అసమానతల వల్ల భవిష్యత్తులో రాబోయే సామాజిక అశాంతిని దృష్టిలో ఉంచుకుని ఈమేరకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
Oxfam Inequality Report 2024: డబ్బు ఉన్నవారు.. లేనివారికి మధ్య ఇంత తేడా..!
ప్రపంచంలో ఆదాయం, సంపదపరంగా తీవ్ర అసమానతలు రాజ్యమేలుతున్నాయని ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. దాంతో ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక విధానాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాజంలో ఉన్నత వర్గాల సంపద, ఆదాయాలు పెరుగుతుంటే, దిగువ శ్రేణివారి పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన తొలి అయిదుగురి నికర సంపద విలువ, కొవిడ్ మహమ్మారి వ్యాపించిన 2020 తర్వాత రెట్టింపునకు పైగా పెరిగినట్లు ఆక్స్‌ఫామ్ తెలిపింది. అదే సమయంలో 500 కోట్లమంది మాత్రం మరింత పేదరికంలోకి వెళ్లారని నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అసమానతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో ఆక్స్‌ఫామ్ ‘ఇనీక్వాలిటీ ఇంక్.’ పేరుతో రిపోర్ట్ విడుదల చేసింది. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. కంపెనీ లాభాలు పెరిగినా.. ఉద్యోగాల్లో కోత అతిపెద్ద కంపెనీల్లో డెబ్భై శాతం సంస్థల్లో ఒక బిలియనీర్ సీఈఓ ఉన్నారు. ఈ కంపెనీలు 10.2 లక్షల కోట్ల డాలర్ల విలువైన సంపదను కలిగి ఉన్నాయి. అంటే ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల జీడీపీల కంటే అధిక సంపద వీరి వద్దే ఉంది. గత మూడేళ్లలో 148 పెద్దకంపెనీలు 1.8 లక్షల కోట్ల డాలర్ల లాభాలను నమోదు చేశాయి. ఏటా సగటున 52 శాతం వృద్ధి చెందాయి. మరోవైపు లక్షల మంది ఉద్యోగుల వేతనాలు తగ్గాయి. 500 కోట్ల మంది పేదలు.. ప్రపంచంలోని అగ్రగామి అయిదుగురు ధనవంతులు ఇలాన్ మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్, లారీ ఎలిసన్, మార్క్ జుకర్‌బర్గ్ సంపద 2020 నుంచి 405 బిలియన్ డాలర్ల (రూ.33.61 లక్షల కోట్ల) నుంచి 464 బిలియన్ డాలర్లు (రూ.38.51 లక్షల కోట్లు) పెరిగి 869 బిలియన్ డాలర్ల (రూ.72.12 లక్షల కోట్ల)కు చేరింది. అంటే గంటకు 14 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.116 కోట్ల) చొప్పున వీరు సంపదను పోగేసుకున్నారు. ప్రపంచంలోని బిలియనీర్లు 2020తో పోలిస్తే 3.3 లక్షల కోట్ల డాలర్ల అదనపు సంపదను పోగేసుకున్నారు. ఇదే సమయంలో 500 కోట్ల మంది సామాన్యులు మాత్రం మరింత పేదలయ్యారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రపంచం వీరిలో నుంచి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్ల సంపద)ను చూడడానికి ఒక దశాబ్దం పడుతుంది. పేదరికం మాత్రం మరో 229 ఏళ్లకు గానీ అంతం కాదు. భారీగా తగ్గిన కార్పొరేట్ పన్నులు.. ప్రపంచంలోని 96 ప్రధాన కంపెనీలు ఆర్జిస్తున్న ప్రతి 100 డాలర్ల లాభంలో 82 డాలర్లు సంపన్న వాటాదారులకే చెందుతున్నాయి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) సభ్యదేశాల్లో కార్పొరేట్ పన్ను 1980లో 48 శాతం ఉండగా.. తాజాగా అది 23.1 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేని వేతనాలు.. ప్రపంచ జనాభాలో ఆస్ట్రేలియాతో పాటు ఉత్తరాది దేశాల వాటా 21 శాతమే అయినప్పటికీ.. సంపద మాత్రం 69 శాతం వీటి దగ్గరే ఉంది. ప్రపంచ బిలియనీర్ల సంపదలో 74 శాతం ఈ దేశాలకు చెందినవారిదే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మంది శ్రామికులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే స్థాయి వేతనాన్ని పొందలేకపోతున్నారు. ఇదీ చదవండి: మురికివాడ రూపురేఖలు మార్చనున్న అదానీ..? మహిళల కంటే పురుషుల వద్దే అధికం.. ప్రపంచంలోని ఐదుగురు అత్యంత ధనవంతులు రోజుకు 1 మిలియన్ డాలర్లు(రూ.8.23 కోట్లు) ఖర్చు చేస్తే వారి సంపద పూర్తిగా కరిగిపోవడానికి 496 ఏళ్లు పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల కంటే పురుషుల దగ్గర 105 ట్రిలియన్ డాలర్ల అధిక సంపద ఉంది. ఈ తేడా అమెరికా ఆర్థిక వ్యవస్థ కంటే నాలుగింతలు అధికం. -
అసమాన ప్రశ్నలు
ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది? ఈ అసమానతలకు కారణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఒక శాస్త్రవేత్తకు వస్తే? ఆయన చరిత్రకారుడు కూడా అయితే! జియోగ్రాఫర్, ఆర్నిథాలజిస్ట్ లాంటి అదనపు అర్హతలు కూడా ఉంటే? ఇలాంటి ప్రశ్నలకు బహు వృత్తులు, ప్రవృత్తులు కలగలిసినవారే జవాబులు చెప్పగలరు. ఒకానొక సముద్రపు ఒడ్డు నడకలో అమెరికన్ రచయిత జేరెడ్ డైమండ్ (జ.1937)ను ఒక నల్లజాతి యువకుడు, పాపువా న్యూ గినియా దీవులకు చెందిన ‘యాలి’ ఇలా నిలదీశాడు: ‘మీ తెల్లవాళ్ల దగ్గర అంత ‘కార్గో’(వస్తు సామగ్రి) ఉన్నప్పుడు, మా దగ్గర అది ఎందుకు లేదు?’ ఈ అన్వేషణలో భాగంగా ఏళ్లపాటు చేసిన పరిశోధనతో జేరెడ్ డైమండ్ రాసిన పుస్తకం ‘గన్స్, జెర్మ్స్ అండ్ స్టీల్: ద ఫేట్స్ ఆఫ్ హ్యూమన్ సొసైటీస్’. శీర్షికలోనే సమాధానాలను నిలుపుకొన్న ఈ పుస్తకం సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం 1997లో వచ్చింది. ఆ తర్వాత దీని ఆధారంగానే ఇదే పేరుతో ‘ఎన్జీసీ’ ఛానల్ డైమండ్ హోస్ట్‌గా మూడు భాగాల డాక్యుమెంటరీ కూడా నిర్మించింది. సులభంగా కనబడే ఈ ప్రశ్నలకు జవాబులు అంత సులభంగా దొరకవు. వీటికి సమాధానాలు కూడా వర్తమానమో, సమీప గతమో చెప్పలేదు. అందుకే చరిత్ర, పూర్వ చరిత్ర యుగంలోకి డైమండ్ మనల్ని తీసుకెళ్తారు. మనుషులందరూ ఆహార సేకరణ దశలోనే ఉన్న తరుణంలో పదమూడు వేల ఏళ్ల క్రితం ‘మధ్య ప్రాచ్యం’లో మొదటిసారి వ్యవసాయం మొదలైంది. బార్లీ, గోదుమ పండించారు. ఎప్పుడైతే మిగులు పంట సాధ్యమైందో అక్కడ మనుషుల వ్యాపకాలు ఇతరాల వైపు మళ్లాయి. అలా మానవాళి మొదటి నాగరికత నిర్మాణం జరిగింది. చిత్రంగా పాపువా న్యూ గినియాలో ఇప్ప టికీ వ్యవసాయం మొదలుకాలేదు. అక్కడివాళ్లు తెలివైనవాళ్లు కాదనా? ఏ చెట్టు ఏమిటో, ఏ పుట్టలో ఏముందో చెప్పగలిగేవాళ్లు; ఎంతదూరమైనా బాణాన్ని గురిచూసి కొట్టేవాళ్లు తెలివైనవాళ్లు కాక పోవడం ఏమిటి? ఏ పంటలైతే మధ్యప్రాచ్యంలో నాగరికతకు కారణమయ్యాయో, అవి ఇక్కడ పెరగవు. ఆ భౌగోళిక పరిమితి వల్ల వాళ్లు ఇంకా ఆహార అన్వేషణ దశలోనే ఉన్నారు. అందుకే మనుషులను ‘అసమానంగా’ ఉంచుతున్న కీలక కారణం భౌగోళికత అంటారు డైమండ్. ‘ఫెర్టయిల్ క్రెసెంట్’(సారవంతమైన చంద్రవంక)గా పిలిచే ఈ యురేసియా ప్రాంతంలోనే జంతువులను మచ్చిక చేసుకోవడం కూడా జరిగింది. ఇవి గొప్ప అదనపు సంపదగా పనికొచ్చాయి. ఆవు, ఎద్దు, గొర్రె, మేక, గుర్రం, గాడిద, పంది లాంటి పద్నాలుగు పెంపుడు జంతువుల్లో ఒక్క లామా(పొట్టి ఒంటె; దక్షిణ అమెరికా) తప్ప పదమూడు ఈ ప్రాంతం నుంచే రావడం భౌగోళిక అనుకూలతకు నిదర్శనంగా చూపుతారు డైమండ్. మనుషుల విస్తరణ కూడా సరిగ్గా ఆ భౌగోళిక రేఖ వెంబడి, అంటే ఏ ప్రాంతాలు వీటికి అనుకూలంగా ఉన్నాయో వాటివెంటే జరిగింది. మరి ఒకప్పుడు మొదటి నాగరికత వర్ధిల్లిన మధ్య ప్రాచ్యం ఇప్పుడు ప్రపంచంలోనే సంపన్న ప్రాంతంగా ఎందుకు లేదు? భౌగోళికత ఒక కారణం అవుతూనే, దాన్ని మించినవి కూడా ఇందులో పాత్ర పోషిస్తున్నాయన్నది డైమండ్ సిద్ధాంతం. అయితే భౌగోళికత ప్రతికూలంగా కూడా పరిణమించవచ్చు. కరవు కాటకాలు ఓ దశలో మధ్యప్రాచ్యాన్ని తుడిచిపెట్టాయి కూడా! వారికి తెలియకుండానే ఐరోపావాసుల పక్షాన పనిచేసినవి సూక్ష్మ క్రిములని చెబుతారు డైమండ్. ఇతర ప్రాంతాలకు విస్తరించే క్రమంలో జరిగిన పోరాటాల్లో, ఆ పోరాటాల కంటే ఎక్కువగా వీరి నుంచి వ్యాపించిన సూక్ష్మక్రిముల వల్ల ‘మూలజాతులు’ నశించాయి. దానిక్కారణం – వేల సంవత్సరాల జంతువుల మచ్చిక వల్ల వాటి నుంచి వచ్చే సూక్ష్మక్రిముల నుంచి వీరికి నిరోధకత ఏర్పడింది. కానీ అలాంటి సంపర్కం లేని అమెరికన్ జాతులు దాదాపు తొంభై ఐదు శాతం నశించిపోయాయి. ముఖ్యంగా ‘స్మాల్‌పాక్స్’(మశూచి) కోట్లాది మంది ప్రాణాలు తీసింది. ఇంక ఎప్పుడైతే ఉక్కు వాడకంలోకి వచ్చిందో, ఆ ఉక్కుతో ముడిపడిన తుపాకులు రావడం ప్రపంచ గతినే మార్చేసింది. ఆ తుపాకుల వల్లే యూరప్ దేశాలు ప్రపంచాన్ని తమ కాలనీలుగా మార్చుకోగలిగాయి. ముఖ్యంగా ఆఫ్రికాలోని ప్రాచీన నాగరిక సమాజాలు, అవెంతటి ఘన సంస్కృతి కలిగినవి అయినప్పటికీ తుపాకుల ముందు నిలవలేకపోయాయి. అక్కడి నుంచి ఎంతో అమూల్యమైన సంపద తరలిపోయింది. మరి ఐరోపావాసులకు ప్రతికూలతలుగా పరిణమించినవి ఏవీ లేవా? ఏ భౌగోళిక రేఖ వెంబడి ప్రయాణిస్తూ వారికి అనుకూలమైన శీతోష్ణస్థితి ఉండే ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’(దక్షిణాఫ్రికా)లో మనగలిగారో, దాన్ని దాటి ఆఫ్రికాలోని ఉష్ణ మండలం వైపు విస్తరించినప్పుడు కేవలం మలేరియాతో కోట్లాదిమంది చచ్చిపోయారు. ప్రపంచం స్థిరంగా ఆగిపోయేది కాదు. భౌతిక ప్రమాణాల రీత్యా ప్రపంచంలో అసమానతలు స్పష్టంగా కనబడుతుండవచ్చు. కానీ మొన్న కోవిడ్ మహమ్మారి సమయంలో ఐరోపా, అమెరికా అల్లాడిపోయాయి. అదే పేద దేశాలు అంత ప్రభావితం కాలేదు. కాబట్టి అసమానత అనేది కూడా ఒక చరాంకం కావొచ్చు. ఒకే సమాజంలోనే కొందరు ధనికులుగా, ఇంకొందరు పేదవాళ్లుగా ఎందుకు ఉండిపోతున్నారు? ఒకే ఇంటిలోనే ఇద్దరన్నదమ్ములు భిన్న స్థాయుల్లోకి ఎందుకు చేరుతున్నారు? ఈ మొత్తంలో మానవ ప్రయత్నానికి ఏ విలువా లేదా? అందుకే డైమండ్ జవాబులు మరీ సరళంగా ఉన్నాయేమో అనిపించక మానదు. కానీ మార్గదర్శులు వాళ్ల జీవితాలను రంగరించి కొన్ని సమాధానాలు చెబుతారు. వాటి వెలుగులో సమాజం మరిన్ని జవాబులు వెతకాల్సి ఉంటుంది. ఎందుకంటే మానవ సమాజం అనేది మానవ స్వభావం అంత సంక్లిష్టమైనది. -
30 గంటలకు ఒక కొత్త బిలియనీర్
దావోస్: కరోనా వైరస్ మహమ్మారి వెలుగు చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అసమానతలు పెరిగిపోయినట్టు ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ తెలిపింది. కరోనా కాలంలో ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్ (బిలియన్ డాలర్లు అంతకుమించి సంపద కలిగినవారు) కొత్తగా పుట్టుకువచ్చినట్టు చెప్పింది. ఈ ఏడాది ప్రతి 33 గంటలకు సుమారు పది లక్షల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని ఈ సంస్థ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం సందర్భంగా దావోస్‌లో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికకు ‘ప్రాఫిటింగ్ ఫ్రమ్ పెయిన్’ (బాధ నుంచి లాభం/కరోనా కాలంలో పేదల కష్టాల నుంచి లాభాలు పొందడం) అని పేరు పెట్టింది. పెరిగిన ధరలతో బిలియనీర్లకు పంట దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయినట్టు తెలిపింది. దీంతో ఆహారం, ఇంధన రంగాల్లోని బిలియనీర్లు తమ సంపదను ప్రతి రెండు రోజులకు బిలియన్ డాలర్లు (రూ.7,700 కోట్లు) చొప్పున పెంచుకున్నట్టు వివరించింది. 573 మంది కొత్త బిలియనీర్లు కరోనా విపత్తు సమయంలో (రెండేళ్ల కాలంలో) కొత్తగా 573 మంది బిలీయనీర్లు పుట్టుకొచ్చినట్టు ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. దీన్ని ప్రతి 30 గంటలకు ఒక బిలీయనీర్ ఏర్పడినట్టు తెలిపింది. 26 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి ఈ ఏడాది 26.3 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని అంచనా వేస్తున్నట్టు ఆక్స్‌ఫామ్ ప్రకటించింది. ప్రతి 33 గంటలకు పది లక్షల మంది పేదరికంలోకి వెళ్తారని వివరించింది. 23 ఏళ్ల కంటే రెండేళ్లలో ఎక్కువ కరోనాకు ముందు 23 ఏళ్లలో ఏర్పడిన సంపద కంటే కరోనా వచ్చిన రెండేళ్లలో బిలియనీర్ల సంపద ఎక్కువ పెరిగినట్టు ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. ‘‘ఇప్పుడు ప్రపంచంలోని బిలియనీర్ల సంపద విలువ ప్రపంచ జీడీపీలో 13.9 శాతానికి సమానం. 2000లో ప్రపంచ జీడీపీలో బిలియనీర్ల సంపద 4.4 శాతమే’’అంటూ ప్రపంచంలోని అసమానతలను ఆక్స్‌ఫామ్ తన నివేదికలో ఎత్తి చూపింది. ‘‘కార్మికులు తక్కువ వేతనానికే, దారుణమైన పరిస్థితుల మధ్య ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అధిక సంపద పరులు వ్యవస్థను దశాబ్దాలుగా రిగ్గింగ్ చేశారు. వారు ఇప్పుడు ఆ ఫలాలను పొందుతున్నారు. ప్రైవేటీకరణ, గుత్తాధిపత్యం తదితర విధానాల మద్దతుతో ప్రపంచ సంపదలో షాక్‌కు గురిచేసే మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు’’అని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఈడీ గ్యాబ్రియెల్ బుచెర్ అన్నారు. ఆకలి కేకలు.. ‘‘మరోవైపు లక్షలాది మంది పస్తులు ఉండాల్సిన పరిస్థితి. మనుగడ కోసం వారు తదుపరి ఏం చేస్తారన్నది చూడాలి. తూర్పు ఆఫ్రికా వ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒక వ్యక్తి ఆకలితో చనిపోతున్నారు. ఈ స్థాయి అసమానతలు మానవత్వంతో మనుషులు కలిసి ఉండడాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. ఈ ప్రమాదకరమైన అసమానతలను అంతం చేయాలి’’అని బుచెర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఐదు అతిపెద్ద ఇంధన సంస్థలైన బీపీ, షెల్, టోటల్ ఎనర్జీ, ఎక్సాన్, చెవ్రాన్ కలసి ప్రతి సెకనుకు 2,600 డాలర్ల లాభాన్ని పొందాయని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. రికార్డు స్థాయి ఆహార ధరలతో శ్రీలంక నుంచి సూడాన్ వరకు సామాజికంగా అశాంతిని చూస్తున్నాయని.. 60% తక్కువ ఆదాయం కలిగిన దేశాలు రుణ సంక్షోభంలో ఉన్నాయని తెలిపింది. సంపన్నుల ఐశ్వర్యం ‘‘2,668 బిలియనీర్ల వద్ద 12.7 లక్షల కోట్ల డాలర్ల సంపద ఉంది. ప్రపంచంలో అట్టడుగున ఉన్న 301 కోట్ల ప్రజల (40 శాతం) ఉమ్మడి సంపద కంటే టాప్ 10 ప్రపంచ బిలియనీర్ల వద్దే ఎక్కువ ఉంది. సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న వ్యక్తి 112 ఏళ్లు కష్టపడితే కానీ.. అగ్రస్థానంలో ఒక వ్యక్తి ఏడాది సంపాదనకు సరిపడా సమకూర్చుకోలేని పరిస్థితి నెలకొంది’’అని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలు ఈ నెల 22న దావోస్‌లో ప్రారంభం కాగా, 26న ముగియనున్నాయి. -
అవసరమున్నంత కాలం రిజర్వేషన్లు: ఆరెస్సెస్
పుష్కర్: సామాజిక, ఆర్థిక అసమానతలు ఉన్నాయి కనుకనే రిజర్వేషన్ల అవసరం ఉన్నదనీ, లబ్ధిదారులకు రిజర్వేషన్ల అవసరమున్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగుతాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్పష్టం చేసింది. మంచినీటి విషయంలోనూ, శ్మశానాల్లోనూ, దేవాలయాల్లోనూ అందరికీ ప్రవేశం ఉండాలనీ, నీటి వనరుల వాడకాన్ని కులంపేరుతో నిరాకరించడం తగదనీ ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధానకార్యదర్శి దత్తాత్రేయ హోసబేల్ తేల్చి చెప్పారు. సమాజంలో ఆర్థిక, సామాజిక అంతరాలున్నాయనీ, అందుకే రిజర్వేషన్ల కొనసాగింపు అవసరమనీ ఆర్ఎస్ఎస్ భావిస్తోం దన్నారు. రాజస్తాన్‌లోని పుష్కర్‌లో మూడు రోజుల పాటు జరిగిన సంఘ్‌పరివార్ కోఆర్డినేషన్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి 35 ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల నుంచి 200 మంది ప్రతిని«ధులతోపాటు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి.నడ్డా, జనరల్ సెక్రటరీ బి.ఎల్.సంతోష్‌లు హాజరయ్యారు. -
వేతనాల్లో అసమానతలున్నాయ్!
90 శాతం మంది ఉద్యోగుల అభిప్రాయం న్యూఢిల్లీ: ఒకే హోదా కలిగి, ఒకే విధమైన విధులు నిర్వర్తిస్తున్నా వేతనాల విషయంలో తమ కంపెనీలు అసమానతలు పాటిస్తున్నాయని 90 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. జాబ్బజ్డాట్ఇన్, టైమ్స్జాబ్స్డాట్కామ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అధిక వేతనం చెల్లించి బయటివారిని నియమించడమే ఇందుకు కారణమని 40 శాతం మంది ఉద్యోగులు తెలుపగా, మేనేజర్ల పక్షపాత వైఖరే కారణమంటూ 35 శాతం మంది అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ప్రతిభ కారణంగానే వేతనాల్లో వ్యత్యాసం ఉంటోందని కేవలం 5 శాతం మంది మాత్రమే పేర్కొన్నారు. మహిళలు, పురుషుల వేతనాల్లో కూడా పరిగణించగల స్థాయిలో వ్యత్యాసం ఉన్నట్లు సర్వేలో తేలింది. 10-20 శాతం వ్యత్యాసం ఉన్నట్లు 25 శాతం మంది పేర్కొనగా, 20-30 శాతం తేడా ఉన్నట్లు 21 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. సిబ్బంది వేతనాల విషయంలో అంతర్గత సర్వే నిర్వహించి అందుకనుగుణంగా కంపెనీలు జాగరూకతతో వ్యవహారించాల్సిన అవసరం ఉందని టైమ్స్జాబ్డాట్కామ్ సీఈఓ వివేక్ మధుకర్ తెలిపారు. -
అసమానతలు ఉన్నంత వరకూ రిజర్వేషన్లు: భాగవత్
న్యూఢిల్లీ: సమాజంలో అసమానతలు, వివక్ష కొనసాగుతున్నంత కాలం రిజర్వేషన్లు అవసరమేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. అయితే ఈ రిజర్వేషన్ల కోటా విషయంలో రాజకీయాలు తగవని వ్యాఖ్యానించారు. ఆదివారం భాగవత్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘మేం రిజర్వేషన్లను సమర్థిస్తాం. సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు అవసరమే. అసమానత, వివక్షలతో బాధపడుతున్నవారు సమాన అవకాశాలు పొందడానికి రిజర్వేషన్లు అవకాశం కనిపిస్తాయి. కానీ, ఈ విషయంలో రాజకీయాలు ఏ మాత్రం తగవు’’ అని ఆయన పేర్కొన్నారు.