ఆ 54 మంది సైనికులు ఏమయ్యారు? | Vijay Diwas Indo Pak War 1971 Unforgotten Heroes | Sakshi
Sakshi News home page

ఆ 54 మంది సైనికులు ఏమయ్యారు?

Published Thu, Dec 17 2020 9:26 AM | Last Updated on Sun, Dec 20 2020 10:49 AM

Vijay Diwas Indo Pak War 1971 Unforgotten Heroes - Sakshi

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌పై భారత్‌ సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతీ ఏడాది డిసెంబర్‌ 16న విజయ్‌ దివస్‌ జరుపుకొంటాము. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం చేకూర్చిన 1971 నాటి ఇండో- పాక్‌ యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తాం. ఇక ఈ యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద బుధవారం స్వర్ణ జ్యోతిని వెలిగించారు. వీర జవాన్ల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. దాయాది దేశం పాకిస్తాన్‌ మీద భారత ఆర్మీ సాధించిన అతి గొప్ప చారిత్రక విజయాల్లో ఒకటిగా నిలిచిన నేటి రోజున భారతీయుల గుండెలు ఉద్వేగంతో ఉప్పొంగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే, అదే సమయంలో ఇండో- పాక్‌ యుద్ధ కాలం (1947-48, 1965, 1971)లో ముఖ్యంగా 1971 యుద్ధంలో అదృశ్యమై పోయిన 54 మంది భారత సైనికులను కూడా గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. పాకిస్తాన్ ఆర్మీకి పట్టుబడిన ఆ జవాన్లు ఇంకా బతికే ఉన్నారని వారి కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు. కొంతమందైతే వారి జాడను వెదుక్కుంటూ పాక్‌కు వెళ్లారు కూడా. కానీ అక్కడ వారికి నిరాశే ఎదురైంది. మరి.. యుద్ధ ఖైదీలుగా పాకిస్తాన్‌కు చిక్కిన ఆ 54 మంది సైనికులు ఏమయ్యారు? నాలుగు దశాబ్దాలు గడిచినా తమవారు తిరిగి వస్తారని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యుల ఎదురుచూపులకు సమాధానం దొరుకుతుందా?! నిజానికి అధికారికంగా 54 మంది మాత్రమే అదృశ్యమయ్యారని పైకి చెబుతున్నా.. ఇవే కచ్చితమైన గణాంకాలు కావనే వాదనలూ ఉన్నాయి. వారు బతికే ఉన్నారా లేదా మరణించారా అన్న సందేహాలకు కూడా జవాబు లేదు. అయితే పాకిస్తాన్‌ నుంచి వచ్చిన కొన్ని ఉత్తరాలు మాత్రం వారు బతికే ఉన్నాయని ఆశలు కల్పిస్తున్నాయి.
(చదవండి : పాకిస్తాన్‌ మెడలు వంచిన భారత ఆర్మీ)

మోకరిల్లిన పాక్‌
పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆమిర్‌ అబ్దుల్లా ఖాన్‌ నాయిజీతో సహా 93 వేల మంది పాక్‌ సైనికులు భారత దళాల ఎదుట బేషరతుగా లొంగిపోవడంతో 13 రోజుల పాటు ఏకధాటిగా సాగిన యుద్ధం ముగిసింది. భారత్‌ విజయంతో బంగ్లాదేశ్‌ స్వతంత్ర దేశంగా అవతరించింది. కానీ, పాకిస్తాన్‌లో చెరలో ఉన్నట్టు భావిస్తున్న సైనికుల కుటుంబాల్లో నెలకొన్న చీకట్లు తొలగిపోలేదు. అశోక్‌ అనే సైనికుడు తాము పాకిస్తాన్‌లో చిక్కుకున్నామని చెప్తూ డిసెంబరు 26, 1974న భారత్‌లోని తన తండ్రి ఆర్‌ఎస్‌ సురికి రాసిన ఓ లేఖ మాత్రం వారి మనసుల్లో కాంతిరేఖలు ప్రసరింపజేసింది. 1975 ఆగస్టులో.. ‘ప్రియమైన నాన్న.. ఆశీర్వాదం కోసం అశోక్‌ మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాడు. నేనిక్కడ బాగానే ఉన్నాను. ఇండియన్‌ ఆర్మీ, భారత ప్రభుత్వంతో మా గురించి మాట్లాడండి. మేమిక్కడ 20 మంది ఆఫీసర్లం ఉన్నాం. నా గురించి బాధ పడొద్దు.

ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి. ముఖ్యంగా అమ్మ, తాతయ్యను. మాకు విముక్తి కల్పించేందుకు భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ సర్కారును సంప్రదిస్తే బాగుంటుంది’అని లేఖలో పేర్కొన్నాడు. అప్పటి రక్షణ శాఖా కార్యదర్శి ఆ లేఖలో ఉన్న సంతకం అశోక్‌దేనని నిర్ధారించారు. మేజర్‌ ఏకే ఘోష్‌ పాకిస్తాన్‌తో యుద్ధంలో పాల్గొన్నట్టు ఆయన ఫొటోలు టైమ్‌ మ్యాగజీన్‌లో ప్రచురితమయ్యాయి. కానీ, యుద్ధానంతరం ఆయన మాత్రం ఇండియాకు తిరిగి రాలేదు. ఆయన మరణించి ఉండొచ్చనే అభిప్రాయాలు ఒకవైపు, పాక్‌లో పట్టుబడి ఉన్నారేమోననే వాదనలు మరోవైపు వినిపించాయి.

ఇదిలాఉంటే.. మోహన్‌లాల్‌ భాస్కర్‌ అనే సైనికుడు 1968- 1974 వరకు పాకిస్తాన్‌ జైలులో గడిపిన ఆయన డిసెంబరులో విడుదలయ్యారు. యాన్‌ ఇండియన్‌ స్పై ఇన్‌ పాకిస్తాన్‌ పేరిట పుస్తకం రాశారు. పాకిస్తాన్‌ సెకండ్‌ పంజాబ్‌ రెజిమెంట్‌కు చెందిన కల్నల్‌ అసీఫ్‌ షఫీని తాను కలిసినట్టు అందులో పేర్కొన్నారు. అదేవిధంగా మేజర్‌ అయాజ్‌ అహ్మద్‌ సిప్రాను కలిశానని 1968-71 యుద్ధ సమయంలో దాదాపు 40 భారత సైనికులు జైళ్లలో మగ్గుతున్నట్టు ఆయన చెప్పినట్టు రాసుకొచ్చారు. ఇక బేనజీర్‌ భుట్టో బయోగ్రఫీలో బ్రిటీష్‌ చరిత్రకారులు విక్టోరియస్‌ కఫిల్‌ తనకు పాకిస్తాన్‌లో భారత యుద్ధ ఖైదీలు ఉన్నట్టు ఆ దేశానికి చెందిన ఓ లాయర్‌ తనకు చెప్పారని పేర్కొన్నారు. అంతేకాక పాకిస్తాన్‌ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. భారత వింగ్‌ కమాండర్‌ హరిసేన్‌ గిల్‌ నడుపుతున్న యుద్ధ విమానం డిసెంబర్‌ 3న కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్‌ను ప్రాణాలతో పట్టుకున్నట్టు ఆర్మీ అధికార ప్రతినిధి చెప్పిన మాటలు రేడియో ప్రకటనలో వెలువడ్డాయి.

54 మంది అదృశ్యం.. ఎన్నో అనుమానాలు
చందర్‌ సుతా డోగ్రా వంటి సీనియర్‌ జర్నలిస్టులు వీరి గురించి వివరాలు తెలుసుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. రిటైర్డ్‌ ఆర్మీ అధికారులు, బ్యూరోక్రాట్లు, జవాన్ల బంధువులు, వారి దగ్గర ఉన్న ఉత్తరాలు, వార్తా పత్రికల క్లిప్పింగులు, డైరీలు, ఫొటోలు, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న వివరాల ఆధారంగా వారు ఏమైపోయారన్న ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు కృషి చేశారు. తన పరిశోధనలో భాగంగా.. పాకిస్తాన్‌ నిజంగానే ఈ 54 మందిని చంపేసిందా? వారు పాక్‌లోనే బంధీలుగా ఉన్నారని ఇండియా నిరూపించగలదా? వారి శరీరంలో చిప్‌లు పెట్టి భవిష్యత్తులో వారిని ఆయుధాలుగా ఉపయోగిస్తుందా? నిజానికి చాలా మంది పాక్‌ అధికారులు.. తమ దేశంలో గూఢచర్యం చేసేందుకే ఈ సైనికులు పట్టుబడ్డారని భావించడం, పట్టుబడిన భారత జవాన్లలో కొద్ది మందిని వెంటనే చంపేయడం, మిగతా వారిని యుద్ధ ఖైదీలుగా బంధించడం వెనుక గల కారణాల గురించి ఆమె అన్వేషించారు. ఇక అదృశ్యమై పోయిన 54వ మంది సైనికుల గురించి పిటిషన్‌ దాఖలైన నేపథ్యంలో.. వారిలో 15 మంది కచ్చితంగా వీరమరణం పొందారని భారత ప్రభుత్వం రెండు అఫిడవిట్లలో పేర్కొనడం వంటి అంశాల ఆధారంగా.. భారత్‌ ఇంకా 54 మంది మాయమైపోయారని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటన్న అంశాల గురించి ఆరా తీశారు.

పాక్‌ జైళ్లకు వెళ్లి మరి
ఇక తమ వారి జాడను వెదుక్కుంటూ ఈ సైనికుల బంధువులు పాకిస్తాన్‌కు వెళ్లారు. వారి ఫొటోలు పట్టుకుని, వివరాలు అడుగుతూ 1983లో ఆరుగురు, 2007లో 14 మంది పాక్‌ను సందర్శించారు. అక్కడి జైళ్లకు వెళ్లి ఆరా తీశారు. తమ వాళ్లు జైళ్ల గోడల అవతలే ఉన్నారంటూ వారు బలంగా విశ్వసించారు. దీంతో యుద్ధఖైదీలు ఎవరూ లేరని పాక్‌ ప్రభుత్వం మరోసారి ప్రకటన చేసింది. కానీ, మిస్టరీగా మారిన భారత సైనికుల ఆచూకీ ఏమై ఉంటుందన్న ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది..  ఏనాటికైనా దీనికి జవాబు దొరుకుతుందా!

భారత సైన్యం సిబ్బంది

1. మేజర్‌ ఎస్‌పీఎస్‌ వారాయిచ్ ‌(15 పంజాబ్‌ ఈయనను పాక్‌ఖైదీగా పట్టుకున్న వెంటనే తుపాకీ కాల్పుల్లో చనిపోయారని చెప్తున్నారు)

2. మేజర్‌ కన్వల్జిత్‌సింగ్‌సంధూ (15 పంజాబ్‌)

3. సెకండ్‌ లెఫ్టినెంట్‌ సుధీర్‌ మోహన్‌ సభర్వాల్‌(87 లైట్‌రెజిమెంట్‌)

4. కెప్టెన్‌ రవీందర్‌ కౌరా (మెడికల్ ‌రెజిమెంట్‌)

5. కెప్టెన్‌ గిరిరాజ్‌ సింగ్‌(5 అస్సాం)

6. కెప్టెన్‌ ఓమ్‌ ప్రకాష్‌ దలాల్‌(గ్రెనేడియర్స్‌)

7. మేజర్‌ సూరజ్‌ సింగ్‌(15 రాజ్‌పుత్‌)

8. మేజర్‌ ఎ.కె.సూరి (5 అసోం)

9. కెప్టెన్‌ కల్యాణ్‌ సింగ్‌ రాథోడ్‌(5 అసోం)

10. మేజర్‌ జస్‌కిరణ్‌ సింగ్‌ మాలిక్‌(8 రాజ్‌రైఫిల్స్‌)

11. మేజర్‌ ఎస్‌.సి. గులేరి (9 జాట్‌)

12. లెఫ్టినెంట్‌ విజయ్‌కుమార్‌ ఆజాద్‌(1/9 జి రెజ్‌)

13. కెప్టెన్‌ కమల్‌బక్షి (5 సిఖ్‌)

14. సెకండ్‌ లెఫ్టినెంట్‌ పరస్‌రామ్‌ శర్మ (5/8 జి. ఆర్‌.)

15. కెప్టెన్‌ వశిష్ట్‌ నాథ్‌

16. లెఫ్టినెంట్‌ హవల్దార్‌ కృష్ణలాల్‌ శర్మ (1 జమ్మూకశ్మీర్‌రైఫిల్స్‌)

17 సుబేదార్‌ అస్సాసింగ్‌(5 సిఖ్‌)

18. సుబేదార్‌ కాళిదాస్‌(8 జమ్మూకశ్మీర్‌ఎల్‌ఐ)

19. లాన్స్‌నాయక్‌ జగదీశ్‌రాజ్‌(మహర్‌రెజిమెంట్‌)

20 లాన్స్‌నాయక్‌ హజూరాసింగ్‌

21 గన్నర్‌ సుజన్‌ సింగ్‌(14 ఫార్వర్డ్‌రెజిమెంట్‌)

22. సిపాయ్‌ దలేర్‌ సింగ్‌(15 పంజాబ్‌)

23. గన్నర్‌ పాల్‌సింగ్‌(181 లైట్‌రెజిమెంట్‌)

24. సిపాయ్‌ జాగీర్‌సింగ్‌(16 పంజాబ్‌)

25 గన్నర్‌ మదన్‌ మోహన్‌(94 మౌంటెయిన్‌రెజిమెంట్‌)

26. గన్నర్‌గ్యాన్‌చంద్‌/ గన్నర్‌శ్యామ్‌సింగ్‌

27. లాన్స్‌నాయక్‌ బల్బీర్‌సింగ్‌ఎస్‌.బి.ఎస్‌. చౌహాన్‌

28. కెప్టెన్‌ డి.ఎస్‌.జామ్వాల్‌(81 ఫీల్డ్‌రెజిమెంట్‌)

29. కెప్టెన్‌ వశిష్ట్‌నాథ్‌(అటాక్‌)

భారత వైమానిక దళ సిబ్బంది

30. స్క్వాడ్రన్‌లీడర్‌ మోహీందర్‌ కుమార్‌ జైన్‌(27 స్క్వాడ్రన్‌)

31. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌ సుధీర్‌ కుమార్‌ గోస్వామి (5 స్క్వాడ్రన్‌)

32. ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌ సుధీర్‌ త్యాగి (27 స్క్వాడ్రన్‌)

33. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌ విజయ్‌ వసంత్‌ తాంబే (32 స్క్వాడ్రన్‌)

34. ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ నాగస్వామి శంకర్‌(32 స్క్వాడ్రన్‌)

35. ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ రామ్‌ మేథారామ్‌ అద్వానీ (జేబీసీయూ)

36. ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ మనోహర్‌ పురోహిత్‌(5 స్క్వాడ్రన్‌)

37. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌ తన్మయ సింగ్‌ దాన్‌దాస్‌(26 స్క్వాడ్రన్‌)

38. వింగ్‌ కమాండర్‌ హర్‌శరన్‌ సింగ్‌(47 స్క్వాడ్రన్‌)

39. ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ బాబుల్‌గుహ

40. ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ సురేశ్‌చందర్‌ సందాల్‌(35 స్క్వాడ్రన్‌)

41. స్క్వాడ్రన్‌లీడర్‌ జల్‌మాణిక్షా మిస్త్రీ

42. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌ హర్వీందర్‌సింగ్‌(222 స్క్వాడ్రన్‌)

43. స్క్వాడ్రన్‌లీడర్‌ జతీందర్‌దాస్‌కుమార్‌(3 స్క్వాడ్రన్‌)

44. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌ ఎల్‌.ఎం.సాసూన్‌(జేబీసీయూ)

45. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌ కుషల్‌పాల్‌ సింగ్‌ నందా (35 స్క్వాడ్రన్‌)

46. ఫ్లాగ్‌ఆఫీసర్‌ కృషన్‌ఎల్‌. మల్కానీ (27 స్క్వాడ్రన్‌)

47. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌ బల్వంత్‌ధవాలే (1 స్క్వాడ్రన్‌)

48. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌ శ్రీకాంత్‌సి. మహాజన్‌(5 స్క్వాడ్రన్‌)

49. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌ గుర్‌దేవ్‌సింగ్‌రాయ్‌(27 స్క్వాడ్రన్‌)

50. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌ రమేశ్‌జి. కాదమ్‌(టీఏసీడీఈ)

51. ఫ్లాగ్‌ఆఫీసర్‌ కె.పి.మురళీధరన్‌(20 స్క్వాడ్రన్‌)

52. నావల్‌ పైలట్‌లెఫ్టినెంట్‌ కమాండర్‌అశోక్‌రాయ్‌

53. స్క్వాడ్రన్‌లీడర్‌ దేవప్రసాద్‌ఛటర్జీ

54. పెటీ ఆఫీసర్‌ తేజీందర్‌సింగ్‌ సేథీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement