100 రోజుల్లో కొత్త అధ్యక్షుడు ఏం చేయాలంటే?
వాషింగ్టన్: మరో 100 రోజుల్లో అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవీకాలం ముగియబోతున్న తరుణంలో అమెరికా పగ్గాలు చేపట్టబోయే కొత్త అధ్యక్షుడు 100 రోజుల్లోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలువాల్సిన అవసరముందని అగ్రరాజ్యం మేధోసంస్థ ఒకటి సూచించింది. భారత్-అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగించే ఆవశ్యకతను చాటడానికి ఈ భేటీ అవసరమని అభిప్రాయపడింది.
‘భారత్-అమెరికా రక్షణ సహకారం’పై వ్యూహాత్మక, అంతర్జాతీయ అధ్యయన కేంద్రం (సీఎస్‌ఐఎస్) కీలకమైన నివేదికను రూపొందించింది. మౌలికమైన ఒప్పందాలపై భారత్‌తో సంతకాలు చేయించే పూచీ అమెరికా కొత్త పరిపాలక బృందంపై ఉంటుందని, దీనివల్ల భారత-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం అవుతుందని ఈ నివేదికలో పేర్కొంది. ‘ఈ ఒప్పందాలు చేసుకోలేకపోతే.. భారత్ రక్షణ సామర్థ్యానికి అవసరమైన అడ్వాన్స్‌డ్ సెన్సింగ్, కంప్యూటింగ్, కమ్యూనికేషన్ సాంకేతికతలను ఆ దేశానికి అమెరికా దాదాపు అందించలేదు’ అని పేర్కొంది.
‘ఆస్ట్రేలియా, భారత్, జపాన్‌తో త్రైపాక్షిక రక్షణ చర్చలు జరిపేలా కొత్త పరిపాలన యంత్రాంగం పనిచేయాల్సి ఉంటుంది. అమెరికా విదేశాంగ, రక్షణశాఖల ఆధ్వర్యంలో ఇది జరగాలి. హిందూ మహా సముద్రం, పసిఫిక్ మహా సముద్ర ప్రాంతాల్లో ఉమ్మడి ప్రయోజనాల దృష్టితో ఈ చర్చలు జరగాలి’ అని నివేదిక తెలిపింది. సబ్‌మెరైన్ భద్రత, యాంటీ సబ్ మెరైన్ వార్‌ఫేర్ వంటి అంశాల్లో భారత్-అమెరికా బంధం దృఢతరం కావాల్సిన అవసరముందని, ఉమ్మడి శిక్షణ, ఉమ్మడి సామర్థ్యాల విస్తరణ, పరస్పర రక్షణ కార్యకలాపాల నిర్వహణ వంటి చర్యలను ఇరుదేశాలు చేపట్టాల్సిన అవసరముందని సీఎస్‌ఐఎస్ తన నివేదికలో పేర్కొంది.