
నలంద: బీహార్‌లోని నలంద జిల్లాలోగల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కలుషిత నీరు తాగి ఒక బాలిక మృతి చెందగా, 9 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మృతిచెందిన బాలిక పాఠశాల విద్యార్థిని కాదని, పాఠశాలలోని తన స్నేహితురాలిని కలిసేందుకు వచ్చిందని నలంద జిల్లా అధికారులు చెబుతున్నారు. కలుషిత నీరు తాగి అనారోగ్యం బారినపడిన మరో 9 మంది బాలికలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా నీటి నమూనాను అధికారులు పరీక్షల నిమిత్తం పంపారు.
నలంద జిల్లా మేజిస్ట్రేట్ శశాంక్ శుభాంకర్ మంగళవారం మాట్లాడుతూ పాఠశాల ఆవరణలోని ఆర్‌ఓ సిస్టమ్ దగ్గర నీటిని తాగిన కొంతమంది బాలికలు వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారన్నారు. వెంటనే వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించామమన్నారు. అయితే చికిత్స పొందుతూ ఓ బాలిక మృతి చెందిందని తెలిపారు. అస్వస్థతకు గురైన తొమ్మిది మంది విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. పాఠశాలలోని ఆర్‌ఓ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం లేదని తమ దృష్టికి వచ్చిందని, దానిలోని నీటి నమూనాలను టెస్టింగ్ కోసం పంపించామన్నారు. పాఠశాల వార్డెన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అతన్నిఅధికారులు సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment