యుద్ధంలో పాక్‌కు సాయంపై చైనా తూచ్
భారతదేశంతో యుద్ధం వస్తే పాకిస్థాన్‌కు తాము సాయం చేస్తామంటూ తమ సీనియర్ దౌత్యవేత్త ఒకరు చెప్పిన విషయం తమకు తెలియదని చైనా స్పష్టం చేసింది. తద్వారా పాకిస్థాన్‌కు సాయం చేసే విషయంలో వెనుకంజ వేసినట్లయింది. వేరే దేశం ఏదైనా దాడి చేసిన పక్షంలో పాక్‌కు చైనా అండగా ఉంటుందని పాకిస్థాన్‌లో చైనా రాయబారి యు బోరెన్ పేర్కొన్నట్టు పాకిస్థాన్ పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరినప్పుడు విదేశాంగ శాఖ ఆ అంశాన్ని కొట్టిపారేసింది. అసలు ఆ విషయం గురించి తమకు ఏమాత్రం సమాచారం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ చెప్పారు. పాక్, భారత్ రెండు దేశాలకూ పొరుగు దేశంగా, మిత్ర దేశంగా ఉన్నందున చైనా విధానం ఎప్పుడూ స్పష్టంగా ఉందని, వాటి మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారా రెండు దేశాలు పరిష్కరించుకోవాలని ఆయన ఎప్పుడూ చెప్పే పాత పాటే పాడారు.
కశ్మీర్ సమస్య చాలాకాలంగా ఉందని, దాన్ని కూడా సంబంధిత వ్యక్తులు శాంతియుతంగా కూర్చుని చర్చించుకోవాలని ఆయన తెలిపారు. ఇక చైనా భారత దేశాల మధ్య సరిహద్దులను సరిగా గుర్తించాల్సి ఉందని, దీనిపై వారితో చర్చలు కొనసాగిస్తున్నామని.. ఈ విషయంలో ఉన్న వ ఇభేదాలను పరిష్కరించుకుంటామని కూడా గెంగ్ షువాంగ్ చెప్పారు. ఎల్ఏసీ విషయంలో ద్వైపాక్షిక ఒప్పందాలకు తమ సైన్యం పూర్తిగా కట్టుబడి ఉంటుందన్నారు.