![India, US to double bilateral trade to 500 billion dollers by 2030](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/140220250330-PTI02_14_2025_.jpg.webp?itok=aeVUm9qR)
2030 కల్లా 500 బిలియన్ డాలర్లకు
ట్రంప్–మోదీ భేటీలో కీలక నిర్ణయాలు
భారత్‌కు ఎఫ్–35 యుద్ధ విమానాలు
భారీగా చమురు, సహజవాయువు
వైట్‌హౌస్‌లో అధ్యక్షునితో ప్రధాని భేటీ
రెండోసారి బాధ్యతలు చేపట్టాక తొలిసారి మోదీని ఆత్మీయంగా ఆహ్వానించిన ట్రంప్
సుదీర్ఘ కరచాలనం, సుదృఢ ఆలింగనం
అనంతరం మీడియాతో సంయుక్త భేటీ
భారత్‌పైనా సమాన టారిఫ్‌లు తప్పవు
మోదీ సమక్షంలోనే ట్రంప్ స్పషీ్టకరణ
వాషింగ్టన్: ట్రంప్ 2.0తో మోదీ 3.0 తొలి భేటీ బంపర్ హిట్టయింది. భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా రెండింతలకు పెంచి 500 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయం జరిగింది. అందులో భాగంగా భారత్‌కు అమెరికా అత్యాధునిక ఎఫ్–35 యుద్ధ విమానాలను అందజేయడమే గాక రక్షణ ఉత్పత్తులను ఎగుమతులను ఇతోధికంగా పెంచనుంది. భారీగా చమురు, సహజవాయువు కూడా సరఫరా చేయనుంది. ఇరు దేశాలూ పౌర అణు సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)తో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) జరిపిన సమావేశం ఇలాంటి పలు కీలక ఒప్పందాలకు వేదికైంది. రెండు రోజుల అమెరికా పర్యటన(Usa Tour)లో భాగంగా అధ్యక్షునితో మోదీ శుక్రవారం (భారత కాలమానం ప్రకారం) వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో భేటీ అయ్యారు. మోదీ మూడోసారి ప్రధానిగా, ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించాక వారి మధ్య ఇదే తొలి సమావేశం కావడం విశేషం.
మోదీని ట్రంప్ అత్యంత ఆత్మీయంగా స్వాగతించారు. చాలాసేపటిదాకా కరచాలనం చేయడమే గాక ప్రధానిని గట్టిగా హత్తుకున్నారు. ‘మీరో అద్భుతమైన వ్యక్తి. గొప్ప మిత్రుడు. మిమ్మల్నెంతగానో మిస్సయ్యాం’ అంటూ అత్యంత ఆప్యాయంగా పలకరించారు. అనంతరం భారత్, అమెరికా వాణిజ్య, దౌత్య సంబంధాలు, రక్షణ రంగంలో పరస్పర సహకారంతో పాటు పలు అంశాలపై నేతలిద్దరూ సుదీర్ఘంగా చర్చించుకున్నారు. పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తర్వాత 44 నిమిషాల పాటు మీడియాతో సంయుక్తంగా మాట్లాడారు. అమెరికాకు మోదీ చిరకాల మిత్రుడంటూ మీడియా ముఖంగా కూడా ట్రంప్ పదేపదే ప్రశంసించారు.
భారీ వర్తక ఒప్పందం: ట్రంప్
చైనాతో పాటు పలు దేశాలపై దూకుడైన టారిఫ్‌ల యుద్ధం ప్రకటించిన ట్రంప్, భారత్‌పై టారిఫ్‌ల విషయంలో మాత్రం కాస్త సున్నితంగానే స్పందించారు. కాకపోతే పరస్పర టారిఫ్‌ల విషయంలో మాత్రం అస్సలు మొహమాటపడబోమని మోదీ సమక్షంలో ట్రంప్ కుండబద్దలు కొట్టారు. అమెరికాపై భారత్ విధించే సుంకాలనే తామూ విధించి తీరతామన్నారు.
పలు అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న దిగుమతి సుంకాలు చాలా హెచ్చుగా, ఏకపక్షంగా ఉన్నాయంటూ సంయుక్త మీడియా భేటీలోనే ఆక్షేపించారు. అయితే, అమెరికా నుంచి చమురు, సహజవాయువు దిగుమతుల పరిమాణాన్ని భారీగా పెంచేందుకు మోదీ సమ్మతించారని అధ్యక్షుడు వెల్లడించారు. ఆ రెండింట్లో భారత్‌కు తామే అతి పెద్ద సరఫరాదారులం కాబోతున్నట్టు చెప్పారు.
‘‘భారత్‌తో వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు రక్షణ హార్డ్‌వేర్ తదితర ఉత్పత్తుల ఎగుమతులను ఈ ఏడాది నుంచి ఏటా బిలియన్ డాలర్ల మేరకు పెంచనున్నాం. అంతేగాక ప్రపంచంలోకెల్లా అత్యంత అధునాతనమైన ఎఫ్–35 స్టెల్త్ ఫైటర్లను భారత్‌కు అందజేస్తాం. భారత్‌తో అతి త్వర లో భారీ వర్తక ఒప్పందం కుదరనుంది. పౌర అణు ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం.
ఇందులో భా గంగా అమెరికా అణు పరిజ్ఞానాన్ని భారత్ తన మార్కెట్లలోకి అనుమతించనుంది’’ అని వెల్లడించారు. భారత్–పశి్చమాసియా–యూరప్ ఆర్థిక కారిడార్ దిశగా కృషి చేయాలని అంగీకారానికి వచ్చామన్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు ముకుతాడు వేసే దిశగా అధినేతల భేటీలో మరిన్ని నిర్ణయాలు జరిగాయి. వాటిలో భాగంగా భారత్‌కు మరో 6 అత్యాధునిక పీ–8ఐ దీర్ఘశ్రేణి సముద్ర నిఘా విమానాలను విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు, స్ట్రైకర్ యుద్ధ వాహనాలను భారత్‌లో సంయుక్త తయారీ తదితరాలకూ సమ్మతించింది.
పదేళ్లకు రోడ్‌మ్యాప్: మోదీ
భారత్, అమెరికా పరస్పర సహకారాత్మక బంధం మెరుగైన ప్రపంచానికి బాటలు పరుస్తుందని మోదీ ఆశాభావం వెలిబుచ్చారు. రక్షణ రంగంలో పరస్పర సహకారానికి వచ్చే పదేళ్ల కాలానికి రోడ్‌మ్యాప్ రూపొందించుకుంటామని చెప్పారు. అంతరిక్ష రంగంలో సహకారాన్ని మరింత పెంపొందించుకుంటామని చెప్పారు. 2025ను అమెరికా–భారత్ పౌర అంతరిక్ష సహకార సంవత్సరంగా అభివర్ణించారు. ‘‘అన్ని విషయాల్లోనూ అమెరికా ప్రయోజనాలకే ట్రంప్ పెద్దపీట వేస్తారు.
ఇది నేనెంతగానో అభినందించే విషయం. భారత ప్రయోజనాలకు నేను కూడా అంతే’’ అని వివరించారు. వ్యాపారవేత్త గౌతం అదానీ వివాదంపై ట్రంప్‌తో చర్చించారా అని ప్రశ్నించగా వ్యక్తులను గురించి అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని చెప్పారు. చైనాతో లద్దాఖ్ వివాదాన్ని ప్రస్తావించగా సరిహద్దు ఘర్షణలు ఎవరికీ మంచివి కావని అభిప్రాయపడ్డారు. ట్రంప్ జోక్యం చేసుకుని చైనా, భారత్, రష్యా, అమెరికా కలసికట్టుగా సాగాలని అభిలషించారు. ట్రంప్‌తో భేటీ అద్భుతంగా సాగిందని అనంతరం మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. రెండు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని శుక్రవారం ఆయన భారత్ బయల్దేరారు.
ముంబై దోషుల్ని శిక్షించాల్సిందే
ఇస్లామిక్ రాడికల్ ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అమెరికా సంఘీభావం ప్రకటించింది. దాన్ని రూపుమాపేందుకు సంయుక్తంగా పోరాడతామని ట్రంప్ స్పష్టం చేశారు. 2008 ముంబై ఉగ్ర దాడుల దోషులందరికీ శిక్ష పడేలా చూడాల్సిందేనని పాకిస్తాన్‌కు స్పష్టం చేశారు. ఆ దాడుల్లో నిందితుడైన తహవ్వుర్ రాణాను భారత్‌కు అప్పగిస్తున్నట్టు సంయుక్త విలేకరుల భేటీలో అధ్యక్షుడు ధ్రువీకరించారు. ‘‘ప్రపంచంలోకెల్లా అత్యంత హింసాత్మక వ్యక్తుల్లో ఒకరిని భారత్‌కు అప్పగిస్తున్నామని చెప్పేందుకు సంతోషిస్తున్నా. ముంబై ఉగ్ర దాడులకు పాల్పడ్డందుకు అక్కడ న్యాయ విచారణను ఎదుర్కొంటాడు.
త్వరలో మరికొందరిని కూడా అప్పగిస్తాం’’ అని పేర్కొన్నారు. తద్వారా ఖలిస్తానీ వేర్పాటువాది పన్ను తదితరులకు పరోక్షంగా హెచ్చరిక సంకేతాలిచ్చారు. రాణా అప్పగింత పట్ల అమెరికాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా తొలినుంచీ కలసికట్టుగా పని చేస్తున్నాయని గుర్తు చేశారు. ముంబై తరహా దాడులను నివారించేందుకు, అల్‌ఖైదా, ఐసిస్, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా తదితర ఉగ్ర సంస్థల ఆట కట్టించేందుకు సంయుక్త కృషిని కొనసాగిస్తామని ఇరు దేశాల సంయుక్త ప్రకటన కూడా పేర్కొంది. పాక్ మూలాలున్న రాణా కెనడా జాతీయుడు. పాక్–అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో పాటు ముంబై దాడుల్లో ప్రధాన నిందితుడు. ప్రస్తుతం లాస్ ఏంజెలిస్ జైల్లో ఉన్నాడు.
భారత్‌లో అమెరికా వర్సిటీల క్యాంపస్‌లు
పలు ప్రఖ్యాత అమెరికా విశ్వవిద్యాలయాలు త్వరలో భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నాయి. ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చల్లో ఈ మేరకు నిర్ణయం జరిగింది. ఉన్నత విద్యా రంగంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవాలని కూడా నిశ్చయించారు. ఇందుకోసం పరస్పర సంయుక్త డిగ్రీలు తదితర పథకాలతో పాటు జాయింట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలో చదువుతున్న 3 లక్షలకు పై చిలుకు భారత విద్యార్థుల వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థకు ఏటా 8 బిలియన్ డాలర్ల దాకా అందుతోందని నేతలిద్దరూ గుర్తు చేసుకున్నారు. అమెరికాలోని భారత సమాజానిది ఇరు దేశాల బంధంలో అతి కీలక పాత్ర అని మీడియా భేటీలో ట్రంప్ చెప్పారు. లాస్ ఏంజెలిస్, బోస్టన్ నగరాల్లో త్వరలో భారత కాన్సులేట్లు తెరవనున్నట్టు వెల్లడించారు.
మానవ అక్రమ రవాణాపై పోరు: మోదీ
మనుషుల అక్రమ రవాణా భారత్‌కు మాత్రమే పరిమితమైన సమస్య కాదని ప్రధాని మోదీ అన్నారు. దాన్ని ప్రపంచ సమస్యగా అభివరి్ణంచారు. పెద్ద కలలు కనే సాధారణ కుటుంబాలకు చెందిన అమాయకులను పరాయి దేశాల్లో అక్రమ వలసదారులుగా మారుస్తున్న ఈ జాఢ్యంపై దీనిపై దేశాలన్నీ కలసికట్టుగా పోరాడాల్సి ఉందన్నారు. ‘‘పరాయి దేశంలో అక్రమంగా ప్రవేశించే వారెవరికీ అక్కడ నివసించే హక్కుండబోదు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్టు తేలిన భారతీయులందరినీ వెనక్కు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని స్పష్టం చేశారు. ఈ అంశం ట్రంప్–మోదీ చర్చల్లో కూడా ప్రస్తావనకు వచ్చిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తెలిపారు.
తటస్థం కాదు, శాంతివైపే
ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ శాంతివైపే నిలిచింది తప్ప ఏనాడూ తటస్థ వైఖరితో వ్యవహరించలేదని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయమై కొన్ని దేశాలకు ఉన్న అభిప్రాయం అపోహ మాత్రమేనన్నారు. ‘‘రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి సాధనకు దౌత్యమే మార్గం తప్ప యుద్ధం కాదు. ఈ దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిస్తున్నా. ఇది యుద్ధాల యుగం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు స్పష్టంగా చెప్పా’’ అని చెప్పారు.
బేరాల్లో నాకన్నా మొనగాడు: ట్రంప్
ట్రంప్, మోదీ సంయుక్త మీడియా సమావేశం అత్యంత స్నేహపూర్వకంగా, పలు సందర్భాల్లో సరదా మాటలతో సాగింది. ఇద్దర్లో ఎవరు మెరుగ్గా బేరమాడతారని మీడియా ప్రశ్నించగా ఆ విషయంలో మోదీదే పై చేయంటూ ట్రంప్ టక్కున బదులిచ్చారు. ‘‘మోదీ నా కంటే చాలా గట్టిగా, మెరుగ్గా బేరమాడగలరు. ఆయనతో పోటీ కూడా పడలేను. అందులో అనుమానమే లేదు’’ అంటూ నవ్వులు పూయించారు. భేటీ పొడవునా మోదీని అధ్యక్షుడు పదేపదే ప్రస్తుతించారు. ‘‘ఆయనో గొప్ప నాయకుడు. ప్రధానిగా అద్భుతంగా రాణిస్తున్నారు.
దేశాధినేతలతో పాటు ఎవరిని చూసినా ఆయన గురించే మాట్లాడతారు. భారత్‌లోనూ, అమెరికాలోనూ మోదీ, నేను ఎంతో సమయం కలిసి గడిపాం. ఆయన ప్రత్యేకమైన వ్యక్తి. అందమైన భారతదేశంలో ఐదేళ్ల కింద పర్యటించా. నా భార్య మెలానియాతో కలిసి అద్భుతమైన సమయం గడిపా. అప్పుడు మోదీ ఇచ్చిన అద్భుతమైన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడాయనకు అదే తరహాలో ఆతిథ్యం ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా మిత్రుడు మోదీకి మరోసారి స్వాగతం పలికినందుకు ఎంతో థ్రిల్లవుతున్నా’’ అని చెప్పుకొచ్చారు. జనవరి 20న ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక అమెరికాలో పర్యటించిన తొలి విదేశీ నేతల్లో మోదీ ఉన్నారు.
మాగా.. మిగా కలిస్తే మెగా
ట్రంప్ నినదించిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (ఎంఏజీఏ–మాగా) స్ఫూర్తితో మేక్ ఇండియా గ్రేట్ అగైన్ (ఎంఐజీఏ–మిగా) నినాదం ఇస్తున్నానని ప్రధాని మోదీ ప్రకటించారు. రెండూ కలిసి మెగా భాగస్వామ్యంగా మారతాయని ధీమా వెలిబుచ్చారు.
మిషన్ 500
భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణాన్ని 2030 కల్లా 500 బిలియన్ డాలర్లకు పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇందులో భా గంగా పరస్పర సుంకాలను బాగా తగ్గించుకోవాలని, మార్కెట్ యాక్సెస్‌ను పెంపొందించుకోవాలని తీర్మానించాయి. మోదీ–ట్రంప్ భేటీ అనంతరం ఇరు దేశాలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ముఖ్యాంశాలు...
→ ఈ సంవత్సరాంతానికల్లా ద్వైపాక్షిక వర్తక ఒప్పందం (బీటీఏ) కుదరనుంది. ఇరు దేశాల నుంచి ఉన్నత స్థాయి ప్రతినిధులు లోతుగా చర్చిస్తారు.
→ సైనిక భాగస్వామ్యం, వేగవంతమైన వాణిజ్య, సాంకేతిక బంధం దిశగా అవకాశాలను నిశితంగా పరిశీలించేందుకు ఉద్దేశించిన ‘కాంపాక్ట్’ మిషన్‌ను ముందుకు తీసుకెళ్లే మార్గాలను అన్వేషిస్తారు.
→ వస్తువులు, సేవల రంగంతో పాటు అన్నింటా వరక్త వాణిజ్యాలు మరింత వేగవంతం అవుతాయి.
→ నాసా–ఇస్రో సంయుక్త ఆక్సియోమ్ మిషన్ ద్వారా భారత వ్యోమగామి తొలిసారి ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్నాడు.
→ త్వరలో నాసా–ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ (నిసార్) మిషన్‌ను ప్రయోగించనున్నాం.
→ ట్రాన్స్‌ఫారి్మంగ్ ద రిలేషన్‌షిప్ యుటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ (ట్రస్ట్) పథకం ద్వారా రక్షణ, ఏఐ, సెమీ కండక్టర్లు, క్వాంటమ్, బయోటెక్నాలజీ, ఇంధన, అంతరిక్ష తదితర రంగాల్లో ప్రభుత్వాల, ప్రైవేటు స్థాయిలో పరస్పరం మరింత సహాయక సహకారాలు.
Comments
Please login to add a commentAdd a comment