- వెలుగు చూస్తున్న వాస్తవాలు
- కేసును పక్కదారి పట్టించేందుకే డ్రామా
- బ్లాక్ మనీ వ్యవహారమే అసలు కారణం
- కీలకంకానున్న కాల్‌డేటా
చోరీ బూటకం?
Published Tue, Jan 24 2017 11:46 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
మామిడికుదురు :
వజ్రాల పేరిట కళ్లల్లో కారం కొట్టి రూ.15 లక్షలు చోరీ చేశారంటూ ఈ నెల 20న విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేదరమట్ట శ్రీధర్ చేసిన ఫిర్యాదు బూటకం అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వ్యవహారం నుంచి కేసును పక్కదారి పట్టించేందుకే చోరీ నాటకం ఆడారన్న అనుమానాలు రోజు రోజుకు బలపడుతున్నాయి. బ్లాక్ మనీ వ్యవహారంలో వచ్చిన లుక లుకల వల్లే ఒకరిపై మరోకరు దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇచ్చేందుకు రెండు వర్గాల మధ్య ఒప్పందం కుదిరిందని, ఈ విషయంలో రెండు వర్గాలు ఒకరినొకరు మోసం చేసుకునేందుకు చేసిన ప్రయత్నమే దీని వెనుక ఉన్న అసలు
కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడం అనేది వాస్తవమని పేర్కొంటున్నారు.
రూ.15 లక్షల చోరీ, వజ్రాల పేరిట మోసం అంతా అభూత కల్పన అని చెబుతున్నారు. ముక్కూ, మొహం తెలియని, పది రోజుల క్రితమే పరిచయమైన పాస్టర్ రాజు మాటలు నమ్మి వచ్చి మోస పోయామని చెబుతున్న దానిలో వాస్తవం ఎంత! అసలు అంత డబ్బు వారికి ఎక్కడి నుంచి వచ్చింది! అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డబ్బు తీసుకుని ముగ్గురు రాగా వారిలో ఒక్కడే నిందితుల కూడా వెళ్లి డబ్బు పొగొట్టుకున్నానని చెప్పడం వంటి ప్రశ్నల్లో వీడని చిక్కుముడులు ఎన్నో ఉన్నాయి. వీటికి పోలీసులు సమాధానాలు రాబట్టాల్సి ఉంది.
దీంతో పాటు 19వ తేదీనే విజయవాడ నుంచి వచ్చిన వారు 20వ తేదీన తాము వచ్చామని చెప్పడంలో ఆంతర్యం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయవాడ నుంచి వచ్చిన వారు అమలాపురం లాడ్జిలో 19వ తేదీ రాత్రి బస చేశారని చెబుతున్నారు. లాడ్జి అద్దె చెల్లింపులో రెండు వర్గాల మధ్య వివాదం జరిగిందని ప్రచారం జరుగుతోంది. రెండు వర్గాల్లో ఎవరి వద్ద డబ్బులు లేకుండానే ఒకరినొకరు నమ్మించి, మోసం చేసే ప్రయత్నం చేశారని, పాత నోట్లు తీసుకుని ఉడాయించాలని ఒక వర్గం, కొత్త నోట్లు తీసుకుని పరారు కావాలని మరో వర్గం భావించిందని చెబుతున్నారు.
ఈ ప్రయత్నంలోనే రెండు వర్గాల మధ్య కారంతో దాడి, అనంతరం ఘర్షణ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. ఇవే కారణాలా! లేక ఇతర విషయాలు ఏమైనా దీని వెనుక ఉన్నాయా! అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేయాల్సి ఉంది. ఈ కేసు విచారణలో రెండు వర్గాలకు చెందిన వ్యక్తుల కాల్‌డేటా కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ చోరీ సంఘటనపై నగరం ఎస్‌ఐ జి.వెంకటేశ్వరరావును మంగళవారం వివరణ కోరగా అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి తీసుకు వస్తాయన్నారు.
Advertisement
Advertisement