దేశమంతా ఈరోజు (డిసెంబరు 16) విజయ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1971లో ఇదే రోజున భారత్ యుద్ధంలో పాక్ సైన్యాన్ని మట్టికరిపించింది. అలాగే తూర్పు పాకిస్తాన్‌ను అణచివేత నుండి విముక్తి చేసింది. ఈ రోజు భారతదేశంతో పాటు బంగ్లాదేశ్‌కు కూడా ఎంతో ప్రత్యేకమైనది. పాక్‌పై యద్ధంలో గెలిచినందుకు గుర్తుగా భారత సాయుధ బలగాల త్యాగాలను ఈరోజు గుర్తుచేసుకుంటారు.
నాటి ప్రధాని ఇందిరాగాంధీ చొరవతో..
1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర యుద్ధంలో బెంగాలీ జాతీయవాద సమూహానికి భారత్ మద్దతుపలికింది. ఈ నేపధ్యంలో తూర్పు పాకిస్తాన్‌లో భారత్.. పాక్‌తో యుద్ధం చేసింది. అంతిమంగా ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓటమిని చవిచూసింది. 1970-71లలో పాకిస్తాన్ జనరల్ యాహ్యా ఖాన్ తన అణచివేత సైనిక పాలనతో తూర్పు పాకిస్తాన్‌లోని సామాన్యులను ఊచకోతకు గురిచేశారు. ఈ నేపధ్యంలో షేక్ ముజిబుర్ రెహమాన్ సామాన్యులను పోరాటం దిశగా ప్రేరేపించేందుకు ముక్తి బాహినీ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే ఈ పోరాటానికి భారత్ నుంచి సహాయం కూడా కోరారు. నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ తూర్పు పాకిస్తాన్ ప్రజలను పాక్ అరాచకాల నుంచి రక్షించేందుకు భారత సైన్యాన్ని పాక్‌తో యుద్ధానికి అనుమతించారు.
అతిపెద్ద సైనిక లొంగుబాటు
భారత సైన్యం 1971, డిసెంబర్ 4న ఆపరేషన్ ట్రైడెంట్‌ను ప్రారంభించింది. ఈ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ సైన్యానికి తగిన సమాధానం ఇచ్చింది. దీంతో 1971, డిసెంబర్ 16న బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఆవిర్భవించింది. ఈ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీని లొంగిపోయేలా ఒత్తిడి చేయడంతో మరోమార్గంలేక అతను అందుకు తలొగ్గాడు. ఈ యుద్ధకాలంలో 93 వేలమంది పాకిస్తానీ సైనికులు లొంగిపోయారు. దీనిని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైనిక లొంగుబాటుగా చెబుతారు.
ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎప్పటికీ గుర్తుండే 10 రాజకీయ ఘటనలు
Comments
Please login to add a commentAdd a comment