జయలలితను ఎందుకు ఖననం చేశారు?
న్యూఢిల్లీ: లక్షలాది అభిమానులను శోకసంద్రంలో వదిలేసి దిగంతాలకు నిష్ర్కమించిన జయలలితకు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు జరిగినప్పటికీ ఒక ప్రశ్న మిగిలే ఉంది. ఐయ్యంగార్ బ్రాహ్మణ హిందూ కుటుంబానికి చెందిన ఆమెకు దహన సంస్కరణలను నిర్వహించకుండా ఎందుకు ఖననం చేశారన్నదే ఆ ప్రశ్న. అందుకు పలు కారణాలు ఉన్నాయి.
1. పెరియార్ రామస్వామి, అన్నా దురై, ఎంజీ రామచంద్రన్ లాంటి ప్రముఖ నాయకులందరిని మెరీనా బీచ్ ఒడ్డునే గంధపుచెక్కలు, పవిత్ర జలాలతో ఖననం చేశారు. కనుక జయలలిత విషయంలోనూ అదే చేశారు.
2. ఖననం చేసిన చోట వారి పేరిట స్మారక భవనాన్ని నిర్మించే అవకాశం ఉంటుంది. అందులో సమాధిని సందర్శించుకొని అభిమానులు తమ ప్రియతమ నాయకురాలిని గుర్తుచేసుకునే అవకాశం కలుగుతుంది.
3. దహన సంస్కారం చేయాలంటే సమీప బంధువులు ఉండాలి. వారే చితికి నిప్పంటించాల్సి ఉంటుంది. జయలలిత అన్న జయ కుమార్ కూతురు దీపా జయకుమార్ గత సెప్టెంబర్ నెల నుంచి పలుసార్లు ఆపోలో ఆస్పత్రికి వచ్చి చికిత్సపొందుతున్న జయలలితను కలసుకునేందుకు ప్రయత్నించారు. ఓసారి భర్తతో వచ్చిన ఆమెను తమిళనాడు పోలీసులు అపోలో ఆస్పత్రి గేట్ నుంచి బలవంతంగా బయటకు పంపించారు.
4. జయలలితకు వారసురాలిగా దీపా జయకుమార్ ఎక్కడ ముందుకు వస్తారన్న ముందుచూపుతో ఆమెను శశికళనే బయటకు పంపించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే అంత్యక్రియలకు కూడా వారిని అనుమతించలేదు. శశికళ, ఆమె కుటుంబ సభ్యులే భౌతిక దేహం వద్ద నిరంతరం ఉండడమే కాకుండా ఆమె ఆధ్వర్యంలోనే అంత్యక్రియలు ముగిశాయి.