Kargil Vijay Diwas 2021: Great Victory Of Indian Army Over Pakistan On July 26 - Sakshi
Sakshi News home page

Vijay Diwas : కార్గిల్‌ వీరులారా... అందుకోండి వందనాలు

Published Sun, Jul 25 2021 4:52 PM | Last Updated on Mon, Jul 26 2021 10:23 AM

Kargil Vijay Diwas 2021 A Great Victory Of Indian Army Against Pakistan - Sakshi

దాయాది దేశం పాకిస్తాన్‌ కన్ను ఎప్పుడూ కశ్మీర్‌ మీదే. ఏదో వంకతో స్థానిక యువతను రెచ్చగొడుతూ దేశంలో అలజడి సృష్టిస్తూనే ఉంది. అలాంటి ప్రయత్నమే 1999లో కూడా చేసింది. అయితే ఈ సారి ఉగ్రవాదులతో పాక్‌ ఆర్మీ చేతులు కలిపింది. సహాజ నిబంధనలు ఉల్లంఘించి నియంత్రణ రేఖ దాటి వచ్చి మన ఆర్మీపై దాడికి తెగబడింది. ఇండియన్‌​ ఆర్మీ ధీటుగా స్పందించింది. ఆపరేషన్‌ విజయ్‌ పేరుతో పాక్‌కు బుద్ధి చెప్పింది. 


పశువులు తినేందుకు పచ్చిక కూడా కనిపించనంతగా హియలయాలపై మంచు దుప్పటి పేరుకుపోయింది. తన గొర్రెలను మేపేందుకు పర్వత లోయల్లోకి వెళ్లాడు తాశి నామ్‌గ్యాల్‌. జనసంచారం ఉండని ఆ ప్రాంతంలో పఠాన్‌ దుస్తుల్లో కొందరు వ్యక్తులు రాళ్లతో మంచులో ఏదో పని చేస్తుండటం కనిపించింది. జాగ్రత్తగా గమనిస్తే వారి దుస్తుల్లో ఆయుధాలు కనిపించాయి. క్షణం ఆలస్యం చేయలేదు తాశి నామ్‌గ్యాల్‌. వెంటనే భారత ఆర్మీకి విషయం చేరవేశాడు. ఆ రోజు 1999 మే 2.

తీవ్రమైన దాడులు
నామ్‌గ్యాల్‌ ఇచ్చిన సమాచారంతో పర్వతాల్లోకి వెళ్లిన ఇండియన్‌ ఆర్మీ ట్రూప్‌పై అనుమానిత వ్యక్తులు దాడి చేశారు. ఐదుగురు భారత సైనికులను పట్టుకుని చంపేశారు. ఊహించని విధంగా జరిగిన దాడితో భారత ఆర్మీ మొదటి  తీవ్రంగా నష్టపోయింది. పాక్‌ దళాల సాయంతో టెర్రరిస్టులు చేసిన దాడిలో కార్గిల్‌ ఆయుధగారం ధ్వంసమైంది. మన ఆర్మీ తేరుకునే లోపే  ద్రాస్‌, కక్సర్‌, ముస్తో సెక్టార్లలో  శత్రువులు  తిష్ట వేశారనే సమాచారం అందింది. 

తూటాలు కాచుకుంటూ
దొంగచాటుగా పాక్‌ ఆర్మీ కొండల పైకి  చేరుకుని బంకర్లు నిర్మించుకోవడంతో ఈ పోరాటంలో తొలుత భారత సైనికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పై నుంచి పాక్‌ సైనికులు, టెర్రరిస్టులు తేలికగా దాడి చేస్తూ తూటాలు, బాంబుల వర్షం కురిసిస్తుండగా.. వాటిని కాచుకుంటూ మన సైనికులు వీరోచితంగా పోరాటం చేయాల్సి వచ్చింది. దీంతో 26న వాయుసేన రంగంలోకి దించింది ఇండియా ప్రభుత్వం.  మొదటి వారంలోనే రెండు మిగ్‌ విమానాలు, ఒక ఆర్మీ హెలికాప్టర్‌లను మన ఆర్మీ నష్టపోయింది. రోజులు గడుస్తున్నా... రణ క్షేత్రంలో భారత దళాలలకు పట్టు దొరకడం లేదు. దాడి చేస్తున్నది పాకిస్తానే అని తెలిసినా సరైన ఆధారాలు లభించడం లేదు.

పాక్‌ హస్తం
జూన్‌ 5వ తేదిన ముగ్గురు పాక్‌ సైనికులు భారత భద్రతా దళాలకు చిక్కారు. దీంతో ఈ దాడిలో పాకిస్తాన్‌ హస్తం ఉందని స్పష్టంగా తేలిపోయింది. అప్పటి వరకు కార్గిల్‌లో స్థానికులు సైన్యంపై  తిరుగుబాటు చేస్తున్నారంటూ చెబుతూ వచ్చిన పాక్‌ నోటికి తాళం పడింది. పొరుగు దేశం కుట్రలు బయట పడటంతో భారత్‌ పూర్తి స్థాయి యుద్ధానికి రెడీ అయ్యింది. పాక్‌ ఆర్మీ, , టెర్రరిస్టుల ఆధీనంలోకి వెళ్లిన  భూభాగాలను తిరిగి చేజిక్కించుకునేందుకు ఆపరేషన్‌ విజయ్‌ని ప్రకటించింది. 

టైగర్‌ హిల్స్‌
కార్గిల్‌ చొరబాటులో కీలకమైన ప్రాంతం టైగర్‌ హిల్స్‌. వాటిపై తిష్ట వేసిన పాక్‌ దళాలు భౌగోళిక పరిస్థితులు ఆసరాగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. భారత దళాలు జూన్‌ 29న టైగర్‌ హిల్స్‌ పర్వత పాదాల వద్దకు చేరుకున్నాయి. యుద్ధంలో కీలక ఘట్టం మొదలైంది. వారం రోజుల పాటు హోరాహోరీ పోరు జరిగింది. జులై 4వ తేదిన కీలకమైన టైగర్‌ హిల్స్‌ని భారత్‌ స్వాధీనం చేసుకుంది. దీంతో పాక్‌ ఆర్మీకి దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. తెలుగు వాడైన మేజర్‌ పద్మఫణి ఆచార్య ఈ యుద్ధ క్షేత్రంలోనే నేలకొరిగారు. 

తరిమి కొట్టారు
టైగర్‌ హిల్స్‌ చేజిక్కిన తర్వాత భారత దళాలకు ఎదురే లేకుండా పోయింది. నియంత్రణ రేఖ దాటి చొరబాటు దారులు ఆక్రమించుకున్న స్థలాలను వేగంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే ఇటు రణక్షేత్రం, అటు అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ ఏకాకిగా నిలిచింది. ముషారఫ్‌ కుట్రలు, కుతంత్రాలు పారలేదు. అతని అండతో అతిక్రమణకు పాల్పడిన ఆర్మీ, టెర్రరిస్టులు తోక ముడిచారు. జులై 14 నాటికి అన్ని శత్రు మూకలను తరిమి కొట్టారు. పాక్‌తో చర్చల అనంతరం జులై 26న అధికారికంగా యుద్ధాన్ని ముగిసినట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది.  

ముషారఫ్‌ కుయుక్తి
పాకిస్తాన్‌లో ప్రధానులెక్కువగా కీలుబొమ్మలే అయ్యారు. ఆర్మీ అధికారులే నిజమైన అధికారం చెలాయించారు. పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కి చెప్పకుండా అప్పటీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ కశ్మీర్‌పై కుయుక్తి పన్నాడు. దొంగచాటుకా భారత భూభాగంలోకి తన సైన్యాన్ని పంపించాడు.

చలికాలంలో
హిమాలయాల్లో దట్టంగా మంచు పేరుకుపోయే కాలంలో పర్వత శ్రేణుల నుంచి ఇరు దేశాల భద్రతా దళాలు వెనక్కి వస్తాయి. చాన్నాళ్లుగా ఇదే పద్దతి అమలవుతోంది. అయితే దీన్ని తుంగలో తొక్కి భారత దళాలు గస్తీలో లేని సమయం చూసి ముషారఫ్‌ ఆదేశాలతో పాక్‌ ఆర్మీతో కూడిన టెర్రరిస్టు మూకలు పాక్‌ గుండా భారత భూభాగంలో అడుగుపెట్టి కీలక స్థావరాలను ఆక్రమించుకున్నారు. ఫలితంగా యుద్ధం అనివార్యమైంది.

అమరులు
దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో భారత్‌ వైపు 527 మంది జవాన్లు అమరులయ్యారు. పాకిస్తాన్‌ వైపు 453 మంది వరకు చనిపోయినట్టు సమాచారం. ఈ చొరబాట్లలో పాకిస్తాన్‌కి చెందిన స్పెషల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌, నార్తర్న్‌ లైట్‌ఇన్‌ఫాంట్రీ చెందిన సైనికులు పాల్గొన్నట్టు తేలింది. వీరికి కశ్మీరీ తీవ్రవాదులు, ఆఫ్ఘానిస్థాన్‌కి చెందిన కిరాయి ముకలు సహాకరించినట్టు తేలింది. 

విజయ్‌ దివాస్‌
కార్గిల్ విజయ దినోత్సవాన్ని ప్రతీ ఏటా  జూలై 26న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో దేశ ప్రధాని హోదాలో నరేంద్రమోదీ పాల్గొని అమర జవానులకు నివాళులు అర్పిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో ప్రజలు సైతం సైనికుల త్యాగాలకు గుర్తుగా క్యాండిల్స్‌ వెలిగించి నివాళులు అర్పించడం రివాజు. 
- సాక్షి , వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement