దేశంలో పేదల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. సరైన పోషకాహారం లభించక కోట్లమంది రక్త హీనతతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. మరొక వైపున కొద్ది మంది సర్వభోగాలూ అనుభవిస్తు న్నారు. దేశంలో ఈ దారుణ పరిస్థితులకు కారకులు ఎవరు?
కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాలే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆర్థిక సంస్కరణల కారణంగా సంపద కొందరి దగ్గరే పోగుపడటం ప్రారంభమైంది. భారతదేశంలో ఆదాయం, సంపద పరంగా తీవ్ర అసమానతలు ఉన్నాయని ప్యారిస్ లోని అధ్యయన సంస్థ (వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్) 2022 నివేదిక వెల్లడించింది. 2021లో భారత సమాజంలోని 10శాతం అగ్రశ్రేణి సంపన్న వర్గం జాతీయ ఆదాయంలో 57 శాతం కలిగి ఉంది. అందులోని ఒక శాతం అగ్ర ధనిక వర్గం 22 శాతం వాటాను సొంతం చేసుకుంది. 50 శాతం ప్రజల వాటా 13 శాతం మాత్రమే. 1980 నుంచి భారత్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలే ఈ పరిస్థితికి కారణమని నివేదిక వెల్లడించింది. ఇండియాలో ప్రైవేట్ వ్యక్తుల సంపద 1980లో 290 శాతం ఉంటే 2020 నాటికి 560 శాతానికి పెరిగింది.
మరొక వైపున ప్రపంచంలో అత్యంత పేదరికం ఉన్న దేశాల్లో భారత్ మొదటి వరుసలో ఉంది. ప్రపంచం మొత్తం మీద అత్యంత పేదరికం అనుభవిస్తున్నవారు 68.9 కోట్లు ఉండగా... అందులో భారతదేశం వాటా 20.17 శాతంగా ఉంది. ఆర్థిక అసమానతల ఫలితంగా పేదలు పస్తులతో అర్ధాకలితో కాలం గడుపుతున్నారు. ప్రపంచ ఆహార సంస్థ ‘పోషక, ఆహార భద్రత– 2018’ నివేదిక ప్రకారం 19.59 కోట్ల మంది భారత ప్రజలు పస్తులతో పడుకుంటున్నారు.
2018 ప్రపంచ ఆకలి సూచీ(జీహెచ్‌ఐ) మేరకు 119 దేశాల్లో భారత్ 103వ స్థానంలో ఉంది. ఆహార భద్రత సూచీ ప్రకారం 113 దేశాల్లో భారత్ 76వ స్థానంలో ఉంది. ఈ విషయంలో శ్రీలంక, ఘనా, బొలీవియా కన్నా వెనకబడి ఉంది. పోషకాహారం లోపం వలన 17.3 శాతం చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు లేరు. 2015–16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేతో పోలిస్తే దేశంలో మరింత ఎక్కువ మందిలో రక్త హీనత ఏర్పడింది. చిన్నపిల్లల్లో, గర్భిణుల్లో అధికంగా రక్త హీనత ఉంది.
‘జాతీయ ఆహార భద్రత చట్టం’ అమలులోకి వచ్చి 54 ఏళ్లయినా ఆకలి చావులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వీటిని ప్రభుత్వాలు గుర్తించ నిరాకరిస్తున్నాయి. 2015–18లో దేశవ్యాప్తంగా ఆకలి చావులు సంభవించాయి. 2018లో 46 మంది ఆకలితో మరణించారు. స్వరాజ్ అభియాన్ సంస్థ 2015 చేసిన సర్వే వివరాల ప్రకారం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోకి వచ్చే బుందేల్ ఖండ్ ప్రాంతం లోని 13 జిల్లాల్లోని 38 శాతం గ్రామాల్లో 8 నెలల వ్యవధిలో పల్లెకొకరు చొప్పున పస్తులతో మరణిం చారు. మోదీ ప్రభుత్వం మాత్రం అవి ఆకలి చావులు కావనీ, అనారోగ్య కారణాలతో చనిపోయారనీ చెప్పి బాధ్యత నుంచి తప్పించుకుంది.
పేదరికానికి, అనారోగ్య సమస్యలకు, ఆకలి చావులకు దుర్భరమైన ఆర్థిక పరిస్థితులే కారణం. ప్రభుత్వ పథకాలు వలన పేదల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడలేదని ప్రస్తుత పరిస్థితులే నిరూపిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ పేదల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే తక్షణం తీసుకోవాల్సిన చర్యలున్నాయి. గ్రామీణ పేదలకు సేద్యపు భూమి పంపిణీ చేసి, హక్కు కల్పించాలి. పట్టణ పేదలకు, శ్రామికులకు ఉపాధి కల్పించే పరిశ్రమలు నెలకొల్పి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి. వారికి వాటిల్లో భాగస్వామ్యం కల్పించాలి. ఇందు కోసం గ్రామీణ, పట్టణ పేదలు సమష్టిగా ఉద్యమించాలి. (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!)
- బొల్లిముంత సాంబశివరావు
రైతు కూలీ సంఘం ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment