India US defense relationship
-
సరిహద్దు భద్రతే కీలకం
హ్యూస్టన్: కరడుగట్టిన ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి సామాన్య ప్రజలకు రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. భారత్, అమెరికాకు సరిహద్దు భద్రతే అత్యంత కీలకమని చెప్పారు. హౌడీ మోదీ కార్యక్రమంలో ఆయన 25 నిమిషాలపాటు ప్రసంగించారు. భారత్–అమెరికా మధ్య బంధాన్ని బలోపేతం చేసే దిశగా త్వరలో పలు రక్షణ ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నట్లు తెలిపారు. తమ పౌరులను భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం భారత్, అమెరికాకు ఉందన్నారు. అలాగే మన సరిహద్దులను రక్షించుకోవాలన్నారు. సరిహద్దు భద్రత భారత్‌కు కీలకాంశమని, దాన్ని అమెరికా గుర్తించిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ దక్షిణ సరిహద్దు(మెక్సికో) రక్షణకు కనీవినీ ఎరుగని చర్యలు చేపడుతున్నామని, అక్రమ వలసలకు సమర్థంగా అడ్డుకట్ట వేస్తున్నామని తెలిపారు. అక్రమ వలసలతో ముప్పు తప్పదని హెచ్చరించారు. మాకు గర్వకారణం మోదీ అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణను ట్రంప్ ప్రశంసించారు. ఈ సంస్కరణలతో లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడతారని చెప్పారు. భారత్, అమెరికాలో అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని నిర్మూలించడంలో ఎన్నడూ లేనంతగా ప్రగతి సాధిస్తున్నారన్నారు. అమెరికాలో తమ ప్రభుత్వం సాధించిన ఘనతలను ట్రంప్ వివరించారు. టెక్సాస్‌లో తయారీ రంగంలో 70 వేల కొత్త ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. అమెరికా నుంచి ఏటా 5 మిలియన్ టన్నుల ఎన్ఎన్జీని కొనుగోలు చేసేందుకు ఇండియా కంపెనీలు ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు. దీనివల్ల రాబోయే రోజుల్లో వందల కోట్ల డాలర్ల విలువైన ఎల్ఎన్జీని తాము భారత్‌కు ఎగుమతి చేయబోతున్నామని అన్నారు. భారత్ అమెరికాలో ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ పెట్టుబడులు పెట్టలేదన్నారు. అమెరికా కూడా భారత్‌లో పెట్టుబడుల వరద పారిస్తోందన్నారు. అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్ర మరువలేనిదని ట్రంప్ శ్లాఘించారు. తమ సంస్కృతిని, విలువలను వారు మరింత సుసంపన్నం చేస్తున్నారని కొనియాడారు. వారు అమెరికన్లుగా ఉండడం తమకు గర్వకారణమని చెప్పారు. -
100 రోజుల్లో కొత్త అధ్యక్షుడు ఏం చేయాలంటే?
వాషింగ్టన్: మరో 100 రోజుల్లో అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవీకాలం ముగియబోతున్న తరుణంలో అమెరికా పగ్గాలు చేపట్టబోయే కొత్త అధ్యక్షుడు 100 రోజుల్లోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలువాల్సిన అవసరముందని అగ్రరాజ్యం మేధోసంస్థ ఒకటి సూచించింది. భారత్-అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగించే ఆవశ్యకతను చాటడానికి ఈ భేటీ అవసరమని అభిప్రాయపడింది. ‘భారత్-అమెరికా రక్షణ సహకారం’పై వ్యూహాత్మక, అంతర్జాతీయ అధ్యయన కేంద్రం (సీఎస్ఐఎస్) కీలకమైన నివేదికను రూపొందించింది. మౌలికమైన ఒప్పందాలపై భారత్‌తో సంతకాలు చేయించే పూచీ అమెరికా కొత్త పరిపాలక బృందంపై ఉంటుందని, దీనివల్ల భారత-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం అవుతుందని ఈ నివేదికలో పేర్కొంది. ‘ఈ ఒప్పందాలు చేసుకోలేకపోతే.. భారత్ రక్షణ సామర్థ్యానికి అవసరమైన అడ్వాన్స్డ్ సెన్సింగ్, కంప్యూటింగ్, కమ్యూనికేషన్ సాంకేతికతలను ఆ దేశానికి అమెరికా దాదాపు అందించలేదు’ అని పేర్కొంది. ‘ఆస్ట్రేలియా, భారత్, జపాన్‌తో త్రైపాక్షిక రక్షణ చర్చలు జరిపేలా కొత్త పరిపాలన యంత్రాంగం పనిచేయాల్సి ఉంటుంది. అమెరికా విదేశాంగ, రక్షణశాఖల ఆధ్వర్యంలో ఇది జరగాలి. హిందూ మహా సముద్రం, పసిఫిక్ మహా సముద్ర ప్రాంతాల్లో ఉమ్మడి ప్రయోజనాల దృష్టితో ఈ చర్చలు జరగాలి’ అని నివేదిక తెలిపింది. సబ్‌మెరైన్ భద్రత, యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ వంటి అంశాల్లో భారత్-అమెరికా బంధం దృఢతరం కావాల్సిన అవసరముందని, ఉమ్మడి శిక్షణ, ఉమ్మడి సామర్థ్యాల విస్తరణ, పరస్పర రక్షణ కార్యకలాపాల నిర్వహణ వంటి చర్యలను ఇరుదేశాలు చేపట్టాల్సిన అవసరముందని సీఎస్ఐఎస్ తన నివేదికలో పేర్కొంది.