ప్రపంచ దేశాలు ఇప్పుడు అమెరికావైపు చూస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలో ఎవరు గెలుస్తారు?. అగ్రరాజ్య ముఖచిత్రాన్ని మార్చేది ఎవరు? అనే దాని కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మరోసారి వైట్‌హౌజ్ నుంచి పాలించాలని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే.. రాజకీయాల్లోకి రాకముందు.. ట్రంప్ రియల్ ఎస్టేట్ రంగంలో మకుటం లేని మహారాజు అనే విషయం మీకు తెలుసా?..
డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్రెడ్ ట్రంప్‌కు నాలుగో సంతానం. 13 ఏళ్ల వయసులో ట్రంప్ సైనిక్ అకాడమీలో చేరాడు. ఆ తరువాత యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా.. వార్టన్ స్కూల్ నుంచి డిగ్రీ పొందిన తరువాత కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.
కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టడాని ముందే ట్రంప్ తన తండ్రి నుంచి కొంత మొత్తం అప్పుగా తీసుకుని రియల్ ఎస్టేట్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. ఆ తరువాత తండ్రి రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లను నిర్వహించడంలో కీలక పాత్రం పోషించాడు. 1971లో కంపెనీని నియంత్రణలోకి తీసుకున్న తరువాత.. దానిని ట్రంప్ ఆర్గనైజేషన్‌గా మార్చేశారు. ఆ తరువాత వివిధ వ్యాపారాలలోకి ప్రవేశించారు.
1973 నాటికి ట్రంప్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా ట్రంప్ బ్రూక్లిన్, క్వీన్స్ & స్టాటెన్ ఐలాండ్‌లో 14,000 అపార్ట్‌మెంట్లను పర్యవేక్షించారు. 1978లో గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ పక్కనే గ్రాండ్ హయత్ హోటల్‌ను అభివృద్ధి చేయడం కూడా ఈయన సారథ్యంలోనే జరిగింది. 1983లో మిడ్‌టౌన్ మాన్‌హట్టన్‌లోని 58 అంతస్తుల 'ట్రంప్ టవర్'ను ట్రంప్ పూర్తి చేశారు. ఈయన కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు కూడా ఈ భవనంలోనే నివసిస్తున్నట్లు తెలుస్తోంది.
వ్యాపార రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్న ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తరువాత.. ట్రంప్ సంస్థలోని అన్ని నిర్వహణ బాధ్యతలకు రాజీనామా చేసి, కంపెనీ నిర్వహణను తన కుమారులు డోనాల్డ్ జూనియర్, ఎరిక్‌లకు అప్పగించారు. కాగా ఇప్పుడు మరోసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం కమలా హరిస్‌తో పోటీ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment