1965లో భారత్–పాక్ యుద్ధం చివరి రోజది. స్క్వాడ్రన్ లీడర్ కేసీ కరియప్ప సరిహద్దు సమీపంలో తన విమానాన్ని చక్కర్లు కొట్టిస్తున్నారు! అకస్మాత్తుగా ఓ పేలుడు. ఆ తర్వాత విమానం నేలకొరిగింది. కొంతసేపటి తర్వాత సరిహద్దుకు ఆవల అడవిలోంచి కరియప్ప విమాన శకలాల నుంచి బయటకి రావడం కనిపించింది. కానీ.. దురదృష్టవశాత్తూ విమానం పాక్‌వైపు పడడంతో అతడూ యుద్ధఖైదీగా పాకిస్థాన్ చేతుల్లో చిక్కారు. అచ్చంగా.. మొన్నటి మిగ్ విమానం కూలిన తర్వాత పాక్ బలగాలకు మన వింగ్ కమాండర్ అభినందన్ చిక్కినట్లే. అభినందన్ లాగే అప్పుడు కరియప్ప కూడా తన పేరు, హోదా, యూనిట్ సంఖ్య మాత్రమే చెప్పారు. మరే ఇతర వివరాలూ వెల్లడించలేదు. కరియప్ప పట్టుబడ్డ సంగతి క్షణాల్లోనే రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కేంద్రానికి చేరిపోయింది.
సన్నాఫ్ కేఎం కరియప్ప!
విమానం కూలిన గంటలోపే.. పాక్ అధికారులు కరియప్ప బందీగా ఉన్న సెల్ వద్దకు హడావుడిగా చేరుకున్నారు. ఆయన గురించి గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. తమకు చిక్కింది.. భారత ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప కుమారుడని వారికప్పుడే తెలిసింది. అందుకే వారిలో ఎక్కడలేని ఉత్సాహం. స్వాతంత్య్రం తర్వాత భారత త్రివిధ దళాల అధ్యక్షుడిగా నియమితుడైన భారతీయుడు ఫీల్డ్ మార్షల్ కరియప్పే. అంతేకాదు.. 1965లో పాక్ పాలకుడు, ఆర్మీ చీఫ్ జనరల్ అయూబ్ ఖాన్‌కు ఒకప్పటి బాస్ కూడా. బందీగా చిక్కింది తన పాత బాస్ కొడుకు అన్న విషయాన్ని అయూబ్ ఖాన్ స్వయంగా తన కింది అధికారులకు చెప్పాడు. జాగ్రత్తగా చూసుకోమని సూచించాడు కూడా. ఆ తరువాత ఏమైందో చిన్న కరియప్పకు అర్థంకాలేదు.
ప్రతి సైనికుడూ నా కొడుకు లాంటోడే!
జనరల్ అయూబ్ ఖాన్ పాక్ రేడియో ద్వారా కేసీ కరియప్ప తమ బందీగా, క్షేమంగా ఉన్నాడని ప్రకటిం చాడు. పాత బాస్ అంటే ఉన్న గౌరవభావంతో ఢిల్లీలోని పాక్ హైకమిషనర్‌ను ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప వద్దకు పంపి.. ‘మీ కొడుకు పట్టుబడ్డాడు. మీరు చెబితే విడుదల చేస్తాం’ అన్న ప్రతిపాదన చేశాడు. దీన్ని కేఎం కరియప్ప తిరస్కరించారు. ‘పట్టుకున్న ప్రతి భారతీయ సైనికుడూ.. నా కొడుకు లాంటి వాడే. అందరినీ బాగా చూసుకోవాలి’ అంటూ అయూబ్ ఖాన్‌కు సమాధానమిచ్చారు.
అదీ మా నాన్నంటే : కేసీ కరియప్ప
ఈ ఘటన తర్వాత కొంత కాలానికి కేసీ కరియప్ప భారత్ తిరిగి వచ్చేశారు. భారతీయు వాయుసేన హెలికాప్టర్ విభాగానికి అధిపతిగా ఎదిగారు కూడా. ఎయిర్ మార్షల్‌గా పదవీ విరమణ పొందిన కేసీ కరియప్ప.. బుధవారం నాటి ఘటన తర్వాత నాటి పరిస్థితులను మీడియాతో పంచుకున్నారు. ‘మా నాన్న ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి. తన కొడుకని, ఇతర సైనికులని తేడా ఎప్పుడూ చూపించలేదు. అందుకే తను చెబితే విడుదల చేస్తానని.. అయూబ్ ఖాన్ చెప్పినా తిరస్కరించారు. అందుకే అందరిలాగే.. నన్నూ కొంచెం సమయం తీసుకుని విడుదల చేశారు’ అని వివరించారు. తను అరెస్టు రోజే యుద్ధం ముగిసిన విషయం తనకు తెలియదని కేసీ కరియప్ప తెలిపారు. 1971 పాక్ యుద్ధంలోనూ పాల్గొన్న కేసీ కరియప్ప ప్రస్తుతం కర్ణాటకలోని కొడగు జిల్లాలోని తన పూర్వీకుల నివాసం ‘రోషనార’లో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్
దటీజ్ కేఎం కరియప్ప
Published Fri, Mar 1 2019 4:19 AM | Last Updated on Fri, Mar 1 2019 4:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment