
మోదీ ఇజ్రాయెల్ తోనే ఎందుకు పోల్చారో తెలుసా?
ప్రతి ఒక్కరూ భారత సైన్య పరాక్రమాల గురించి మాట్లాడుకుంటున్నారని మధ్యప్రదేశ్ మండీలోని పరివర్తన్ ర్యాలీలో భారత సైన్యాన్ని ఇజ్రాయెల్ సైన్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోల్చారు. గతంలో ఇజ్రాయెల్ సైన్య పరాక్రమాల గురించి ఇలా మాట్లాడుకునే వారని మోదీ చెప్పారు. ఇజ్రాయెల్ తో భారత సైన్య పరాక్రమాన్ని పోల్చడం వెనుక పెద్ద కారణమే ఉంది.
బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం పొందిన తర్వాత దేశ సార్వభౌమత్వాన్ని, ఏకత్వాన్ని రక్షించడమే థ్యేయంగా 1948లో ఇజ్రాయెల్ రక్షణ దళం(ఐడీఎఫ్) ఏర్పడింది. మిగిలిన దేశాల రక్షణ దళాలతో పోల్చితే ఇజ్రాయెల్ దళాలు వేరు ఎందుకంటే ఆ దేశ రక్షణ దళాల ప్రభావం దేశ సామాజిక వ్యవస్ధపై ఎక్కువగా ఉంటుంది.
ఇజ్రాయెల్ దళాల విరోచిత పోరాటాలు:
ఆపరేషన్ ఎజ్రా, నెహెమియా: 1950-52ల మధ్య కాలంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ ఆపరేషన్ ను చేపట్టింది. ఇరాక్ లో చిక్కుకుపోయిన లక్షా ఇరవై వేల మంది జూస్ జాతీయులను(ఇజ్రాయిలీలు) ఆకాశమార్గం ద్వారా ఇజ్రాయెల్ కు తీసుకురావడం ఈ ఆపరేషన్ లక్ష్యం. ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా అవతరించడంతో ఇరాక్ లో నివసిస్తున్న జూస్ లపై ఆ దేశం ఆంక్షలు విధించింది. ఈ ఆపరేషన్ విజయసాధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జూస్ లను ఇజ్రాయెల్ తిరిగి తమ దేశానికి తీసుకువెళ్లింది.
ఆరు రోజుల యుద్ధం: సరిహద్దు దేశాలైన ఈజిప్టు, జోర్డాన్, సిరియాలతో ఇజ్రాయెల్ 1967 జూన్ 5 నుంచి 10 వరకూ యుద్ధం చేసింది. ఇజ్రాయెల్ సరిహద్దు ఈజిప్టు పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తుండటంతో ఇజ్రాయెల్ ముందస్తు దాడులు నిర్వహించింది. ఈ దాడి లో ఈజిప్టు ఎయిర్ ఫోర్స్ సర్వం కోల్పోయింది.
ఆపరేషన్ ఎంటెబ్బే: ఇజ్రాయెల్ పాసింజర్లతో వెళ్తున్న ఓ ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని 1976 జూన్ లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ది పాలస్తీన్ ఎక్స్ టర్నల్ ఆపరేషన్స్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు హైజాక్ చేశారు. ఉగండాలోని ఎంటెబ్బెలో విమానాన్ని ఉంచారు. దీంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం వెంటనే 100 మంది కమాండోలను రవాణా విమానాల ద్వారా ఉగండాకు పంపింది. కేవలం 90 నిమిషాల వ్యవధిలో కమాండోలు 102మంది ఇజ్రాయెల్ పౌరులను రక్షించారు. ఈ ఆపరేషన్ లో హైజాకర్లను, ఉగండాకు చెందిన కొందరు సైనికులను ఇజ్రాయెల్ కమాండోలు మట్టుపెట్టారు.
ఆపరేషన్ మోసెస్: 1984లో సూడాన్ లో కనివిని ఎరుగని రీతిలో కరువు వచ్చింది. ఆ దేశంలో నివసిస్తున్న ఇథియోపియన్ జూస్ జాతీయులను ఇజ్రాయెల్ బలగాలు రక్షించాయి. దాదాపు ఏడు వారాల పాటు సాగిన ఈ ఆపరేషన్ లో ఎనిమిది వేల మందికి పైగా జ్యూలను బలగాలు ఆకాశమార్గం ద్వారా స్వదేశానికి చేర్చాయి.
ఆపరేషన్ ఢిఫెన్సీవ్ షీల్డ్: 2002 మార్చి నుంచి మే నెలల మధ్య కాలంలో పశ్చిమాన ఉన్న పాలస్తీనా పట్టణాలు, గ్రామాల్లో ఇజ్రాయెల్ బలగాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ను నిర్వహించాయి. ఇజ్రాయెల్ లో పాలస్తీనాకు చెందిన వారు మానవబాంబు దాడికి పాల్పడం వల్ల ఇజ్రాయెల్ దళాలు ఈ ఆపరేషన్ ను చేపట్టాయి. కాగా, ఈ దాడుల్లో ఇజ్రాయెల్ దళాలు టెర్రరిస్టు స్ధావరాలపై విధ్వంసం సృష్టించినట్లు రిపోర్టులు వచ్చాయి.
ఇజ్రాయెల్ దళాల గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు:
1. స్వతంత్రం పొందిన అతి కొద్ది కాలంలోనే 20కు పైగా యుద్ధాల్లో పాల్గొన్న దేశం ఇజ్రాయెల్. ప్రపంచంలోనే ఎక్కువ యుద్ధాలను ఎదుర్కొన్న దళంగా ఇజ్రాయెల్ ఆర్మీ ఐడీఎఫ్ కు పేరుంది.
2. మిగిలిన ఆర్మీలతో పోల్చితే సామాజిక వ్యవస్ధపై ఇజ్రాయెల్ ఆర్మీ ప్రభావం ఎక్కువ. పౌరులకు విద్యనందించడంలో కూడా ఐడీఎఫ్ తన వంతు పాత్రను పోషిస్తోంది. ఇందుకుగాను 1965లో ఇజ్రాయెల్ అవార్డ్ ఫర్ కంట్రిబ్యూషన్ టూ ఎడ్యుకేషన్ కూడా ఐడీఎఫ్ ను వరించింది.
3. దేశ సంరక్షణ కోసం ఇజ్రాయెల్ తయారీదారులు సొంతంగా మిలటరీ ఆయుధాలను తయారుచేస్తారు.
4.ఐడీఎఫ్ చేరేందుకు స్త్రీ, పురుషులకు కచ్చితంగా 18 ఏళ్ల వయసు ఉండాలి. ఎంపికైన వారికి ఆర్మీ ట్రెయినింగ్ ఇస్తూ ఉంటుంది. అత్యవసర సమయాల్లో వీరిని రంగంలోకి దించుతుంది.
5. రక్షణ సంబంధిత వ్యవహారాల్లో ఇజ్రాయెల్ కు అమెరికాతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇరు దేశాలు మధ్య ఆసియా దేశాల్లో భద్రతపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసుకుంటాయి.