చెంప ఛెళ్ళుమనిపించే వాస్తవం అది. పాలకులు మేల్కోవాల్సిన అగత్యాన్ని గణాంకాల్లో చాటి చెప్పిన నివేదిక అది. ప్రపంచంలో ధనిక, పేద తేడా అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటంటూ ‘ప్రపంచ అసమానతల నివేదిక’ చేదు నిజాన్ని చెప్పింది. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు మహా రాజుల – ముష్టివాళ్ళ గడ్డగా ప్రపంచం పిలుచుకొన్న భారత్, స్వాతంత్య్రం వచ్చి 75వ ఏట అడు గిడినా ఇప్పటికీ అటు అతి సంపన్నులు, ఇటు నిరుపేదలున్న దేశంగానే మిగిలిందని వెల్లడైంది. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడంలోనే కాదు, స్వాతంత్య్రానికి ముందు నుంచి ఉన్న అసమానతలను తొలగించడంలోనూ మనం విఫలమవడం విషాదం. అసమానతలను కొలవడానికి అంతటా అంగీకరించే ‘జీనీ కో–ఎఫిషియంట్’ లెక్క సైతం మనదేశంలో 2000లో 74.7 ఉండేది. ఇరవై ఏళ్ళలో అది 82.3కి పెరగడం గమనార్హం. ఒక్క ముక్కలో, మునుపెన్నడూ లేని ప్రమాదకర స్థాయిలో దేశంలో ఇప్పుడు పేద, గొప్ప తేడాలున్నాయి.
‘ప్రపంచ అసమానతల సమాచార నిధి’ లెక్కల ప్రకారం 1951 నాటికి మన దేశం జాతీయ ఆదాయంలో అగ్రశ్రేణి 1 శాతం మంది వాటా, దిగువ శ్రేణి 40 శాతం మంది వాటాతో సమానం. అదే ఇవాళ చూస్తే – దిగువన ఏకంగా 67 శాతం మంది వాటా అంతా కలిస్తే కానీ, అగ్రశ్రేణి 1 శాతం మంది వాటాకు సరిపోదు. పోనీ, 1961 నుంచి అందుబాటులో ఉన్న జాతీయ సంపద లెక్కల్ని బట్టి చూసినా, ఎంతో అసమానత స్పష్టమవుతుంది. అప్పట్లో దేశ జాతీయ సంపదలో 1 శాతం సంపన్నులదీ, 50 శాతం నిరుపేదలదీ సమాన వాటా. అరవై ఏళ్ళ దేశపురోగతి తర్వాత ఇప్పుడు– దిగువన ఉన్న 90 శాతం మంది భాగం కలిస్తే కానీ, పైనున్న ఒక్క శాతం సంపన్నుల వాటాకు సరితూగడం లేదు. స్వతంత్ర భారతంలో ఆర్థిక అసమానతకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి?
ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెట్టీతో పాటు పలువురు సమన్వయం చేయగా, ‘వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్’ కో–డైరెక్టర్ లూకాస్ ఛాన్సెల్ ఈ ‘ప్రపంచ అసమానతల నివేదిక’కు అక్షరరూపం ఇచ్చారు. 2021కి గాను నవీకరించిన డేటా ప్రకారం ప్రపంచంలో 76 శాతం సంపద, సంపన్నులైన 10 శాతం మంది చేతిలోనే ఉంది. ప్రపంచ ధోరణికి తగ్గట్లే మన దేశమూ ఉంది. మన జాతీయ ఆదాయంలో 57 శాతం అగ్రశ్రేణిలో ఉన్న 10 శాతం మంది అతి సంపన్నులదే. అందులోనూ అందరి కన్నా పైయెత్తున ఉన్న ఒకే ఒక్క శాతం మందికి 22 శాతం ఆదాయం సొంతం. సంపద నిచ్చెనలో దిగువన ఉన్న 50 శాతం మంది వాటా కేవలం 13 శాతమే. ఇంకా చెప్పాలంటే, పైనెక్కడో ఉన్న 10 శాతం మందికీ, దిగువనెక్కడో ఉన్న 50 శాతం మందికీ మధ్య మన దేశంలో ఆదాయ వ్యత్యాసం 1 నుంచి 22 ఉందని లెక్క. ఇది చాలా పెద్ద తేడా అని నిపుణుల మాట.
సమాచార నిధిలో లెక్కల ప్రకారం ఇతర దేశాలతో పోలిస్తే, మనమింకా ఎక్కడున్నామో తెలుస్తోంది. ఇవాళ 50 శాతం మంది అతి నిరుపేద భారతీయుల సగటు ఆదాయం, 1932లో 50 శాతం మంది అతి పేద అమెరికన్ల సంపాదనతో సమానమట. అంటే, 1930ల నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసిన తర్వాత అమెరికన్ నిరుపేదలు ఎక్కడున్నారో, 90 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అక్కడే ఉన్నామన్న మాట. నెహ్రూవాద సామ్యవాదం మొదలు ఇందిరా గాంధీ మార్కెట్ సంస్కరణల ‘ప్రగతి పథం’, రాజీవ్ గాంధీ ప్రైవేటీకరణ జోరు, పీవీ నరసింహారావు – మన్మోహన్‌ల ఆర్థిక సంస్కరణల మీదుగా చాలా దూరం వచ్చాం. కానీ, దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో గణనీయ వృద్ధి వచ్చినా, దిగువనున్న 50 శాతం బీదవర్గాల భారతీయులకు ఒరిగిందేమీ లేదు.
భారత ప్రస్థానంలో అత్యంత కీలకమైన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ – ఈ 3 ఆర్థిక విధానాల వల్ల అగ్రశ్రేణిలోని 10 శాతం సంపన్నులే అనూహ్య లబ్ధి పొందారు. మిగిలిన 90 శాతానికి దక్కింది లేదు. దేశంలో అసమానతలు, అంతరాలు ఇంతగా పెరగడానికి అదే మూలకారణమని నిపుణుల విశ్లేషణ. ఇప్పుడు కరోనాతో అసమానతలు మరింత పెరిగాయి. అసమానత ఒక ముప్పు అయితే, అభివృద్ధి రేటు కుంటుపడడం మరిన్ని కష్టాలు తెచ్చింది. మధ్యతరగతిలో 3.2 కోట్ల మంది కొత్తగా దారిద్య్రంలోకి జారిపోయినట్టు ‘ప్యూ రిసెర్చ్’ మాట. కానీ, కోటీశ్వరుల సంపద మాత్రం నిరుడు లాక్‌డౌన్‌లో 35 శాతం పెరిగిందట.
అలాగని స్వాతంత్య్రపు తొలి రోజులతో పోలిస్తే, బీదాబిక్కీ జీవన ప్రమాణాలు అసలేమీ మెరుగు కాలేదని అనలేం. అయితే అది సరిపోతుందా? అసమానతలు సామాజికంగానూ ప్రభావం చూపుతున్నాయి. అతి సంపన్నులు 1 శాతం, వారికి తోడుబోయిన తరువాతి 9 శాతం మంది చెప్పినట్టే సంస్థలు, ప్రజా విధానాలు సాగుతాయి. జనానికి తెలియజెప్పాల్సిన మాధ్యమాలూ వారి చేతి కిందే. ఓటింగ్‌ను ప్రభావితం చేసే ప్రజాభిప్రాయ పరికల్పనా వారి చేతుల్లోనే. అదే పెద్ద చిక్కు. అయితే, దేశంలోని దారిద్య్ర వర్గాన్ని పైకి తీసుకురావడం అసాధ్యమేమీ కాదు. లేమిపై పోరుకు కావాల్సిన భౌతిక, సామాజిక వసతి సౌకర్యాల కల్పన ఓ సవాలు. నిజానికి, లేనివాళ్ళు పాతాళం నుంచి పైకి లేవాలన్నా, పైపైకి రావాలన్నా అందుకు రాజకీయ సాధికారికత కీలకం. అది చేతికి అందితే, విద్య, వైద్యం లాంటివి డిమాండ్ చేసి మరీ సాధించుకుంటారు. ఫలితంగా సమాజంలో వ్యవస్థాగత అసమానతలు, వర్గ విభేదాలు రూపుమాసిపోగలుగుతాయి. అందుకు తక్షణమే నడుం కట్టాల్సింది రాజకీయ నేతలు, విధాన నిర్ణేతలే. అత్యవసరంగా చర్యలు చేపట్టడమే శరణ్యం.
Comments
Please login to add a commentAdd a comment