స్థూలకాయంతో బాధపడుతున్నవారితో పాటు, బరువు పెరిగిపోతున్నామనే భయంతో కొందరు రకరకాల వెయిట్ లాస్ ప్రక్రియలను అనుసరిస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చయినా వెనుకాడకుండా భరిస్తున్నారు. అయితే వెయిట్ లాస్ వ్యామోహం పెంచుకున్న కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
శరీర బరువు తగ్గాలనే తపనలో 21 ఏళ్ల యువతి తన ప్రాణాలు పోగొట్టుకుంది. ఆమె 90 కిలోల బరువు తగ్గాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకోసం తీసుకునే ఆహారపానీయాలను ఒక్కసారిగా తగ్గించేసింది. ఖాళీ కడుపుతో వర్క్ అవుట్ చేస్తున్న సమయంలో ఆమె ఆనారోగ్యం పాలయ్యింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన చైనాలోని షాంక్సీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
షాంఘై మార్నింగ్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం చైనా సోషల్ మీడియాలో కుయ్‌హువా అనే యువతి ఎంతో ఆదరణ దక్కించుకుంది. ఆమెకు వేలమంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. గత శనివారం ఆమె వర్క్ అవుట్ చేస్తున్న సమయంలో మృతి చెందింది. ఆమె తల్లిదండ్రులు ఈ విషయాన్ని వెల్లడించారు.
డౌయిన్(చైనా టిక్‌టాక్ వెర్షన్)లో ఆమె తల్లిదండ్రులు ఇలా రాశారు... ‘ మా అమ్మాయి ఇక లేదు. మీరందరూ అందించిన ప్రేమ, మద్దతుకు అభినందనలు. ప్లీజ్ మీరంతా ఇలా చేయకండి’ అని రాశారు. కుయ్‌హువా తల్లిదండ్రులు తమ కుమార్తె మృతికి గల కారణాలు వెల్లడించలేదు. అయితే వర్క్ అవుట్ తరువాతనే ఇలా జరిగిందని తెలిపారు.
స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కుయ్‌హువా భారీ కాయంతో బాధపడుతోంది. దీంతో 90 కిలోల వరకూ బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆమె ఒక ఫిట్‌నెస్ క్యాంపులో చేరింది. అక్కడ ఆమె ప్రతిరోజూ వర్క్ అవుట్ చేస్తూ వస్తోంది. కఠినమైన డైటింగ్ ఫాలో అయ్యేది. త్వరగా బరువు తగ్గించుకోవాలనే తపనతో ఆహారాన్ని పూర్తిగా మానేసేందుకు కూడా ప్రయత్నించింది. ఈ నేపధ్యంలో ఆమె 25 కిలోల వరకూ బరువు తగ్గింది.
ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలియజేసింది. అలాగే పలు ఫొటోలను కూడా షేర్ చేసింది. రాబోయే 6 నెలల్లో మరో 10 కిలోల బరువు తగ్గాలను కుంటున్నట్లు తెలియజేసింది. అయితే ఈ టార్గెట్ పూర్తయ్యేలోగానే ఆమె కన్నుమూసింది. కుయ్‌హువా ఇటీవలి కాలంలో షేర్ చేసిన ఫోటోలలో వర్క్ అవుట్‌కి సంబంధించిన ఫొటోలే అధికంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆమె మృతికి సంబంధించిన వార్త వైరల్ అవుతుండగా, ఆమె బరువు తగ్గేందుకు అవలంబించిన విధానం సరైనదేనా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: రూ. 500 చొప్పున పిల్లల కొనుగోలు.. 18 గంటల వెట్టి చాకిరీ..
Comments
Please login to add a commentAdd a comment