India US relations
-
టారిఫ్ వార్ 2.0!
‘చైనా, బ్రెజిల్, భారత్... అమెరికాపై దిగుమతి సుంకాల మోత మోగిస్తున్నాయి. కొన్ని ఉత్పత్తులపై చైనా కంటే భారీగా భారత్ సుంకాలను విధిస్తోంది. ‘టారిఫ్ కింగ్’గా మారింది. నేను తిరిగి అధికారంలోకి వస్తే టిట్–ఫర్–టాట్ సుంకాలతో బదులు తీర్చుకుంటాం. అమెరికాను మళ్లీ అత్యంత సంపన్న దేశంగా మార్చాలంటే ప్రతీకార టారిఫ్‌లే మందు’. గతేడాది అక్టోబర్‌లో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలివి. అనుకున్నట్లే బంపర్ విక్టరీతో మళ్లీ అగ్రరాజ్యాధిపతిగా శ్వేత సౌధంలో కొలువుదీరనున్నారు. ట్రంప్ అమెరికా ఫస్ట్ ఎజెండాతో భారత్ సహా చాలా దేశాలకు టారిఫ్ వార్ గుబులు పట్టుకుంది. ప్రచారంలో ట్రంప్ ఊదరగొట్టిన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)’ నినాదం గనుక అమల్లోకి వస్తే... ఆటోమొబైల్, టెక్స్టైల్, ఫార్మా వంటి కొన్ని కీలక రంగాల్లో ఎగుమతులపై అధిక కస్టమ్స్ సుంకాలకు దారితీసే అవకాశం ఉందని వాణిజ్య రంగ నిపుణులు చెబుతున్నారు. చైనాతో పాటు భారత్, మరికొన్ని దేశాలపై సుంకాల పెంపు ద్వారా ట్రంప్ 2.0లో మలివిడత టారిఫ్ వార్‌కు ట్రంప్ తెరతీయవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ‘ట్రంప్ రెండో విడత అధికారంలో అమెరికా ఫస్ట్ నినాదానికి అనుగుణంగానే భారత్ ఉత్పత్తులపై రక్షణాత్మక చర్యలు, ప్రతీకార సుంకాలు విధింవచ్చు. ఈ జాబితాలో వాహన రంగం, వైన్స్, టెక్స్టైల్స్, ఫార్మా, స్టీల్ వంటి కీలక రంగాల్లో అడ్డంకులకు ఆస్కారం ఉంది. దీనివల్ల ఆయా పరిశ్రమల ఆదాయాల్లో కోత పడుతుంది’ అని శ్రీవాస్తవ చెప్పారు. అయితే, మనతో పోలిస్తే చైనాపై టారిఫ్ వార్ తీవ్రంగా ఉంటే గనుక, అది భారతీయ ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు కలి్పస్తుందన్నారు. అతిపెద్ద వాణిజ్య భాగస్వామి... భారత వస్తు, సేవలకు సంబంధించి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలుస్తోంది. ద్వైపాక్షిక వాణిజ్యం 2023–24లో 190 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక పెట్టుబడుల విషయానికొస్తే, అమెరికా మూడో అతిపెద్ద ఇన్వెస్టర్. 2000 నుంచి 2024 మధ్య 66.7 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) భారత్ అందుకుంది! కాగా, ఇంజనీరింగ్ గూడ్స్, స్టీల్ వంటి అత్యధిక ఎగుమతి ఆదాయ రంగాలపై అమెరికా భారీగా టారిఫ్‌లు విధిస్తే, ప్రభావం తీవ్రంగా ఉంటుందని సీఐఐ జాతీయ ఎగ్జిమ్ కమిటీ కో–చైర్మన్ సంజయ్ బుధియా పేర్కొన్నారు. ట్రంప్ గత హయాంలో స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై 10–25 % అదనపు సుంకాలు విధించడంతో, భారత్ 28 ఉత్పత్తులపై ప్రతీకార టారిఫ్‌లతో బదులిచ్చింది. ఇవే కాకుండా డెయిరీ ఉత్పత్తులు (188%), పండ్లు–కూరగాయలు (132%), నూనె గింజలు, ఫ్యాట్స్, ఆయిల్స్ (164 శాతం), బేవరేజెస్–పొగాకు (150%)పై కూడా అమెరికా అధిక టారిఫ్‌లతో విరుచుకుపడింది.వస్తు ఎగుమతి–దిగుమతులు (బి. డాలర్లలో) వాణిజ్య వివాదాలు పెరగవచ్చు... ట్రంప్ 2.0 హయాంలో వాణిజ్య పరంగా కష్టాలకు ఆస్కారం ఉంది. అధిక టారిఫ్‌ల కారణంగా వాణిజ్య వివాదాలు పెరగవచ్చు. గతంలో మాదిరిగా రక్షణాత్మక విధానం, కఠిన వలస నిబంధనల ట్రెండ్ కొనసాగుతుంది. – అజయ్ సహాయ్, భారత ఎగుమతి సంస్థల సమాఖ్య డైరెక్టర్ జనరల్ టెక్ బంధాన్ని బలోపేతం చేసుకుందాం... ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు శుభాకాంక్షలు. ఇరు దేశాల మధ్య నెలకొన్న అద్భుతమైన టెక్నాలజీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కొత్త ప్రభుత్వంతో మరింత సన్నిహితంగా కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నాం. ద్వైపాక్షిక వాణిజ్యంలో టెక్నాలజీ రంగం ‘వెన్నెముక’గా నిలుస్తోంది. – సింధు, గంగాధరన్, నాస్కామ్ చైర్పర్సన్ఎగుమతులకు కొత్త మార్కెట్లు.... ట్రంప్ 2.0 హయాంలో చైనా, కొన్ని యూరప్ దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు, దిగుమతి నియంత్రణలకు ఆస్కారం ఉంది. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులకు కొత్త మార్కెట్లకు ద్వారాలు తెరుచుకుంటాయి. ట్రంప్ భారత్‌ను ట్రంప్ మిత్ర దేశంగానే పరిగణిస్తారు. దీనివల్ల యూఎస్ కంపెనీల పెట్టుబడులు పెరుగుతాయి. ట్రంప్ విజయం భారత్‌కు సానుకూలాంశమే. – రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ -
US-India Relations: బలమైన రక్షణ బంధం
న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు శుక్రవారం ఢిల్లీలో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వీటిలో పాలుపంచుకున్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ, అరుదైన ఖనిజాల అన్వేషణ, అత్యున్నత సాంకేతికత వంటి రంగాల్లో కలిసి పని చేయాలని నిర్ణయించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, పశ్చిమాసియాలో పరిణామాలు, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక దూకుడుకు అడ్డుకట్ట వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై మంత్రులు చర్చించుకున్నారు. అనంతరం చర్చల వివరాలను వెల్లడిస్తూ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ముంబైలో 26/11 ఉగ్ర దాడులకు, పఠాన్‌కోట్ దాడులకు పాల్పడ్డ ముష్కరులకు శిక్ష పడి తీరాల్సిందేనని ప్రకటన స్పష్టం చేసింది. ఈ మేరకు పాకిస్థాన్‌కు మంత్రుల భేటీ స్పష్టమైన హెచ్చరికలు చేసిందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంతో పాటు ఐసిస్ సహా ఉగ్ర సంస్థలన్నింటినీ నిర్మూలించేందుకు అన్ని దేశాలూ కలసికట్టుగా ప్రయత్నించాలని పిలుపునిచి్చనట్టు వివరించింది. ఫలప్రదం: జై శంకర్ అమెరికా మంత్రులతో చర్చ లు ఫలప్రదంగా సాగాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ సంబంధాలను మెరుగుపర్చుకోవడం, అంతరిక్ష పరిశోధనలు, సాంకేతికత రంగాల్లో పరస్పరం సహకరించుకోవడంతోపాటు రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలపై చర్చించుకున్నామని తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అంతకముందు చర్చల ప్రారంభ కార్యక్రమంలో ఎస్.జైశంకర్ మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి ఈ చర్చలు ఒక అద్భుత అవకాశమని అభివరి్ణంచారు. భారత్–అమెరికా మరింత సన్నిహితం కావడంతోపాటు ఉమ్మడి నిర్మాణాత్మక గ్లోబల్ అజెండాను రూపొందించుకోవాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లక్ష్యమని గుర్తుచేశారు. ఇరు దేశాల సంబంధాలు ఇతోధికంగా వృద్ధి చెందుతున్నాయన్నారు. ఇండో–పసిఫిక్‌ను స్వేచ్ఛాయుత, వృద్ధిశీల, భద్రతాయుతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యమిస్తున్నట్టు బ్లింకెన్ తెలిపారు. అంతేగాక అంతర్జాతీయ శాంతి, భద్రత తదితరాల సాధనకు కూడా ఇరు దేశాలూ కలసికట్టుగా కృషి చేస్తున్నాయన్నారు. భారత్–అమెరికా సంబంధాలకు రక్షణ ఒప్పందాలు మూలస్తంభంగా నిలుస్తున్నాయని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు. చైనా దూకుడుకు సంయుక్తంగా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. సంయుక్తంగా సాయుధ సైనిక వాహనాల తయారీ: ఆస్టిన్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కీలకమైన సాయుధ సైనిక వాహనాల సంయుక్త తయారీ విషయంలో తక్షణం ముందుకు వెళ్లాలని భారత్–అమెరికా నిర్ణయించినట్టు లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఇరు దేశాల సైనిక దళాల మధ్య సమాచార వ్యవస్థను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అలాగే ద్వైపాక్షిక రక్షణ పారిశ్రామిక వ్యవస్థల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచేందుకు ఉద్దేశించిన సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్మెంట్ (ఎస్ఓఎస్ఏ) ఒప్పందం ఖరారు తుది దశకు చేరిందని మంత్రి చెప్పారు. జీఈ ఎఫ్–414 జెట్ ఇంజన్లను భారత్‌లో తయారు చేసేలా జనరల్ ఎలక్ట్రిక్ ఏరో స్పేస్, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఊపందుకున్నాయన్నారు. అలాగే భారత్‌కు వీలైనంత త్వరగా అత్యాధునిక ఎంక్యూ–9బి డ్రోన్లను సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు. ఇది 300 కోట్ల డాలర్ల ఒప్పందం. ఆగడాలకు అడ్డుకట్ట పడాల్సిందే: భారత్ కెనడాలో ఖలిస్తానీ శక్తుల ఆగడాలు పెరిగిపోతుండటం ఆందోళనకరమని అమెరికాకు భారత్ స్పష్టం చేసింది. మంత్రుల చర్చల సందర్భంగా ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వట్రా మీడియాకు వెల్లడించారు. వాటికి అడ్డుకట్ట పడాల్సిందేనని బ్లింకెన్, లాయిడ్లకు రాజ్‌నాథ్ స్పష్టం చేశారన్నారు. ఈ విషయంలో భారత ఆందోళనను అర్థం చేసుకోగలమని వారు చెప్పారన్నారు. ప్రధానితో మంత్రుల భేటీ భారత్–అమెరికా ద్వైపాక్షిక బంధం ప్రపంచ శాంతికి, ప్రగతికి అతి పెద్ద చోదక శక్తిగా మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. మంత్రుల స్థాయి భేటీ అనంతరం అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులు బ్లింకెన్, ఆస్టిన్ ఇరువురు శుక్రవారం రాత్రి ఆయనతో సమావేశమయ్యారు. విదేశంగ మంత్రి జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా భేటీలో పాల్గొన్నారు. సదస్సు జరిగిన తీరును, తీసుకున్న నిర్ణయాలను వారు మోదీకి వివరించారు. ‘‘ప్రజాస్వామ్యం, బహుళత్వ విలువలపై భారత్, అమెరికాలకున్న ఉమ్మడి విశ్వాసం తిరుగులేనివి. ఇరు దేశాల మధ్య జరిగిన మంత్రుల స్థాయి చర్చలు ఆశించిన ఫలితాలు సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అంటూ భేటీ అనంతరం మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా శుక్రవారం మోదీకి ఫోన్ చేశారు. పశి్చమాసియా ఉద్రిక్తత తదితరాలపై నేతలు ఆందోళన వెలిబుచ్చారు. అక్కడ యుద్ధ మేఘాలు తీవ్ర రూపు దాలుస్తుండటం, ఉగ్రవాదం, మతి లేని హింస భారీ జన నష్టానికి దారి తీస్తుండటం దారుణమన్నారు. బ్రెజిల్ జీ20 సారథ్యం సఫలం కావాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. -
అమెరికా, భారత్ బంధాలకు హద్దుల్లేవ్
వాషింగ్టన్: అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక బంధాలకు హద్దుల్లేవని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు అత్యున్నత స్థాయికి చేరుకు న్నాయని, ఇరు దేశాలు పరస్పర అవసరాలు తీర్చుకుంటూ, సౌకర్యవంతమైన, అనుకూలమైన భాగస్వామ్యులుగా మెలగుతున్నాయని పేర్కొన్నారు. చంద్రయాన్ మాదిరిగా ఇరు దేశాల మధ్య బంధాలు చంద్రుడిని తాకాయని, అంతకుమించి హద్దుల్లేకుండా సాగిపోతున్నాయని అభివర్ణించారు. అమెరికాలో పర్యటిస్తున్న జైశంకర్ శనివారం ప్రవాస భారతీయులతో ఇండియా హౌస్‌లో సమావేశమయ్యారు. ఇక్కడ నిర్వహించిన సెలబ్రేటింగ్ కలర్స్ ఆఫ్ ఫ్రెండ్షిఫ్ కార్యక్రమానికి అమెరికాలో వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు తరలివచ్చారు. ప్రవాస భారతీయులనుద్దేశించి జై శంకర్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాల్ని మరో కొత్త స్థాయికి తీసుకువెళతామని చెప్పారు. ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చినా ఇరు దేశాల మధ్య సంబంధాలు పటిష్టంగా సాగుతున్నాయని, ఇక భవిష్యత్‌లో సరికొత్త రంగాల్లో అమెరికాతో కలిసి పని చేస్తామని వెల్లడించారు. భారత్‌లో నిర్వహించిన జీ–20 సదస్సుకి అమెరికా సహకారం అందించడం వల్లే విజయ వంతమైందని అన్నారు. ‘‘దేశాలు ఒకరితో ఒకరు వ్యాపారాలు చేస్తాయి. రాజకీ యాలు చేస్తాయి. మిలటరీ బంధాలు కలిగి ఉంటాయి. విన్యాసాలు నిర్వహిస్తాయి. సాంస్కృతిక బదలాయింపులు ఉంటాయి. అయి నప్పటికీ రెండు దేశాలు లోతైన మానవీయ సంబంధాలు కలిగి ఉండాలి. అప్పుడే ఆ బంధం సంపూర్ణమవుతుంది. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య అలాంటి సంబంధాలే ఉండాలి’’ అని జైశంకర్ వివరించారు. -
G20 summit: నేడే మోదీ– బైడెన్ చర్చలు
న్యూఢిల్లీ: జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య ప్రపంచ, వ్యూహాత్మక స్థాయి భాగస్వామ్యాన్ని మరింతగా దృఢతరం చేసుకోవడమే చర్చల ప్రధాన అజెండా కానుంది. స్వచ్ఛ ఇంధనం, వర్తకం, హై టెక్నాలజీ, రక్షణ వంటి రంగాల్లో ప్రస్తుత పరస్పర సహకారాన్ని సమీక్షించి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సమస్యలను అధిగమించే మార్గాలపై నేతలు దృష్టి సారిస్తారు. బైడెన్ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ చేరుకుంటారు. ఆదివారం జీ 20 సదస్సు ముగియగానే వియత్నాం బయల్దేరతారు. మోదీ, ఇతర నేతలతో ఈ వారాంతంలో ఫలప్రదమైన చర్చల కోసం బైడెన్ ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారని వైట్ అండ్ హౌజ్ ప్రెస్స్ కార్యదర్శి కరిన్ జీన్ పియరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చివరిసారిగా 2020లో భారత్‌ను సందర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. -
కిషన్‌రెడ్డికి ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ ఇన్క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్షిప్ అవార్డు’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఇన్క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్షిప్ అవార్డు’ వరించింది. భారత్–అమెరికాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్–టు–పీపుల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు నిర్వహించే యూఎస్ ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్ ఈ అవార్డును కేంద్రమంత్రికి అందించింది. భారతదేశపు సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు పర్యాటకాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన కృషికి గాను అందిస్తున్నట్లు తెలిపింది. అమెరికాలోని మేరీలాండ్ నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు ఈ అవార్డును కేంద్రమంత్రికి అందించారు. కిషన్ రెడ్డి ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘యూఎస్ ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్’ సంస్థ నుంచి లీడర్ షిప్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ ఘనమైన చరిత్రను, సంస్కృతిని కాపాడుకోవడంతోపాటు పర్యాటక రంగాభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డు దక్కింది’ అని పేర్కొన్నారు. -
భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణం
వాషింగ్టన్: భారత్‌లో మరింత మెరుగైన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇదే మంచి తరుణమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత వ్యాపార రంగంలో పారదర్శకమైన, సానుకూలమైన పాత్ర పోషించేందుకు అనువైన వాతావరణాన్ని భారత్, అమెరికా సంయుక్తంగా సృష్టించాయని ఆయన ఉద్ఘాటించారు. అమెరికా పర్యటనలో భాగంగా శుక్రవారం వాషింగ్టన్‌లోని కెన్నడీ సెంటర్లో అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, భారతీయ సంతతి వ్యక్తులు, దాతలతో మోదీ భేటీ అయ్యారు. ‘ఇరు దేశాల భాగస్వామ్యం అనేది అనువుగా మార్చుకున్న సంబంధం కాదు. ఇది పరస్పర వాగ్దానాలు, నిబద్దతకు నిదర్శనం’ అని మోదీ నొక్కిచెప్పారు. ‘ వాషింగ్టన్లో భిన్న రంగాల దిగ్గజాలతో భేటీ అద్భుతంగా కొనసాగింది. ఇందులో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ సైతం పాల్గొనడం విశేషం. భారత ప్రగతిపథ ప్రస్థానంలో భాగమయ్యేందుకు, దేశ అవకాశాల గనిని ఒడిసిపట్టేందుకు అమెరికా పెట్టుబడిదారులకు ఇదే చక్కని సమయం’ అని మోదీ ట్వీట్‌చేశారు. భారత్‌లో 75,000 కోట్ల పెట్టుబడి: గూగుల్ ‘భారత్‌లో దాదాపు రూ.75,000 కోట్ల(10బిలియన్ డాలర్ల) పెట్టుబడి పెట్టబోతున్నాం. ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా సంబంధిత వివరాలు ఆయనతో పంచుకున్నాను’ అని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇండియా డిజిటైజేషన్ ఫండ్‌లో భాగంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీ(గిఫ్ట్)లో తమ గ్లోబల్ ఫిన్‌టెక్ వ్యాపారకార్యకలాపాలను ప్రారంభిస్తామని గూగుల్ వెల్లడించింది. జీపేకు సపోర్ట్‌గా ప్రత్యేక కార్యకలాపాలను ‘గిఫ్ట్’లో మొదలుపెడతారని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు శనివారం పేర్కొన్నారు. ‘ఫిన్‌టెక్ రంగంలో భారత నాయకత్వాన్ని గూగుల్ గుర్తిస్తోంది. అందకే భారత్‌లో చిన్న, భారీ పరిశ్రమలకోసం సేవలు అందిస్తాం. దాంతోపాటే అమెరికాసహా ప్రపంచదేశాలకు ఇక్కడి నుంచే సేవలు కొనసాగుతాయి. ఈ ఏడాది చివరినాటికి ముఖ్యంగా మహిళల సారథ్యంలో మొదలయ్యే అంకుర సంస్థలకు మద్దతుగా నిలుస్తాం’ అని అధికార ప్రతినిధి చెప్పారు. అమెజాన్ మరో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అదనంగా 15 బిలియన్ డాలర్లు (రూ.1,23,000 కోట్లు) పెట్టుబడి పెట్టడం ద్వారా భారత్‌లో తన ఉనికిని మరింత పెంపొందించుకోవాలని అమెజాన్.కామ్ భావిస్తున్నట్లు అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం సందర్భంగా ఆయన ఈ విషయాలను తెలియజేశారు. ఈ అదనపు పెట్టుబడి 2030 నాటికి భారత్‌లోని వివిధ వ్యాపారాలలో సంస్థ మొత్తం పెట్టుబడిని 26 బిలియన్లకు (రూ.2,13,200 కోట్లకు) చేరుస్తుందని జస్సీ పేర్కొన్నారు. భారతీయ స్టార్టప్‌లను ప్రోత్సహించడం, ఉద్యోగాల కల్పన, ఎగుమతులను సులభతరం చేయడం, డిజిటల్ పరివర్తన, గ్లోబల్ మార్కెట్లో అభివృద్ధి చెందడానికి వ్యక్తులు వంటి అంశాలపై చర్చించారు. -
బంధం మరింత బలోపేతం
నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005లో దౌత్య వీసా ఇవ్వడానికి నిరాకరించిన అమెరికా.. ఇప్పుడు భారత ప్రధానమంత్రి హోదాలో మోదీకి రెడ్ కార్పెట్ వేసి మరీ గ్రాండ్ వెల్కమ్ చెబుతోంది. అగ్రరాజ్యాధీశుడు జో బైడెన్ అధికారిక పర్యటనకు ఆహ్వానించిన మూడో ప్రపంచ నాయకుడిగా ప్రధాని మోదీ కొత్త చరిత్ర లిఖిస్తున్నారు. ఆప్తమిత్ర దేశాల అధినేతలకే అమెరికా ఇలా తమ దేశానికి రమ్మని ఆతిథ్యం ఇస్తుంది. మోదీ పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు జూన్ 21 నుంచి 24 వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అగ్రరాజ్య పర్యటన సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. బైడెన్ కేబినెట్లో కీలక మంత్రులు నరేంద్ర మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నట్టు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంలో బంధాలు మరింత బలోపేతమవడానికి మోదీ పర్యటన అత్యంత కీలకంగా మారనుంది. ప్రధాని మోదీ ఇంతకు ముందు చాలాసార్లు అమెరికా వెళ్లినప్పటికీ ఈసారి అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానించడంతో ఈ పర్యటనకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. అయిదు రంగాలే ఎజెండా అంతర్జాతీయంగా అమెరికా, భారత్ మధ్య బంధం క్రమక్రమంగా బలోపేతమవుతూ వస్తోంది. ఇండో çపసిఫిక్ ప్రాంతంలో చైనాకు చెక్ పెట్టి స్వేచ్ఛాయుత వాణిజ్యం జరగడానికి ఇరుదేశాలు ఒక్కటిగా పని చేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జీ–20 సదస్సుకి భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి ముందు మోదీ అగ్రరాజ్యంలో పర్యటించడం దౌత్యపరంగా మనకు కలిసొచ్చే అంశం. అయిదు కీలక రంగాల్లో వ్యూహాత్మక సహకారం కోసం బైడెన్, మోదీ చర్చలు జరిపే అవకాశాలున్నాయి. రక్షణ, ఆరోగ్యం, సాంకేతిక పరిజ్ఞానం, సంప్రదాయేతర ఇంధనం, విద్య–విజ్ఞానం రంగాల్లో సహకారానికి ఒప్పందాలు కుదుర్చుకుని సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉంది. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి అయిదేళ్లలోనే ప్రధాని మోదీ రెండోసారి ప్రసంగించనున్నారు. 2016, జూన్ 8న మోదీ తొలిసారిగా కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడారు. బ్రిటన్ తరఫున విన్స్టన్ చర్చిల్, దక్షిణాఫ్రికా నుంచి మండేలా తర్వాత రెండు సార్లు కాంగ్రెస్‌నుద్దేశించి ప్రసంగించే అవకాశం మోదీకే వచ్చింది. ఈ సమావేశంలో మోదీ ఏం మాట్లాడతారన్న దానిపై ప్రపంచం యావత్తూ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు అన్ని విధాలుగా అమెరికా అండదండగా ఉంటే, తటస్థ వైఖరి అవలంబిస్తున్న భారత్‌కు ఈ అంశాన్ని డీల్ చేయడమే అతి పెద్ద సవాల్‌గా మారింది. రష్యాతో సన్నిహితంగా ఉంటూ రక్షణ రంగంలో భారీగా ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్ ఇప్పుడు అమెరికా నుంచి 30 ఎంక్యూ–9బీ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం చేసుకోనుంది. 2015–19 మధ్య కాలంలో అమెరికా నుంచి భారత్ రక్షణ రంగ దిగుమతులు 14 శాతం ఎగబాకాయి. అత్యాధునిక టెక్నాలజీని అగ్రరాజ్యం నుంచి అందిపుచ్చుకొని ప్రపంచ దేశాల్లో సూపర్ పవర్‌గా భారత్ మారడానికి మోదీ పర్యటన సాయపడుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉత్సాహంగా.. ఉల్లాసంగా ప్రధాని మోదీ అమెరికా ‘‘స్టేట్ విజిట్’’అనేది దౌత్యపరంగా అత్యున్నత స్థాయి పర్యటన. సుదృఢమైన సంబంధాలు కలిగిన మిత్రదేశాల అధినేతలకే అమెరికా ఇలాంటి పర్యటనలకి ఆహ్వానిస్తుంది.ఈ పర్యటన అంతా పలు వేడుకలతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతుంది. ప్రధాని మోదీ అమెరికాలో విమానం దిగిన దగ్గర నుంచి తిరుగు ప్రయాణమయ్యే వరకు రాచమర్యాదలతో పర్యటన సాగుతుంది. మ్యూజికల్ బ్యాండ్‌తో ఘనంగా స్వాగతం పలుకుతారు. శ్వేత సౌధంలో అడుగుపెట్టినప్పుడు 21సార్లు తుపాకుల్ని గాల్లో పేల్చి గౌరవ వందనం సమర్పిస్తారు. వైట్‌హౌస్‌లో ఇచ్చే విందు సమయంలో భారీగా కానుకల్ని సమర్పిస్తారు. అమెరికా అధ్యక్షుడి అతిథి గృహం బ్లెయిర్ హౌస్‌లో బసకల్పిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పర్యటన అంతా సందడిగా సాగేలా చూస్తారు. ఎందుకీ రెడ్ కార్పెట్..? దశాబ్దకాలంగా అమెరికా రాజకీయాల్లో ప్రవాస భారతీయుల పాత్ర విస్తృతమైంది. అమెరికాలో నివసిస్తున్న 50 లక్షల మంది భారతీయులు అక్కడ కీలక ఓటు బ్యాంకుగా మారారు. ప్రతీసారి అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యక్తి పోటీ పడుతూ వస్తున్నారు. గత ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఏకంగా ఉపాధ్యక్ష పదవి అందుకున్నారు. బైడెన్ తన ప్రభుత్వంలో కూడా భారతీయుల్ని నియమించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి పోటీ పడుతున్నారు. స్వింగ్ రాష్ట్రాల్లో ఇండియన్ అమెరికన్ల ఓట్లు అత్యంత కీలకమని గత ఎన్నికల్లోనే తేటతెల్లమైంది. గత ఎన్నికల్లో 74 శాతం మంది ఇండియన్ అమెరికన్లు బైడెన్‌కు మద్దతునిచ్చారని సర్వేల్లో తేలింది. ఇప్పుడు ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా డెమొక్రాట్లు భారత్‌కి దగ్గరన్న సంకేతాలు ప్రవాస భారతీయులకు పంపడానికే మోదీని ఆహ్వానించారని ఆసియన్ అమెరికన్లపై అధ్యయన సంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న సారా సాధ్వాని అభిప్రాయపడ్డారు. అమెరికాలో ప్రధాని మోదీకున్న ఇమేజ్ రాను రాను పెరుగుతూ వస్తోంది. 2014లో మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత అమెరికా వెళ్లినప్పుడు న్యూయార్క్‌లోని మ్యాడిసన్ స్క్వేర్‌లో 20 వేల మంది ప్రవాస భారతీయులు ఆయన సమావేశానికి వచ్చారు. 2019లో హస్టన్‌లో హౌడీమోడీ కార్యక్రమానికి 50 వేల మంది హాజరయ్యారు. ఈసారి టైమ్ స్క్వేర్ నుంచి నయాగారా జలపాతం వరకు ఇండియన్ అమెరికన్లు మోదీ అధికారిక పర్యటనకు వస్తూ ఉండడంతో గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సెప్టెంబర్‌లో భారత్‌కు బైడెన్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చే సెప్టెంబర్‌లో మొదటిసారిగా భారత్‌కు రానున్నారు. భారత్‌లో జరిగే జి–20 శిఖరాగ్రంలో ఆయన పాల్గొంటారని సహాయ మంత్రి (దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలు) డొనాల్డ్ లూ తెలిపారు. పర్యటనకు సంబంధించిన సన్నాహాలు సాగుతున్నాయన్నారు. జి–20 అధ్యక్షస్థానంలో ఉన్న భారత్ నాయకత్వ లక్షణాలు మరింత విస్తృతమై బలమైన దేశంగా నిలుస్తోందన్నారు. అమెరికా–భారత్ సంబంధాల్లో వచ్చే ఏడాది అత్యంత కీలకం కానుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా అపెక్, జపాన్ జి–7తోపాటు క్వాడ్ కూటమి సదస్సులు వచ్చే ఏడాది జరగనున్నాయి. వీటి తో భారత్–అమెరికా మరింత సన్నిహితమయ్యే అవకాశాలు పెరుగుతాయని లూ అన్నారు. -
భారతీయులకు ఈసారి 10 లక్షలకుపైగా వీసాలు..!
వాషింగ్టన్: భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నవేళ భారతీయుల వీసా ప్రక్రియను వేగిరం చేసి ఈ ఏడాది 10 లక్షలకుపైగా వీసాలు జారీచేస్తామని అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. విద్యార్థి వీసాలకు అధిక ప్రాధాన్యతనిచ్చేందుకు బైడెన్ సర్కార్ కృత నిశ్చయంతో ఉందని అమెరికా సహాయ మంత్రి (దక్షిణ, మధ్య ఆసియా విభాగం) డొనాల్డ్ లూ పీటీఐ వార్తాసంస్థతో చెప్పారు. ‘ వీసా ప్రాసెసింగ్ ప్రక్రియలో హెచ్–1బీ, ఎల్–వీసాలకూ తగిన ప్రాధాన్యత కల్పిస్తాం. విద్యార్థి వీసాలు, ఇమిగ్రెంట్ వీసాలుసహా మొత్తంగా ఈ ఏడాది ఏకంగా 10 లక్షలకుపైగా వీసాలను మంజూరుచేస్తాం. ఈసారి సమ్మర్ సీజన్లో అమెరికాలో విద్యనభ్యసించనున్న భారతీయ విద్యార్థుల సౌలభ్యం కోసం అన్ని స్టూడెంట్ వీసాల ప్రాసెసింగ్‌ను పూర్తిచేస్తాం’ అని చెప్పారు. బీ1(వ్యాపారం), బీ2(పర్యాటక) కేటగిరీలుసహా తొలిసారిగా వీసా కోసం దరఖాస్తుచేసుకున్న వారి అప్లికేషన్ల వెరిఫికేషన్ వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉన్న విషయం విదితమే. అమెరికాకు వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో సంఖ్య పరంగా ప్రపంచంలో భారత్ రెండోస్థానంలో ఉంది. కొన్ని చోట్ల 60 రోజుల్లోపే.. ‘హెచ్–1బీ, ఎల్ వీసాల జారీపైనా దృష్టిపెట్టాం. భారత్‌లోని కొన్ని కాన్సులేట్లలో ఈ వీసాల కోసం వేచిఉండే కాలం 60 రోజుల్లోపే. అమెరికా, భారత్ ఇరుదేశాల ఆర్థికవ్యవస్థకు ఈ వర్కింగ్ వీసాలు కీలకం. అందుకే వీటి సంగతీ చూస్తున్నాం’ అని వెల్లడించారు. ‘ పిటిషన్ ఆధారిత నాన్ఇమిగ్రెంట్ విభాగాల కింద దరఖాస్తుచేసిన వీసాదారులు తమ వీసా రెన్యువల్ కోసం మళ్లీ స్వదేశానికి వెళ్లిరావాల్సిన పనిలేకుండా అమెరికాలోనే పని పూర్తిచేసుకునేలా ఏర్పాటుచేయదలిచాం. ఇక ఆర్థిక అనిశ్చితి కారణంగా ఉద్యోగాలు కోల్పోయి 60 రోజుల్లోపు అమెరికాను వీడాల్సిన ప్రమాదం ఎదుర్కొంటున్న హెచ్–1బీ వీసాదారులకు.. అవకాశమున్న మరికొన్ని ‘వెసులుబాట్ల’ను వివరిస్తూ అదనపు సమాచారాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఇచ్చింది’ అని వివరించారు. -
ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి భారత్‌తో కలిసి పని చేస్తాం
వాషింగ్టన్: జీ20 సదస్సు ఆతిథ్య దేశంగా భారత్ ప్రత్యేకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అమెరికా అభిప్రాయపడింది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించడానికి రష్యాతో తనకున్న చిరకాల సత్సంబంధాలను భారత్ వినియోగించుకోవాలని చెప్పింది. ఈ సంక్షోభాన్ని వీలైనంత త్వరగా ముగించడానికి తాము కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. జీ20 విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం ఉక్రెయిన్ యుద్ధంపై ఏకాభిప్రాయానికి రావడంలో విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకరులతో మాట్లాడుతూ జీ20 సదస్సు ప్రారంభమయ్యే లోపు ఉక్రెయిన్ యుద్ధంపై ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని ఆశిస్తున్నట్టుగా తెలిపారు. ఇందుకోసం విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ ఒక దారి చూపించిందని ఈ ఏడాది కాలంలో ఇంకా చేయాల్సింది చాలా ఉందని అన్నారు. -
మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ గురించి తెలియని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విలేకరి అడిగిన ప్రశ్నకు ఈమేరకు బదులిచ్చారు. భారత్-అమెరికా బలమైన ప్రజాస్వామ్య దేశాలుగా ఉండటానికి కారణమైన భాగస్వామ్య విలువల గురించే తనకు తెలుసని చెప్పారు. 'మీరు అడుగుతున్న బీబీసీ డాక్యుమెంటరీ గురించి నాకు తెలియదు. కానీ భారత్-అమెరికా భాగస్వామ్య విలువల గురించి బాగా తెలుసు. వీటి వల్లే రెండు దేశాలు బలమైన ప్రజాస్వామ్య, అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఉన్నాయి. ఇండియాలో జరిగిన పరిణామాల గురించి గతంలోనే కొన్ని సందర్భాల్లో మాట్లాడాం.' అని ప్రైస్ పేర్కొన్నారు. భారత్-అమెరికా అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు కావడానికి రాజకీయ, ఆర్థిక కారణాలతో పాటు ప్రజా సంబంధాలు అత్యంత ముఖ్యమైనవని ప్రైస్ వివరించారు. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో సీఎంగా ఉన్న మోదీపై బీబీసీ రెండు భాగాల డాక్యుమెంటరీ రూపొందించింది. అయితే ఇది దురుద్దేశంతో తీసినట్లుగా ఉందని కేంద్రం ఫైర్ అయ్యింది. యూట్యూబ్, ట్విట్టర్లో ఈ వీడియోలను బ్లాక్ చేసింది. చదవండి: ఇలాంటి సన్నివేశాన్ని ఇండియాలో ఊహించగలమా? -
భారత్‌తో చెలిమికే బైడెన్ మొగ్గు!
బిల్ క్లింటన్ హయాంలో తప్ప ఎన్నికైన ప్రతి అమెరికా అధ్యక్షుడూ భారత్‌తో సామరస్య పూర్వకమైన సంబంధాలను నెలకొల్పుకోవడానికే ప్రాధాన్యతనిచ్చారు. జార్జి బుష్ జూనియర్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా భారత్ సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఆయన జట్టులోని కీలక సభ్యులు భారత్‌ను ఏ దృక్పథంతో చూస్తారనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా భారత్ సందర్శించిన బైడెన్‌కు భారత్ పట్ల సానుకూల అభిప్రాయమే ఉంది. భారత్‌పై అణు ఆంక్షలకు ముగింపు పలకాలంటూ మద్దతు పలికారు. బైడెన్ టీమ్‌లో ఉండబోతున్న కీలక అధికారులు సైతం తాలిబన్ల కట్టడి, పాకిస్తాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాద చర్యల నిరోధం వంటి అంశాలపై భారత్ అనుకూల వైఖరినే ప్రదర్శించగలరని సంకేతాలు వెలువడుతున్నాయి. కొత్తగా ఎన్నికయ్యే ప్రతి అమెరికా అధ్యక్షుడూ విదేశీ విధాన నిర్వహణపై తన వ్యక్తిగత ముద్ర వేయాలని చూడటం కద్దు. బిల్ క్లింటన్ అధ్యక్షుడుగా ఉన్నకాలంలో భారత్–అమెరికా సంబంధాలు దిగజారి పోయాయి. భారత్ అణ్వాయుధ కార్యక్రమాన్ని నిలిపి వేయడానికి క్లింటన్ శతథా ప్రయత్నించారు. కశ్మీర్ సమస్యకు సంబంధించి భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని ప్రయత్నించిన క్లింటన్, చైనాతో సత్సంబంధాలు కుదుర్చుకోవడానికి నడుం కట్టారు. క్లింటన్ అనంతరం గద్దెనెక్కిన జార్జి బుష్ (జూనియర్) భారత్‌తో అత్యంత మిత్రపూరితంగా వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడిగా చరి త్రలో మిగిలిపోయారు. భారతదేశంపై అంతర్జాతీయ అణు సంపన్న దేశాలు ఆంక్షలను ఎత్తివేయడంలో సహకారమందించారు. బుష్ నిర్దే శించిన పంథానే ఒబామా అనుసరించారు. భారత్‌తో సంబంధాలను ఇండో–పసిఫిక్ భద్రతా దృక్పథం నుంచి ఒబామా అంచనా వేశారు. వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధించినప్పటికీ, భద్రతాపరమైన అంశాలపై భారత్‌కు ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్ మద్దతుగా నిలిచారు. ఇకపై బైడెన్ హయాంలో జమ్మూ కశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరసత్వ చట్టాలు వంటి అంశాలపై అమెరికాకు భారత్ తగు హామీని ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వాలు స్వాగతించాయి. బైడెన్, అయన జట్టులోని కీలక సభ్యులు భారత్‌ను ఏ దృక్పథంతో చూస్తారనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో బైడెన్ భారత్ సందర్శించారు. భారత్‌తో బైడెన్ నెరిపిన కీలకమైన సంబంధాలు ఏవంటే... సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ చైర్మన్ హోదాలో నాటి అధ్యక్షుడు బుష్‌కి ఉత్తరం రాస్తూ, భారత దేశంపై అణు ఆంక్షలకు ముగింపు పలకాలని బైడెన్ మద్దతు పలికారు. ఉపాధ్యక్షుడి హోదాలో బైడెన్ 2013 జూలైలో భారత్‌ను సందర్శించారు. వాతావరణ మార్పుపై ఒప్పందం కోసం అంత ర్జాతీయ మద్దతును కూడగట్టడంలో అమెరికాకు సహకరించాల్సిందని భారత్‌ను ఒప్పించే ప్రచారం మొదలెట్టిన బైడెన్ తన పనిలో విజయం సాధించారు కూడా. పారిస్‌లో నిర్వహించిన 2015 వాతావరణ మార్పు సదస్సు సందర్భంగా అమెరికాకు భారత్ మద్దతిచ్చింది. ఈ సదస్సులోనే పర్యావరణ సమస్యలపట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రదర్శించిన చిత్తశుద్ధిని అమెరికా నిజంగానే మెచ్చుకుంది కూడా. విదేశీ విధానం, భద్రతా విధానాలకు సంబంధించిన సమస్యలపై బైడెన్ పాలనా యంత్రాంగంలో ముగ్గురు వ్యక్తులు కీలక స్థానాల్లో ఉండబోతున్నారు. సెనేట్ విదేశీ సంబంధాల కమిటీలో బైడెన్‌కు దీర్ఘకాలం పాటు సహకరించిన ఆంథోనీ బ్లింకెన్ (ప్రస్తుతం అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి కానున్నారు)తో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ వ్యవహరించవలసి ఉంటుంది. ఒబామా ప్రభుత్వంలో బ్లింకెన్ డిప్యూటీ విదేశీ మంత్రిగా వ్యవహరించారని గుర్తుంచుకోవాలి. భారత్‌తో సంబంధాల తీరుతెన్నుల గురించి ఈ ఏడాది జూలైలో వాషింగ్టన్లో ప్రసంగించిన బ్లింకెన్, భారత్‌తో దృఢమైన సంబం ధాలను నెలకొల్పుకోవడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ‘ఇండో–పసిఫిక్ భవిష్యత్తుకు ఇది ఎంతో ముఖ్యమైనది, మేం కోరు కుంటున్న వ్యవస్థ తీరుకు భారత్‌తో సంబంధాలు చాలా ముఖ్యమై నవి. నూతన వ్యవస్థ అనేది మరింత న్యాయబద్ధంగా, సుస్థిరంగా, మరింత ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని బ్లింకెన్ పేర్కొన్నారు. భారత్‌తో రక్షణరంగ పారిశ్రామిక సహకారం అభివృద్ధిని కూడా బ్లింకెన్ ఆకాంక్షించారు. దీనివల్ల భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తి గణనీయంగా మారిపోతుంది. జాతీయ భద్రతా విధానాలతో వ్యవహరించనున్న బైడెన్ టీమ్‌లో అత్యంత వృత్తిపర నైపుణ్యం, అనుభవం కలిగిన అధికారులు ఉన్నారు. 43 ఏళ్ల వయసున్న జాక్ సుల్లివాన్ ఇప్పుడు బైడెన్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. బైడెన్ ఉపాధ్యక్షుడిగా, హిల్లరీ క్లింటన్ విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు సుల్లివాన్ అత్యంత కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. మరొక ఆసక్తికరమైన నియామకం జనరల్ లాయిడ్ ఆస్టిన్. అమెరికా చరిత్రలో రక్షణ రంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ కావడం విశేషం. ఆస్టిన్ గతంలో యుఎన్ జనరల్ కమాండ్ అధిపతిగా వ్యవహరించేవారు. ఇది అఫ్గానిస్తాన్‌లో అమెరికా సైనిక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేది. కాబట్టి అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లకు మద్దతునివ్వడంలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ పాత్ర గురించి, అబోత్తాబాద్‌లో అల్ కాయిదా అధినేత బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆశ్రయమివ్వడం గురించి అస్టిన్ కాబోయే అధ్యక్షుడికి చక్కని సమాచారం ఇవ్వగలరు. పాకిస్తాన్ అణ్వాయుధ నిర్మాణంలో చైనా సహకారం గురించి భారత్‌కు చక్కటి సూచనలు అందించగలరు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో తాజా పరిస్థితి, పౌరసత్వ సవరణ చట్టం గురించి బ్లింకెన్ మాట్లాడుతూ, కశ్మీరులో స్వేచ్ఛగా సంచరిం చడం, వాక్ స్వేచ్ఛలను దెబ్బతీస్తూ భారత్ ఇటీవలి కాలంలో తీసు కున్న కొన్ని చర్యల గురించి కూడా ప్రస్తావించారు. భారతదేశంలో పౌరసత్వ చట్టాలపై కూడా ఆయన మాట్లాడారు. కొన్ని రంగాల్లో విభేదాలు ఉన్నప్పటికీ మరింత గొప్ప సహకారాన్ని నిర్మించు కోవడంపై మరింత మెరుగైన రీతిలో వ్యవహరించగలమని బ్లింకెన్ నొక్కి చెప్పారు. అదే సమయంలో జమ్మూ కశ్మీరుపై భారత్ పారదర్శక విధానాన్ని కలిగి ఉన్నదని మనం బైడెన్ పాలనా యంత్రాంగానికి స్పష్టం చేయ వలసిన అవసరం ఉంది. జమ్మూకశ్మీరులో ప్రజలు ఎన్నుకునే ప్రజా స్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ధృఢ నిర్ణయంతో ఉందని కూడా చెప్పవలసి ఉంది. జమ్మూకశ్మీర్‌లో ఉనికిలో ఉన్న ప్రజాతంత్ర సంస్థలను అణచిపెట్టడానికి, ఎన్నికలను విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఏమేరకు ప్రోత్సహిస్తుందన్న దానికి అనుగుణంగానే ఆ ప్రాంతంపై భారత్ విధానం ఉంటుందని అమెరికాకు అర్థం చేయించాల్సి ఉంది. అదే సమయంలో భారతదేశంలోనూ, అఫ్గానిస్తాన్‌లోనూ ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు నివ్వకుండా చేయడంలో అమెరికా తన పలుకు బడిని ఉపయోగించాలని భారత్ ఆశిస్తున్నదనే విషయాన్ని కూడా మనం అమెరికాకు స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. ఇకపోతే చైనా, రష్యాతో అమెరికా సంబంధాల్లో కూడా గణనీయమైన స్థాయిలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. చైనాపై డొనాల్డ్ ట్రంప్ హయాంలో మాదిరి తీవ్రమైన కఠిన పదజాలాన్ని ప్రయోగించడం తగ్గిపోవచ్చు. ఎందుకంటే పసిíఫిక్, హిందూ మహా సముద్రంలో తన సైనికపరమైన ఉనికిని అమెరికా కొనసాగించ నుంది. అయితే ట్రంప్ పాలనాయంత్రాంగం నుంచి రష్యా అందు కున్న ప్రాధాన్యత బైడెన్ హయాంలో లభించక పోవచ్చనిపిస్తుంది. అలాగే ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై విధించిన ఆంక్షలకు బైడెన్ యంత్రాంగం ముగింపు పలకవచ్చు. ఇది ఎంతైనా స్వాగతించవలసిన విషయం. ఎందుకంటే అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రాయోజిత ఉగ్రవా దాన్ని ఎదుర్కోవడంలో ఇరాన్ సానుకూల పాత్ర పోషించగలదు. అమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి చేరుకుంటే అది అఫ్గానిస్తాన్‌లోనే కాకుండా గల్ఫ్ ప్రాంతంలో కూడా శాంతి సుస్థిరతలను పెంపొందించగలదు. అన్నిటికంటే మించి సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాన్ని కొనసాగించడంలో పాకిస్తాన్‌ను ప్రోత్సహించే విధంగా బైడెన్ యంత్రాంగం ఏరకంగానూ వ్యవహరించదని మనం భావించవచ్చు. అలాగే, చైనా ప్రాదేశిక స్వార్థ ప్రేరేపిత ఆకాంక్షలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై అమెరికా తనదైన స్పష్టమైన వైఖరిని వ్యక్తపర్చగలదని కూడా మనం భావించవచ్చు. ఇండో–పసిఫిక్ ప్రాంతం పొడవునా ప్రాంతీయ భద్రతను ప్రోత్సహించడంలో క్వాడ్ ఇప్పుడు ఒక కీలక సంస్థగా ఉంటోంది. పైగా 2021లో జి–7 పారిశ్రామిక దేశాల (బ్రిటన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా) సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. క్వాడ్ సభ్య దేశాలను ఆహ్వానించనున్నట్లు వార్తలు వస్తున్నాయి కూడా. ఇది భారత్‌కు ఎంతో అనుకూలమైన అంశమని చెప్పక తప్పదు. జి.పార్థసారథి వ్యాసకర్త చాన్స్‌లర్, జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీ; మాజీ హైకమిషనర్, పాకిస్తాన్ -
100 రోజుల్లో కొత్త అధ్యక్షుడు ఏం చేయాలంటే?
వాషింగ్టన్: మరో 100 రోజుల్లో అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవీకాలం ముగియబోతున్న తరుణంలో అమెరికా పగ్గాలు చేపట్టబోయే కొత్త అధ్యక్షుడు 100 రోజుల్లోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలువాల్సిన అవసరముందని అగ్రరాజ్యం మేధోసంస్థ ఒకటి సూచించింది. భారత్-అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగించే ఆవశ్యకతను చాటడానికి ఈ భేటీ అవసరమని అభిప్రాయపడింది. ‘భారత్-అమెరికా రక్షణ సహకారం’పై వ్యూహాత్మక, అంతర్జాతీయ అధ్యయన కేంద్రం (సీఎస్ఐఎస్) కీలకమైన నివేదికను రూపొందించింది. మౌలికమైన ఒప్పందాలపై భారత్‌తో సంతకాలు చేయించే పూచీ అమెరికా కొత్త పరిపాలక బృందంపై ఉంటుందని, దీనివల్ల భారత-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం అవుతుందని ఈ నివేదికలో పేర్కొంది. ‘ఈ ఒప్పందాలు చేసుకోలేకపోతే.. భారత్ రక్షణ సామర్థ్యానికి అవసరమైన అడ్వాన్స్డ్ సెన్సింగ్, కంప్యూటింగ్, కమ్యూనికేషన్ సాంకేతికతలను ఆ దేశానికి అమెరికా దాదాపు అందించలేదు’ అని పేర్కొంది. ‘ఆస్ట్రేలియా, భారత్, జపాన్‌తో త్రైపాక్షిక రక్షణ చర్చలు జరిపేలా కొత్త పరిపాలన యంత్రాంగం పనిచేయాల్సి ఉంటుంది. అమెరికా విదేశాంగ, రక్షణశాఖల ఆధ్వర్యంలో ఇది జరగాలి. హిందూ మహా సముద్రం, పసిఫిక్ మహా సముద్ర ప్రాంతాల్లో ఉమ్మడి ప్రయోజనాల దృష్టితో ఈ చర్చలు జరగాలి’ అని నివేదిక తెలిపింది. సబ్‌మెరైన్ భద్రత, యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ వంటి అంశాల్లో భారత్-అమెరికా బంధం దృఢతరం కావాల్సిన అవసరముందని, ఉమ్మడి శిక్షణ, ఉమ్మడి సామర్థ్యాల విస్తరణ, పరస్పర రక్షణ కార్యకలాపాల నిర్వహణ వంటి చర్యలను ఇరుదేశాలు చేపట్టాల్సిన అవసరముందని సీఎస్ఐఎస్ తన నివేదికలో పేర్కొంది.