reason
-
ఆకాశాన్నంటిన ఆహార ధరలు.. అదే ప్రధాన కారణం!
గతేడాది టమాటా ధరలు, ఉల్లి ధరలు మాత్రమే కాకుండా పప్పు ధాన్యాల ధరలు చుక్కలు తాకాయి. ఇప్పడు కూడా టమాటా ధరలు భారీగానే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కేజీ ధర వంద రూపాయలకంటే ఎక్కువ. ఆహార ధరలు పెరగటానికి గల కారణాలను ఆర్ధిక సర్వేలో వెల్లడించారు.వాతావరణంలో ఏర్పడ్డ మార్పులు, రిజర్వాయర్లలో నీటిమట్టం తగ్గడం, పంట నష్టం వంటివి.. ఆహార ధరలు పెరగటానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక సర్వే వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పంటలపై ప్రభావం చూపుతాయి. ఆ ప్రభావం ధరల మీద పడుతుందని వివరించింది.పంట దిగుబడి తగ్గితే.. డిమాండ్‌కు సరిపడా సరఫరా తగ్గుతుంది. దీంతో ధరలు పెనుగుతాయి. గత కొన్ని రోజులుగా ఆహార ధాన్యాలు, టమాటా, ఉల్లి ధరలు పెరగడానికి ఇదే కారణమని ఆర్ధిక సర్వే వెల్లడించింది. వినియోగదారుల ఆహార ధరల సూచీ (CFPI) ఆధారంగా ఆహార ద్రవ్యోల్బణం FY22లో 3.8 శాతం నుంచి FY23లో 6.6 శాతానికి చేరింది. ఇది FY24 నాటికి 7.5 శాతానికి చేరింది.ఉల్లి ధరలు పెరగడానికి గత కోత సీజన్లో వర్షాలు, విత్తడంలో జాప్యం మాత్రమే కాకుండా ఇతర దేశాలు తీసుకున్న వాణిజ్య సంబంధిత చర్యలు కూడా కారణమని తెలుస్తోంది. తక్కువ ఉత్పత్తి కారణంగా పప్పుధాన్యాల ధరలు పెరిగాయని సర్వే పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ అవాంతరాలతో పాటు రబీ సీజన్లో నెమ్మదిగా విత్తడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వెల్లడించింది. -
నేరస్తుడా? నిరపరాధుల పాలిట దైవమా.. ! ఏకంగా 50 ఏళ్లు జైల్లోనే..
ఓ వ్యక్తి కరుడుగట్టిన నేరస్తుడి మాదిరిగా దారుణమైన జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అంటరానివాడిలా ఒక ప్రత్యేక భద్రతతో కూడిన సెల్లో ఉన్నారు. అతడికి ఆహారం సైతం ఓ రంధ్రం గుండా పంపిస్తారు జైలు అధికారులు. కానీ అతడి నేరాల చరిత్ర వింటే..నేరస్తుడా లేదా నిరపరాధిల పాలిట రక్షకుడా అన్న ఫీలింగ్ వస్తుంది. లేక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో చట్టాన్ని చేతిల్లోకి తీసుకుని దుర్మార్గులని దునుమాడిన మహోన్నత వ్యక్తి ఏమో..! అనే భావన కలుగుతుంది. పైగా బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం ఒంటిరిగా నిర్భంధంలో ఉన్న ఖైదీగా నిలిచిపోయాడు. అతడెవరంటే..బ్రిటన్‌లో అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్నాడు రాబర్ట్ మాడ్స్లీ. ప్రస్తుతం అతడు వేక్ఫీల్డ్ జైలులో ఉన్నాడు.అతని జైలు గది 18 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉండి, 17 ఉక్కు తలుపుల వెనుక ఉంటుంది.ఈ గది కాల్పులు తట్టుకునేంత దృఢంగా ఉంటుంది.“ఇన్సైడ్ వేక్ఫీల్డ్ ప్రిజన్” అనే పుస్తకంలో జోనాథన్ లెవి, ఎమ్మా ఫ్రెంచ్‌లు రాసినట్లుగా, మాడ్స్లీ జైలు గదిలోని టేబుల్, కుర్చీలు కార్డ్‌బోర్డ్‌తో తయారు చేశారు.టాయిలెట్, సింక్ నేలకు బిగించబడి ఉంటుంది. అతనికి అందించే భోజనం కూడా ఒక చిన్న రంధ్రం గుండా పంపిస్తారు. నిజానికి మాడ్సీ 21 ఏళ్ల వయసు నుంచి జైలు జీవితం గడుపుతున్నాడు. అతడి నేరాలు గురించి తెలుసుకుని విస్తుపోతారు. ఎందుకంటే అతడు ఖైదీనా నిరపరాధుల పాలిట దైవమా..!అనిపిస్తుంది. చేసిన నేరాలు..1974లో, చిన్న పిల్లలపై లైంగిక దాడి చేసిన 30 సంవత్సరాల వ్యక్తి జాన్ ఫారెల్ని అతను చంపేశాడు.ఆ తర్వాత 1977లో, అతను మరో ఖైదీతో కలిసి, చిన్నపిల్లలపై లైంగిక దాడి నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్న డేవిడ్ ఫ్రాన్సిస్( David Francis )ని చంపేశాడు.వేక్ఫీల్డ్ జైలులో కూడా మాడ్స్లీ నేరాలు కొనసాగాయి.1978 జులై 29న, తన భార్యను హత్య చేసిన ఖైదీ సల్నీ డార్వడ్ని హతమార్చాడు.అంతేకాకుండా, ఏడేళ్ల బాలికపై అత్యాచార చేసిన బిల్ రాబర్ట్స్‌ను కూడా చంపేశాడు.ఈ హత్యల కారణంగా, అధికారులు మాడ్స్లీని ఇతర ఖైదీలతో కలిపి ఉంచడం చాలా ప్రమాదకరమని భావించారు.ఫలితంగా, 1983లో అతని కోసం ప్రత్యేక అద్దాల గదిని నిర్మించారు. అప్పటి నుంచి, అతను అదే గదిలో ఉన్నాడు. తన జైలు జీవితాన్ని మాడ్స్లీ ఒకసారి నరకంలో బంధించడం లాగా ఉందని వర్ణించాడు. ప్రస్తుతం అతని వయసు 71 సంవత్సరాలు. ఇప్పటికీ అదే జైలులో ఉండడం వల్ల, అతన్ని నేరస్తుడిగా చూడాలా లేక నిరపరాధుల రక్షకుడిగా భావించాలా అనే సందేహం బ్రిటన్ ప్రజల్లో కలుగుతుంటుంది. కనీసం ఇప్పుడైనా మాడ్స్లీ క్షమాభిక్ష పెట్టి స్వేచ్ఛగా జీవించేలా చేస్తే బాగుండనని కొందరూ భావిస్తుండటం విశేషం. (చదవండి: ఆ ఫోబియాకు పుస్తకాలతో చెక్‌పెట్టి..స్ఫూర్తిగా నిలిచిన ట్రాన్స్‌విమెన్!) -
ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
ఛత్తీస్‌గఢ్‌లో లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ మే 7న జరగనుంది. రాష్ట్రంలోని రాయ్‌పూర్, దుర్గ్, బిలాస్పూర్, జాంజ్‌గిర్-చంపా, కోర్బా, రాయ్‌గఢ్, సుర్గుజా మొదలైన ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతాల్లో మే 5 నుండి 7 వరకు డ్రై డేగా ప్రకటించారు. అంటే ఈ రెండు రోజూలూ ఈ లోక్‌సభ నియోజకవర్గాల్లో మద్యం విక్రయాలు ఉండవు. డ్రై డేకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఓటింగ్‌కు 48 గంటల ముందు సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలను మూసివేస్తారు. అంతే కాదు మద్యం రవాణాను కూడా నిషేధించారు. ఈ సమయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాయ్‌పూర్, దుర్గ్, బిలాస్పూర్, జాంజ్‌గిర్-చంపా, కోర్బా, రాయ్‌గఢ్, సుర్గుజా లోక్‌సభ నియోజకవర్గాల్లో మే 5 నుండి మే 7 వరకు వైన్ షాపులు మూసివేయనున్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గాలకు మూడు కిలోమీటర్ల పరిధిలోగల అన్ని మద్యం దుకాణాలు మూసివేస్తారు. ఎవరైనా మద్యం దుకాణాన్ని తెరిచి, విక్రయాలు సాగిస్తున్నారని తేలితే సంబంధిత అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. -
వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మనుషులతో పాటు జంతువులు కూడా ఎండ వేడిమికి తాళలేకపోతున్నాయి. వేసవిలో శునకాలు రెచ్చిపోతుండటాన్ని మనం చూస్తుంటాం. అవి ఎందుకు అలా ప్రవర్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.మనుషులకు మాదిరిగానే చలికాలం, వేసవి కాలం, వర్షాకాలం మొదలైనవి కుక్కల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ఒక నివేదిక ప్రకారం కుక్కలు చల్లని వాతావరణంలో ఉదాశీనంగా ఉంటాయి. అయితే వేసవికాలం రాగానే అవి హైపర్ యాక్టివ్‌గా మారిపోతాయి. వేసవిలో కుక్కలు మరింత దూకుడుగా మారుతాయని ఒక పరిశోధనలో వెల్లడయ్యింది.అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జోస్ ఆర్చ్ తెలిపిన వివరాల ప్రకారం వేసవి కాలంలో శునకాలు మరింత వేడి అనుభూతికి లోనవుతాయి. వేసవికాలం మనుషులకు మించి శునకాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. అధిక వేడి లేదా ఉష్ణోగ్రత శునకాలలోని థర్మోగ్రూలేషన్ను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా కుక్కలు వేడిని తట్టుకోలేవు. ఇటువంటి పరిస్థితిలో కుక్కలు అసాధారణంగా ప్రవర్తిస్తాయి.వేసవి కాలంలో కుక్కలలో కార్టిసాల్ హార్మోన్ (స్ట్రెస్ హార్మోన్) పెరుగుతుందని పెన్ స్టేట్ యూనివర్శిటీ ఒక పరిశోధనలో కనుగొంది. దీని కారణంగా అవి అసాధారణంగా ప్రవర్తిస్తాయని గుర్తించారు. ఈ సమయంలో కుక్కలు ఆకస్మికంగా మొరగడం, మనుషులను చుట్టుముట్టడం, కరవడం, పరిగెత్తడం లాంటి చర్యలను చేస్తాయి.వేసవిలో పెంపుడు శునకాలు లేదా వీధి కుక్కలు ఇలా ప్రవర్తించకుండా ఉండాలంటే వాటికి నీరు, ఆహారం అందుబాటులో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అవి ఎప్పుడూ నీరసంగా పడుకున్నట్లు కనిపిస్తే, అవి వడ దెబ్బకు గురయ్యాయని గుర్తించాలి. అటువంటి స్థితిలో వాటికి వైద్య సహాయం అందించాలి. -
ఒకే కంపెనీలో ఏళ్ల తరబడి ఉద్యోగం.. ఎందుకో తెలుసా?
ఉద్యోగం చేసేవారిలో చాలామంది ఒకే సంస్థలో ఏళ్లతరబడి జాబ్ చేస్తుంటారు. మరికొందరు సంవత్సరానికి ఓ కంపెనీలో జాబ్ చేస్తూ ముందుకు వెళ్లిపోతుంటారు. ఇంతకీ ఒకే కంపెనీలో సంవత్సరాలు తరబడి జాబ్ చేయడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ప్రస్తుత జాబ్ మార్కెట్ ట్రెండ్స్‌పై Apna.co ఒక ఆన్లైన్ సర్వే చేపట్టి.. వివిధ రంగాల్లో పనిచేస్తున్న పదివేల మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ అభిప్రాయాలను సేకరించింది. వేతనం అనేది ఒక ముఖ్యమైన అంశం అయినప్పటికీ, 54 శాతం మంది ఉద్యోగులు తమ ప్రస్తుత ఉద్యోగాల్లో కొనసాగడం కంటే కెరీర్లో పురోగతి సాధించడానికి ఇష్టపడుతున్నట్లు తెలిసింది. అంటే ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీలలోనే వృత్తిపరమైన వృద్ధిని కోరుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది. 37 శాతం మంది ఉద్యోగులు వర్క్ విషయంలో స్వేచ్ఛను కోరుకుంటున్నారు. 44 శాతం మంది ఉద్యోగులు తాము చేస్తున్న కంపెనీలోని వర్క్ కల్చర్‌కు అలవాటు పడినట్లు సమాచారం. కొందరు లీడర్షిప్ రోల్స్ కోసం లేదా కీలక బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేటగిరిలో సుమారు 54 శాతం మంది ఉన్నారు. 40 శాతం ఉద్యోగులు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ యాక్టివిటీస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు, 36 శాతం మంది సీనియర్ లీడర్షిప్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. చేస్తున్న పనిలోనే స్కిల్ పెంచుకోవడానికి చూస్తున్న వారు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. అది మాత్రమే కాకుండా కంపెనీలు తమ ఉద్యోగులను సంతృప్తి పరిస్తే (జీతాలు పెంచడం, ప్రోత్సాహాలు అందించడం) ఎక్కువ కాలం ఒకే సంస్థలో పనిచేయడానికి ఉద్యోగులు ఇష్టపడతారని సర్వేలు తేలింది. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న చాలామందిలో ఉన్న కంపెనీలలోనే జాబ్ చేస్తూ.. ఉన్నత స్థాననానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పని విషయంలో స్వేచ్ఛ మాత్రమే కాకుండా.. వర్క్ కల్చర్, కమ్యూనికేషన్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారని సర్వేలో తెలిసినట్లు Apna.co సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'నిర్మిత్ పారిఖ్' వెల్లడించారు. -
73 మంది అభ్యర్థులపై అనర్హత వేటు!
ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో మరో సంచలనం నమోదయ్యింది. ఎన్నికల నిబంధనలను పట్టించుకోని 73 మంది అభ్యర్థులను భారత ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్) అనర్హులుగా ప్రకటించింది. ఖర్చు వివరాలు తెలియజేయని లేదా ఇతర నిబంధనలను పాటించని ఈ అభ్యర్థులు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు. భారత ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో ఈ అభ్యర్థుల జాబితాను బహిరంగపరిచింది. అనర్హతకు గురయిన ఈ 73 మందిలో 65 మంది అభ్యర్థులు 2024 వరకు, ఎనిమిదిమంది అభ్యర్థులు 2025 వరకు ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఛత్తీస్‌గఢ్‌లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమయ్యింది. వీటిని పరిశీలించాక సంబంధిత అధికారులు అనర్హుల జాబితాను విడుదల చేశారు. రాయ్‌పూర్ జిల్లా నుండి గరిష్టంగా 17 మంది అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారు. ఈ అనర్హుల జాబితాను భారత ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేసిందని డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి యుఎస్ బాండే తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని 11 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఏప్రిల్ 19న ఒక స్థానానికి, ఏప్రిల్ 26న మూడు స్థానాలకు, మే 7న ఏడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
రైల్వే స్టేషన్లలోని బోర్డులకు పసుపు రంగు ఎందుకు?
భారతీయ రైల్వే.. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్ కలిగివుంది భారతీయ రైళ్లలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. అలా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు పలు రైల్వే స్టేషన్లలో పసుపు రంగు బోర్డులు మనకు కనిపిస్తాయి. వాటిపై ఆ రైల్వే స్టేషన్ పేరు, సముద్ర మట్టానికి అది ఎంత ఎత్తులో ఉన్నదీ రాసివుంటుంది. అయితే రైల్వే సైన్ బోర్డులకు పసుపు రంగునే ఎందుకు వేస్తారో తెలుసా? దీని వెనుక గల కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు రంగు ప్రత్యేకత ఏమిటంటే అది చాలా దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రైలు స్టేషన్‌కు చేరుకోకముందే డ్రైవర్ దూరం నుండి పసుపు రంగును బోర్డును చూడగలుగుతాడు. తద్వారా అతనికి స్టేషన్ రాబోతున్నదని తెలుస్తుంది. ఇలా స్టేషన్ బోర్డు చూసిన తర్వాత రైలు డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉంటారు. పసుపు రంగు అనేది సూర్యకాంతితో అనుసంధానమై ఉంటుంది. ఈ రంగును ఇతర రంగులతో పోలిస్తే ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రంగు చూపరుల మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీనికి తోడు పసుపురంగు బోర్డుపై నలుపు రంగులో రాసే అక్షరాలు దూరం నుండి స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కళ్లకు ఒత్తిడిని కూడా కలిగించదు. ఇదేవిధంగా విద్యాసంస్థల బస్సుల కూడా పసుపు రంగులో ఉండటాన్ని గమనించే ఉంటాం. దీనికి కారణం దూరం నుండి ఈ రంగు కనిపించడం. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తారు. రైలు లోకో పైలట్‌కు స్టేషన్‌కు సంబంధించిన పసుపురంగు బోర్డు కనిపించగానే హారన్ మోగిస్తాడు. దీంతో రైలులోని ప్రయాణికులు కూడా స్టేషన్ రాబోతున్న విషయాన్ని తెలుసుకోగలుగుతారు. -
ఎల్పీజీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటి?
దేశంలోని దాదాపు ప్రతి ఇంటిలోనూ వంటగ్యాస్ అంటే ఎల్పీజీ కనెక్షన్ ఉంది. గ్రామాల్లో కూడా మట్టి పొయ్యిలకు బదులు గ్యాస్ స్టవ్‌లు వినియోగిస్తున్నారు. అయితే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. ఉజ్వల పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించిన తర్వాత వంటగ్యాస్ వినియోగం మరింతగా పెరిగింది. గత 10 సంవత్సరాలలో ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య 32 కోట్లకు పైగా పెరిగింది. గత ఐదేళ్లలో దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి నాలుగు శాతం పెరిగింది. అయితే వినియోగం 22 శాతం మేరకు పెరిగింది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గ్యాస్‌ను ప్రభుత్వం దిగుమతి చేస్తోంది. గత ఐదేళ్లలో ఎల్పీజీ దిగుమతులు 60 శాతం మేరకు పెరిగాయి. భారతదేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్ నుండి గ్యాస్ సరఫరా అవుతోంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అందించిన డేటా ప్రకారం గత కొన్నేళ్లుగా భారత్.. అమెరికా నుంచి కూడా గ్యాస్ దిగుమతి చేసుకుంటోంది. ఇలా ఎల్పీజీ దిగుమతులు పెరిగిన కారణంగానే వాటి ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. భారతదేశంలో 90 శాతం ఎల్పీజీ గృహ వినియోగం కోసం ఉపయోగిస్తున్నారు. మిగిలిన మొత్తం పారిశ్రామిక, వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారు. దేశంలో ఎల్పీజీ వినియోగంలో 13 శాతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఇది మహారాష్ట్రలో 12 శాతం మేరకు ఉంది. ఈ విషయంలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. -
పాక్‌లో చెలరేగుతున్న హింస.. ఎన్నికలే కారణమా?
పాకిస్తాన్లో ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు ముందుగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జనవరి 31న ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని బజౌర్ జిల్లాలో రాజకీయ నేత రెహాన్ జెబ్ ఖాన్‌ను కాల్చి చంపారు. రెహాన్ జెబ్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నేత. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్ఏ-8, పీకే-22 స్థానాల నుండి పోటీ చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు రెహాన్ ఉన్న పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జియో టీవీ కథనం ప్రకారం రెహాన్ జెబ్ ఖాన్ ఎన్నికల ప్రచారం కోసం సాదికాబాద్ ఫటక్ బజార్ ప్రాంతానికి వెళ్లారు. ఇంతలో దుండగులు అతనిపై కాల్పులు జరపడంతో, అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ కూడా రెహాన్ హత్యను ఖండించింది. పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రాంతీయ ప్రధాన కార్యదర్శి.. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుంచి ఈ ఘటనకు సంబంధించిన నివేదికను కోరింది. దీంతో పాటు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికిముందు బలూచిస్థాన్‌లోని చమన్ నగరంలో అవామీ నేషనల్ పార్టీ కార్యకర్తలపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక కార్యకర్త మృతి చెందాడు. కార్యకర్తలు ప్రచారంలో మునిగివున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇదేవిధంగా క్వెట్టాలోని సరియాబ్ రోడ్‌లోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఎన్నికల కార్యాలయంపై జరిగిన దాడిలో ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. బలూచిస్థాన్ తాత్కాలిక హోం మంత్రి జుబేర్ జమాలీ ఈ దాడులను ఖండించారు. ఇటీవల స్వాబి జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి షా ఖలీద్‌ను కాల్చి చంపారు. అలాగే పీకే-104 నుండి పోటీ చేసిన కలీముల్లా ఖాన్‌ను దుండగులు హత్య చేశారు. -
దీపావళి వేళ.. ఢిల్లీలో 200కుపైగా అగ్నిప్రమాదాలు!
దీపావళి రోజున దేశరాజధాని ఢిల్లీలో 208 అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు అగ్ని ప్రమాదాలకు సంబంధించి లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ అగ్నిప్రమాదాల్లో 22 ఘటనలు బాణసంచా కాల్చడం కారణంగానే సంభవించాయి. దీపావళి రోజున జరిగిన చిన్న, మధ్యతరహా, తీవ్రమైన అగ్నిప్రమాదాలకు సంబంధించి ఇప్పటివరకు 208 ఘటనలు చోటుచేసుకున్నాయని డిపార్ట్మెంట్ హెడ్ అతుల్ గార్గ్ తెలిపారు. ఢిల్లీలోని సదర్ బజార్, ఈస్ట్ ఆఫ్ కైలాష్, తిలక్ నగర్లో భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. అయితే ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారిక సమాచారం రాలేదు. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సెంట్రల్ ఢిల్లీలోని సదర్ బజార్‌లోని డిప్యూటీ గంజ్ మార్కెట్లోని గోదాములో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అదుపు చేసేందుకు 22 అగ్నిమాపక శకటాలు శ్రమించాయి. దాదాపు 2 గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. గోదాములో ఉంచిన వస్తువులన్నీ దగ్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఎంత మేరకు నష్టం జరిగిందన్న సమాచారం అందుబాటులో లేదు. పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్ మార్కెట్ ప్రాంతంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్కెట్లోని కొన్ని దుకాణాలు అగ్నికి ఆహుతైనట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, పోలీసుల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. ఇది కూడా చదవండి: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో విషాదం -
యూదులు ఇతరుల రక్తాన్ని ఎందుకు ఎక్కించుకోరు? వారు చెప్పే కారణం ఏమిటి?
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరువర్గాలకు చెందిన వందలాదిమంది మృతి చెందగా, లెక్కలేనంతమంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇదిలా ఉంటే యూదులు తమ వైద్యచికిత్సలో ఎవరి నుంచి కూడా రక్తాన్ని తీసుకోరనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎంత నిజం ఉందో, అదే నిజమైతే దీని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. యూదులు తమ పవిత్ర గ్రంథం ‘తోరా’లో ఉన్న నియమనిబంధనలను తప్పక పాటిస్తారు. మారుతున్న కాలంతో పాటు ఈ నిబంధనలలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే పాతతరం యూదులు చికిత్స సమయంలో ఎవరి రక్తాన్ని తీసుకునేందుకు ఇష్టపడరు. వారు ఎంత అనారోగ్యంతో ఉన్నా మరొకరి రక్తాన్ని తమ శరీరంలోకి ఎక్కించడాన్ని వారు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే యూదులు రక్తాన్ని ప్రాణంతో సమానంగా భావిస్తారు. వేరొకరి రక్తాన్ని తీసుకోవడమంటే వారి ప్రాణాన్ని తీయడమేనని అనుకుంటారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మెల్లగా మారుతోంది. నేడు యూదులు కూడా తమకు రక్తం అవసరమైనపుడు దానిని ఎక్కించుకునేందుకు అంగీకరిస్తున్నారు. నాటి తరం యూదులు తమ దేవుని శక్తిపై మాత్రమే గాఢమైన నమ్మకాన్ని కలిగివుంటారు. తాము అనారోగ్యానికి గురైనప్పుడు దేవుని ప్రార్థన ద్వారా మాత్రమే ఆరోగ్యవంతులమవుతామని నమ్ముతుంటారు. వీరిలోని చాలామంది నేటికీ వైద్యుల దగ్గర చికిత్స తీసుకోరు. మందులు వాడరు. అయితే నేటి తరం యూదులు ఆధునిక వైద్యాన్ని వినియోగించుకోవడమే కాకుండా, వైద్య పద్ధతులను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు. ఇది కూడా చదవండి: నుక్భా ఫైటర్స్ ఎవరు? హమాస్‌తో సంబంధం ఏమిటి? -
నింగిలో ‘నీలి సూరీడు’.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
బ్రిటన్ ప్రజలు ఆకాశంలో ఓ ప్రత్యేక దృశ్యాన్ని తిలకించి మురిసిపోయారు. మబ్బుల్లో సూర్యుని రంగు మారిపోవడాన్ని చూసి ఆశ్యర్యం వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో సూర్యుడు నీలిరంగులో కనిపిస్తున్నాడు. అమెరికాలో సంభవించిన అగ్నిప్రమాదమే ఇందుకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది. ట్విట్టర్లో ఒక యూజర్ ‘స్కాట్లాండ్లో అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద కారణంగా నూతన నీలి సూర్యుడు కనిపిస్తున్నాడు’ అని అన్నారు. మరొక యూజర్ ఉదయం 10:15 గంటలకు ‘బ్లూ సన్’ కనిపించాడని రాశారు. కాగా గతంలో సూర్యుడు ముదురు ఆరెంజ్ రంగులో కనిపించాడు. 2017లో పోర్చుగీస్ అడవి కార్చిచ్చుకు సంబంధించిన పొగ బ్రిటన్ అంతటా వ్యాపించింది. అయితే ఈసారి సూర్యుడు నీలి రంగులోకి ఎందుకు మారాడనే దానికి వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు సమాధానం తెలిపారు. ఉత్తర అమెరికాలోని అడవి కార్చిచ్చు పొగ బ్రిటన్‌కు చేరుతోంది. వాతావరణంలో మేఘాలు, పొగ కలసిపోవడం కారణంగా సూర్యరశ్మి వివిధ రంగులలో వ్యాప్తి చెందున్నదని ఆయన చెప్పారు. ప్రతి రంగు వేర్వేరు ప్రకాశాలను కలిగి ఉంటుంది. నీలి రంగు అధికంగా వ్యాపిస్తుందని తెలిపారు. పర్పుల్ రంగు తక్కువగా వ్యాపిస్తుందని, ఇది దాదాపు 380 నానోమీటర్లు ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఎరుపు రంగు పొడవైన తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుందని, ఇది దాదాపు 700 నానోమీటర్లు ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అమెరికాను ముంచెత్తిన వరదలు... న్యూయార్క్ అతలాకుతలం! 28th September 2023 Hertfordshire UK Unnatural fog…#chemtrail #geoengineering pic.twitter.com/P37Mc0SYeA — Dan Stevens (@Dan__Stevens) September 28, 2023 -
దేశ దేశాల నామాయణం! పేర్లు మార్చకున్న దేశాలు ఇవే!
పేరులోనేముంది అని చాలామంది కొట్టిపారేస్తారు గాని, పేరు మీద పట్టింపుగల వాళ్లు తక్కువేమీ కాదు. మనుషులు పేర్లు మార్చుకోవడం పెద్ద విశేషమేమీ కాదు. చిరపరిచితమైన ఊళ్లు, దేశాల పేర్లు మారిపోతే మాత్రం విశేషమే! ‘ఇండియా దటీజ్ భారత్’ అని మన రాజ్యాంగంలోని మొదటి అధికరణలో ఉంది. విదేశీయులు మనల్ని ఇండియన్స్గానే సంబోధిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మన దేశానికి భారత్‌గా పునర్నామకరణం చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపింది. ఇప్పటికైతే అధికారికంగా మన దేశం పేరు మారలేదు. త్వరలోనే మారితే మారవచ్చు కూడా! అలాగని దేశాలు పేరు మార్చుకోవడం కొత్తేమీ కాదు. ఆధునిక ప్రపంచంలో పేర్లు మార్చుకున్న దేశాలు కొన్ని ఉన్నాయి. వాటి విశేషాలు మీ కోసం... రాచరికాలు కొనసాగిన కాలంలో రాజుల ఆధిపత్యాలను బట్టి రాజ్యాల పేర్లు తరచు మారిపోతూ ఉండేవి. ఆధునిక ప్రపంచంలో దేశాల పేర్లు అంత తరచుగా మారిపోవడం లేదు గాని, అప్పుడప్పుడూ రకరకాల కారణాల వల్ల అవి మారుతూనే ఉన్నాయి. ఇరవయ్యో శతాబ్ది నుంచి ఇప్పటి వరకు పేర్లు మార్చుకున్న కొన్ని దేశాల గురించి తెలుసుకుందాం. చెకియా చెకొస్లోవేకియా నుంచి 1992 విడివడిన తర్వాత ఈ దేశం పేరు ‘చెక్ రిపబ్లిక్’గా ఉండేది. ఈ దేశం పేరు మార్పు వెనుక ఘనమైన చారిత్రక, సాంస్కృతిక కారణాలేవీ లేవు. మరెందుకు పేరు మార్చుకున్నారంటే, ఇదివరకటి పేరు పెద్దగా ఉందట! పెద్దగా ఉన్న పేరుతో అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు పొందడం కష్టమని, విదేశీయులకు ఆ పేరు పలకడం కష్టంగా ఉందని పాలకులు భావించారు. అంతర్జాతీయ సమాజాన్ని ఆకట్టుకోవడానికి, మరింతగా విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడానికి 2016 ఏప్రిల్‌లో దేశం పేరును ప్రభుత్వం ‘చెకియా’గా మార్చుకుంది. అధ్యక్షుడు మిలోస్ జెమాన్ ఆధ్వర్యంలో ఈ మార్పు జరిగింది. ఇరాన్ ఇప్పుడు ఇరాన్ అంటే జనాలకు బాగా అలవాటైపోయిన పేరు. ఇదివరకు దీని పేరు పర్షియాగా ఉండేది. పర్షియా తన పేరును 1935లో ఇరాన్‌గా మార్చుకుంది. ఈ మార్పు వెనుక నాజీల ప్రభావం ఉంది. ఆర్యుల జనాభా ఎక్కువగా ఉండే దేశాలతో నాజీ జర్మనీ ‘సత్సంబంధాలు’ కలిగి ఉండేది. ‘ఆర్యన్’ నుంచి వచ్చిన పేరే ఇరాన్! జర్మనీలో అప్పటి పర్షియా రాయబారి మొహసిన్ రియాస్ ఈ పేరు మార్పు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు సాగించాడు. బహుశా నాజీల మెప్పు కోసం ఆయన ఆ ప్రయత్నాలు చేసి ఉండవచ్చనే వాదన లేకపోలేదు. మొత్తానికి అప్పటి పర్షియా అధినేత రెజా షా పహ్లావీ 1935లో ఇకపై తమ దేశాన్ని ‘ఇరాన్’ పేరుతో గుర్తించాలని తమ దేశంతో దౌత్యసంబంధాలు కలిగి ఉన్న దేశాలన్నింటినీ కోరారు. అవి ఆ కోరికను మన్నించడంతో పర్షియా పేరు ఇరాన్‌గా మారింది. రెండో ప్రపంచయుద్ధం ఫలితంగా జర్మనీలో నాజీ ప్రభుత్వం పతనమైన తర్వాత మిగిలిన దేశాలు కూడా పర్షియాను ఇరాన్‌గా గుర్తించడంతో అదే పేరు స్థిరపడింది. బోత్స్యానా ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో ఉన్న చిన్న దేశం బోత్స్యానా. దీనికి ఇంతకు ముందున్న పేరు ‘బెషువాన్లాండ్ ప్రొటెక్టరేట్’. బ్రిటిష్ పాలకులు దీన్ని 1885లో ప్రొటెక్టరేట్‌గా ప్రకటించారు. స్థానిక ‘త్సా్వనా’ పదాన్ని పలకలేక వారు ‘బెషువానా’గా వ్యవహరించేవారు. చాలా పోరాటాలు, చర్చోపచర్చల తర్వాత ఈ దేశానికి 1966లో స్వాతంత్య్రం దక్కింది. సెరెత్సె ఖామా తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ‘త్వ్సానా’ తెగ ప్రజలు అత్యధికులుగా ఉన్న ఈ దేశానికి బ్రిటిష్‌వారు అపభ్రంశ పదాలతో పెట్టిన పేరును మార్చి, ‘బోత్స్యానా’గా మార్చారు. ‘బోత్స్యానా’ అంటే ‘త్వ్సానా’ ప్రజల నేల. ఈ పేరు మార్పును అంతర్జాతీయ సమాజం కూడా గుర్తించింది. శ్రీలంక శ్రీలంక పాత పేరు సిలోన్. బ్రిటిష్ పాలకులు ఆ పేరు పెట్టారు. ‘సహీలన్’ అరబిక్ పదం నుంచి వారు ఆ పేరు పెట్టారని చెబుతారు. అయితే, ఆ పేరు పుట్టుపూర్వోత్తరాల గురించి వేర్వేరు వాదనలు ఉన్నాయి. పదో శతాబ్దానికి చెందిన అరబిక్ రచయిత ఇబ్న్ షహ్రియార్ తన ‘అజబ్–అల్–హింద్’ పుస్తకంలో శ్రీలంకను ఉద్దేశించి ‘సెరెన్దిబ్’, ‘సహీలన్’ అనే పదాలను ఉపయోగించాడు. తొలినాళ్లలో దీని పేరు ‘తామ్రపర్ణి’గా ఉండేది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన గ్రీకుయాత్రికుడు మెగస్తనీస్ దీనినే తన రచనల్లో ‘తప్రోబన’ అని పేర్కొన్నాడు. బ్రిటిష్‌వారి కంటే ముందు ఈ ప్రాంతాన్ని పోర్చుగీసు, స్పానిష్, ఫ్రెంచ్, డచ్ వాళ్లు కూడా కొంతకాలం పరిపాలించారు. పోర్చుగీసులు దీనిని ‘సీలావో’ అని, స్పానిష్ వాళ్లు ‘సీలాన్’ అని, ఫ్రెంచ్‌వాళ్లు ‘సీలన్’ అని, డచ్‌వాళ్లు ‘జీలన్’ అని వ్యవహరించేవారు. అయితే, బ్రిటిష్ హయాంలో పెట్టిన ‘సిలోన్’ పేరు ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. ఈ దేశానికి 1948లోనే స్వాతంత్య్రం వచ్చినా, 1966 వరకు సిలోన్ పేరుతోనే ఉండేది. సిరిమావో బండారునాయకె ప్రధానిగా ఉన్న కాలంలో దేశం పేరును ‘శ్రీలంక’గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐర్లండ్ ఇప్పటి ప్రపంచానికి ఐర్లండ్ పేరు బాగా పరిచయం గాని, అంతకుముందు దీని పేరు ‘ఐరిష్ ఫ్రీ స్టేట్’. ఇంగ్లిష్ వాళ్ల పాలనలో దాదాపు మూడు శతాబ్దాలు మగ్గిన దేశం ఇది. ఐరిష్ జాతీయోద్యమం తర్వాత తొలుత ఇది 1922లో బ్రిటిష్ సామ్రాజ్యంలోని స్వయంపాలిత రాజ్యంగా మారింది. బ్రిటిష్ ప్రభుత్వం 1931లో దీనిని ‘నిర్వివాద స్వతంత్ర దేశం’గా ప్రకటించడంతో ‘ఐరిష్ ఫ్రీ స్టేట్’గా అవతరించింది. ఐర్లండ్ ద్వీపంలోని మొత్తం 32 కౌంటీలు ఉంటే, వాటిలోని 26 కౌంటీలతో ‘ఐరిష్ ఫ్రీ స్టేట్’ ఏర్పడింది. మిగిలిన ఆరు కౌంటీలు ‘నార్తర్న్ ఐర్లండ్’గా బ్రిటిష్ సామ్రాజ్యంలోని భాగంగానే ఉన్నాయి. ఐరిష్ రాజ్యాంగం 1937లో దేశం పేరును అధికారికంగా ‘ఐర్లండ్’గా మార్చింది. ఐర్లండ్ 1949లో ‘రిపబ్లిక్’గా మారడంతో మిగిలిన ప్రపంచం అప్పటి నుంచి ఇదే పేరుతో గుర్తించడం ప్రారంభించింది. థాయ్‌లాండ్ థాయ్‌లాండ్ ఇప్పుడు అందరికీ అలవాటైపోయిన పేరు. ఇదివరకు దీని పేరు ‘సియామ్’. ‘శ్యామ’ అనే సంస్కృత పదం నుంచి ‘సియామ్’ పేరు వచ్చింది. ‘సియామ్’ అనేది ఈ దేశవాసులు పెట్టుకున్న పేరు కాదు, విదేశీయులు పెట్టిన పేరు. ఫీల్డ్ మార్షల్ ప్లేక్ ఫిబున్సాంగ్ఖ్రామ్ ప్రధాని పదవిలోకి వచ్చి, నియంతృత్వాధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆయన 1939లో ‘సియామ్’ పేరును ‘థాయ్‌లాండ్’గా మార్చారు. ‘థాయ్’ భాషలో ‘థాయ్’ అంటే ‘మనిషి’, ‘స్వతంత్రుడు’ అనే అర్థాలు ఉన్నాయి. స్వతంత్రుల దేశం అనే అర్థం వచ్చేలా ‘థాయ్‌లాండ్’ పేరును ఎంపిక చేసుకున్నారు. మిగిలిన ప్రపంచం దీనిని గుర్తించడంతో ఇదే పేరు స్థిరపడింది. ఇస్వాతిని ఆఫ్రికా ఆగ్నేయ ప్రాంతంలోని చిన్న దేశం ఇది. ఈ దేశం ఇదివరకటి పేరు ‘స్వాజిలాండ్’. చాలాకాలం బ్రిటిష్ వలసరాజ్యంగా ఉండేది. ఇక్కడ ఎక్కువగా స్వాజీ తెగకు చెందిన ప్రజలు ఉంటారు. పూర్వీకుడైన తెగ నాయకుడి పేరు మీదుగా తమ తెగకు ‘స్వాజీ’ అని పేరు పెట్టుకున్నారు. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొంది యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దేశానికి రాజుగా ఉన్న మూడో ఎంస్వాతి దేశం పేరును తన పేరు కలిసొచ్చేలా ‘ఇస్వాతిని’గా మార్చారు. ఎవరితోనూ సంప్రదించకుండా రాజు ఏకపక్షంగా దేశం పేరు మార్చేశారనే విమర్శలు ఉన్నా, అంతర్జాతీయ సమాజం కొత్తగా మార్చిన పేరు గుర్తించడంతో మారిన పేరుతోనే చలామణీ అవుతోంది. నార్త్ మాసిడోనియా యూరోప్ ఆగ్నేయ ప్రాంతంలోని దేశం నార్త్ మాసిడోనియా. ఇదివరకు దీని పేరు మాసిడోనియా మాత్రమే! రెండో ప్రపంచయుద్ధ కాలంలో 1944లో ఈ ప్రాంతం ‘సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా’గా ఆవిర్భవించింది. తర్వాత 1991లో రిఫరెండం ద్వారా స్వాతంత్య్రం సాధించుకుని, ‘మాసిడోనియా’గా మారింది. ఈ ప్రాంతానికి చాలా పురాతన చరిత్ర ఉంది. ప్రాచీనకాలంలో గ్రీకు సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఇప్పటికీ మాసిడోనియా ప్రాంతంలోని కొంతభాగం ఈ దేశానికి దక్షిణాన గల గ్రీస్‌లో ఉంది. పొరుగుదేశంతో గందరగోళం తొలగించుకోవాలనే ఉద్దేశంతో 2019లో ఈ దేశం తన పేరును ‘నార్త్ మాసిడోనియా’గా మార్చుకుంది. మయాన్మార్ మన దేశానికి సరిహద్దుల్లోని ఆగ్నేయాసియాలో ఉన్న ఈ దేశానికి ఇదివరకటి పేరు ‘బర్మా’. అధికారికంగా మయాన్మార్గా మారినా, ‘బర్మా’ పేరుతో ఈ దేశాన్ని గుర్తుపట్టేవాళ్లు ఇప్పటికీ ఎక్కువమందే ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా బర్మన్ తెగకు చెందిన ప్రజలు నివసిస్తారు. అందువల్ల ‘బర్మా’గా పేరుపొందింది. బ్రిటిష్ పాలన నుంచి ఈ దేశం 1948లో స్వాతంత్య్రం పొందింది. అలజడులతో అతలాకుతలమైన ఈ దేశం 1989లో జరిగిన సైనిక కుట్రలో పూర్తిగా సైనిక పాలనలోకి వెళ్లింది. అప్పట్లో అధికారంలోకి వచ్చిన సైనిక పాలకులు దేశం పేరును మయాన్మార్గా మార్చారు. ‘మయాన్మార్’ పదం పుట్టుపూర్వోత్తరాల గురించి ఇప్పటికీ గందరగోళం ఉంది.బెనిన్ అట్లాంటిక్ తీరంలో ఉన్న ఆఫ్రికన్ దేశం ఇది. ఆఫ్రికా పడమటి తీరాన ఉన్న ఈ చిన్న దేశానికి గతంలో ఉన్న పేరు ‘దహోమీ’. చిన్న రాజ్యంగా ఉండే ఈ దేశం పదిహేనో శతాబ్దిలో చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలను కలుపుకొని ‘దహోమీ’ రాజ్యంగా అవతరించింది. స్థానిక ఫోన్ తెగకు చెందిన ప్రజలు మాట్లాడే ‘ఫోంగ్బే’ భాషలో ‘ఫోన్ ద హోమీ’ అంటే ‘పాము పొట్ట’ అని అర్థం. దేశం ఆకారం దాదాపు అలాగే ఉండేది కాబట్టి వారు ‘దహోమీ’ అని పేరు పెట్టుకున్నారు. ఈ దేశాన్ని 1872లో ఫ్రెంచ్‌వాళ్లు ఆక్రమించుకుని, 1960 వరకు పరిపాలన కొనసాగించారు. ఫ్రెంచ్ పాలన అంతమయ్యాక 1960లో స్వాతంత్య్రం వచ్చినా, ‘దహోమీ’ పేరుతోనే పదిహేనేళ్లు కొనసాగింది. మాథ్యూ కెరెకోవు నేతృత్వంలోని సైనిక బలగాలు 1972లో అప్పటి ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. కెరెకోవు నేతృత్వంలోని ప్రభుత్వం 1975లో దేశం పేరును ‘బెనిన్’గా మార్చింది. ‘ఫోన్’ తెగ తర్వాత ‘బిని’ తెగవారు కూడా ఈ దేశంలో గణనీయంగా ఉంటారు. ‘బిని’ తెగ మూలం గానే బెనిన్ పేరు పెట్టారు. అయితే, ‘బిని’ తెగ జనాభా నైజీరియాలో ఎక్కువగా ఉంటారు. సూరినామా దక్షిణ అమెరికాలోని ఈశాన్యతీరంలో ఉన్న దేశం సూరినామా. దీని ఇదివరకటి పేరు సూరినామ్. స్థానిక స్రానన్ టోంగో భాషలో ‘ఆమ’ పదానికి నది లేదా నదీముఖద్వారం అనే అర్థాలు ఉన్నాయి. ఈ దేశాన్ని వేర్వేరు యూరోపియన్ దేశాల వారు ఆక్రమించుకున్నారు. బ్రిటిష్‌వారు 1630లో వలస రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ అధికసంఖ్యాకులు సూరీనియన్ తెగకు చెందినవారు. స్థానిక భాష అర్థంకాని బ్రిటిష్ వలస పాలకులు దీని పేరును ‘సూరినామ్’గా వ్యవహరించేవారు. పదిహేడో శతాబ్ది చివర్లో బ్రిటిష్ వారి నుంచి ఈ దేశం డచ్ పాలకుల చేతిలోకి వెళ్లింది. అప్పట్లో ఇది డచ్ గయానాలో భాగంగా ఉండేది. డచ్ పాలకులు ఇక్కడి నుంచి భారీగా చక్కెర ఎగుమతి చేసేవారు. దాదాపు రెండు శతాబ్దాలు సాగిన డచ్ పాలన నుంచి ఈ దేశానికి 1975లో స్వాతంత్య్రం లభించింది. స్వాతంత్య్రం వచ్చాక, పాశ్చాత్యులు తమ దేశానికి పెట్టిన అపభ్రంశ పదాన్ని తమ భాషకు అనుగుణంగా మార్చుకుని, 1978లో ‘సూరినామా’గా స్వతంత్ర పాలకులు ప్రకటించుకున్నారు. స్వతంత్ర దేశానికి తొలి అధ్యక్షుడైన హెంక్ ఆరన్ హయాంలో ఈ మార్పు అమలులోకి వచ్చింది. నెదర్లాండ్స్ మూడేళ్ల కిందటి వరకు ఈ దేశం పేరు హాలండ్. పశ్చిమ యూరోప్‌లోని డచ్ ప్రజల దేశం ఇది. ఇక్కడి ప్రభుత్వం 2020లో దేశం పేరును ‘నెదర్లాండ్స్’గా మార్చినట్లు ప్రకటించింది. ‘హాలండ్’ పేరు దేశంలోని రెండు డచ్ రాష్ట్రాలు గల ప్రాంతానికే వర్తిస్తుందని, దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా కలుపుకొనేలా ఒక పేరుపెట్టడం బాగుంటుందని దేశ నేతలు కొంతకాలం మల్లగుల్లాలు పడ్డారు. చివరకు ప్రధాని మార్క్ రుట్టే నేతృత్వంలోని ప్రభుత్వం ‘నెదర్లాండ్స్’ పేరును ఖాయం చేసింది. జింబాబ్వే ఆఫ్రికా ఆగ్నేయప్రాంతంలోని దేశం ఇది. దీని ఇదివరకటి పేరు ‘రొడీషియా’. ఇక్కడ బ్రిటిష్ వలస రాజ్యానికి చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు సెసల్ రోడ్స్ పేరు మీద అప్పటి బ్రిటిష్ వలస పాలకులు ఈ దేశానికి ‘రొడీషియా’ అని పేరు పెట్టారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1960లలో ఇక్కడి నల్లజాతీయులు తీవ్రస్థాయిలో ఉద్యమించారు. ఉద్యమకాలంలో వారు తమ దేశానికి ‘జింబాబ్వే’ పేరును వాడుకలోకి తెచ్చారు. ‘జింబాబ్వే’ అంటే స్థానిక ‘షువావు’భాషలో ‘రాతి ఇళ్ల దేశం’ అని అర్థం. పోరాట ఫలితంగా 1965లో స్వాతంత్య్రం వచ్చినా, పాలనలో 1979 వరకు నల్లజాతీయులు మైనారిటీలుగానే మిగిలారు. గెరిల్లా పోరాటం తర్వాత 1979లో జరిగిన ఎన్నికల్లో రాబర్ట్ ముగాబే నాయకత్వంలో నల్లజాతీయ ప్రభుత్వం ఏర్పడింది. ముగాబే ప్రభుత్వం దేశం పేరును ‘జింబాబ్వే’గా మార్చింది. బుర్కీనా ఫాసో ఆఫ్రికా పశ్చిమ ప్రాంతంలోని చిన్న దేశమిది. స్వాతంత్య్రానికి ముందు ఫ్రెంచ్ పాలనలో ఉండేది. ఫ్రెంచ్ పాలకులు దీనిని ఫ్రెంచ్ భాషలో ‘హాట్–వోల్టా’ అని, ఇంగ్లిష్‌లో ‘అప్పర్ వోల్టా’ అని వ్యవహరించేవారు. ఈ దేశానికి ‘అప్పర్ వోల్టా’ పేరు ఎక్కువగా చలామణీలో ఉండేది. ఫ్రెంచ్ వలస పాలకుల నుంచి 1958లో ఈ దేశానికి స్వయంపాలనాధికారం లభించింది. తర్వాత రెండేళ్లకు 1960లో పూర్తి స్వాతంత్య్రం వచ్చింది. స్వాతంత్య్రం వచ్చాక ‘రిపబ్లిక్ ఆఫ్ వోల్టా’గా దేశం పేరు మారింది. వలస పాలకుల ఆనవాళ్లను పూర్తిగా తుడిచివేయాలనే ఉద్దేశంతో 1984లో అప్పటి అధ్యక్షుడు థామస్ సంకారా తమ దేశానికి ‘బుర్కీనా ఫాసో’ పేరును ప్రకటించారు. స్థానిక మూరీ భాషలో ‘బుర్కీనా ఫాసో’ అంటే నిజాయతీపరుల దేశం అని అర్థం. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆఫ్రికా మధ్య ప్రాంతంలోని రెండో అతిపెద్ద దేశం ఇది. బెల్జియం రాజు రెండో లియోపోల్డ్ 1885లో ఇక్కడ సొంతరాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. లియోపోల్డ్ హయాంలో ఈ దేశాన్ని ‘కాంగో ఫ్రీ స్టేట్’ అనేవారు. తర్వాత 1908 నాటికి ఇది పూర్తిగా బెల్జియం ప్రభుత్వం స్వాధీనంలోకి వచ్చింది. బెల్జియన్ల పాలనలో ఈ దేశాన్ని ‘బెల్జియన్ కాంగో’గా వ్యవహరించేవారు. బెల్జియన్ల నుంచి ఈ దేశానికి 1960లో స్వాతంత్య్రం వచ్చాక ‘రిపబ్లిక్ ఆఫ్ జైరీ’గా అవతరించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దాదాపు ఐదేళ్లు దేశం తిరుగుబాట్లు, అంతర్యుద్ధాలతో అతలాకుతలమైంది. అంతర్యుద్ధంలో సైనికాధికారి మొబుటు సెసె సీకో 1965లో అధికారాన్ని చేజిక్కించుకుని నియంతృత్వ పాలన ప్రారంభించారు. దేశంలో ప్రవహించే కాంగో నది పేరు మీదుగా ఆయన దేశానికి ‘కాంగో’ పేరు పెట్టాడు. రెండేళ్లలోనే 1967లో సీకో ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చిన తిరుగుబాటు నాయకుడు లారెంట్ డిజైర్ కబిలా దేశానికి ‘డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ పేరును ఖాయం చేశారు. కాబో వెర్డీ ఆఫ్రికా పశ్చిమాన ఉన్న చిన్న ద్వీపసమూహ దేశం ఇది. పదేళ్ల కిందటి వరకు ఈ దేశం ‘కేప్ వెర్డీ’ అనే ఇంగ్లిష్ పేరుతోనే చలామణీ అయ్యేది. తొలుత పోర్చుగీసులు ఈ ద్వీపసమూహాన్ని 1462లో ఆక్రమించుకుని, నావికా స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచి వస్తువులే కాకుండా, బానిసలను కూడా దేశదేశాలకు ఎగుమతి చేసేవారు. స్థానిక క్రియోలె భాషలో ఈ దీవులకు ‘కాప్–వెర్ట్’ అనేవారు అంటే, ‘ఆకుపచ్చని అగ్రం’. దాని ఆధారంగానే పోర్చుగీసులు ఈ ద్వీపసమూహానికి తమ భాషలో ‘కాబో వెర్డీ’ అనే పేరు పెట్టుకున్నారు. ఇంగ్లిష్ మాట్లాడే దేశాలతో వారు లావాదేవీలు సాగించడంతో వారికి అర్థమయ్యేలా ‘కేప్ వెర్డీ’ అనేవారు. పోర్చుగీసుల నుంచి ఈ దేశానికి 1975లో స్వాతంత్య్రం వచ్చింది. దేశాధ్యక్షుడు జోస్ మారియా నెవిస్ 2013లో దేశానికి తిరిగి పోర్చుగీసు పదాన్ని అధికారికంగా వాడుకలోకి తీసుకొచ్చారు. తుర్కియే నిన్న మొన్నటి వరకు ఈ దేశం ‘టర్కీ’ పేరుతోనే చలామణీలో ఉండేది. ఇక్కడి తుర్కు ప్రజల ప్రాచీన నాగరికత, సంస్కృతి ప్రతిబింబించేలా స్థానిక భాషలోనే దేశం పేరు ఉండాలనే ఉద్దేశంతో అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్ గత ఏడాది దేశం పేరును ‘తుర్కియే’గా మార్చినట్లు ప్రకటించారు. అంతర్జాతీయ సమాజం ఈ దేశాన్ని ఇప్పుడు ఇదే పేరుతో గుర్తిస్తోంది. నిజానికి అంతర్జాతీయంగా ఏర్పడిన ఒక చిన్న ఇబ్బంది ఈ దేశం పేరు మార్చుకోవడానికి కారణమైంది. ‘థాంక్స్ గివింగ్ డే’ సందర్భంగా ఉత్తర అమెరికన్లు సంప్రదాయంగా ఇచ్చేవిందులో టర్కీ కోళ్లు తప్పనిసరి. టర్కీ కోళ్లను వాళ్లు ‘టర్కీ’గానే వ్యవహరిస్తారు. కోడిజాతికి చెందిన పక్షుల పేరు, తమ దేశం పేరు ఒకటే కావడంతో గందరగోళం ఏర్పడుతోందని, దీన్ని తప్పించుకోవడానికే దేశం పేరు మార్చుకోవాల్సి వచ్చిందని ‘తుర్కియే’ విదేశాంగ శాఖ అధికారి ఒకరు తెలిపారు. (చదవండి: ఆదర్శగురువులెందరో..వారందరికీ ప్రణామం!) -
రైలు కదిలేముందు జర్క్ ఎందుకు? న్యూటన్ నియమంతో సంబంధం ఏమిటి?
భారతదేశంలో దాదాపు 125 కోట్ల మంది నివసిస్తున్నారు. వీరిలో చాలామంది దూర ప్రయాణాలకు రైళ్లను ఆశ్రయిస్తుంటారు. అయితే కొన్ని రైళ్లు బయలుదేరేముందు ఒక కుదుపునకు గురి చేసి, ఆ తర్వాత ముందుకు కదలడాన్ని మీరు గమనించేవుంటారు. ఇది ప్రతి రైలులోనూ జరగదు. కొన్ని రైళ్లలో మాత్రమే ఇలా జరుగుతుంది. ఇటువంటి రైళ్ల ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రైళ్లలోనే జర్క్ అనుభూతి నిజానికి ఈ జర్క్కు కారణం రైలు కోచ్. కొన్ని రకాల కోచ్‌లు ఉన్న రైళ్లలో మాత్రమే మనకు ఈ జర్క్ అనేది వస్తుంది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు కలిగిన రైళ్లలో ఇటువంటి జర్క్ మనకు అనుభవానికి వస్తుంది. ఈ తరహా కోచ్‌లలో ఒకదానికొకటి కనెక్ట్ అయ్యే కప్లింగ్ల డిజైన్ చాలా పాతదై ఉంటుంది. దీంతో వాటి స్థాయి ఇటువంటి జర్క్లను నియంత్రించేందుకు అనువుగా ఉండదు. వీటిలో తక్కువ జర్క్ ఐసీఎఫ్ కోచ్‌లు కలిగివున్న రైళ్లు వాటి కప్లింగ్లలో జర్క్ రెసిస్టెంట్ సస్పెన్షన్లను కలిగి ఉంటాయి. ఐసీఎఫ్ కోచ్‌లతో రైలు నడుస్తున్నప్పుడు చాలా స్వల్పస్థాయి జర్క్ మాత్రమే సంభవిస్తుంది. కప్లింగ్‌లు గుండ్రంగా ఉండి, రెండు కోచ్‌లు ఒకదానికొకటి అనుసంధానమయ్యే చోట ఉంటాయి. న్యూటన్ మొదటి నియమం.. న్యూటన్ మొదటి నియమం కూడా ఇటువంటి జర్క్కు కారణంగా నిలుస్తుంది. అదే జడత్వ నియమం. వాస్తవానికి మీరు రైలులో కూర్చున్నప్పుడు, మీ శరీరం స్థిరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో రైలు అకస్మాత్తుగా ముందుకు కదులుతున్నప్పుడు.. మీ శరీరం దాని స్థానంలో అది ఉన్నప్పటికీ, రైలు కదలిక కారణంగా జర్క్ అయినట్లు అనుభూతి కలుగుతుంది. ఇది కూడా చదవండి: శాంతినికేతన్‌తో చైనాకు లింకు ఏమిటి? -
ఏఏ దేశాల్లో వరద ముప్పు అధికం? దీనికి ప్రధాన కారణం ఏమిటి?
తుఫాను ప్రభావంతో వచ్చిన వరదలు లిబియాను సర్వ నాశనం చేశాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. దర్నా నగరంలో ఎక్కడ చూసినా మృతదేహాలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. లెక్కకుమించిన ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చాలా మంది మరణించారు. పది వేల మంది జాడ ఇంకా తెలియరాలేదు. లిబియాలో పెనువిధ్వంసం ఈ విధ్వంసకర దృశ్యాలను చూసిన లిబియా విపత్తు వ్యవహారాల మంత్రి హిచెమ్ చిక్వియోట్ కంటతడి పెట్టుకున్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని, సముద్రంలో, లోయల్లో, భవనాల కింద ఇలా.. ప్రతిచోటా మృతదేహాలు ఉన్నాయని తెలిపారు. దర్నా నగరంలో దాదాపు 25 శాతం కనుమరుగైంది. లెక్కలేనన్ని భవనాలు కూలిపోయాయి. ఆసుపత్రుల్లో మృతదేహాలను ఉంచేందుకు స్థలం కూడా సరిపోవడం లేదు. గల్లంతైన వారి సంఖ్య నిరంతరం పెరుగుతుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. మొదటి స్థానంలో బంగ్లాదేశ్ వరదలు ఈ స్థాయిలో విధ్వంసం సృష్టించడం ఇదేమీ మొదటిసారి కాదు. అనేక దేశాల్లో వరదలు వేలమంది ప్రాణాలను తీయడమే కాకుండా తీవ్ర నష్టాన్ని కూడా కలిగించాయని ఈ సంవత్సరం వెలువడిన గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలో వరదల ప్రమాదం నిరంతరం పెరుగుతోంది. దీనికి కారణం ఏమిటి? పెరుగుతున్న ఈ వరదల ముప్పు నుండి ప్రపంచాన్ని రక్షించుకోగలమా? స్టాటిస్టా నివేదిక ప్రకారం ఈ ఏడాది అత్యధికశాతం వరదలను ఎదుర్కొన్న దేశాలలో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉంది. వరదలు ఇక్కడ భారీ విధ్వంసం సృష్టించాయి. బంగ్లాదేశ్‌లో ఈసారి ప్రజలు చూసిన వరద పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ఈ వరదలు వేలాది మంది ఇళ్లను ముంచివేయడమే కాకుండా అనేక మంది ప్రాణాలను బలిగొన్నాయి. వియాత్నాంలో వరద విలయం ప్రపంచంలో వరదల వల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశాల జాబితాలో వియత్నాం రెండో స్థానంలో ఉంది. ఇక్కడ ఏటా వరద ముప్పు మరింతగా పెరుగుతోంది. ఈ ఏడాది కూడా వియత్నాంలో సంభవించిన వరదలు అనేక మంది ప్రాణాలను బలిగొన్నాయి. వరదల బారిన పడిన దేశాల్లో మయన్మార్ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ రుతుపవనాల వరదల కారణంగా 40 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ దేశంలో వరదల బీభత్సం ప్రతి సంవత్సరం కనిపిస్తూనే ఉంటుంది. వరదలు ఏర్పడుతున్న పరిస్థితుల్లో ఇక్కడి జనానికి వలసలు తప్ప మరో మార్గం లేకుండా పోయింది. కంబోడియాలో కకావికలం కంబోడియా ప్రపంచంలో అత్యంత వరద ప్రభావిత దేశాలలో ఒకటి. ఇక్కడ ఈ ఏడాది వరదలు లెక్కలేనంతమందిని ప్రభావితం చేశాయి. వరద ప్రభావిత దేశాలలో ఇరాక్ పేరు ఐదవ స్థానంలో ఉంది. దీని తరువాత లావోస్, సెర్బియా, తరువాత పాకిస్తాన్ అత్యంత వరద ప్రభావిత దేశాలు. కాగా భారతదేశంలో వరదల ప్రమాదం ప్రతీఏటా పెరుగుతోంది. ఈ ఏడాది యమునా నది వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈ సంవత్సరం భారతదేశంలో వరదల కారణంగా 10 నుండి 15 వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లింది. దేశంలో మరింతగా ప్రకృతి వైపరీత్యాలు ఎస్బీఐ నివేదిక ప్రకారం అమెరికా, చైనాల తర్వాత ప్రకృతి వైపరీత్యాల కారణంగా భారత్‌లోనే ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. 1990 తర్వాత భారతదేశం అనేక ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నివేదిక ప్రకారం 1900- 2000 సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాల సంఖ్య 402 కాగా, 2001 నుండి 2022 వరకు అంటే కేవలం 21 సంవత్సరాలలో వాటి సంఖ్య 361కు చేరింది. ఈ ఏడాది వరదలు దేశంలోని ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, దేశ రాజధాని ఢిల్లీ వంటి కొండ ప్రాంతాలను ఎక్కువగా ప్రభావితం చేశాయి. ఒక్క ఉత్తరాఖండ్‌లోనే వరదల కారణంగా 8000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. వాతావరణంలో భారీగా పెరిగిన తేమ శాతం శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఇటువంటి విపత్కర పరిస్థితుల వెనుక ప్రధాన కారణం వాతావరణం వేడెక్కడం. ఈ సమయంలో ఉత్తరార్ధగోళంలో వేసవి కాలం ఉండటంతో పాటు ఈసారి వేడి ఎక్కువగా ఉండటంతో వాతావరణంలో తేమ శాతం భారీగా పెరిగినందున వరదలు వచ్చే అవకాశం మరింత పెరిగింది. వెచ్చని వాతావరణంలో తుఫానులు ఎక్కువగా ఏర్పడతాయి. వాతావరణ మార్పు అనేది అకాల మార్పులను మరింతగా పెంచింది. రానున్న కాలంలో వేడిగాలులతో తేమశాతం మరింత పెరగనుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ శతాబ్దం మధ్య నాటికి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు సంవత్సరానికి 20 నుండి 50 సార్లు కనిపించవచ్చంటున్నారు. పెను విపత్తులకు ఇది ఆరంభం ఎల్‌నినో ప్రభావం ప్రపంచంలో కనిపించడం మొదలయ్యిందని ఈ ఏడాది జూలైలో ప్రపంచ వాతావరణ శాఖ ప్రకటించింది. పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే ఈ ప్రత్యేక సంఘటన ప్రపంచమంతటా వేడిని పెంచేలా చేస్తోంది. దీని ప్రారంభంలో మధ్యధరా పసిఫిక్ మహాసముద్రం ఉపరితల నీరు వేడిగా మారనుంది. భారతదేశ రుతుపవనాలపై కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీని ప్రభావం అమెరికా, యూరప్‌లో కూడా ఉండనుంది. దీని ప్రకారం చూస్తే పెను విపత్తులకు ఇది ఆరంభం మాత్రమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది కూడా చదవండి: ఫిరోజ్ ఘంఢీ.. ఫిరోజ్ గాంధీగా ఎలా మారారు? -
10 అనవసర విషయాలు.. వీటి జోలికి వెళ్లకపోవడమే శ్రేయస్కరం!
మనిషి ప్రశాంతంగా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని పరిధులను కల్పించుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే లేని పోని సమస్యలు ఎదురవుతాయి. అవమానాలు కూడా ఎదురయ్యే ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఈ 10 అనవసర విషయాలు మనిషికి ముప్పును తెచ్చిపెడతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సమయం, శక్తి వృథా: మీకు అవసరం లేని చోటికి వెళ్లడం వలన లేదా అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన మీ విలువైన సమయం, శక్తి వృథా అవుతాయి. దీనికి బదులుగా మీ నైపుణ్యాలను అవసరమయ్యే విషయాలపైనే కేంద్రీకరించండి. తద్వారా మీ శక్తిసామర్థ్యాలు సద్వినియోగం అవుతాయి. 2. గుర్తింపునకు దూరం కావడం: మీరు అవసరం లేని చోటికి వెళ్లినప్పుడు, లేదా మీ సామర్థ్యాన్ని అనవసరం లేని విషయాలపై కేంద్రీకరించినప్పుడు మీకు తగిన గుర్తింపు, ప్రశంసలు అందకపోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో మీకు సహకారం అందకపోగా, మీ గుర్తింపు కూడా మరింత తగ్గే అవకాశం ఉంది. 3. ఇతరుల వ్యక్తిగతాల్లోకి తొంగిచూడటం: మీకు అవసరం లేనప్పుడు ఇతరుల వ్యక్తిగతాల్లోకి చొరబడకపోవడమే ఉత్తమం. ఇతరుల వ్యక్తిగతాలను గౌరవించండి. ఎదుటివారు మీ సహాయం కోసం ప్రత్యేకంగా అడగనంత వరకు వారి వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్లకండి. 4. ఇతరుల సామర్థ్యాలను అణగదొక్కడం: మీరు ఉద్దేశ్యపూర్వకంగా ఇతరుల సామర్థ్యాలను అణగదొక్కే ప్రయత్నం చేయకండి. వారి నైపుణ్యాలపై నమ్మకం ఉంచండి. వారి బాధ్యతలను వారు స్వతంత్రంగా నిర్వహించేలా చూడండి. ఇందుకు అవసరమైతేనే సహకారం అందించండి 5. ఉనికికే ప్రమాదం: మీరు అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకుని, ఇతరులు మీ ఉనికిపై ఆధారపడే భావాన్ని వారిలో కల్పించవద్దు. ఇది ఇతరుల ఎదుగుదలకు, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే వారు తమ స్వంత నైపుణ్యాలను, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి బదులు మీపై ఆధారపడే స్వభావాన్ని ఏర్పరుచుకోవచ్చ. తద్వారా మీ ఉనికికే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. 6. లక్ష్యానికి దూరం కావడం: మీరు అవసరం లేని విషయాలలో అతిగా జోక్యం చేసుకుంటే మీ ఆసక్తులు, లక్ష్యాలకు దూరమై అన్ని అవకాశాలను కోల్పోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీ వ్యక్తిగత ఎదుగుదలకు ప్రాధాన్యత ఇవ్వడం, మీకు నిజమైన ప్రయోజనాలను అందించగల ప్రయత్నాలను కొనసాగించడం ఎవరికైనా చాలా అవసరం. 7. అతిశయోక్తులకు దూరంగా ఉండటం: మిమ్మల్ని మీరు అతిగా ఊహించుకోవడం, వర్ణించుకోవడం వలన మీ అత్యవసరాలను, శ్రేయస్సును నిర్లక్ష్యం చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైన పనితీరు, జీవిత సమతుల్యతను కాపాడుకునేందుకు మనం ఏమిటో మనం తెలుసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. 8. వనరుల దుర్వినియోగం: మీరు మీ దగ్గరున్న వనరులను మీకు అవసరం లేని అంశాలపై మళ్లించినప్పుడు.. అది సమయం అయినా, డబ్బు అయినా వృథాకు దారితీస్తుంది. మీ దగ్గరున్న వనరులను ద్విగుణీకృతం చేసుకునేందుకు, వాటిని సమర్థవంతంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. 9. కార్యకలాపాలకు అంతరాయం: మీరు లేనిపోని విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన మీ కార్యకలాపాలకు, ఇతరుల కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుంది. మీరు కోరుకునే మార్పు, మెరుగుదల కోసం ఇప్పటికే ఉన్న ప్రక్రియలను కొనసాగించాలి. సంబంధిత ప్రోటోకాల్‌లను గౌరవించడం కూడా అవసరమే. 10. చివరికి మిగిలేది: మీరు అవసరం లేని విషయాల్లో తరచూ జోక్యం చేసుకోవడం వల్ల అది నిరాశకు దారితీస్తుంది. మీ ప్రయత్నాలను అనవసరమైన విషయాలపై పెట్టి, సమయం వృథా చేసుకోకుండా, విలువైన, అర్ధవంతమైన మార్పును కలిగించగల అంశాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఇది కూడా చదవండి: ‘నాలుగు కాళ్ల’ వింత కుటుంబం.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు -
ఈఫిల్ టవర్‌కు రాత్రివేళ ఫొటోలు తీయడం నేరం.. కారణం ఇదే!
పారిస్‌లోని ఈఫిల్ టవర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరొందింది. ప్రపంచంలోని నలుమూలల నుంచి పర్యాటకులు ఈఫిల్ టవర్‌ను సందర్శించేందుకు ఫ్రాన్స్‌కు తరలివస్తుంటారు. 1889లో ఫ్రాన్స్‌లో నిర్వహించిన వరల్డ్ ఎగ్జిబిషన్‌కు ఎంట్రీ గేటుగా ఈ టవర్ నిర్మాణం ప్రారంభమయ్యింది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్ రూపంలో నిర్మించారు. తరువాత దీనిని కూల్చివేసే ఆలోచన చేశారు. అయితే దీని అందం, ప్రజాదరణలను దృష్టిలో ఉంచుకుని దీనిని కూల్చివేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. ఈఫిల్ టవర్ నిర్మించేందుకు 2 ఏళ్ల 2 నెలల 5 రోజులు పట్టింది. దీని నిర్మాణం 1887 నుంచి 1889 వరకూ సాగింది. ఈఫిల్ టవర్ నిర్మాణంలో సుమారు 300 మంది కూలీలు పాల్గొన్నారు. ఈ అద్భుత కళాకృతి కారణంగా నేడు పారిస్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంటుంది. ఈఫిల్ టవర్‌కు రాత్రివేళ ఫొటోలు తీయడం నిషిద్ధం. చట్టరీత్యా ఈ టవర్‌కు రాత్రివేళ పొటోలుతీయడం నేరమని ప్రభుత్వం ప్రకటించింది. ఈఫిల్ టవర్ లైట్లు పారిస్ కాపీరైట్స్ కిందకు వస్తాయి. అందుకే ఎవరైనా రాత్రివేళ ఈఫిల్ టవర్‌కు ఫొటోలు తీయాలనుకుంటే, ముందుగా కాపీరైట్ చట్టానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. పారిస్‌ను లవ్ సిటీ అని అంటారు. జంటలకు ఈఫిల్ టవర్ లవ్ స్పాట్ అని చెబుతారు. పారిస్‌కు ఇంతటి జనాదరణ ఉన్న కారణంగానే భారత ప్రధాని నరేంద్రమోదీ తన ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశంలో యూపీఐ పేమెంట్లను ప్రారంభించారు. దీని తొలి పేమెంట్‌ను ఈఫిల్ టవర్ వద్ద నిర్వహించారు. త్వరలో పర్యాటకులు ఈఫిల్ టవర్ ఎంట్రీ ఫీజు చెల్లించేందుకు యూపీఐ పేమెంట్‌ను ఉపయోగించవచ్చు. ఈఫిల్ టవర్లోని కొంతభాగం శీతాకాలంలో ముడుచుకుపోతుంటుంది. ఇప్పటిరకూ 6 ఇంచుల భాగం ముడుచుకుపోయిందని చెబుతుంటారు. ఈఫిల్ టవర్ నిర్మాణంలో ఉపయోగించిన మెటల్ చలికి ముడుచుకుపోతుంటుంది. వేసవిలో తిరిగి సాధారణ స్థాయికి వస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన నిర్మాణాలలో ఈఫిల్ టవర్ ముందు వరుసలో ఉంటుంది. అయితే 1930లో నిర్మించిన న్యూయార్క్‌లోని క్రిస్మస్ బిల్డంగ్ ఎత్తు విషయంలో ఈఫిల్ టవర్‌ను అధిగమించింది. నిజానికి ఈఫిల్ టవర్‌ను 20 ఏళ్లపాటు నిలిచివుండేలా నిర్మించారు. అయితే ఈ నిర్మాణం జరిగి 20 ఏళ్లు దాటినా అది చెక్కుచెదరకుండా ఉంది. దీని నిర్మాణం జరిగిన 20 ఏళ్ల అనంతరం దీనికి కొన్ని సాంకేతిక పరీక్షలు చేశారు. ఈ నేపధ్యంలో టవర్ ఎంతో స్ట్రాంగ్‌గా ఉందని తేలింది. అందుకే ఈరోజుకూ ఈఫిల్ టవర్ మనమంతా తలెత్తుకునేలా నిలిచింది. ఇది కూడా చదవండి: నేపాల్‌లో దాక్కున్న చైనా ‘పెంగ్’.. భారత్‌లోకి అక్రమంగా చొరబడుతూ.. -
మంగళవారం మంచిదికాదా? ఎందుకు ఆ రోజు ఆ పనులు చేయరు!
మనలో చాలా మంది ఏ పని ప్రారంభించాలన్నా వారం, వర్జ్యం అనేవి చూసుకుంటారు. అలాగే చాలా మంది మంగళవారం గోర్లు, వెంట్రుకలు కత్తిరించుకోవడం అశుభంగా భావిస్తారు. దీని వెనుక కారణమేంటో తెలుసా? వారంలో అన్ని రోజులు తెరిచి ఉండే సెలూన్ షాప్‌లు మంగళవారం మాత్రం మూసి ఉంటాయి. ఆరోజున క్షౌరశాలలు నిర్వహించే నాయి బ్రాహ్మణులు అందరూ సెలవు దినంగా పాటిస్తారు. పైగా ఆ రోజు ఏ మంచి పని మొదలుపెట్టరు. ఎక్కడికీ వెళ్ళరు మరీ అర్జెంటు.. తప్పనిసరి ఐతే తప్ప. మంగళవారం మంచిదికాదన్న సంగతి ఎలా వచ్చింది..? ఎవరు చెప్పారు..? ఎంతవరకు నిజం..? చూద్దామా!. తమ సంస్కృతి, సంప్రదాయాలకు కట్టుబడి ఉండే హిందువులు ఎవరూ కూడా మంగళవారం రోజున కటింగ్, షేవింగ్ లాంటివి చేసుకోరు. శరీరంపై అంగారక గ్రహ ప్రభావం మంగళవారాన్ని అంగారక గ్రహం రోజుగా (Mars Day) భావిస్తుంటారు. అంగారక గ్రహం అనేది ఎరుపు వర్ణానికి చిహ్నం. ఎక్కువ వేడిని కలిగి ఉంటుంది. గ్రహ ప్రభావం వల్ల మంగళవారం రోజున ఆ వేడి మానవ శరీరంపై ప్రభావం చూపుతుందంటారు. ఆ రోజు శరీరానికి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువ. శరీరంపై గాట్లు పడే అవకాశం ఉంటుందని విశ్వసిస్తారు. కాబట్టి ఆ రోజున కటింగ్, షేవింగ్ లాంటివి చేసుకోవద్దని పెద్దలు చెప్పారు. జుట్టు కత్తిరించుకోడాన్ని ఆయుష్కర్మ అంటారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా పని చేయరాదు. ముందుగా గడ్డం, ఆపైన మీసం, ఆ తరువాత తలమీద ఉన్న జుట్టూ తీయించుకోవాలి. ఆపైన చేతిగోళ్లు, చివరగా కాలిగోళ్ళు తీయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వరుసను అతిక్రమించరాదు. కొన్ని రోజులలో ఈ ఆయుష్కర్మ నిషిద్ధం. ఏకాదశి, చతుర్దశి, అమావాస్య పౌర్ణమి తిధులు నిషిద్ధాలు. ప్రతినెలా వచ్చే సంక్రాంతి కూడా నిషిద్ధమే. వ్యతీపాత, విష్టి యోగ కరణాలలో, శ్రాద్ధ దినాలలో నిషిద్ధం. వ్రతదినాలైతే కూడా క్షవరము చేయించుకోరాదు. ఆయుష్కర్మ చేయించుకునే వారాన్ని బట్టి ఆయుష్షు పెరగడం కానీ తరగడం కానీ ఉంటుంది. శుక్ర వారమైతే పదకొండు నెలలు, బుధవారం అయితే ఐదు నెలలు, సోమవార అయితే ఎనిమిది నెలలు ఆయుష్షు పెరుగుతుంది. గురువారమైతే ఆయుష్షు పది నెలలు పెరుగుతుంది. ఆదివారం క్షవరము చేయించుకుంటే ఆయుష్షు నెల రోజులు తగ్గుతుంది. శనివారం అయితే ఏడు నెలలు తగ్గుతుంది. మంగళవారం అయితే ఎనిమిది నెలలు తగ్గుతుంది. పూర్వం షాపులు లేని రోజుల్లో ఇంటికి వచ్చే మంగలి పని చేసేవారు. (ఈ పదం వృత్తిరీత్యా వాడబడింది కానీ కులాన్ని సూచించేది కాదు.) ప్రతిరోజూ ఉద్యోగానికి వెడుతూ, గడ్డం, మీసం కావలసినంతగా కత్తిరించుకుని వెళ్లే అవసరం కూడా ఆ రోజుల్లో లేదు. మంగలి అతను వచ్చి క్షవరకర్మ చేసి వెళ్ళాక అతని భార్య వచ్చి ఇంట్లో వారిచ్చిన అన్నము, పదార్థాలు తీసుకుని వెళ్ళేది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పంచాంగం చూసి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం చూసి క్షవరకర్మ చేయించుకునే పరిస్థితి లేదు. క్షవర కర్మ వృత్తిలో ఉన్నవారు కూడా షాపు తెరిచి అక్కడకు వచ్చిన వారికే ఆయుష్కర్మ చేస్తున్నారు. కొన్ని రోజులు మాత్రమే తెరిచి ఉంచితే వారికి కిట్టదు. ఈ సూత్రాలలో చెప్పినవన్నీ పూర్తిగా వదిలివేయడానికి భారతీయులు ఇష్టపడరు అందుకే క్షవరం చేయించుకుంటే ఆయుష్షు ఎక్కువగా తరిగిపోయే మంగళవారాన్ని మాత్రమే సెలవు దినంగా స్వీకరించడం జరిగింది. తగాదలయ్యే అవకాశం ఎక్కువ.. అంగారక గ్రహ ప్రభావం కారణంగా మంగళవారం రోజున తగాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ఇబ్బందుల్లో పడతారు. మంచి శకునాలు ఉండవు కాబట్టి ఆ రోజున ఏ కార్యం తలపెట్టినా అశుభంగా భావిస్తారు. దేవతలకు ఆ రోజు ప్రత్యేకం పూజలు, వ్రతాలకు ప్రత్యేకం ఇదే కాకుండా, మంగళవారం రోజున గోర్లు, జుట్టు కత్తిరించుకోకపోవడానికి మరో నమ్మకం కూడా ప్రాచుర్యంలో ఉంది. దుర్గాదేవి, మహాలక్ష్మి అమ్మవార్లకు ఎక్కువగా మంగళవారాల్లోనే ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. ఆ రోజున దేవతలను పూజించడం వల్ల మంచి ఐశ్వర్యం, ధన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. అమ్మవార్లకు సంబంధించి మంగళవారం ప్రత్యేక దినంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవడం లాంటివి చేయరు. -
మన కితకితలు మనకు ఎందుకు నవ్వు తెప్పించవంటే..
కితకితలు.. ఎవరికైనా ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చే ఉంటాయి. ఎవరైనా కితకితలు పెడుతున్నప్పుడు మనకు విచిత్ర అనుభూతి కలిగి, నవ్వు వస్తుంటుంది. ఇటువంటి సందర్భంలో పగలబడి నవ్విన ఉదంతాలు కూడా ఉంటాయి. సాధారణంగా చిన్నపిల్లలకు పెద్దవాళ్లు కితకితలు పెట్టడం చూస్తుంటాం. అటువంటప్పుడు పిల్లలు ఆనందంతో మెలికలు తిరిగిపోతూ నవ్వుతుంటారు. అయితే ఇక్కడున్న ఒక విచిత్ర విషయాన్ని చాలామంది గమనించివుండరు. ఎవరికి వారు కితకితలు పెట్టుకున్నప్పుడు నవ్వు రాదు. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కితకితలు అనుభూతికి రావడంలో మన మెదడులోని రెండు భాగాలు బాధ్యత వహిస్తాయి. వాటిలో మొదటిది కార్టిక్స్.. ఇది శరీరపు స్పర్శను అనుభూతి చెందుతుంది. ఇక రెండవది ఎంటీరియా సింగులెట్ కార్టిక్స్. ఇది ఆనందాన్ని, సెన్సేషన్‌ను అనుభూతి చెందుతుంది. మనకు మనం కితకితలు పెట్టుకున్నప్పుడు మెదడులోని సెరిబెల్మ్ భాగానికి ముందుగానే ఈ విషయం తెలిసిపోతుంది. దీంతో అది కార్టిక్స్‌కు ఆ సమాచారాన్ని అందిస్తుంది. దీంతో కితకితలకు సిద్ధమైన కార్టిక్స్ అంతకుముందే విషయాన్ని గ్రహిస్తుంది. ఫలితంగా మనకు మనం కితకితలు పెట్టుకున్నా నవ్వురాదు. ఎటువంటి అనుభూతి కూడా కలుగదు. కితకితలను అనుభూతి చెందేందుకు సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది తప్పనిసరి. మనకు మనం కితకితలు పెట్టుకున్నప్పుడు మెదడు ముందుగానే శరీరానికి సిగ్నల్ పంపుతుంది. అందుకే మన కితకితలు మన అనుభూతికి అందవు. అయితే మనకు ఎవరైనా కితకితలు పెట్టినప్పుడు మన మెదడు ఆ సిగ్నల్‌ను కార్టిక్స్‌కు పంపలేదు. దీంతో మెదడు కితకితల అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉండదు. ఫలితంగా ఎవరైనా కితకితలు పెడితే వెంటనే ఎడతెగకుండా నవ్వువస్తుంది. అయితే ఇతరులు కితకితలు పెడుతుంటే మనం నవ్వడం కొంతవరకూ మంచిదేనని నిరూపితమయ్యింది. అప్పుడప్పుడు మన శరీరంపై ఏదైనా పురుగు లేదా కీటకం పాకినప్పుడు మనకు శరీరం జలదరిస్తుంది. వెంటనే ఆ పురుగును లేదా కీటకాన్ని తీసి బయట పారేస్తాం. మెదడు ఈ విధంగా కూడా మనకు రక్షణ కల్పిస్తుంది. -
ఆపకుండా గట్టిగా నవ్వితే చనిపోతారా? ఇందులో నిజమెంతంటే...
ఆనందం కలిగినప్పుడు ఎవరైనా నవ్వుతుండటం సహజమే. ఆ ఆనందం కాస్త ఎక్కువైనప్పుడు పగలబడి నవ్వుతుండటం కూడా చూసేవుంటాం. కొన్ని సినిమాల్లో నవ్వుతూ చనిపోయే పాత్రలు కూడా కనిపిస్తాయి. వీటిని చూసినప్పుడు నిజజీవితంలో కూడా ఇలా జరుగుతుందా? అనే అనుమానం కలుగుతుంది. అవును.. ఇది నిజమే.. నిజజీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇది వినడానికి అతిశయోక్తిగానే అనిపించవచ్చు. కానీ ముమ్మాటికీ నిజం. ఆపకుండా నవ్వడం చావుకు ఎలా కారణమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నవ్వుతున్నవారిలో కొన్ని విచిత్రమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అతిగా నవ్వడం వలన మరణం సంభవించడమనేది చాలా అరుదుగా జరిగే ఘటన. దీనికి సంబంధించి కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘటన తొలిసారిదని చెబుతారు. ఇది క్రీస్తుపూర్వం మూడవ శతాబ్ధంలో చోటుకుందని చెబుతారు. Chrysippus అనే గ్రీకు తత్వవేత్త మరణం 2 కారణాలుగా జరిగిందని చెబుతారు. దానిలో మొదటిది అతను అధికంగా మద్యం తాగడం వలన సంభవించిందని అంటారు. ఇక రెండవ అంశానికి వస్తే.. అతను ఒక గాడిదకు ఏదో తినిపించేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు అతను వ్యంగ్యంగా ‘ఇప్పుడు గాడిదకు మద్యం తాగిపించాలి’ అని అనుకుంటూ పెద్దపెట్టున నవ్వుతూ చనిపోయాడని చెబుతారు. నేటి ఆధునిక కాలంలోనూ ఇటువంటి ఘటన కనిపిస్తుంది. 1975లో అలెక్సా మిషెల్ అనే బ్రిటీషర్ ‘ది గాడీస్’ అనే పాపులర్ కామెడీ చూస్తున్నాడు. ఈ సమయంలో అతను ఆపకుండా 30 నిముషాల పాటు నవ్వుతూనే ఉన్నాడు. తరువాత నేలకు ఒరిగిపోయాడు. ఇదేవిధంగా 2003లో థాయిల్యాండ్‌కు చెందిన ఒక ఐస్‌క్రీమ్ ట్రక్ డ్రైవర్ నిద్రలో పెద్దపెట్టున నవ్వసాగాడు. అతని పక్కనే పడుకున్న అతని భార్య అతనిని లేపేందుకు ప్రయత్నించింది. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతని ప్రాణం పోయింది. మనదేశంలోనూ ఇటువంటి ఘటన జరిగింది. 2013లో మహారాష్ట్రలో 22 ఏళ్ల ఒక యువకుడు మంగేష్ బోగల్ తన స్నేహితునితోపాటు ‘గ్రాండ్ మస్తీ’ అనే కామెడీ సినిమాకు వెళ్లాడు. సినిమా చూస్తూ గట్టిగా నవ్వుతూ గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటన గురించి అతని పక్కన కూర్చున్నవారు మాట్లాడుతూ మంగేష్ సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాడన్నారు. ఈ కారణంగానే అతనికి గుండెపోటు వచ్చిందని తెలిపారు. కాగా అతనిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిశీలనగా చూస్తే ఈ ఉదంతాల్లో అతిగా నవ్వడం వలన వారు మృతి చెందలేదు. ఈ సంఘటనల్లో నవ్వుతున్నప్పుడు వారికి శ్వాసలో ఇబ్బంది ఏర్పడటమో లేక గుండెపోటు రావడమో జరిగి మరణించారు. నిజానికి నవ్వడం అనేది ఆరోగ్య లక్షణం. వైద్యులు కూడా నవ్వుతూ ఉండాలని అందరికీ సలహా ఇస్తుంటారు. నవ్వుతుండటం వలన మన శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతుంటారు. అయితే మన శరీరంలో నిరంతరం అంతర్గత అవయవాల కార్యకలాపాలు జరుగుతుంటాయి. గట్టిగా ఎక్కువసేపు నవ్వడం వలన కొందరికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరికైనా గట్టిగా నవ్వుతున్నప్పుడు శారీకరంగా ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
వెంకటేష్ తో అర్దాంతరంగా సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటంటే...
-
కోటంరెడ్డి బ్రదర్స్ కోసం సొంతవాళ్లకే టీడీపీ వెన్నుపోటు.. పాపం అజీజ్!
నమ్మిన వాళ్లను నట్టేట ముంచడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నైజమని టీడీపీలోనే ప్రచారముంది. ఇప్పుడు బయటి నుంచి వచ్చిన వారి కోసం సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. నెల్లూరు జిల్లా టీడీపీలో గందరగోళ పరిస్థితులకు చంద్రబాబు నిర్ణయాలే కారణమని అక్కడి నేతలు వాపోతున్నారు. ఇంతకీ సింహపురి రాజకీయాల్లో కలకలానికి కారణం ఏంటి? తెగేసి చెబుతున్నారట.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన రాకను టీడీపీ జిల్లా అధ్యక్షులు, రూరల్ ఇన్చార్జ్ అబ్దుల్ అజీజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. రూరల్‌లో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి.. ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఏకంగా ముఖ్య నాయకుల్నే అజీజ్ ప్రశ్నించారట. అయితే వారు అజీజ్‌ను లైట్ తీసుకోవడంతో.. ప్రత్యర్థిని పార్టీలోకి తీసుకువచ్చి అధిష్టానం తన గొంతు కోసిందని అనుచరుల దగ్గర వాపోతున్నారట. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి పనిచేసే ప్రసక్తి లేదని తెగేసి చెబుతున్నారట. తమ మీద హత్యాయత్నం కేసులు పెట్టించి, బెదిరించిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో ఎలా కలిసి పనిచేయాలని పార్టీ పెద్దలను అజీజ్ ప్రశ్నిస్తున్నారట. బాబు మంత్రాంగం అంటే అంతే సంగతి పార్టీ దారుణంగా ఓడిపోయినా నాలుగేళ్ల నుంచి రూరల్ లో పార్టీని బలోపేతం చేస్తున్న తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా.. గిరిధర్ రెడ్డిని ఎలా తీసుకుంటారని చంద్రబాబు నాయుడు, లోకేష్ పై అజీజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇదే విషయాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. పార్ఠీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర దగ్గర ప్రస్తావించారట. అయితే కోటంరెడ్డి సోదరుల రాక తమకు కూడా ఇష్టం లేదని వారు బదులివ్వడంతో అజీజ్ కు ఏం చెయ్యాలో అర్దం కాక సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. కోటంరెడ్డి అధికారాన్ని ఉపయోగించి.. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతిసారి.. అజీజ్ వారికి అండగా నిలిచేవారు. కొంతకాలం క్రితమే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీతో టచ్‌లోకి వెళ్లారు. వైసీపీ నుంచి టిక్కెట్ రాదని భావించిన ఆయన.. పచ్చ బ్యాచ్ తో చేతులు కలిపారు.. ప్రభుత్వం మీదే అనవసర విమర్శలు చేసి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేశారని తేలడంతో శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పాపం.. బలిపశువు మరో నాలుగు నెలల్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా పార్టీలో చేరుతారని.. ముందుగా తన తమ్ముడ్ని టీడీపీలోకి పంపారని రూరల్ లో చర్చ నడుస్తోంది. శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరితే తనకు ఎమ్మెల్యే సీటు రాదని భావిస్తున్న అజీజ్.. అన్నదమ్ముల రాకను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఉన్న తనకు మాట కూడా చెప్పకుండా.. గిరిధర్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారట. గిరిధర్ రెడ్డికి సహాయ నిరాకరణ చేద్దామని.. తన అనుచరులతో చెబుతున్నారట. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
ఎలక్ట్రిక్ డక్ట్‌లో షార్ట్ సర్క్యూట్.. స్వప్నలోక్ అగ్నిప్రమాదానికి కారణమిదే..
సాక్షి, హైదరాబాద్/రామ్‌గోపాల్‌పేట: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదానికి ఎలక్ట్రిక్ వైర్లకు సంబంధించిన డక్ట్‌లో షార్ట్ సర్క్యూటే కారణమని అగి్నమాపక శాఖ అధికారులు తేల్చారు. ఈ మంటలు ఐదో ఫ్లోర్లో బయటకు వచ్చి ఆరు, ఏడు ఆంతస్తులకు వ్యాపించినట్లుగా ఆధారాలు లభించాయి. ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురూ ఒకే కార్యాలయంలో పని చేస్తున్నారని, మంటలకు భయపడి బయటకు రాలేక ప్రాణాలు పోగొట్టుకున్నారని నిర్ధారించారు. శుక్రవారం పోలీసులు, క్లూస్‌టీమ్స్ కాంప్లెక్స్‌లో తనిఖీలు చేసి ఆధారాలు సేకరించాయి. అగి్నమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. డక్ట్ నుంచి పైకి వ్యాప్తి.. ఎలక్ట్రిక్ వైర్ల డక్ట్‌లో మొదలైన మంటలు నాలుగో ఫ్లోర్ వరకు లోలోపలే విస్తరించాయి. ఐదో ఫ్లోర్లో డక్ట్ తెరిచి ఉండటంతో పక్కనే ఉన్న ఫ్లాట్ నం.510, 511ల్లో ఉన్న కేడియా ఇన్ఫోటెక్ లిమిటెడ్ అండ్ వికాస్ పేపర్ ఫ్లెక్సో ప్యాకింగ్ లిమిటెడ్, క్యూ నెట్–విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిలెడ్ సంస్థలకు వ్యాపించాయి. ఆరు, ఏడు అంతస్తులకూ ఎగబాకాయి. ఇది దాదాపు రాత్రి 7.15 గంటల సమయంలో చోటు చేసుకుంది. క్యూ నెట్ కార్యాలయం నుంచి ఉద్యోగులు, టెలికాలర్లు ప్రతి రోజూ సాయంత్రం 6–7 గంటల ప్రాంతంలో వెళ్లిపోతారు. ఆ తర్వాత టీమ్ లీడర్లతో పాటు కొందరు మాత్రమే ఉంటారు. గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగే సమయానికి అందులో దయాకర్, శ్రావణ్, పవన్ (రెస్క్యూ అయ్యారు)లతో పాటు శివ, త్రివేణి, వెన్నెల, ప్రమీల, శ్రావణి, ప్రశాంత్ (అసువులు బాశారు) ఉన్నారు. రాత్రి 7.30 గంటల కు కార్యాలయంలోకి పొగ రావడాన్ని గమనించిన మొదటి ముగ్గురూ వెనుక వైపు ఉన్న కిటికీ పగులకొట్టుకుని సజ్జపైకి దిగారు. అక్కడ నుంచే తమ ఉనికిని కింద ఉన్న అగి్నమాపక, డీఆర్ఎఫ్ అధికారులకు తెలియజేసి ప్రాణాలు దక్కించుకున్నారు. భయంతో బయటకు రాలేక.. మిగిలిన ఆరుగురూ భయంతో కార్యాలయం లోపలకు వరకు వెళ్లిపోయారు. దీనికి సమీపంలో ఉన్న ఒమెగా సంస్థను నిర్వహించే సు«దీర్‌రెడ్డి ఈ విషయం గమనించారు. ధైర్యం చేసిన ఆయన క్యూనెట్ వరకు వెళ్లి అందులో ఉన్న వారిని తనతో రావాల్సిందిగా కోరారు. నలుగురు యువతులు ఆయనతో కలిసి కాస్త ముందుకు వచి్చనా.. అక్కడ దట్టమైన పొగ చూసి భయపడి మళ్లీ తమ కార్యాలయంలోకి వెళ్లిపోయారు. సు«దీర్ మాత్రం భవనం బీ బ్లాక్ ముందు వైపునకు చేరుకుని అక్కడున్న ఖాళీ ప్రదేశంలో, పొగ ప్రభావం ఏమాత్రం లేనిచోట నిలబడ్డారు. సెల్ఫోన్లో లైట్ వెలిగించడం ద్వారా సహాయక సిబ్బంది గుర్తించేలా చేసి బయటపడ్డారు. క్యూ నెట్ కార్యాలయంలో ఉన్న నలుగురు యువతుల్లో ముగ్గురు బాత్రూమ్లోకి వెళ్లి పొగ రాకూడదనే ఉద్దేశంతో తలుపు వేసుకున్నారు. మరో యువతితో పాటు ఇద్దరు యువకులు ఆ సమీపంలోని గదిలో వేర్వేరు చోట్ల ఉండిపోయారు. అలా అక్కడే ఆగిపోయిన ఆరుగురు పొగ పీల్చుకోవడం వల్లే మరణించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్టెయిర్‌కేస్ గ్రిల్స్‌కు తాళం వేయడం వల్లే.. ఈ కాంప్లెక్స్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలు కావట్లేదని, పైపులు ఉన్నా పని చేయట్లేదని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇటీవలే నోటీసులు జారీ చేశామన్నారు. కాంప్లెక్స్‌కు లిఫ్ట్‌లు ఉండటంతో ఐదో అంతస్తులో ఫ్లోర్‌కు, మెట్లకు మధ్య ఉన్న ఇనుప గ్రిల్స్‌ను లాక్ చేసి ఉంచడం, అక్కడ సామాను పెట్టుకోవడం కూడా ఆరుగురు మృతి చెందడానికి ఓ కారణమైందన్నారు. ఇకపై కాంప్లెక్సుల్లో గ్రిల్స్‌కు ఇలా తాళాలు వేసి ఉంటే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. పలు సెక్షన్ల కింద కేసు అగి్నప్రమాదంపై కాంప్లెక్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మహంకాళి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్వప్నలోక్ సూర్యకిరణ్ ఎస్టాబ్లి‹Ùమెంట్ అసోసియేషన్, కేడియా ఇన్ఫోటెక్ లిమిటెడ్ అండ్ వికాస్ పేపర్ ఫ్లెక్సో ప్యాకింగ్ లిమిటెడ్, క్యూ నెట్–విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిలెడ్ సంస్థలపై ఐపీసీలోని 304 పార్ట్ 2, 324, 420 సెక్షన్లతో పాటు పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 9 (బి) కింద కేసు పెట్టిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆరు మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబీకులకు అప్పగించారు. క్యూ నెట్ వ్యవహారాలపై పూర్తిస్థాయి దర్యాప్తు స్వప్నలోక్‌లో అగ్ని ప్రమాదం క్యూ–నెట్ దందాను మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ ఘటనలో చనిపోయిన ఆరుగురూ ఈ సంస్థలో పనిచేస్తున్న వారిగా తేలింది. అయితే ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే విక్రయించడం పేరుతో క్యూ నెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు తెరలేపడంపై గతంలో సీఐడీ సహా అనేక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఇటీవలే మళ్లీ ఈ సంస్థ తమ కార్యకలాపాలు ప్రారంభించిందని, ప్రచారం కోసం సెలబ్రెటీలను వినియోగించుకుంటోందని ఈ స్కామ్‌ను వెలుగులోకి తెచి్చన సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ ట్వీట్ చేయడం గమనార్హం. కాగా ప్రమాదానికి సంబంధించి క్యూ నెట్‌పైనా కేసు నమోదైన నేపథ్యంలో దీని వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని మహంకాళి పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. పేలుడు పదార్థాల చట్టం మొదటిసారి.. స్వప్నలోక్‌లో అగ్నిప్రమాదంపై మహంకాళి పోలీసులు ఐపీసీ 420తో పాటు పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశారు. అగి్నప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో ఇలాంటి సెక్షన్లు జోడించడం ఇదే ప్రథమం. అనుమతి లేకుండా గ్యాస్ సిలిండర్లు కలిగి ఉండటం, బాణసంచా నిల్వ చేయడం, పేలుడు పదార్థాలు, రసాయనాలు దాచి ఉంచడం వంటి వాటి వల్లా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోనూ ఇలాంటివి అక్రమంగా నిల్వ చేస్తే మోసం చేసినట్లే. ఈ కారణంగానే ఐపీసీ సెక్షన్ 420తో పాటు పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్‌ను జోడించారు. ఈ కాంప్లెక్స్‌లో అనేక కార్యాలయాలతో పాటు గోదాములు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీతో పాటు క్లూస్ టీమ్ ఇచ్చే నివేదిక ఆధారంగా కేసులో తదుపరి చర్యలు తీసుకోనున్నారు. చదవండి: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. -
Bruce Lee: నమ్మిందే బ్రూస్లీ ప్రాణం తీసిందా?
మార్షల్ ఆర్ట్స్.. ఈ పేరు వినగానే కళ్ల ముందర మెదిలే రూపం బ్రూస్ లీ. తరాలు మారుతున్న మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తికనబరిచే యువతకు ఆయనే ఆదర్శం. ఒకవైపు డిష్యుం.. డిష్యుంలతో పాటు నటుడిగానూ అశేష అభిమానులను సంపాదించుకున్నారాయన. అయితే.. కేవలం 32 ఏళ్ల వయసులోనే చనిపోయి.. అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టేసి వెళ్లిపోయారు. ఆ టైంలో ఆయన మరణంపై రకరకాల ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. కానీ, మెదడు వాపు కారణంగానే ఆయన చనిపోయారని వైద్యులు ఆ టైంలో ప్రకటించారు. అయితే.. ఇప్పుడు సుమారు యాభై ఏళ్ల తర్వాత ఆయన మరణానికి కారణం చర్చలోకి వచ్చింది. మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్లీ మరణంపై తాజాగా మరో ప్రకటనపై చేశారు పరిశోధకులు. అదీ ఓ అధ్యయనం నిర్వహించి మరీ!. 1973 జులైలో సెరెబ్రల్ ఎడిమా అనే వ్యాధితో బ్రూస్లీ మరణించినట్లు ఆయన్ని పరిశీలించిన వైద్యులు ప్రకటించారు. సెరెబ్రల్ ఎడిమా అంటే మెదడు వాపు. పెయిన్‌కిల్లర్స్ అతిగా వినియోగించడం వల్ల మెదడు కణాలు వాపు ఎక్కినట్లు వైద్యులు భావించారు. కానీ.. బ్రూస్లీ మరణం వెనుక.. మంచి నీళ్లు ఉన్నాయన్నది ఇప్పుడు స్పెయిన్ సైంటిస్టులు చెప్తున్న మాట. అవును.. అతిగా నీళ్లు తాగడం వల్లే బ్రూస్లీ మరణించారని స్పెయిన్ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం నిర్వహించి మరీ ప్రకటించారు. హైపోనాట్రేమియా.. అతిగా నీరు తాగడం వల్ల శరీరంలో అవసరానికి మించిన సోడియం స్థాయిలు కరిగిపోతాయి. ఈ స్థితి వల్లే బ్రూస్లీ సెరెబ్రల్ ఎడిమా బారిన పడినట్లు స్పెయిన్ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనం ద్వారా వెల్లడించారు. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల సోడియం లెవల్స్ తగ్గిపోయి.. శరీరంలోని కణాలు, ముఖ్యంగా మెదడులో కణాలు వాపు చెందుతాయి. అదే బ్రూస్లీ మరణానికి దారితీసి ఉంటుందని ఇప్పుడు స్పెయిన్ సైంటిస్టులు చెప్తున్నారు. ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవడం, గంజాయి లాంటి మాదకద్రవ్యాల వల్ల అతిగా దాహం వేయడం, ఆల్కహాల్ అలవాట్లతో అధిక నీటిని బయటకు పంపించే సామర్థ్యాన్ని కిడ్నీలు కోల్పోవడం వంటివి ఈ పరిస్థితికి దారితీస్తాయని స్పెయిన్ సైంటిస్టుల అధ్యయనం వెల్లడించింది. నీరు ఎక్కువగా తాగడం ముప్పే! బీ వాటర్ మై ఫ్రెండ్.. బ్రూస్ లీ తరపున విపరీతంగా వైరల్ అయ్యే కోట్ ఇది. పలు పుస్తకాల్లోనూ ఈ ప్రస్తావన ఉంటుంది. రోజూవారీ జీవితంలో ఆయన మంచి నీటికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు వాటిని చదివితే తెలుస్తుంది. అంతేకాదు.. ఓ మనిషి మంచి నీటిలా బతకాలంటూ ఆయన పేరు మీద ఓ ఫిలాసఫీ కూడా ప్రచారంలో ఉంది. కానీ, అంతలా నమ్మిన మంచి నీరే ఆయన ప్రాణం తీయడం ఇక్కడ విశేషం. అయితే అందుకు ‘అతి’ ప్రధాన కారణం అయ్యింది. నీరు అధికంగా తీసుకోవడం వల్ల మరణం సంభవిస్తుందా? అవును.. అలాంటి కేసులు మెడికల్ హిస్టరీలో బోలెడు నమోదు అయ్యాయి. చాలా ఎక్కువ నీటి వినియోగం ఇంట్రాక్రానియల్ ఒత్తిడిని (ICP)కి కారణం అవుతుంది. ఇది రకరకాల లక్షణాలకు, ఒక్కోసారి పరిస్థితులు తిరగబడి ప్రాణాల మీదకు కూడా తీసుకొస్తుంది. అసలు ఎంత తాగాలి.. ఒక వ్యక్తి తన మూత్రపిండాలు(కిడ్నీల) మూత్రం ద్వారా తొలగించగల దానికంటే ఎక్కువ నీటిని తీసుకుంటే 'ఓవర్‌హైడ్రేషన్' 'వాటర్ ఇంటాక్సికేషన్' సంభవిస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. హైపోనాట్రేమియా, సెరిబ్రల్ ఎడెమా సందర్భాల్లో ఒక్కోసారి అధికంగా నీరు తీసుకున్న గంటలో కూడా మరణం సంభవించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎంత నీరు తీసుకోవాలి?.. కొందరు రెండు, కొందరు మూడు, కొందరు ఐదు లీటర్లు అంటూ చెప్తుంటారు. కానీ, శాస్త్రీయంగా దీనికంటూ ఓ పరిమితి లేదు. కానీ, గంటలో లీటర్ లోపు నీటిని మాత్రమే తీసుకోవాలని కొన్నిసార్లు సూచిస్తుంటారు వైద్య నిపుణులు. తద్వారా కిడ్నీలపై ఒత్తిడి ఉండదని చెప్తున్నారు. అంతేకాదు.. అతిగా నీటిని తీసుకోవడం మూలంగా మానసిక అనారోగ్యం కూడా సంభవించవచ్చని చెప్తున్నారు. -
గజియాబాద్ పేలుడు ఘటన.. టీవీలు పేలడానికి ప్రధాన కారణాలు ఏవో తెలుసా!
ఇటీవల ఎలక్ట్రిక్ బైకులు, స్మార్ట్ఫోన్లు పేలిన ఘటనలను చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఈ ప్రమాదాల కారణంగా కొందరు తీవ్రంగా గాయపడగా, ఇంకొందరి ప్రాణాలు కూడా పోయాయి. తాజాగా గజియాబాద్‌లో టీవీ పేలి ఓ టీనేజర్ మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఎలక్ట్రిక్ పరికరాల వాడడంపై కాకుండా సురక్షితం ఎలా వాడాలో తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా టీవీలు పేలడం అరుదుగా జరిగే ఘటనలే అయినప్పటికీ ప్రమాద తీవ్రత భారీ స్థాయిలో ఉంటుందని గజియాబాద్ సంఘటన చెప్తోంది. ఈ నేపథ్యంలో వీటి పేలుడుకి ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. గజియాబాద్ ఘటనలో టీవి పేలుడు ధాటికి దెబ్బతిన్న ఇంటి గోడ ఎల్ఈడీ టీవీలు పేలడానికి గల కారణాలు ఇవే! ఎల్ఈడీ టీవీలు పేలడానికి రకరకాల కారణాలున్నాయి. టీవీలో ఉండే కెపాసిటర్లు వల్ల పేలుడు సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే కెపాసిటర్ అంటే విద్యుత్ శక్తిని నిల్వ చేసుకుని.. బ్యాటరీలా పని చేస్తుంది. టీవీ ఆపరేట్ చేయడానికి, అవసరమైన సమయంలో స్టాండ్‌బై మోడ్‌లో ఉండటానికి అవసరమైన కొద్దిపాటి శక్తిని నిల్వ చేస్తుంది. అయితే క్వాలిటీ కెపాసిటర్ వాడడం వల్ల, లేదా టీవీలోని కెపాసిటర్లు పాతవి కావడం వల్లే పేలుళ్లు సంభవిస్తాయి. అయితే గజియాబాద్ పేలుడు ఇంత తీవ్రస్థాయిలో ఉండడానికి గది వాతావరణం కూడా కారణమై ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓవర్ హీటింగ్ ఎలక్ట్రికల్ డివైజ్‌లు చాలా వరకు అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు లేదా పేలుడుకు గురవుతాయి. టీవీలను ఎక్కువసేపు ఉపయోగించినప్పుడు లేదా చాలా పరికరాలను టీవీలకు కనెక్ట్ చేసి వాడుతున్న సమయంలో అవి సులభంగా వేడెక్కుతుంది. ఈ క్రమంలో వేడెక్కిన పరికారాలు వాటి పరిమితి దాటిన వెంటనే పేలుడికి దారితీస్తాయి. అకస్మాత్తుగా వోల్టేజ్లో మార్పు.. భారత్ వంటి దేశాలలో టీవీ పేలుడు సంభవించడానికి ప్రధాన కారణాలలో ఒకటి విద్యుత్ లేదా వోల్టేజ్లో ఆకస్మిక పెరుగుదల కూడా ఒకటి. దీనినే మరో రకంగా పవర్ సర్జ్ అని కూడా అంటాం. తప్పుడు వైరింగ్ ఉన్న ప్రాంతాల్లో ఇది జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఆకస్మిక విద్యుత్ పెరుగుదల నుంచి డివైజ్ డ్యామేజ్ కాకుండా సురక్షితంగా ఉంచేందుకు కంపెనీలు టీవీలో అనేక పరికారలను ఏర్పాటు చేస్తాయి. తద్వారా ఆది ఆకస్మిక వోల్టేజ్ పెరుగుదలను తట్టుకోగలదు, అయినప్పటికీ, అవి కూడా కొన్నిసార్లు విఫలమయ్యే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. అందుకే ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షాల సమయంలో టీవీలను ఆఫ్ చేయమని చెబుతుంటారు. చదవండి: బ్యాంక్ కస్టమర్లకు వార్నింగ్.. ఆ యాప్‌లు ఉంటే మీ ఖాతా ఖాళీ,డిలీట్ చేసేయండి!