విశ్లేషణ
⇒ కీలకమైన ఆయుధ, సమాచార వ్యవస్థలు, టెక్నాలజీల కోసం విదేశాలపై ఆధారపడటం వీలైనంత తగ్గించుకోవాలి.
⇒ యుద్ధ ట్యాంక్, యుద్ధ విమానం, జలాంతర్గాముల విష
యంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. వ్యక్తిగత ఆయుధాల కోసం కూడా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. అగ్ని–5 వంటి క్షిపణులను సమర్థంగా ఉత్పత్తి చేయగల దేశానికి ఇదే మంత అనుకూలమైన అంశం కాదు.
⇒ స్థూల జాతీయోత్పత్తిలో ‘ఆర్ అండ్ డీ’కి భారత్ వెచ్చిస్తున్న మొత్తం కేవలం 0.65 శాతమే. అమెరికా 2.83 శాతం, ఫ్రాన్స్ 2.19 శాతం, చైనా 2.14 శాతం, దక్షిణ కొరియా 4.8 శాతం ఖర్చు చేస్తున్నాయి.
ఏ దేశమైనా భద్రంగా ఉండాలన్నా, సార్వభౌమత్వానికి సవాళ్లు ఎదురు కాకూడ దన్నా పటిష్టమైన మిలిటరీ, రక్షణ వ్యవస్థలు అత్యవసరం. 2014లో ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి నరేంద్ర మోదీ ఈ అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. అయితే భారత మిలిటరీ, రక్షణ వ్యవస్థలను సంపూర్ణంగా అర్థం చేసుకోవడంతోపాటు సమీక్షించి అవసరమైన సంస్కరణలు చేపట్టాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉన్నది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ అంశాన్ని తరచూ మిలిటరీ పెద్దల వద్ద ప్రస్తావిస్తూండేవారు. దురదృష్టవశాత్తూ ఈ వ్యవస్థ సంస్కరణ పథం పట్టేందుకు ఇప్పటికీ నిరాకరిస్తోంది.
నరేంద్ర మోదీ రెండో దఫా ప్రధానిగా ఎన్నికైన తరువాత ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్’ పదవిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రక్షణ రంగ సంస్కరణలనే భారీ ప్రయత్నానికి ఇది చిన్న ముందడుగు మాత్రమే. చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి.
రక్షణ శాఖ ఆధ్వర్యంలోని మిలిటరీ వ్యవస్థ బహుముఖమైనది.ఎన్నో భాగాలు, విభాగాలు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల వంటివి బిట్రిష్ కాలం నాటివి. అన్నీ వేటికవే ప్రత్యేకమన్నట్టుగా పనిచేస్తున్నాయి. మార్పును సుతరామూ ఇష్టపడటం లేదు. అయితే ఈ లక్షణం భారతీయులది కాకపోవడం కాకతాళీయమే. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మిలిటరీలు పాతకాలపు మూస ధోరణుల్లోనే కొట్టుకు పోతున్నాయి. భారత మిలిటరీ కూడా ఇలాంటి వ్యవస్థాగతమైన లక్షణాన్నే వ్యక్తం చేస్తోంది.
లేని యుద్ధ సన్నద్ధత
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 2025 సంవత్సరాన్ని మిలిటరీ సంస్కరణలను ప్రధాన లక్ష్యంగా ఎంచుకోవడం, ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పాలి. ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్’ (డీఆర్డీవో) 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని ఉద్దేశాలను బహిరంగ పరిచారు. సంస్కరణల లక్ష్యాల సాధనలో డీఆర్డీవో కీలక భూమిక ఏమిటన్నది కూడా రక్షణ మంత్రి ఆ సమావేశంలో వివరించారు.
మిలిటరీ సంస్కరణల గురించి స్థూలంగా చెప్పాలంటే... దేశ రక్షణకు వ్యూహాత్మకంగా, సాంకేతిక పరిజ్ఞానాల విషయంలో, భౌగోళిక, రాజకీయ అనివార్యతలకు తగ్గట్టుగా యుద్ధ సన్నద్ధతను సంపా దించుకోవడం ఒకటి. కీలకమైన ఆయుధ, సమాచార వ్యవస్థలు, టెక్నాలజీల కోసం విదేశాలపై ఆధారపడటం వీలైనంత తగ్గించడం రెండోది. ఈ రెండు లక్ష్యాలను సాధించాలంటే డీఆర్డీవోతో పాటు దేశంలోని శాస్త్ర, తయారీ రంగాలు ప్రధానమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది.
శాస్త్రవేత్తలు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలనీ, తమ సామ ర్థ్యాలను పెంచుకోవాలనీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘ప్రపంచంలోనే అగ్రగామి పరిశోధన, అభివృద్ధి సంస్థగా డీఆర్డీవో ఎదగాలి’ అని ఆకాంక్షించారు. డీఆర్డీవో కీర్తి కిరీటంలో కొత్తగా చేరిన కలికితురాయి దీర్ఘశ్రేణి ‘హైపర్ సానిక్ యాంటీ–షిప్’ క్షిపణి డిజైన్ బృందం కృషిని రక్షణ మంత్రి అభినందించారు కూడా.
అయితే భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి విషయాల్లో వ్యవస్థాగతమైన పరిమితులు కొన్ని పట్టిపీడిస్తున్నాయన్నది కఠోర సత్యం. వీటిని పరిష్కరించకుండా సంస్కరణల లక్ష్యం సాధించడం అసాధ్యం. ‘ఆర్ అండ్ డీ’ విషయంలో భారత్ ప్రపంచ అగ్రగామి దేశాల జాబితాలో లేదు. రక్షణ రంగంలో పెట్టుబడులు, ఉత్పాదకతలు కూడా దశాబ్దాలుగా ఓ మోస్తరుగా మాత్రమే ఉన్నాయి. అప్పుడప్పుడు అక్కడక్కడ ఒకట్రెండు మినహాయింపులు కనిపిస్తాయి అంతే.
కేటాయింపులు పెరిగేనా?
గత ఏడాది సెప్టెంబరులో డీఆర్డీవో చైర్మన్ సమీర్ వి.కామత్ మాట్లాడుతూ, ‘ఆర్ అండ్ డీ’కి వెచ్చిస్తున్న మొత్తం భారత స్థూల జాతీయోత్పత్తిలో కేవలం 0.65 శాతం మాత్రమే ఉన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఈ రంగంపై అమెరికా 2.83 శాతం, ఫ్రాన్స్ 2.19 శాతం, చైనా 2.14 శాతం, దక్షిణ కొరియా 4.8 శాతం ఖర్చు చేస్తున్నాయని కూడా ఆయన గుర్తు చేశారు. భారత్ కేటాయిస్తున్న నిధులు చాలా తక్కువన్న విషయం ప్రభుత్వానికి కూడా తెలుసుననీ, మోదీ హయాంలోనైనా ఈ మొత్తం జాతీయోత్పత్తిలో ఒక శాతానికి చేరుకోవాలనీ ఆశిస్తున్నట్లు సమీర్ కామత్ తెలిపారు.
2035 నాటికి రెండు శాతానికి చేరడం అభిలషణీయమని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఈ ఆశలు నెరవేరే సూచనలేవీ లేవు. రక్షణ రంగం మొత్తానికి కేటాయిస్తున్న నిధులే స్థూల జాతీయోత్పత్తిలో రెండు శాతానికి దగ్గరగా ఉన్న పరిస్థితుల్లో భారీ రాజకీయ జోక్యంతో గానీ ‘ఆర్ అండ్ డీ’కి ఒక శాతం కేటాయింపులు సాధ్యం కావు.
ఇక డీఆర్డీవో, రక్షణ మిలటరీ వ్యవస్థలు ఎదుర్కొంటున్న సమస్య విదేశీ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక ప్రకారం, 2012–13 నుంచి 2021–22 మధ్యకాలంలో మిలిటరీ, రక్షణ రంగాల మూలధన వ్యయం విదేశీ మారక ద్రవ్యంలో 35 శాతం వరకూ ఉందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. ఒకానొక దశలో ఇది 49 శాతానికి కూడా చేరు కున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. వ్యూహాత్మక విషయాల్లో స్వతంత్రంగా ఉండాలన్న దేశ ఆకాంక్షలకు ఇది భిన్నం.
డీఆర్డీవో, ఇతర రక్షణ రంగ సంస్థలు మొదలై సుమారు ఏడు దశాబ్దాలు అవుతోంది. అణ్వాయుధాలు, క్షిపణులు, అణు చోదక వ్యవస్థల విషయంలో ప్రశంసార్హమైన ప్రగతి సాధించాము. ఇందులో ముప్ఫై ఏళ్లు అగ్రరాజ్యం అమెరికా ఎన్నో ఆంక్షలున్న సంగతి తెలిసిందే. అయితే యుద్ధ ట్యాంక్, యుద్ధ విమానం, జలాంతర్గాముల విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. డీఆర్డీవో, ప్రభుత్వ రంగ సంస్థలు రెండూ దేశ యుద్ధ సన్నద్ధతను గణనీయంగా పెంచిందీ లేదు.
సొంత డిజైన్లు లేవు!
ప్రస్తుత ప్రభుత్వం దృష్టి ప్రధానంగా ప్రైవేట్ రంగం, విద్యాసంస్థల సహకారంపై ఉంది. ఆహ్వానించ దగ్గదే. కానీ ఈ సహకారానికి సంబంధించి పద్ధతులు, సమయావధులు నిర్ణయం కావాల్సి ఉంది. భారత్‌కు ఉన్న ఇంకో బలహీనత ఏమిటంటే... గణనీయమైన జీడీపీ, నైపుణ్యం, విద్యార్హతలున్న మానవ వనరులు, ఉన్నత విద్యాసంస్థలు ఎన్ని ఉన్నా... మిలిటరీ పరికరాలకు సంబంధించి సొంత డిజైన్ లేకపోవడం!
1960లలో ఐషాపోర్ రైఫిల్, హెచ్‌ఎఫ్–24 మారుత్ యుద్ధ విమానాలు కొంతమేరకు మాత్రమే విజయం సాధించాయన్నది గుర్తుపెట్టుకోవాలి. ఫలితంగా ఇప్పటికీ మనం వ్యక్తిగత ఆయుధాల కోసం కూడా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. అగ్ని–5 వంటి క్షిపణులను సమర్థంగా ఉత్పత్తి చేయగల భారత్ లాంటి దేశానికి ఇదేమంత అనుకూలమైన అంశం కాదు.
డీఆర్డీవో విషయాన్నే ప్రత్యేకంగా పరిశీలిస్తే... సంస్కరణలను ఆహ్వానిస్తూనే తన సొంత శక్తి సామర్థ్యాలపై లోతైన సమీక్ష చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాలి. స్వతంత్ర నిపుణుల ఆధ్వర్యంలో ఇలాంటి అధ్యయనం ఒకటి జరిపి ఫలితాల ఆధారంగా భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందించుకోవడం అవసరం. లేదంటే సంస్కరణల ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిపోయే ప్రమాదం ఉంది.
సి. ఉదయ్ భాస్కర్
వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment