ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణ మూర్తిని సంపద పరంగా అదే సంస్థకు చెందిన మరో సహవ్యవస్థాపకులు సేనాపతి గోపాలకృష్ణన్ మించిపోయారు. ఇటీవల వెలువడిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం భారత్‌లో 334 మంది బిలియనీర్‌లు ఉన్నారు. ఈ సంఖ్య గతేడాది కంటే 75 ఎక్కువ. వారి సామూహిక సంపద రూ.159 లక్షల కోట్లకు చేరింది. ఈ లిస్ట్‌లో ఈసారి నారాయణ మూర్తి(సందప రూ.36,600 కోట్లు)ని సేనాపతి గోపాలకృష్ణన్ అధిగమించారు. రూ.38,500 కోట్ల నికర సంపదతో ఈ ఘనత దక్కించుకున్నారు.
ఇన్ఫోసిస్‌ను 1981లో నారాయణ మూర్తి, ఎన్‌ఎస్ రాఘవన్, అశోక్ అరోరా, నందన్ నీలేకని, ఎస్‌డీ శిబులాల్, కే.దినేష్, సేనాపతి గోపాలకృష్ణన్ కలిసి స్థాపించారు. ఇది తరువాతి కాలంలో ఇన్ఫోసిస్ భారతదేశంలో అత్యంత విజయవంతమైన ఐటీ సంస్థల్లో ఒకటిగా మారింది. 2023లో 18.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,51,762 కోట్లు ) ఆదాయాన్ని ఆర్జించింది.
ఇదీ చదవండి: యాపిల్ తయారీకి మరో కంపెనీలో వాటా కొనుగోలు
సేనాపతి గోపాలకృష్ణన్
సేనాపతి గోపాలకృష్ణన్(69) ఇన్ఫోసిస్ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అతను 2007 నుంచి 2011 వరకు కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. కంపెనీ విస్తరణ, ఆవిష్కరణల్లో ఇన్ఫోసిస్‌ను ముందుండి నడిపించారు. గోపాలకృష్ణన్ 2011 నుండి 2014 వరకు సంస్థకు వైస్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇన్ఫోసిస్‌లో తన కార్యకలాపాల నుంచి వైదొలిగిన తర్వాత గోపాలకృష్ణన్ కొత్త వ్యాపారాలపై దృష్టి సారించారు. అతను ప్రస్తుతం యాక్సిలర్ వెంచర్స్ ఛైర్మన్‌గా ఉన్నారు. యాక్సిలర్ వెంచర్స్ గుడ్‌హోమ్, కాగాజ్, ఎన్‌కాష్ వంటి స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment