
పార్లమెంటులో స్టార్మర్ ప్రకటన
ముగింపు సుదూరం: జెలెన్‌స్కీ
అత్యంత చెత్త మాటలు: ట్రంప్
లండన్/కీవ్/వాషింగ్టన్: అమెరికాకు బదులుగా ఇకపై ప్రపంచ పెద్దన్న పాత్రను పోషించేందుకు బ్రిటన్ సిద్ధమవుతున్నట్టు కన్పిస్తోంది. రష్యాతో ఘర్షణకు తెర దించి ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఇక బ్రిటన్ సారథ్యం వహిస్తుందని ఆ దేశ ప్రధాని కియర్ స్టార్మర్ ప్రకటించారు. అందుకోసం అవసరమైతే ఉక్రెయిన్‌కు సైనికంగా, ఆర్థికంగానే గాక అన్నివిధాలా దన్నుగా నిలుస్తామని పునరుద్ఘాటించారు.
‘‘ఈ ప్రయత్నాల్లో ఇతర దేశాలనూ కలుపుకుని సాగుతాం. ఇందుకు అమెరికా చాలా కీలకం’’ అని చెప్పారు. ఉక్రెయిన్ విషయమై స్టార్మర్ చొరవ తీసుకుని మరీ ఆదివారం యూరప్ దేశాలతో లండన్‌లో అత్యవసర భేటీ నిర్వహించడం తెలిసిందే. అందులో చర్చించిన అంశాలను సోమవారం ఆయన పార్లమెంటుకు వివరించారు. ఈ విషయంలో స్టార్మర్‌కు విపక్ష కన్జర్వేటివ్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించడం విశేషం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ వాగ్యుద్ధం ఇబ్బందికర పరిణామాలకు దారి తీసిందని స్టార్మర్ అన్నారు. అగ్ర రాజ్యంతో పటిష్టమైన సంబంధాలు బ్రిటన్‌కు చాలా ముఖ్యమని చెప్పారు.
అమెరికా భరించబోదు
రష్యాతో ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కనుచూపు మేరలో కన్పించడం లేదంటూ జెలెన్‌స్కీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ఆ దిశగా ఒప్పందం ఇప్పటికైతే సుదూరంలోనే ఉందన్నారు. వీటిపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘జెలెన్‌స్కీ చేసిన అత్యంత పనికిమాలిన ప్రకటన బహుశా ఇదే! ఆయనను అమెరికా ఇక ఎంతమాత్రమూ భరించబోదు’’ అని స్పష్టం చేశారు. ‘‘జెలెన్‌స్కీకి కావాల్సింది శాంతి కాదని మొదటినుంచీ చెప్తూనే ఉన్నా. అదే నిజమని మరోసారి తేలింది. అలాంటి వ్యక్తికి యూరప్ దేశాల సంఘీభావమా? అవి అసలు ఏమనుకుంటున్నాయి?’’ అంటూ మండిపడ్డారు. జెలెన్‌స్కీతో ట్రంప్ వాగ్యుద్ధం యాదృచ్ఛికమేమీ కాదని, పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని జర్మనీ కాబోయే చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ అనుమానం వెలిబుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment