ఆనందం కలిగినప్పుడు ఎవరైనా నవ్వుతుండటం సహజమే. ఆ ఆనందం కాస్త ఎక్కువైనప్పుడు పగలబడి నవ్వుతుండటం కూడా చూసేవుంటాం. కొన్ని సినిమాల్లో నవ్వుతూ చనిపోయే పాత్రలు కూడా కనిపిస్తాయి. వీటిని చూసినప్పుడు నిజజీవితంలో కూడా ఇలా జరుగుతుందా? అనే అనుమానం కలుగుతుంది. అవును.. ఇది నిజమే.. నిజజీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇది వినడానికి అతిశయోక్తిగానే అనిపించవచ్చు. కానీ ముమ్మాటికీ నిజం. ఆపకుండా నవ్వడం చావుకు ఎలా కారణమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నవ్వుతున్నవారిలో కొన్ని విచిత్రమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అతిగా నవ్వడం వలన మరణం సంభవించడమనేది చాలా అరుదుగా జరిగే ఘటన. దీనికి సంబంధించి కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘటన తొలిసారిదని చెబుతారు. ఇది క్రీస్తుపూర్వం మూడవ శతాబ్ధంలో చోటుకుందని చెబుతారు. Chrysippus అనే గ్రీకు తత్వవేత్త మరణం 2 కారణాలుగా జరిగిందని చెబుతారు. దానిలో మొదటిది అతను అధికంగా మద్యం తాగడం వలన సంభవించిందని అంటారు.
ఇక రెండవ అంశానికి వస్తే.. అతను ఒక గాడిదకు ఏదో తినిపించేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు అతను వ్యంగ్యంగా ‘ఇప్పుడు గాడిదకు మద్యం తాగిపించాలి’ అని అనుకుంటూ పెద్దపెట్టున నవ్వుతూ చనిపోయాడని చెబుతారు. నేటి ఆధునిక కాలంలోనూ ఇటువంటి ఘటన కనిపిస్తుంది. 1975లో అలెక్సా మిషెల్ అనే బ్రిటీషర్ ‘ది గాడీస్’ అనే పాపులర్ కామెడీ చూస్తున్నాడు. ఈ సమయంలో అతను ఆపకుండా 30 నిముషాల పాటు నవ్వుతూనే ఉన్నాడు. తరువాత నేలకు ఒరిగిపోయాడు. ఇదేవిధంగా 2003లో థాయిల్యాండ్‌కు చెందిన ఒక ఐస్‌క్రీమ్ ట్రక్ డ్రైవర్ నిద్రలో పెద్దపెట్టున నవ్వసాగాడు. అతని పక్కనే పడుకున్న అతని భార్య అతనిని లేపేందుకు ప్రయత్నించింది.
అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతని ప్రాణం పోయింది. మనదేశంలోనూ ఇటువంటి ఘటన జరిగింది. 2013లో మహారాష్ట్రలో 22 ఏళ్ల ఒక యువకుడు మంగేష్ బోగల్ తన స్నేహితునితోపాటు ‘గ్రాండ్ మస్తీ’ అనే కామెడీ సినిమాకు వెళ్లాడు. సినిమా చూస్తూ గట్టిగా నవ్వుతూ గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటన గురించి అతని పక్కన కూర్చున్నవారు మాట్లాడుతూ మంగేష్ సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాడన్నారు. ఈ కారణంగానే అతనికి గుండెపోటు వచ్చిందని తెలిపారు. కాగా అతనిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.
నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిశీలనగా చూస్తే ఈ ఉదంతాల్లో అతిగా నవ్వడం వలన వారు మృతి చెందలేదు. ఈ సంఘటనల్లో నవ్వుతున్నప్పుడు వారికి శ్వాసలో ఇబ్బంది ఏర్పడటమో లేక గుండెపోటు రావడమో జరిగి మరణించారు. నిజానికి నవ్వడం అనేది ఆరోగ్య లక్షణం. వైద్యులు కూడా నవ్వుతూ ఉండాలని అందరికీ సలహా ఇస్తుంటారు. నవ్వుతుండటం వలన మన శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతుంటారు.
అయితే మన శరీరంలో నిరంతరం అంతర్గత అవయవాల కార్యకలాపాలు జరుగుతుంటాయి. గట్టిగా ఎక్కువసేపు నవ్వడం వలన కొందరికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరికైనా గట్టిగా నవ్వుతున్నప్పుడు శారీకరంగా ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment