తుఫాను ప్రభావంతో వచ్చిన వరదలు లిబియాను సర్వ నాశనం చేశాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. దర్నా నగరంలో ఎక్కడ చూసినా మృతదేహాలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. లెక్కకుమించిన ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చాలా మంది మరణించారు. పది వేల మంది జాడ ఇంకా తెలియరాలేదు.
లిబియాలో పెనువిధ్వంసం
ఈ విధ్వంసకర దృశ్యాలను చూసిన లిబియా విపత్తు వ్యవహారాల మంత్రి హిచెమ్ చిక్వియోట్ కంటతడి పెట్టుకున్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని, సముద్రంలో, లోయల్లో, భవనాల కింద ఇలా.. ప్రతిచోటా మృతదేహాలు ఉన్నాయని తెలిపారు. దర్నా నగరంలో దాదాపు 25 శాతం కనుమరుగైంది. లెక్కలేనన్ని భవనాలు కూలిపోయాయి. ఆసుపత్రుల్లో మృతదేహాలను ఉంచేందుకు స్థలం కూడా సరిపోవడం లేదు. గల్లంతైన వారి సంఖ్య నిరంతరం పెరుగుతుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.
మొదటి స్థానంలో బంగ్లాదేశ్
వరదలు ఈ స్థాయిలో విధ్వంసం సృష్టించడం ఇదేమీ మొదటిసారి కాదు. అనేక దేశాల్లో వరదలు వేలమంది ప్రాణాలను తీయడమే కాకుండా తీవ్ర నష్టాన్ని కూడా కలిగించాయని ఈ సంవత్సరం వెలువడిన గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలో వరదల ప్రమాదం నిరంతరం పెరుగుతోంది. దీనికి కారణం ఏమిటి? పెరుగుతున్న ఈ వరదల ముప్పు నుండి ప్రపంచాన్ని రక్షించుకోగలమా? స్టాటిస్టా నివేదిక ప్రకారం ఈ ఏడాది అత్యధికశాతం వరదలను ఎదుర్కొన్న దేశాలలో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉంది. వరదలు ఇక్కడ భారీ విధ్వంసం సృష్టించాయి. బంగ్లాదేశ్‌లో ఈసారి ప్రజలు చూసిన వరద పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ఈ వరదలు వేలాది మంది ఇళ్లను ముంచివేయడమే కాకుండా అనేక మంది ప్రాణాలను బలిగొన్నాయి.
వియాత్నాంలో వరద విలయం
ప్రపంచంలో వరదల వల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశాల జాబితాలో వియత్నాం రెండో స్థానంలో ఉంది. ఇక్కడ ఏటా వరద ముప్పు మరింతగా పెరుగుతోంది. ఈ ఏడాది కూడా వియత్నాంలో సంభవించిన వరదలు అనేక మంది ప్రాణాలను బలిగొన్నాయి. వరదల బారిన పడిన దేశాల్లో మయన్మార్ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ రుతుపవనాల వరదల కారణంగా 40 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ దేశంలో వరదల బీభత్సం ప్రతి సంవత్సరం కనిపిస్తూనే ఉంటుంది. వరదలు ఏర్పడుతున్న పరిస్థితుల్లో ఇక్కడి జనానికి వలసలు తప్ప మరో మార్గం లేకుండా పోయింది.
కంబోడియాలో కకావికలం
కంబోడియా ప్రపంచంలో అత్యంత వరద ప్రభావిత దేశాలలో ఒకటి. ఇక్కడ ఈ ఏడాది వరదలు లెక్కలేనంతమందిని ప్రభావితం చేశాయి. వరద ప్రభావిత దేశాలలో ఇరాక్ పేరు ఐదవ స్థానంలో ఉంది. దీని తరువాత లావోస్, సెర్బియా, తరువాత పాకిస్తాన్ అత్యంత వరద ప్రభావిత దేశాలు. కాగా భారతదేశంలో వరదల ప్రమాదం ప్రతీఏటా పెరుగుతోంది. ఈ ఏడాది యమునా నది వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈ సంవత్సరం భారతదేశంలో వరదల కారణంగా 10 నుండి 15 వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లింది.
దేశంలో మరింతగా ప్రకృతి వైపరీత్యాలు
ఎస్‌బీఐ నివేదిక ప్రకారం అమెరికా, చైనాల తర్వాత ప్రకృతి వైపరీత్యాల కారణంగా భారత్‌లోనే ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. 1990 తర్వాత భారతదేశం అనేక ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నివేదిక ప్రకారం 1900- 2000 సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాల సంఖ్య 402 కాగా, 2001 నుండి 2022 వరకు అంటే కేవలం 21 సంవత్సరాలలో వాటి సంఖ్య 361కు చేరింది. ఈ ఏడాది వరదలు దేశంలోని ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, దేశ రాజధాని ఢిల్లీ వంటి కొండ ప్రాంతాలను ఎక్కువగా ప్రభావితం చేశాయి. ఒక్క ఉత్తరాఖండ్‌లోనే వరదల కారణంగా 8000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.
వాతావరణంలో భారీగా పెరిగిన తేమ శాతం
శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఇటువంటి విపత్కర పరిస్థితుల వెనుక ప్రధాన కారణం వాతావరణం వేడెక్కడం. ఈ సమయంలో ఉత్తరార్ధగోళంలో వేసవి కాలం ఉండటంతో పాటు ఈసారి వేడి ఎక్కువగా ఉండటంతో వాతావరణంలో తేమ శాతం భారీగా పెరిగినందున వరదలు వచ్చే అవకాశం మరింత పెరిగింది. వెచ్చని వాతావరణంలో తుఫానులు ఎక్కువగా ఏర్పడతాయి. వాతావరణ మార్పు అనేది అకాల మార్పులను మరింతగా పెంచింది. రానున్న కాలంలో వేడిగాలులతో తేమశాతం మరింత పెరగనుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ శతాబ్దం మధ్య నాటికి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు సంవత్సరానికి 20 నుండి 50 సార్లు కనిపించవచ్చంటున్నారు.
పెను విపత్తులకు ఇది ఆరంభం
ఎల్నినో ప్రభావం ప్రపంచంలో కనిపించడం మొదలయ్యిందని ఈ ఏడాది జూలైలో ప్రపంచ వాతావరణ శాఖ ప్రకటించింది. పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే ఈ ప్రత్యేక సంఘటన ప్రపంచమంతటా వేడిని పెంచేలా చేస్తోంది. దీని ప్రారంభంలో మధ్యధరా పసిఫిక్ మహాసముద్రం ఉపరితల నీరు వేడిగా మారనుంది. భారతదేశ రుతుపవనాలపై కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీని ప్రభావం అమెరికా, యూరప్‌లో కూడా ఉండనుంది. దీని ప్రకారం చూస్తే పెను విపత్తులకు ఇది ఆరంభం మాత్రమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఫిరోజ్ ఘంఢీ.. ఫిరోజ్ గాంధీగా ఎలా మారారు?
Comments
Please login to add a commentAdd a comment