న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధవీరుల ధైర్య సాహసాలను ప్రధాని మోదీ స్మరించుకున్నారు. సాయుధ దళాల నైతిక స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడకూడదని, వారి ధైర్య సాహసాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని ఆదివారం మాసాంతపు రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో ప్రజలకు సూచించారు. ‘దేశం తరువాతే ఏదైనా’అనే భావంతో ప్రజలంతా ఉంటే సైనికుల ఆత్మస్థైర్యం మరింత పెరుగుతుందన్నారు.
కార్గిల్ యుద్ధంలో సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ జరుపుకునే విజయ్ దివస్ (జూలై 26) కూడా ఇదే రోజు రావడంతో ప్రధాని ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు. 1999లో ఇదే రోజు కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. స్నేహ హస్తం చాచిన భారత్‌కు ఆనాడు పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచిందని ప్రధాని గుర్తు చేశారు. ‘అంతర్గత సమస్యల నుంచి తప్పించుకునేందుకు.. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే దుస్సాహసానికి పాక్ ఒడిగట్టింది’అన్నారు.
‘శత్రు సైన్యం శిఖరాల పైభాగంలో ఉంది. భారతీయ సైనికులు ఆ పర్వత పాదాల ప్రాంతాల్లో ఉన్నారు. భౌగోళికంగా వారికి అనుకూల స్థితి. కానీ భారత సైనికులు అత్యంత ధైర్య సాహసాలు, నైతిక స్థైర్యంతో వారిని మట్టికరిపించారు’అని కార్గిల్ యుద్ధాన్ని ప్రధాని గుర్తు చేశారు. తూర్పు లద్దాఖ్‌లో ఇటీవలి చైనా దుష్ట పన్నాగాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘కొందరు శత్రువులుగానే ఉండాలని కోరుకుంటారు’అని వ్యాఖ్యానించారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ దేశ ప్రజలను హెచ్చరించారు.
కరోనా ముప్పు నేపథ్యంలో ఈ సారి స్వాతంత్య్ర దినోత్సవం కూడా ప్రత్యేకంగా ఉండబోతోందన్నారు. ఆరోజు స్వావలంబ, కరోనా రహిత భారత్ దిశగా ముందుకు వెళ్తామని యువత ప్రతినబూనాలన్నారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రధాని కోరారు. కార్గిల్ యుద్ధం అనంతరం నాటి ప్రధాని వాజ్‌పేయి చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని మోదీ గుర్తు చేశారు. సురినామ్ కొత్త అధ్యక్షుడు చంద్రిక ప్రసాద్ సంతోఖి ప్రమాణ స్వీకారం చేసిన తీరు భారతీయులందరికీ గర్వకారణమని మోదీ తెలిపారు. వేద మంత్రాలు పఠిస్తూ, అగ్ని దేవుడిని స్తుతిస్తూ ఆయన ప్రమాణం చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment