నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005లో దౌత్య వీసా ఇవ్వడానికి నిరాకరించిన అమెరికా.. ఇప్పుడు భారత ప్రధానమంత్రి హోదాలో మోదీకి రెడ్ కార్పెట్ వేసి మరీ గ్రాండ్ వెల్కమ్ చెబుతోంది.
అగ్రరాజ్యాధీశుడు జో బైడెన్ అధికారిక పర్యటనకు ఆహ్వానించిన మూడో ప్రపంచ నాయకుడిగా ప్రధాని మోదీ కొత్త చరిత్ర లిఖిస్తున్నారు. ఆప్తమిత్ర దేశాల అధినేతలకే అమెరికా ఇలా తమ దేశానికి రమ్మని ఆతిథ్యం ఇస్తుంది. మోదీ పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు జూన్ 21 నుంచి 24 వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అగ్రరాజ్య పర్యటన సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. బైడెన్ కేబినెట్‌లో కీలక మంత్రులు నరేంద్ర మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నట్టు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంలో బంధాలు మరింత బలోపేతమవడానికి మోదీ పర్యటన అత్యంత కీలకంగా మారనుంది. ప్రధాని మోదీ ఇంతకు ముందు చాలాసార్లు అమెరికా వెళ్లినప్పటికీ ఈసారి అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానించడంతో ఈ పర్యటనకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది.
అయిదు రంగాలే ఎజెండా
అంతర్జాతీయంగా అమెరికా, భారత్ మధ్య బంధం క్రమక్రమంగా బలోపేతమవుతూ వస్తోంది. ఇండో çపసిఫిక్ ప్రాంతంలో చైనాకు చెక్ పెట్టి స్వేచ్ఛాయుత వాణిజ్యం జరగడానికి ఇరుదేశాలు ఒక్కటిగా పని చేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జీ–20 సదస్సుకి భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి ముందు మోదీ అగ్రరాజ్యంలో పర్యటించడం దౌత్యపరంగా మనకు కలిసొచ్చే అంశం. అయిదు కీలక రంగాల్లో వ్యూహాత్మక సహకారం కోసం బైడెన్, మోదీ చర్చలు జరిపే అవకాశాలున్నాయి.
రక్షణ, ఆరోగ్యం, సాంకేతిక పరిజ్ఞానం, సంప్రదాయేతర ఇంధనం, విద్య–విజ్ఞానం రంగాల్లో సహకారానికి ఒప్పందాలు కుదుర్చుకుని సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉంది. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి అయిదేళ్లలోనే ప్రధాని మోదీ రెండోసారి ప్రసంగించనున్నారు. 2016, జూన్ 8న మోదీ తొలిసారిగా కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడారు. బ్రిటన్ తరఫున విన్‌స్టన్ చర్చిల్, దక్షిణాఫ్రికా నుంచి మండేలా తర్వాత రెండు సార్లు కాంగ్రెస్‌నుద్దేశించి ప్రసంగించే అవకాశం మోదీకే వచ్చింది. ఈ సమావేశంలో మోదీ ఏం మాట్లాడతారన్న దానిపై ప్రపంచం యావత్తూ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు అన్ని విధాలుగా అమెరికా అండదండగా ఉంటే, తటస్థ వైఖరి అవలంబిస్తున్న భారత్‌కు ఈ అంశాన్ని డీల్ చేయడమే అతి పెద్ద సవాల్‌గా మారింది. రష్యాతో సన్నిహితంగా ఉంటూ రక్షణ రంగంలో భారీగా ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్ ఇప్పుడు అమెరికా నుంచి 30 ఎంక్యూ–9బీ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం చేసుకోనుంది. 2015–19 మధ్య కాలంలో అమెరికా నుంచి భారత్ రక్షణ రంగ దిగుమతులు 14 శాతం ఎగబాకాయి. అత్యాధునిక టెక్నాలజీని అగ్రరాజ్యం నుంచి అందిపుచ్చుకొని ప్రపంచ దేశాల్లో సూపర్ పవర్‌గా భారత్ మారడానికి మోదీ పర్యటన సాయపడుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఉత్సాహంగా.. ఉల్లాసంగా
ప్రధాని మోదీ అమెరికా ‘‘స్టేట్ విజిట్’’అనేది దౌత్యపరంగా అత్యున్నత స్థాయి పర్యటన. సుదృఢమైన సంబంధాలు కలిగిన మిత్రదేశాల అధినేతలకే అమెరికా ఇలాంటి పర్యటనలకి ఆహ్వానిస్తుంది.ఈ పర్యటన అంతా పలు వేడుకలతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతుంది. ప్రధాని మోదీ అమెరికాలో విమానం దిగిన దగ్గర నుంచి తిరుగు ప్రయాణమయ్యే వరకు రాచమర్యాదలతో పర్యటన సాగుతుంది. మ్యూజికల్ బ్యాండ్‌తో ఘనంగా స్వాగతం పలుకుతారు. శ్వేత సౌధంలో అడుగుపెట్టినప్పుడు 21సార్లు తుపాకుల్ని గాల్లో పేల్చి గౌరవ వందనం సమర్పిస్తారు. వైట్‌హౌస్‌లో ఇచ్చే విందు సమయంలో భారీగా కానుకల్ని సమర్పిస్తారు. అమెరికా అధ్యక్షుడి అతిథి గృహం బ్లెయిర్ హౌస్‌లో బసకల్పిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పర్యటన అంతా సందడిగా సాగేలా చూస్తారు.
ఎందుకీ రెడ్ కార్పెట్..?
దశాబ్దకాలంగా అమెరికా రాజకీయాల్లో ప్రవాస భారతీయుల పాత్ర విస్తృతమైంది. అమెరికాలో నివసిస్తున్న 50 లక్షల మంది భారతీయులు అక్కడ కీలక ఓటు బ్యాంకుగా మారారు. ప్రతీసారి అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యక్తి పోటీ పడుతూ వస్తున్నారు. గత ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఏకంగా ఉపాధ్యక్ష పదవి అందుకున్నారు. బైడెన్ తన ప్రభుత్వంలో కూడా భారతీయుల్ని నియమించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి పోటీ పడుతున్నారు. స్వింగ్ రాష్ట్రాల్లో ఇండియన్ అమెరికన్ల ఓట్లు అత్యంత కీలకమని గత ఎన్నికల్లోనే తేటతెల్లమైంది. గత ఎన్నికల్లో 74 శాతం మంది ఇండియన్ అమెరికన్లు బైడెన్‌కు మద్దతునిచ్చారని సర్వేల్లో తేలింది.
ఇప్పుడు ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా డెమొక్రాట్లు భారత్‌కి దగ్గరన్న సంకేతాలు ప్రవాస భారతీయులకు పంపడానికే మోదీని ఆహ్వానించారని ఆసియన్ అమెరికన్లపై అధ్యయన సంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న సారా సాధ్వాని అభిప్రాయపడ్డారు. అమెరికాలో ప్రధాని మోదీకున్న ఇమేజ్ రాను రాను పెరుగుతూ వస్తోంది. 2014లో మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత అమెరికా వెళ్లినప్పుడు న్యూయార్క్‌లోని మ్యాడిసన్ స్క్వేర్‌లో 20 వేల మంది ప్రవాస భారతీయులు ఆయన సమావేశానికి వచ్చారు. 2019లో హస్టన్‌లో హౌడీమోడీ కార్యక్రమానికి 50 వేల మంది హాజరయ్యారు. ఈసారి టైమ్ స్క్వేర్ నుంచి నయాగారా జలపాతం వరకు ఇండియన్ అమెరికన్లు మోదీ అధికారిక పర్యటనకు వస్తూ ఉండడంతో గర్వంతో ఉప్పొంగిపోతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment