న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌కు స్వేచ్ఛ ప్రసాదించిన ఇండో-పాక్ యుద్ధానికి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది డిసెంబర్ 16న విజయ్ దివాస్ పేరుతో పాకిస్తాన్‌పై భారత్ సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటాము. ఇక చరిత్రలో ఈనాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏఏ ఖాన్ నియాజీతో సహా 93 వేల మంది పాక్ సైనికులు భారత దళాల ఎదుట బేషరతుగా లొంగిపోయారు. దాంతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అలాగే నాటి ఇండో-పాక్ యుద్ధంలో మరణించిన సైనికులకు దేశం ఘనంగా నివాళులర్పిస్తోంది. ఇదిలా ఉండగా భారత దేశం బెంగాలీ ముస్లింలు, హిందువులకు మద్దతుగా నిలవడంతో పాక్, ఇండియాల మధ్య డిసెంబర్ 3, 1971న యుద్ధం ప్రారంభమయ్యింది. 13 రోజుల పాటు ఏకధాటిగా సాగిన యుద్ధం పాక్ ఆర్మీ చీఫ్, సైన్యం భారత దళాల ముందు బేషరుతుగా లొంగిపోవడంతో ముగిసింది. ఇది పాక్ మీద భారత ఆర్మీ సాధించిన అతి గొప్ప చారిత్రక విజయాల్లో ఒకటిగా నిలిచింది.
యుద్ధానికి తక్షణ కారణం...
తూర్పు పాకిస్తాన్ నుంచి విడిపోయి సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని 1971 మార్చి 26న బంగ్లాదేశ్ పిలుపునిచ్చింది. ఆ తరువాతి రోజు వారి స్వాతంత్ర్య పోరాటానికి భారతదేశం పూర్తి మద్దతు ప్రకటించింది. అప్పట్లో పాకిస్తాన్ మిలటరీ బెంగాలీలపై, ప్రధానంగా హిందువులపై ఎన్నో దారుణాలకు పాల్పడింది. దీంతో సుమారు 10 మిలియన్ల మంది ప్రజలు మన దేశానికి వలస వచ్చారు. బెంగాలీ శరణార్థులను భారత్ ఆహ్వానించింది. (చదవండి: 11 గంటల్లో 180 కి.మీ పరుగు!)
ఒక్క సంతకంతో ముగింపు
ఈ యుద్ధం 20 వ శతాబ్దపు అత్యంత హింసాత్మక యుద్ధాలలో ఒకటిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఈ యుద్ధంలో పాక్ సైన్యం పెద్ద ఎత్తున దురాగతాలకు పాల్పడింది. యుద్దం వల్ల 10 మిలియన్ల మంది శరణార్థులుగా మారడమే కాక.. మరో 3 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ సాయుధ దళాలకు నాయకత్వం వహిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ, డిసెంబర్ 16, 1971 న లొంగుబాటు పత్రంపై సంతకం చేయడంతో ఇండో-పాక్ యుద్ధం ముగిసింది. ఇక ఈ లిఖితపూర్వక లొంగుబాటు ఒప్పంద పత్రం బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్ ఈస్టర్న్ కమాండ్ లొంగిపోవడానికి వీలు కల్పించింది. 1971 ఇండో-పాక్ యుద్ధం ముగిసింది. ఇక ఆ సయమంలో అప్పటి భారత ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా పాక్ దళాలకు పంపిన సందేశం చరిత్రలో నిలిచిపోయింది. డిసెంబర్ 13, 1971న సామ్ మానేక్షా పాక్ దళాలను ఉద్దేశిస్తూ.. ‘లొంగిపొండి లేదంటే మిమ్మల్ని మేం నాశనం చేస్తాం’ అని హెచ్చరించారు. దాంతో పాక్ ఆర్మీ చీఫ్‌తో సహా 93 వేల మంది సైనికులు భారత్ ముందు బేషరతుగా లొంగిపోయారు. తర్వాత సిమ్లా ఒప్పందంలో భాగంగా భారత్ వారిని విడుదల చేసింది.
సత్తా చాటిన త్రివిధ దళాలు
పాకిస్తాన్ వైమానిక దళం మన దేశంలో వాయువ్య ప్రాంతాలపై దాడులు చేసిన తరువాత మన దేశం అధికారికంగా యుద్ధంలోకి దిగింది. ‘ఆపరేషన్ చెంగిజ్ ఖాన్’లో భాగంగా ఆగ్రా, తాజ్‌మహల్‌పై దాడులు చేసేందుకు ప్రణాళిక రచించింది. అప్పట్లో శత్రు దేశాల దృష్టిని మళ్లించేందుకు తాజ్‌మహల్‌ను ఆకులు, కొమ్మలతో కప్పివేశారు. పాకిస్తాన్‌కు ప్రతిస్పందనగా భారత వైమానిక దళం వెస్ట్రన్ ఫ్రంట్‌లో పటిష్ట ఏర్పాట్లు చేసింది. యుద్ధం ముగిసే వరకు ఐఏఎఫ్, పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ స్థావరాలపై దాడి చేస్తూనే ఉంది. ఈ యుద్దంలో ఇండియన్ నేవీ కూడా కీలక పాత్ర పోషించింది. ‘ఆపరేషన్ ట్రైడెంట్’ పేరుతో కరాచీ పోర్ట్‌పై భారత నావికాదళం డిసెంబర్ 4-5 మధ్యరాత్రి దాడి చేసింది. దీంతో పాకిస్తాన్ తమ దళాలను భారత పశ్చిమ సరిహద్దు వద్ద మోహరించింది. అప్పటికే మన సైన్యం పాక్ భూభాగంలోకి దూసుకువెళ్లింది. కొన్ని వేల కిలోమీటర్ల పాక్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ యుద్ధంలో పాకిస్తాన్‌కు చెందిన 8000 మంది సైనికులు చనిపోగా.. 25,000 మంది వరకు గాయపడ్డారు. సుమారు 3,843 మంది భారత సైనికులు మరణించారు. మరో 9,851మంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment