indo pak war
-
శెబ్బాష్ తాశి: పాక్ ఖేల్ ఖతం
దాయాది దేశం పాకిస్తాన్ కన్ను ఎప్పుడూ కశ్మీర్ మీదే. ఏదో వంకతో స్థానిక యువతను రెచ్చగొడుతూ దేశంలో అలజడి సృష్టిస్తూనే ఉంది. అలాంటి ప్రయత్నమే 1999లో కూడా చేసింది. అయితే ఈ సారి ఉగ్రవాదులతో పాక్ ఆర్మీ చేతులు కలిపింది. సహాజ నిబంధనలు ఉల్లంఘించి నియంత్రణ రేఖ దాటి వచ్చి మన ఆర్మీపై దాడికి తెగబడింది. ఇండియన్ ఆర్మీ ధీటుగా స్పందించింది. ఆపరేషన్ విజయ్ పేరుతో పాక్‌కు బుద్ధి చెప్పింది. పశువులు తినేందుకు పచ్చిక కూడా కనిపించనంతగా హియలయాలపై మంచు దుప్పటి పేరుకుపోయింది. తన గొర్రెలను మేపేందుకు పర్వత లోయల్లోకి వెళ్లాడు తాశి నామ్‌గ్యాల్. జనసంచారం ఉండని ఆ ప్రాంతంలో పఠాన్ దుస్తుల్లో కొందరు వ్యక్తులు రాళ్లతో మంచులో ఏదో పని చేస్తుండటం కనిపించింది. జాగ్రత్తగా గమనిస్తే వారి దుస్తుల్లో ఆయుధాలు కనిపించాయి. క్షణం ఆలస్యం చేయలేదు తాశి నామ్‌గ్యాల్. వెంటనే భారత ఆర్మీకి విషయం చేరవేశాడు. ఆ రోజు 1999 మే 2. తీవ్రమైన దాడులు నామ్‌గ్యాల్ ఇచ్చిన సమాచారంతో పర్వతాల్లోకి వెళ్లిన ఇండియన్ ఆర్మీ ట్రూప్‌పై అనుమానిత వ్యక్తులు దాడి చేశారు. ఐదుగురు భారత సైనికులను పట్టుకుని చంపేశారు. ఊహించని విధంగా జరిగిన దాడితో భారత ఆర్మీ మొదటి తీవ్రంగా నష్టపోయింది. పాక్ దళాల సాయంతో టెర్రరిస్టులు చేసిన దాడిలో కార్గిల్ ఆయుధగారం ధ్వంసమైంది. మన ఆర్మీ తేరుకునే లోపే ద్రాస్, కక్సర్, ముస్తో సెక్టార్లలో శత్రువులు తిష్ట వేశారనే సమాచారం అందింది. తూటాలు కాచుకుంటూ దొంగచాటుగా పాక్ ఆర్మీ కొండల పైకి చేరుకుని బంకర్లు నిర్మించుకోవడంతో ఈ పోరాటంలో తొలుత భారత సైనికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పై నుంచి పాక్ సైనికులు, టెర్రరిస్టులు తేలికగా దాడి చేస్తూ తూటాలు, బాంబుల వర్షం కురిసిస్తుండగా.. వాటిని కాచుకుంటూ మన సైనికులు వీరోచితంగా పోరాటం చేయాల్సి వచ్చింది. దీంతో 26న వాయుసేన రంగంలోకి దించింది ఇండియా ప్రభుత్వం. మొదటి వారంలోనే రెండు మిగ్ విమానాలు, ఒక ఆర్మీ హెలికాప్టర్లను మన ఆర్మీ నష్టపోయింది. రోజులు గడుస్తున్నా... రణ క్షేత్రంలో భారత దళాలలకు పట్టు దొరకడం లేదు. దాడి చేస్తున్నది పాకిస్తానే అని తెలిసినా సరైన ఆధారాలు లభించడం లేదు. పాక్ హస్తం జూన్ 5వ తేదిన ముగ్గురు పాక్ సైనికులు భారత భద్రతా దళాలకు చిక్కారు. దీంతో ఈ దాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని స్పష్టంగా తేలిపోయింది. అప్పటి వరకు కార్గిల్‌లో స్థానికులు సైన్యంపై తిరుగుబాటు చేస్తున్నారంటూ చెబుతూ వచ్చిన పాక్ నోటికి తాళం పడింది. పొరుగు దేశం కుట్రలు బయట పడటంతో భారత్ పూర్తి స్థాయి యుద్ధానికి రెడీ అయ్యింది. పాక్ ఆర్మీ, , టెర్రరిస్టుల ఆధీనంలోకి వెళ్లిన భూభాగాలను తిరిగి చేజిక్కించుకునేందుకు ఆపరేషన్ విజయ్‌ని ప్రకటించింది. టైగర్ హిల్స్ కార్గిల్ చొరబాటులో కీలకమైన ప్రాంతం టైగర్ హిల్స్. వాటిపై తిష్ట వేసిన పాక్ దళాలు భౌగోళిక పరిస్థితులు ఆసరాగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. భారత దళాలు జూన్ 29న టైగర్ హిల్స్ పర్వత పాదాల వద్దకు చేరుకున్నాయి. యుద్ధంలో కీలక ఘట్టం మొదలైంది. వారం రోజుల పాటు హోరాహోరీ పోరు జరిగింది. జులై 4వ తేదిన కీలకమైన టైగర్ హిల్స్‌ని భారత్ స్వాధీనం చేసుకుంది. దీంతో పాక్ ఆర్మీకి దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. తెలుగు వాడైన మేజర్ పద్మఫణి ఆచార్య ఈ యుద్ధ క్షేత్రంలోనే నేలకొరిగారు. తరిమి కొట్టారు టైగర్ హిల్స్ చేజిక్కిన తర్వాత భారత దళాలకు ఎదురే లేకుండా పోయింది. నియంత్రణ రేఖ దాటి చొరబాటు దారులు ఆక్రమించుకున్న స్థలాలను వేగంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే ఇటు రణక్షేత్రం, అటు అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఏకాకిగా నిలిచింది. ముషారఫ్ కుట్రలు, కుతంత్రాలు పారలేదు. అతని అండతో అతిక్రమణకు పాల్పడిన ఆర్మీ, టెర్రరిస్టులు తోక ముడిచారు. జులై 14 నాటికి అన్ని శత్రు మూకలను తరిమి కొట్టారు. పాక్‌తో చర్చల అనంతరం జులై 26న అధికారికంగా యుద్ధాన్ని ముగిసినట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. ముషారఫ్ కుయుక్తి పాకిస్తాన్లో ప్రధానులెక్కువగా కీలుబొమ్మలే అయ్యారు. ఆర్మీ అధికారులే నిజమైన అధికారం చెలాయించారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కి చెప్పకుండా అప్పటీ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ కశ్మీర్‌పై కుయుక్తి పన్నాడు. దొంగచాటుకా భారత భూభాగంలోకి తన సైన్యాన్ని పంపించాడు. చలికాలంలో హిమాలయాల్లో దట్టంగా మంచు పేరుకుపోయే కాలంలో పర్వత శ్రేణుల నుంచి ఇరు దేశాల భద్రతా దళాలు వెనక్కి వస్తాయి. చాన్నాళ్లుగా ఇదే పద్దతి అమలవుతోంది. అయితే దీన్ని తుంగలో తొక్కి భారత దళాలు గస్తీలో లేని సమయం చూసి ముషారఫ్ ఆదేశాలతో పాక్ ఆర్మీతో కూడిన టెర్రరిస్టు మూకలు పాక్ గుండా భారత భూభాగంలో అడుగుపెట్టి కీలక స్థావరాలను ఆక్రమించుకున్నారు. ఫలితంగా యుద్ధం అనివార్యమైంది. అమరులు దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో భారత్ వైపు 527 మంది జవాన్లు అమరులయ్యారు. పాకిస్తాన్ వైపు 453 మంది వరకు చనిపోయినట్టు సమాచారం. ఈ చొరబాట్లలో పాకిస్తాన్‌కి చెందిన స్పెషల్ సర్వీసెస్ గ్రూప్, నార్తర్న్ లైట్‌ఇన్‌ఫాంట్రీ చెందిన సైనికులు పాల్గొన్నట్టు తేలింది. వీరికి కశ్మీరీ తీవ్రవాదులు, ఆఫ్ఘానిస్థాన్‌కి చెందిన కిరాయి ముకలు సహాకరించినట్టు తేలింది. విజయ్ దివాస్ కార్గిల్ విజయ దినోత్సవాన్ని ప్రతీ ఏటా జూలై 26న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో దేశ ప్రధాని హోదాలో నరేంద్రమోదీ పాల్గొని అమర జవానులకు నివాళులు అర్పిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో ప్రజలు సైతం సైనికుల త్యాగాలకు గుర్తుగా క్యాండిల్స్ వెలిగించి నివాళులు అర్పించడం రివాజు. - సాక్షి , వెబ్‌డెస్క్ -
భారత్ మాకు నిజమైన మిత్రదేశం...
న్యూఢిల్లీ: భారత్ తమకు నిజమైన మిత్ర దేశమని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో తమకు అండగా నిలిచిన భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తూర్పు పాకిస్తాన్ నుంచి విడిపోయి సొంతంగా దేశాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో బంగ్లాదేశ్‌కు భారత్ పూర్తి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 1971లో ఇండో- పాక్ యుద్ధం మొదలైంది. ఇందులో భారత్ విజయం సాధించడంతో బంగ్లాదేశ్ స్వతంత్ర్య దేశంగా అవతరించింది. ఈ చారిత్రాత్మక ఘటన జరిగి బుధవారానికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లా ప్రధాన మంత్రి షేక్ హసీనా గురువారం వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ హసీనా మాట్లాడుతూ.. స్వాత్రంత్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించారు. అదే విధంగా తమకు అండగా నిలబడిన భారత జవాన్లు, వారి కుటుంబాలకు ధన్యవాదాలు తెలిపారు. తమ జాతి స్వేచ్ఛా పోరాటంలో సహకరించిన భారత ప్రభుత్వం, ప్రజల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నారు. (చదవండి: ఆ 54 మంది సైనికులు ఏమయ్యారు?) ఇక ఇందుకు ప్రధాని మోదీ బదులిస్తూ.. బంగ్లాదేశ్ వ్యతిరేక శక్తులపై గెలుపొందిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ విజయ్ దివస్ జరుపుకోవడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. భారత విదేశాంగ విధానానికి సంబంధించి బంగ్లా కీలక పొరుగు దేశం అని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది తన బంగ్లాదేశ్ పర్యటనను ఉద్దేశించి తనకు ఆహ్వానం పలికినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఇది తనకు దక్కిన గౌరవం అన్నారు. కాగా ఈ వర్చువల్ సమావేశంలో భాగంగా భారత్- బంగ్లాదేశ్ ఏడు అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
పాకిస్తాన్ మెడలు వంచిన భారత ఆర్మీ
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌కు స్వేచ్ఛ ప్రసాదించిన ఇండో-పాక్ యుద్ధానికి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది డిసెంబర్ 16న విజయ్ దివాస్ పేరుతో పాకిస్తాన్‌పై భారత్ సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటాము. ఇక చరిత్రలో ఈనాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏఏ ఖాన్ నియాజీతో సహా 93 వేల మంది పాక్ సైనికులు భారత దళాల ఎదుట బేషరతుగా లొంగిపోయారు. దాంతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అలాగే నాటి ఇండో-పాక్ యుద్ధంలో మరణించిన సైనికులకు దేశం ఘనంగా నివాళులర్పిస్తోంది. ఇదిలా ఉండగా భారత దేశం బెంగాలీ ముస్లింలు, హిందువులకు మద్దతుగా నిలవడంతో పాక్, ఇండియాల మధ్య డిసెంబర్ 3, 1971న యుద్ధం ప్రారంభమయ్యింది. 13 రోజుల పాటు ఏకధాటిగా సాగిన యుద్ధం పాక్ ఆర్మీ చీఫ్, సైన్యం భారత దళాల ముందు బేషరుతుగా లొంగిపోవడంతో ముగిసింది. ఇది పాక్ మీద భారత ఆర్మీ సాధించిన అతి గొప్ప చారిత్రక విజయాల్లో ఒకటిగా నిలిచింది. యుద్ధానికి తక్షణ కారణం... తూర్పు పాకిస్తాన్ నుంచి విడిపోయి సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని 1971 మార్చి 26న బంగ్లాదేశ్ పిలుపునిచ్చింది. ఆ తరువాతి రోజు వారి స్వాతంత్ర్య పోరాటానికి భారతదేశం పూర్తి మద్దతు ప్రకటించింది. అప్పట్లో పాకిస్తాన్ మిలటరీ బెంగాలీలపై, ప్రధానంగా హిందువులపై ఎన్నో దారుణాలకు పాల్పడింది. దీంతో సుమారు 10 మిలియన్ల మంది ప్రజలు మన దేశానికి వలస వచ్చారు. బెంగాలీ శరణార్థులను భారత్ ఆహ్వానించింది. (చదవండి: 11 గంటల్లో 180 కి.మీ పరుగు!) ఒక్క సంతకంతో ముగింపు ఈ యుద్ధం 20 వ శతాబ్దపు అత్యంత హింసాత్మక యుద్ధాలలో ఒకటిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఈ యుద్ధంలో పాక్ సైన్యం పెద్ద ఎత్తున దురాగతాలకు పాల్పడింది. యుద్దం వల్ల 10 మిలియన్ల మంది శరణార్థులుగా మారడమే కాక.. మరో 3 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ సాయుధ దళాలకు నాయకత్వం వహిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ, డిసెంబర్ 16, 1971 న లొంగుబాటు పత్రంపై సంతకం చేయడంతో ఇండో-పాక్ యుద్ధం ముగిసింది. ఇక ఈ లిఖితపూర్వక లొంగుబాటు ఒప్పంద పత్రం బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్ ఈస్టర్న్ కమాండ్ లొంగిపోవడానికి వీలు కల్పించింది. 1971 ఇండో-పాక్ యుద్ధం ముగిసింది. ఇక ఆ సయమంలో అప్పటి భారత ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా పాక్ దళాలకు పంపిన సందేశం చరిత్రలో నిలిచిపోయింది. డిసెంబర్ 13, 1971న సామ్ మానేక్షా పాక్ దళాలను ఉద్దేశిస్తూ.. ‘లొంగిపొండి లేదంటే మిమ్మల్ని మేం నాశనం చేస్తాం’ అని హెచ్చరించారు. దాంతో పాక్ ఆర్మీ చీఫ్‌తో సహా 93 వేల మంది సైనికులు భారత్ ముందు బేషరతుగా లొంగిపోయారు. తర్వాత సిమ్లా ఒప్పందంలో భాగంగా భారత్ వారిని విడుదల చేసింది. సత్తా చాటిన త్రివిధ దళాలు పాకిస్తాన్ వైమానిక దళం మన దేశంలో వాయువ్య ప్రాంతాలపై దాడులు చేసిన తరువాత మన దేశం అధికారికంగా యుద్ధంలోకి దిగింది. ‘ఆపరేషన్ చెంగిజ్ ఖాన్’లో భాగంగా ఆగ్రా, తాజ్‌మహల్‌పై దాడులు చేసేందుకు ప్రణాళిక రచించింది. అప్పట్లో శత్రు దేశాల దృష్టిని మళ్లించేందుకు తాజ్‌మహల్‌ను ఆకులు, కొమ్మలతో కప్పివేశారు. పాకిస్తాన్‌కు ప్రతిస్పందనగా భారత వైమానిక దళం వెస్ట్రన్ ఫ్రంట్‌లో పటిష్ట ఏర్పాట్లు చేసింది. యుద్ధం ముగిసే వరకు ఐఏఎఫ్, పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ స్థావరాలపై దాడి చేస్తూనే ఉంది. ఈ యుద్దంలో ఇండియన్ నేవీ కూడా కీలక పాత్ర పోషించింది. ‘ఆపరేషన్ ట్రైడెంట్’ పేరుతో కరాచీ పోర్ట్‌పై భారత నావికాదళం డిసెంబర్ 4-5 మధ్యరాత్రి దాడి చేసింది. దీంతో పాకిస్తాన్ తమ దళాలను భారత పశ్చిమ సరిహద్దు వద్ద మోహరించింది. అప్పటికే మన సైన్యం పాక్ భూభాగంలోకి దూసుకువెళ్లింది. కొన్ని వేల కిలోమీటర్ల పాక్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ యుద్ధంలో పాకిస్తాన్‌కు చెందిన 8000 మంది సైనికులు చనిపోగా.. 25,000 మంది వరకు గాయపడ్డారు. సుమారు 3,843 మంది భారత సైనికులు మరణించారు. మరో 9,851మంది గాయపడ్డారు. -
ఢిల్లీలో అమరవీరులకు త్రివిధి దళాల నివాళి
-
స్వర్ణ విజయజ్యోతి వెలిగించిన మోదీ
ఢిల్లీ : బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం కలిగించిన 1971 ఇండో-పాక్ యుద్దానికి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. యుద్ధంలో మరణించిన జవాన్లకు సంఘీభావంగా స్వర్ణ విజయజ్యోతిని వెలిగించారు. కాగా ఈ స్వర్ణ విజయజ్యోతిని 1971 యుద్ధం తర్వాత పరమ్‌వీర్ చక్ర, మహావీర్ చక్ర పురస్కార గ్రహీత గ్రామాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రదేశాలకు తీసుకెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింఘ, చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు. కాగా ఈ ఏడాదితో భారత్ విజయానికి 50 ఏళ్ల పూర్తయిన సందర్భంగా స్వర్ణ విజయ సంవత్సరంగా పేర్కొంటూ దేశవ్యాప్తంగా వేడుకలను నిర్వహించనున్నట్లు రక్షణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 1971లో తూర్పు పాకిస్తాన్(ఇప్పటి బంగ్లాదేశ్)లో స్వతంత్రం పేరుతో మొదలైన ఇది భారత్- పాక్ యుద్దానికి తెరలేపింది. డిసెంబర్ 3 1971న మొదలైన యుద్ధం డిసెంబర్ 16న ముగిసింది. ఈ యుద్ధంలో భారత్ పాకిస్తాన్‌పై విజయం సాధించడంతో బంగ్లాదేశ్ ఏర్పడింది. యుద్ధంలో పాక్‌పై సాధించిన విజయానికి గుర్తుగా భారత ప్రభుత్వం ప్రతి ఏటా డిసెంబర్ 16ను విజయ్ దివస్ నిర్వహిస్తున్నారు. -
దటీజ్ కేఎం కరియప్ప
1965లో భారత్–పాక్ యుద్ధం చివరి రోజది. స్క్వాడ్రన్ లీడర్ కేసీ కరియప్ప సరిహద్దు సమీపంలో తన విమానాన్ని చక్కర్లు కొట్టిస్తున్నారు! అకస్మాత్తుగా ఓ పేలుడు. ఆ తర్వాత విమానం నేలకొరిగింది. కొంతసేపటి తర్వాత సరిహద్దుకు ఆవల అడవిలోంచి కరియప్ప విమాన శకలాల నుంచి బయటకి రావడం కనిపించింది. కానీ.. దురదృష్టవశాత్తూ విమానం పాక్‌వైపు పడడంతో అతడూ యుద్ధఖైదీగా పాకిస్థాన్ చేతుల్లో చిక్కారు. అచ్చంగా.. మొన్నటి మిగ్ విమానం కూలిన తర్వాత పాక్ బలగాలకు మన వింగ్ కమాండర్ అభినందన్ చిక్కినట్లే. అభినందన్ లాగే అప్పుడు కరియప్ప కూడా తన పేరు, హోదా, యూనిట్ సంఖ్య మాత్రమే చెప్పారు. మరే ఇతర వివరాలూ వెల్లడించలేదు. కరియప్ప పట్టుబడ్డ సంగతి క్షణాల్లోనే రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కేంద్రానికి చేరిపోయింది. సన్నాఫ్ కేఎం కరియప్ప! విమానం కూలిన గంటలోపే.. పాక్ అధికారులు కరియప్ప బందీగా ఉన్న సెల్ వద్దకు హడావుడిగా చేరుకున్నారు. ఆయన గురించి గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. తమకు చిక్కింది.. భారత ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప కుమారుడని వారికప్పుడే తెలిసింది. అందుకే వారిలో ఎక్కడలేని ఉత్సాహం. స్వాతంత్య్రం తర్వాత భారత త్రివిధ దళాల అధ్యక్షుడిగా నియమితుడైన భారతీయుడు ఫీల్డ్ మార్షల్ కరియప్పే. అంతేకాదు.. 1965లో పాక్ పాలకుడు, ఆర్మీ చీఫ్ జనరల్ అయూబ్ ఖాన్‌కు ఒకప్పటి బాస్ కూడా. బందీగా చిక్కింది తన పాత బాస్ కొడుకు అన్న విషయాన్ని అయూబ్ ఖాన్ స్వయంగా తన కింది అధికారులకు చెప్పాడు. జాగ్రత్తగా చూసుకోమని సూచించాడు కూడా. ఆ తరువాత ఏమైందో చిన్న కరియప్పకు అర్థంకాలేదు. ప్రతి సైనికుడూ నా కొడుకు లాంటోడే! జనరల్ అయూబ్ ఖాన్ పాక్ రేడియో ద్వారా కేసీ కరియప్ప తమ బందీగా, క్షేమంగా ఉన్నాడని ప్రకటిం చాడు. పాత బాస్ అంటే ఉన్న గౌరవభావంతో ఢిల్లీలోని పాక్ హైకమిషనర్‌ను ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప వద్దకు పంపి.. ‘మీ కొడుకు పట్టుబడ్డాడు. మీరు చెబితే విడుదల చేస్తాం’ అన్న ప్రతిపాదన చేశాడు. దీన్ని కేఎం కరియప్ప తిరస్కరించారు. ‘పట్టుకున్న ప్రతి భారతీయ సైనికుడూ.. నా కొడుకు లాంటి వాడే. అందరినీ బాగా చూసుకోవాలి’ అంటూ అయూబ్ ఖాన్‌కు సమాధానమిచ్చారు. అదీ మా నాన్నంటే : కేసీ కరియప్ప ఈ ఘటన తర్వాత కొంత కాలానికి కేసీ కరియప్ప భారత్ తిరిగి వచ్చేశారు. భారతీయు వాయుసేన హెలికాప్టర్ విభాగానికి అధిపతిగా ఎదిగారు కూడా. ఎయిర్ మార్షల్‌గా పదవీ విరమణ పొందిన కేసీ కరియప్ప.. బుధవారం నాటి ఘటన తర్వాత నాటి పరిస్థితులను మీడియాతో పంచుకున్నారు. ‘మా నాన్న ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి. తన కొడుకని, ఇతర సైనికులని తేడా ఎప్పుడూ చూపించలేదు. అందుకే తను చెబితే విడుదల చేస్తానని.. అయూబ్ ఖాన్ చెప్పినా తిరస్కరించారు. అందుకే అందరిలాగే.. నన్నూ కొంచెం సమయం తీసుకుని విడుదల చేశారు’ అని వివరించారు. తను అరెస్టు రోజే యుద్ధం ముగిసిన విషయం తనకు తెలియదని కేసీ కరియప్ప తెలిపారు. 1971 పాక్ యుద్ధంలోనూ పాల్గొన్న కేసీ కరియప్ప ప్రస్తుతం కర్ణాటకలోని కొడగు జిల్లాలోని తన పూర్వీకుల నివాసం ‘రోషనార’లో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆ యుద్దం తర్వాత తొలిసారి ఎల్వోసీ దాటి..
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు జరిపిన భారత్.. అమర జవాన్లకు ఘనమైన నివాళి అర్పించింది. పాక్ భూభాగంలోకి దుసుకెళ్లిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. నియంత్రణ రేఖను దాటి జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ క్యాంప్‌లపై బాంబుల వర్షం కురిపించి భారత్ సత్తా చాటింది. అయితే కార్గిల్ యుద్ధ సమయంలో కూడా భారత వైమానిక దళం ఎల్వోసీ దాటలేదు. 1971 ఇండో-పాక్ యుద్దం తరువాత తొలిసారి ఐఏఎఫ్.. ఎల్వోసీ దాటి దాడులు జరిపింది. 12 మిరాజ్-2000 యుద్ద విమానాలతో వెయ్యి కిలోల బాంబులను ఉగ్రస్థావరాలపై జారవిడిచింది. ఈ రోజు ఐఏఎఫ్ ఎల్వోసీ పరిసరాల్లోని చాకోటి, ముజఫరాబాద్ పాంతాలపైనా మాత్రమే కాకుండా.. పాక్ భూభాగం బాల్కోట్లోని ఉగ్రస్థావరాలపై ఐఏఎఫ్ పంజా విసిరింది. అయితే కార్గిల్ సమయంలో కూడా ఎల్వోసీ దాటని ఐఏఎఫ్.. నేడు ఉగ్రమూకలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటానికి బలమైన కారణాలే కనబడుతున్నాయి. ఉగ్రవాద సంస్థల విషయంలో పాక్ ఉదాసీనంగా వ్యవహరించడం, పుల్వామా ఉగ్రదాడిపై పాక్ వైఖరి, అంతేకాకుండా జైషే మహమ్మద్ భారత్‌లో పుల్వామా లాంటి మరిన్ని దాడులకు పాల్పడనుందనే సూచనల నేపథ్యంలో ఐఏఎఫ్ ఈ దాడులు జరిపినట్టు సమాచారం. శాంతి కోసం ఉగ్రసంస్థలకు అన్ని రకాల సాయాన్ని నిలిపివేసి.. శాంతి కోసం పాటుపడాలని కోరిన స్పందన లేకపోవడంతో.. దాయాది దేశానికి గట్టి హెచ్చరికలు జారీచేసేందుకే భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పాక్ పట్టించుకోలేదు...అందుకే దాడులు సర్జికల్ స్ట్రైక్ 2 : 300 మంది ఉగ్రవాదులు హతం! -
గుఢాచారిగా అలియా...?
అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న ‘రాజీ’ సినిమా ట్రైలర్ మంగళవారం ఉదయం విడుదలయ్యింది. 1.5 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ కథలోని కీలక విషయాలను చెప్పకనే చెప్తుంది. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం హరిందర్ సిక్కా పుస్తకం ‘కాలింగ్ శెహమత్’ ఆధారంగా 1971 నాటి ఇండో - పాక్ యుద్ధ పరిస్థితుల నేపధ్యంలో రూపొందింది. దేశం కోసం పాకిస్థాన్ ఆర్మీ అధికారిని పెళ్లి చేసుకున్న కాశ్మీరి యువతి అత్తవారింటికి వెళ్లిన తర్వాత గూఢచారిగా ఎలా మారిందనే కథాంశంత ఈ చిత్రం తెరకెక్కింది. ట్రైలర్లో ఆలియా భట్‌ను తొలుత అయాయకమైన కాశ్మీరి యువతిగా, అనంతరం గూఢచారిగా మారి తుపాకీ పట్టి, పోరాటాలు చేసే మహిళగా రెండు కోణాలలో చూస్తాం. ట్రైలర్‌ను బట్టే ఈ చిత్రంలో ఆలియా నటన అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ట్రైలర్‌తో చిత్రం పై అంచనాలు మరింత పెరిగాయి. ధర్మ మూవీస్, జంగిల్ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నన ఈ చిత్రానికి మేఘన గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. మేఘన గుల్జార్ ‘తల్వార్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అలియాతో పాటు విక్కి కౌశల్, రజిత్ కపూర్, జైదీప్ అహ్లవత్, సోని రాజ్డాన్ ఇతర పాత్రలు పోషస్తున్నారు. మే 11న ఈ చిత్రం విడుదల కానుంది. -
ఆయుధాలు కావాలి.. సిద్ధంగా ఉండండి
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్నాయి. దాంతో ఏ క్షణంలో అడిగినా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి తయారుచేసి ఉంచుకోవాలని భారత ప్రభుత్వం ఆయుధాల సరఫరాదారులను కోరిందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వివిధ ఆయుధ సరఫరాదారుల సామర్థ్యాన్ని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అవసరమైన పక్షంలో తాము చెప్పిన వెంటనే వాటిని సరఫరా చేయాల్సి ఉంటుందని చెప్పారట. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలే కాకుండా.. అవసరమైతే అప్పటికప్పుడు సరఫరా చేసే ప్రాతిపదికన కొత్త ఒప్పందాలు కూడా చేసుకోవాలని రక్షణ శాఖ భావిస్తున్నట్లు సమాచారం. తక్కువ సమయంలో చెబితే మనవాళ్లు ఎంత మొత్తంలో ఆయుధాలు సరఫరా చేయగలరన్న కచ్చితమైన సమాచారం తమకు కావాలని, అవసరాన్ని బట్టి ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఒకేసారి పెంచాలని కూడా కోరారంటున్నారు. జనవరి నెలలో పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ మీద ఉగ్రదాడి జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఇలాగే ఆయుధాలు కావాలని చెప్పిందట. ప్రధానంగా చిన్న ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రి, సుఖోయ్.. మిరేజ్ యుద్ధవిమానాల విడిభాగాలు కావాలని అప్పట్లో కోరినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 29నాడు నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌కు ఒక్కరోజు ముందు కూడా అవసరమైతే భద్రతా కారణాల రీత్యా రక్షణ శాఖ బడ్జెట్‌ను పెంచాల్సి ఉంటుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సూచనప్రాయంగా వెల్లడించారు. అంతర్జాతీయ ఘటనల ప్రభావం మన మీద కూడా ఉంటుందని, అంఉదవల్ల అత్యవసరమైన పరిస్థితుల్లో జాతీయ వనరులను కూడా రక్షణ రంగానికి మళ్లించాల్సి ఉంటుందని, అది చాలా ప్రాధాన్యమైన అంశమని బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో జైట్లీ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఒకవేళ భారీ యుద్ధం చేయాల్సి వస్తే మాత్రం మన సైన్యం వద్ద చిన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రికి తీవ్రమైన కొరత ఉంటుంది. అందుకే ముందుగా సిద్ధం కావడం మంచిదని రక్షణ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
యుద్ధంలో పాక్‌కు సాయంపై చైనా తూచ్
భారతదేశంతో యుద్ధం వస్తే పాకిస్థాన్‌కు తాము సాయం చేస్తామంటూ తమ సీనియర్ దౌత్యవేత్త ఒకరు చెప్పిన విషయం తమకు తెలియదని చైనా స్పష్టం చేసింది. తద్వారా పాకిస్థాన్‌కు సాయం చేసే విషయంలో వెనుకంజ వేసినట్లయింది. వేరే దేశం ఏదైనా దాడి చేసిన పక్షంలో పాక్‌కు చైనా అండగా ఉంటుందని పాకిస్థాన్‌లో చైనా రాయబారి యు బోరెన్ పేర్కొన్నట్టు పాకిస్థాన్ పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరినప్పుడు విదేశాంగ శాఖ ఆ అంశాన్ని కొట్టిపారేసింది. అసలు ఆ విషయం గురించి తమకు ఏమాత్రం సమాచారం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ చెప్పారు. పాక్, భారత్ రెండు దేశాలకూ పొరుగు దేశంగా, మిత్ర దేశంగా ఉన్నందున చైనా విధానం ఎప్పుడూ స్పష్టంగా ఉందని, వాటి మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారా రెండు దేశాలు పరిష్కరించుకోవాలని ఆయన ఎప్పుడూ చెప్పే పాత పాటే పాడారు. కశ్మీర్ సమస్య చాలాకాలంగా ఉందని, దాన్ని కూడా సంబంధిత వ్యక్తులు శాంతియుతంగా కూర్చుని చర్చించుకోవాలని ఆయన తెలిపారు. ఇక చైనా భారత దేశాల మధ్య సరిహద్దులను సరిగా గుర్తించాల్సి ఉందని, దీనిపై వారితో చర్చలు కొనసాగిస్తున్నామని.. ఈ విషయంలో ఉన్న వ ఇభేదాలను పరిష్కరించుకుంటామని కూడా గెంగ్ షువాంగ్ చెప్పారు. ఎల్ఏసీ విషయంలో ద్వైపాక్షిక ఒప్పందాలకు తమ సైన్యం పూర్తిగా కట్టుబడి ఉంటుందన్నారు. -
రానాకు జోడీగా తాప్సీ?
కొత్త తరహా కథా కథనాలతో తెరకెక్కుతున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మరో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమా 'ఘాజీ'. 1971లో ఇండియా - పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో, విశాఖపట్నం సమీపంలో సముద్ర జలాల్లో మునిగిపోయిన పిఎన్ఎస్ ఘాజీ జలాంతర్గామి బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విశాఖ తీరంలో ఉన్న జలాంతర్గామిపై పాకిస్థాన్ సేనలు ఎలా దాడి చేయగలిగాయన్న మిస్టరీని సినిమాటిక్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా నావీ అధికారిగా కనిపించనున్నాడు. కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కథానాయిక పాత్ర కూడా కీలకం కావటంతో హీరోయిన్ కోసం చాలా రోజులుగా వేట సాగిస్తున్నారు. ముందుగా ఈ పాత్రకు సమంతను తీసుకోవాలని భావించినా, హిందీలో కూడా తెలిసిన హీరోయిన్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందని భావించిన చిత్రయూనిట్, ప్రస్తుతం తాప్సీని ఫైనల్ చేయాలని భావిస్తున్నారట. బాలీవుడ్లో తెరకెక్కిన 'బేబీ' మూవీలో యాక్షన్ సీన్స్‌లోనూ ఇరగదీసిన ఈ బ్యూటీ, కొంతకాలంగా గ్లామర్ రోల్స్‌ను పక్కన పెట్టి ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటోంది. దీంతో 'ఘాజీ' సినిమాకు కూడా ఓకే చెబుతుందనే నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.