పెళ్లెందుకు రద్దు చేసుకున్నానంటే...
పెళ్లెందుకు రద్దు చేసుకున్నానంటే..! అంటూ సుదీర్ఘ కాలం తరువాత నటి త్రిష నోరు విప్పారు. గతేడాది ఈ అమ్మడి పెళ్లి సంగతులు పుంఖానుపుంఖాలుగా ప్రచారమయ్యాయి. వాటిలో కలకలం రేపిన అంశాలే అధికం అని చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే త్రిష సినీ వయసు 17 ఏళ్లు అని చెప్పకతప్పదు.1999లో నటి సిమ్రాన్ కథానాయకిగా నటించిన జోడి చిత్రంలో ఆమెకు స్నేహితురాలిగా చిన్న పాత్రలో కనిపించారు. ఆ తరువాత సుమారు మూడేళ్లకు లేసా లేసా చిత్రంలో కథానాయకిగా అవకాశం సంపాదించారు. ఆపై వరుసగా అవకాశాలు తలుపు తట్టడంతో కెరీర్ పరంగా ఎలాంటి బెంగ పెట్టుకోవలసిన అవసరం త్రిషకు రాలేదు. విశ్వనటుడు కమలహాసన్, విజయ్, అజిత్, శింబు నుంచి గణేశ్ వెంకట్రామన్ వరకూ వరుస పెట్టి నటించేస్తున్నారు.
అదే విధంగా తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జునల నుంచి సిద్ధార్ధ్‌ల వరకూ జత కట్టేశారు. నాయకిగా దశాబ్దంన్నరకు చేరువవుతున్న త్రిష నేటికీ కథానాయకిగానే రాణించడం విశేషమే అవుతుంది. ఇటీవల ధనుష్‌తో కలిసి కొడి చిత్రంలో నటించారు. అందులో రాజకీయనాయకురాలిగా ప్రేమికుడిని అంతం చేసే ప్రతినాయకిగా చక్కని అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటున్నారు. కాగా ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం మోహినిలో నటిస్తున్నారు. తదుపరి విక్రమ్‌తో సామి 2లో రొమాన్‌స చేయడానికి సిద్ధం అవుతున్నారు. అదే విధంగా యువ నటుడు విజయ్‌సేతుపతికి జంటగా నటించడానికి రెడీ అవుతున్నారు. ఇలా నటిగా ఎవర్‌గ్రీన్ నాయకిగా వెలిగిపోతున్న త్రిష వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూస్తే పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తాయి.
టాలీవుడ్ యువ నటుడు రానాతో చెట్టాపట్టాల్ అంటూ త్రిష గురించి పెద్ద దుమారమే చెలరేగింది. అయితే రానాతో తనది మంచి స్నేహబంధమే అని ఈ చెన్నై చిన్నది స్పష్టం చేయడంతో ఆ దుమారానికి తెర పడింది. కాగా గత ఏడాది జనవరిలో వ్యాపార వేత్త, సినీ నిర్మాత వరుణ్‌మణియన్‌తో త్రిష పెళ్లి నిశ్చయమైంది.వారి వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక వివాహమే తరువాయి అన్నకున్న తరుణంలో త్రిష, వరుణ్‌మణియన్‌ల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. పెళ్లి రద్దయింది. దీనికి కారణాలంటూ అనధికారంగా పలు విషయాలు మీడియాలో హల్‌చల్ చేసినా, నటి త్రిష మాత్రం స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించలేదు.అయితే మళ్లీ నటించడం ప్రారంభించారు.
అలాంటిది ఇన్నాళ్లకు ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న త్రిషను తన వివాహం గురించి విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ తాను ఇంతకు ముందు పెళ్లిని ఎందుకు రద్దు చేసుకున్నానంటే ..! సినిమానే తన జీవితం. సినిమాను వదిలి ఉండలేను. అంతగా సినిమాను ఇష్టపడుతున్నాను. చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉండాలని ఆశిస్తున్నాను అని అన్నారు. వివాహానంతరం కూడా సినిమాకు దూరంగా ఉండలేను. ఒక వేళ పెళ్లికి తరువాత సినిమాకు దూరం అవ్వాల్సి వస్తే అన్న ప్రశ్న తనలో తలెత్తింది. సినిమాను వదిలి ఉండడం తన వల్ల కాదని భావంచడంతో పెళ్లి రద్దు చేసుకున్నాను అని బదులిచ్చారు. ఇప్పటికీ తనకు కథానాయకిగా అవకాశాలు వస్తున్నాయని భవిష్యత్తులో హీరోయిన్ అవకాశాలు రాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానైనా కొనసాగుతానని త్రిష పేర్కొన్నారు.