వేతనాల్లో అసమానతలున్నాయ్!
90 శాతం మంది ఉద్యోగుల అభిప్రాయం
న్యూఢిల్లీ: ఒకే హోదా కలిగి, ఒకే విధమైన విధులు నిర్వర్తిస్తున్నా వేతనాల విషయంలో తమ కంపెనీలు అసమానతలు పాటిస్తున్నాయని 90 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. జాబ్‌బజ్‌డాట్‌ఇన్, టైమ్స్‌జాబ్స్‌డాట్‌కామ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అధిక వేతనం చెల్లించి బయటివారిని నియమించడమే ఇందుకు కారణమని 40 శాతం మంది ఉద్యోగులు తెలుపగా, మేనేజర్ల పక్షపాత వైఖరే కారణమంటూ 35 శాతం మంది అభిప్రాయపడ్డారు.
వ్యక్తిగత ప్రతిభ కారణంగానే వేతనాల్లో వ్యత్యాసం ఉంటోందని కేవలం 5 శాతం మంది మాత్రమే పేర్కొన్నారు. మహిళలు, పురుషుల వేతనాల్లో కూడా పరిగణించగల స్థాయిలో వ్యత్యాసం ఉన్నట్లు సర్వేలో తేలింది. 10-20 శాతం వ్యత్యాసం ఉన్నట్లు 25 శాతం మంది పేర్కొనగా, 20-30 శాతం తేడా ఉన్నట్లు 21 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. సిబ్బంది వేతనాల విషయంలో అంతర్గత సర్వే నిర్వహించి అందుకనుగుణంగా కంపెనీలు జాగరూకతతో వ్యవహారించాల్సిన అవసరం ఉందని టైమ్స్‌జాబ్‌డాట్‌కామ్ సీఈఓ వివేక్ మధుకర్ తెలిపారు.