టారిఫ్‌ వార్‌ 2.0! | Donald Trump America First agenda may lead to higher tariffs on India | Sakshi
Sakshi News home page

టారిఫ్‌ వార్‌ 2.0!

Published Thu, Nov 7 2024 5:38 AM | Last Updated on Thu, Nov 7 2024 8:25 AM

Donald Trump America First agenda may lead to higher tariffs on India

భారత్‌ ‘టారిఫ్‌ కింగ్‌’ అంటూ గతంలో వ్యాఖ్యలు

ప్రతీకార సుంకాలను వడ్డిస్తామని స్పష్టికరణ... 

ఆటోమొబైల్, టెక్స్‌టైల్స్, ఫార్మా, ఐటీ రంగాలౖపై ఎఫెక్ట్‌

‘చైనా, బ్రెజిల్, భారత్‌... అమెరికాపై దిగుమతి సుంకాల మోత మోగిస్తున్నాయి. కొన్ని ఉత్పత్తులపై చైనా కంటే భారీగా భారత్‌ సుంకాలను విధిస్తోంది. ‘టారిఫ్‌ కింగ్‌’గా మారింది. నేను తిరిగి అధికారంలోకి వస్తే టిట్‌–ఫర్‌–టాట్‌ సుంకాలతో బదులు తీర్చుకుంటాం. అమెరికాను మళ్లీ అత్యంత సంపన్న దేశంగా మార్చాలంటే ప్రతీకార టారిఫ్‌లే మందు’. 

గతేడాది అక్టోబర్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలివి. అనుకున్నట్లే బంపర్‌ విక్టరీతో మళ్లీ అగ్రరాజ్యాధిపతిగా శ్వేత సౌధంలో కొలువుదీరనున్నారు. ట్రంప్‌ అమెరికా ఫస్ట్‌ ఎజెండాతో భారత్‌ సహా చాలా దేశాలకు టారిఫ్‌ వార్‌ గుబులు పట్టుకుంది. 

ప్రచారంలో ట్రంప్‌ ఊదరగొట్టిన ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ (మాగా)’ నినాదం గనుక అమల్లోకి వస్తే... ఆటోమొబైల్, టెక్స్‌టైల్, ఫార్మా వంటి కొన్ని కీలక రంగాల్లో ఎగుమతులపై అధిక కస్టమ్స్‌ సుంకాలకు దారితీసే అవకాశం ఉందని వాణిజ్య రంగ నిపుణులు చెబుతున్నారు. చైనాతో పాటు భారత్, మరికొన్ని దేశాలపై సుంకాల పెంపు ద్వారా ట్రంప్‌ 2.0లో మలివిడత టారిఫ్‌ వార్‌కు ట్రంప్‌ తెరతీయవచ్చని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) ఫౌండర్‌ అజయ్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ‘ట్రంప్‌ రెండో విడత అధికారంలో అమెరికా ఫస్ట్‌ నినాదానికి అనుగుణంగానే భారత్‌ ఉత్పత్తులపై రక్షణాత్మక చర్యలు, ప్రతీకార సుంకాలు విధింవచ్చు. ఈ జాబితాలో వాహన రంగం, వైన్స్, టెక్స్‌టైల్స్, ఫార్మా, స్టీల్‌ వంటి కీలక రంగాల్లో అడ్డంకులకు ఆస్కారం ఉంది. దీనివల్ల ఆయా పరిశ్రమల ఆదాయాల్లో కోత పడుతుంది’ అని శ్రీవాస్తవ చెప్పారు. అయితే, మనతో పోలిస్తే చైనాపై టారిఫ్‌ వార్‌ తీవ్రంగా ఉంటే గనుక, అది భారతీయ ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు కలి్పస్తుందన్నారు. 

అతిపెద్ద వాణిజ్య భాగస్వామి... 
భారత వస్తు, సేవలకు సంబంధించి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలుస్తోంది. ద్వైపాక్షిక వాణిజ్యం 2023–24లో 190 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఇక పెట్టుబడుల విషయానికొస్తే, అమెరికా మూడో అతిపెద్ద ఇన్వెస్టర్‌. 2000 నుంచి 2024 మధ్య 66.7 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) భారత్‌ అందుకుంది!  కాగా, ఇంజనీరింగ్‌ గూడ్స్, స్టీల్‌ వంటి అత్యధిక ఎగుమతి ఆదాయ రంగాలపై అమెరికా భారీగా టారిఫ్‌లు విధిస్తే, ప్రభావం తీవ్రంగా ఉంటుందని సీఐఐ జాతీయ ఎగ్జిమ్‌ కమిటీ కో–చైర్మన్‌ సంజయ్‌ బుధియా పేర్కొన్నారు. ట్రంప్‌ గత హయాంలో స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై 10–25 % అదనపు సుంకాలు విధించడంతో, భారత్‌ 28 ఉత్పత్తులపై ప్రతీకార టారిఫ్‌లతో బదులిచ్చింది. ఇవే కాకుండా డెయిరీ ఉత్పత్తులు (188%), పండ్లు–కూరగాయలు (132%), నూనె గింజలు, ఫ్యాట్స్, ఆయిల్స్‌ (164 శాతం), బేవరేజెస్‌–పొగాకు (150%)పై కూడా అమెరికా అధిక టారిఫ్‌లతో విరుచుకుపడింది.

వస్తు ఎగుమతి–దిగుమతులు (బి. డాలర్లలో)
 

వాణిజ్య వివాదాలు పెరగవచ్చు... 
ట్రంప్‌ 2.0 హయాంలో వాణిజ్య పరంగా కష్టాలకు ఆస్కారం ఉంది. అధిక టారిఫ్‌ల కారణంగా వాణిజ్య వివాదాలు పెరగవచ్చు. గతంలో మాదిరిగా రక్షణాత్మక విధానం, కఠిన వలస నిబంధనల ట్రెండ్‌ కొనసాగుతుంది. 
– అజయ్‌ సహాయ్, భారత ఎగుమతి సంస్థల సమాఖ్య డైరెక్టర్‌ జనరల్‌ 

టెక్‌ బంధాన్ని బలోపేతం చేసుకుందాం... 
ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు శుభాకాంక్షలు. ఇరు దేశాల మధ్య నెలకొన్న అద్భుతమైన టెక్నాలజీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కొత్త ప్రభుత్వంతో మరింత సన్నిహితంగా కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నాం. ద్వైపాక్షిక వాణిజ్యంలో టెక్నాలజీ 
రంగం ‘వెన్నెముక’గా నిలుస్తోంది.     
– సింధు, గంగాధరన్, నాస్కామ్‌ చైర్‌పర్సన్‌

ఎగుమతులకు కొత్త మార్కెట్లు.... 
ట్రంప్‌ 2.0 హయాంలో చైనా, కొన్ని యూరప్‌ దేశాలపై ట్రంప్‌ టారిఫ్‌లు, దిగుమతి నియంత్రణలకు ఆస్కారం ఉంది. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులకు కొత్త మార్కెట్లకు ద్వారాలు తెరుచుకుంటాయి. ట్రంప్‌ భారత్‌ను ట్రంప్‌ మిత్ర దేశంగానే పరిగణిస్తారు. దీనివల్ల యూఎస్‌ కంపెనీల పెట్టుబడులు పెరుగుతాయి. ట్రంప్‌ విజయం భారత్‌కు సానుకూలాంశమే.          
– రాజీవ్‌ కుమార్, నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement