న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో సైనికుల నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా లడఖ్‌లోని ద్రాస్ సెక్టార్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. విపక్షాలపై ధ్వజమెత్తారు.
భారతదేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశంపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. భారత సైన్యం ప్రారంభించిన కీలకమైన సంస్కరణలకు అగ్నిపథ్ పథకం ఒక ఉదాహరణ అని చెప్పారు. ప్రపంచ దేశాల సైనికుల సగటు వయసు కంటే భారత సైనికుడి సగటు వయసు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం.
దీనిపై అనేక కమిటీలు చర్చించాయే కానీ, ఏ ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోలేదు. అగ్నిపథ్ స్కీం ద్వారా మేం ఈ సమస్యకు పరిష్కారం తీసుకువచ్చాం. ఈ పథకం ద్వారా భారత సైన్యంలో యువరక్తం పొంగిపొర్లుతుంది... అన్నివేళలా యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది.
భారత బలగాలకు సంబంధించిన పెన్షన్ సొమ్మును పొదుపు చేయడానికే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు విధుల్లో చేరిన ఉద్యోగులకు 30 ఏళ్ల తర్వాత పింఛన్ అనే ప్రశ్న తలెత్తుతుంది. కానీ మేమే ఈ అంశంపై ఎందుకు నిర్ణయం తీసుకున్నాం, అది తర్వాత వచ్చే ప్రభుత్వాలకే వదిలేయాలని ఆలోచించలేదు. ఎందుకంటే ఎందుకంటే రక్షణ దళాలు అంటే మాకు గౌరవం ఉంది, వారి నిర్ణయం పట్ల మాకు గౌరవం ఉంది. మేం 'రాజనీతి' కోసం కాకుండా 'రాష్ట్రనీతి' కోసం పని చేస్తున్నాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment