ఉక్రెయిన్‌కు భారీ షాక్‌.. ట్రంప్‌ సంచలన నిర్ణయం | USA Donald Trump Pauses Military Aid To Ukraine | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌కు భారీ షాక్‌.. ట్రంప్‌ సంచలన నిర్ణయం

Published Tue, Mar 4 2025 7:20 AM | Last Updated on Tue, Mar 4 2025 9:33 AM

USA Donald Trump Pauses Military Aid To Ukraine

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా (Russia)తో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు షాకిస్తూ అమెరికా నుంచి అందే మిలటరీ సాయాన్ని నిలిపివేశారు. జెలెన్‌స్కీ ఖనిజాల ఒప్పందంపై అంగీకరించని నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది.

డొనాల్డ్‌ ట్రంప్‌ తనదైనా పంథాలో ముందుకు సాగుతున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ఎవరు ఉన్న వారిపై ఆంక్షలు, టారిఫ్‌లు విధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌తో చర్చలు విఫలమైన నేపథ్యంలో జెలెన్‌స్కీకి ట్రంప్‌ ఊహించని షాకిచ్చారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న సైనిక, ఆర్థిక సహాయాన్ని నిలిపివేశారు. తాజా నిర్ణయంలో పైప్‌లైన్‌లో ఉన్న కోటి డాలర్ల విలువైన సైనిక పరికరాల అప్పగింత నిలిచిపోయింది. ఈ మేరకు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ శాంతిస్థాపనపై దృష్టిసారించారు. అమెరికా భాగస్వాములు కూడా ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. మేము మా సాయాన్ని నిలిపివేస్తున్నాం. ఇది ఒక పరిష్కారాన్ని చూపిస్తోందని అనుకుంటున్నాం. రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్‌ అంగీకరించాలనే ఉద్దేశ్యంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల ఖనిజాల ఒప్పందంపై చర్చించడానికి ట్రంప్‌, జెలెన్‌స్కీ వైట్‌హౌస్‌ వేదికగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాడీవేడి చర్చ జరిగింది. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్‌స్కీ ఒత్తిడి చేశారు. దీంతో, ట్రంప్‌ విరుచుకుపడ్డారు. సాయం అందించిన అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్‌ తీరు మూడో ప్రపంచ యుద్దానికి దారి తీస్తుందని హెచ్చరించారు. శాంతి ఒప్పందం చేసుకోవడం జెలెన్‌స్కీకి ఇష్టం లేదంటూ విమర్శలు గుప్పించారు. ఈ చర్చలు కాస్తా రసాభాసగా మారడంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్‌స్కీ వైట్‌హౌస్‌ నుంచి వెళ్లిపోయారు. 
 

మరోవైపు.. జెలెన్‌ స్కీ తాజాగా కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అమెరికాతో ఖనిజాల ఒప్పందం కుదుర్చుకోవడానికి ఉక్రెయిన్‌ సిద్ధంగా ఉందని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. వాళ్లు సరేనంటే ఇప్పటికిప్పుడు ఒప్పందంపై సంతకాలు చేస్తానన్నారు. గతంలో జరిగిన వాటిని కొనసాగించాలన్నది మా విధానం. మేం నిర్మాణాత్మకంగా ఉన్నాం. అదే సమయంలో కొన్ని విషయాలను విశ్లేషించాల్సిందే. ఉక్రెయిన్‌ వైఖరి వినాలి. అది మాకు చాలా ముఖ్యం. అమెరికాతో మా సంబంధాలు కొనసాగుతాయని అనుకుంటున్నా. ఉక్రెయిన్‌ ప్రపంచంలో అతి పెద్ద దేశం కాకపోవచ్చు. కానీ తన స్వాతంత్య్రం కోసం అది చేస్తున్న పోరాటాన్ని అంతా చూస్తున్నారు. అమెరికా నుంచి ఏ అనుమానాలకూ తావు లేకుండా సాయం కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఎందుకంటే మాకు సాయం నిలిపివేత అంతిమంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మాత్రమే ఉపయోగపడుతుంది. అమెరికా, ఇతర ప్రపంచ ప్రతినిధులు పుతిన్‌కు అలాంటి సాయం చేయరని అనుకుంటున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement