గెలిస్తే నేనూ తిరిగి వడ్డిస్తా: ట్రంప్
వాషింగ్టన్: భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా దిగుమతి సుంకాలు విధించే దేశమని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్షుడిగా గెలిస్తే అమెరికాకు భారత్ ఎగుమతులపై తానూ సమానస్థాయిలో పన్నులు విధిస్తానని స్పష్టం చేశారు. విదేశీ వస్తువులపై భారత్‌లోనే దిగుమతి సుంకాలు అత్యధికమని, అయితే చిరునవ్వుతో పన్నులు విధిస్తుందని తనదైన శైలిలో ముక్తాయించారు.
‘అమెరికాను అత్యంత సుసంపన్నం చేయడానికి నా ప్రణాళికలోని ముఖ్యమైన అంశం.. పరస్పర క్రయ విక్రయాలపై సమానస్థాయిలో పన్నులు విధించడం (ఒక దేశం అమెరికా వస్తువులపై ఎంత శాతమైతే పన్ను వేస్తుందో.. అదే స్థాయిలో అమెరికాకు వాటి ఎగుమతులపై పన్ను వేయడం). సాధారణంగా మనం దిగుమతి సుంకాలు వేయం. అధ్యక్షుడిగా ఉండగా నేనే పన్నులు వేసే ప్రక్రియను మొదలుపెట్టా. చైనా 200 శాతం దిగుమతి సుంకం వేస్తుంది. బ్రెజిల్ కూడా భారీగా పన్నులు విధిస్తుంది. అందరికంటే భారత్ అత్యధికంగా వసూలు చేస్తుంది’ అని ట్రంప్ డెట్రాయిల్‌లో గురువారం ఒక ఆర్థిక విధాన ప్రసంగంలో అన్నారు.
అయితే ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించి.. తన మాటల్లోని కాఠిన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ‘భారత్‌తో మనకు సత్సంబంధాలు ఉన్నాయి. నాకూ అంతే. ముఖ్యంగా నాయకుడు మోదీతో. ఆయన గొప్ప నాయకుడు. చక్కటిపాలన అందిస్తున్నారు. చాలావాటిల్లో చైనా కంటే ఎక్కువగా భారత్ పన్నులు వేస్తుంది. కాకపోతే చిరునవ్వుతో.. భారత్ వస్తువులు కొన్నందుకు ధన్యవాదాలు అని చెబుతారు’ అని ట్రంప్ అన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హార్లీ డేవిడ్‌సన్ మోటర్‌సైకిల్ కంపెనీ ప్రతినిధులు తనకిదే విషయం చెప్పారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment