Donald Trump: ట్రంప్‌ రికార్డులు.. చరిత్రలో అతిపెద్ద పునరాగమనం | USA Presidential Elections Results 2024: US second president Donald Trump life story | Sakshi
Sakshi News home page

Donald Trump: ట్రంప్‌ రికార్డులు.. చరిత్రలో అతిపెద్ద పునరాగమనం

Nov 7 2024 4:30 AM | Updated on Nov 7 2024 8:17 AM

USA Presidential Elections Results 2024: US second president Donald Trump life story

విలక్షణ నాయకుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 

వ్యాపార కుటుంబం నుంచి శ్వేత సౌధానికి.. 

బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుప్రఖ్యాతులు 

సంచలనాలు, వివాదాలతో సహవాసం 

రెండు సార్లు అభిశంసనతో అపఖ్యాతి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ జయకేతనం ఎగురవేశారు. 132 ఏళ్ల అనంతరం మధ్యలో ఒక విరామం తర్వాత రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి అభ్యర్థిగా ఆయన చరిత్ర సృష్టించారు. సంచలనాలు, వివాదాలకు మారుపేరైన ట్రంప్‌ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. వ్యాపారం, స్థిరాస్తి, మీడియా రంగాల్లో తన ప్రతిభాపాటవాలతో రాణించారు. వ్యాపార కుటుంబంలో జన్మించిన ట్రంప్‌ విలక్షణ నాయకుడిగా పేరుపొందారు. రాజకీయ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాదు, అమెరికా రాజకీయాలపై తనదైన ముద్ర వేయడం విశేషం. 
 
1982లోనే ఫోర్బ్స్‌ జాబితాలోకి.. 
ట్రంప్‌ అసలు పేరు డొనాల్డ్‌ జాన్‌ ట్రంప్‌. 1946 జూన్‌ 14న న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో జన్మించారు. ఆయన తల్లిదండ్రు లు ఫ్రెడ్‌ ట్రంప్, మేరీ అన్నే మెక్‌లి యోడ్‌ ట్రంప్‌. మొత్తం ఐదుగురు సంతానంలో ట్రంప్‌ నాలుగో సంతానం. ఫ్రెడ్‌ ట్రంప్‌ అమెరికాలో విజయవంతమైన రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌గా పేరు ప్రఖ్యాతులు గడించారు. డొనాల్డ్‌ ట్రంప్‌ బాల్యం న్యూయార్క్‌లోనే గడిచింది. 

న్యూయార్క్‌ మిలటరీ అకాడమీలో చదువు కున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాకు చెందిన వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. 1968లో కామర్స్‌లో గ్రాడ్యుయేట్‌ పట్టా అందుకున్నారు. కాలేజీలో చదువు పూర్తయ్యాక ట్రంప్‌ 1971లో తన తండ్రి వ్యాపార సంస్థలోకి అడుగుపెట్టారు. తమ సంస్థను ‘ట్రంప్‌ ఆర్గనైజేషన్‌’గా పేరుమార్చారు. ట్రంప్‌ గ్రూప్‌నకు సంబంధించిన హోటళ్లు, క్యాసినోలు, గోల్ఫ్‌ కోర్సులను మరింత విస్తరింపజేశారు. తన పేరిట కొన్ని ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. 

అనతికాలంలోనే ట్రంప్‌ బ్రాండ్‌కు మంచి పేరొచ్చింది. విజయవంతమైన వ్యాపారవేత్తగా డొనాల్డ్‌ ట్రంప్‌ పేరు మార్మోగిపోయింది. 200 మిలియన్‌ డాలర్ల సంపదతో 1982లో తొలిసారి ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో చేరారు. 2023లో ఆ సంపద విలువ 631 మిలియన్‌ డాలర్లతో సమానం. 2004లో ప్రారంభమైన అప్రెంటీస్‌ అనే టీవీ రియాలిటీ షోను ట్రంప్‌ స్వయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. ఇంటింటా అందరికీ అభిమాన పాత్రుడయ్యారు. ఆయనలో మంచి రచయిత కూడా ఉన్నారు. 14కుపైగా పుస్తకాలు రాశారు. 1987లో విడుదలైన ‘ద ఆర్ట్‌ ఆఫ్‌ ద డీల్‌’ అనే పుస్తకం విపరీతమైన పాఠకాదరణ పొందింది. 
  
నెరవేరిన స్వప్నం 
డొనాల్డ్‌ ట్రంప్‌కు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఆసక్తి ఉండేది. 1980వ దశకంలో రాజకీయ రంగంలో ప్రవేశించారు. రిపబ్లిన్‌ పార్టీలో చేరారు. అధ్యక్షుడు కావాలన్నది ట్రంప్‌ కల. అందుకోసం ఎంతగానో శ్రమించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగించారు. మొదట్లో ఆ ప్రయత్నాలు ఫలించకపోయినా నిరాశ చెందలేదు. మరింత పట్టుదలతో కృషిచేశారు. 

2015 జూన్‌ 16న రిపబ్లిన్‌ అభ్యర్థిగా ఆయన పేరు బలంగా తెరపైకి వచ్చింది. ప్రైమరీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులను వెనక్కి నెట్టి, ఎట్టకేలకు 2016 జూలైలో అధ్యక్ష ఎన్నికల బరిలో ట్రంప్‌ నిలిచారు. రిపబ్లికన్‌ అభ్యర్థిగా ఆయన పేరు అధికారికంగా ఖరారైంది. 2016 నవంబర్‌ 8న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ సంచలన విజయం సాధించారు. డెమొక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను ఓడించారు. రష్యా ప్రభుత్వం ఆయన విజయానికి సహకరించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ట్రంప్‌ 2017 జనవరి 20 నుంచి 2021 జనవరి 20వ తేదీ దాకా అగ్రరాజ్యానికి 45వ అధ్యక్షుడిగా సేవలందించారు.

 పన్ను సంస్కరణలు, వలస విధానం, విదేశీ వ్యవహారాలపై ట్రంప్‌ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. కొన్ని కీలకమైన పన్నులను తగ్గించారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నాలుగేళ్ల పాలనలో యుద్ధాలకు దూరంగా ఉన్నారు. కానీ, చైనాతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. శత్రుదేశంగా భావించే ఉత్తర కొరియాలో కాలుమోపిన తొలి అమెరికా అధ్యక్షుడిగా(పదవిలో ఉండగానే) ట్రంప్‌ చరిత్రకెక్కారు. వలసలపై కొంత కఠినంగానే వ్యవహరించారు. కొన్ని ఇస్లామిక్‌ దేశాల నుంచి ప్రజలు అమెరికాకు రాకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించేందుకు సైనిక నిధులను మళ్లించారు. తన పదవీ కాలంలో ముగ్గురిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నియమించారు. ట్రంప్‌ పాలనలోనే కోవిడ్‌–19 మహమ్మారి వచ్చిపడింది. ఈ విపత్తును ఎదుర్కోవడంలో ట్రంప్‌ తీవ్ర అలసత్వం వహించారన్న ఆరోపణలు వచ్చాయి. వాతావరణ మార్పులకు సంబంధించిన పారిస్‌ ఒప్పందం, ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలిగారు. ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో మూడుసార్లు సమావేశమయ్యారు. కానీ, అణ్వాయుధాల నియంత్రణ దిశగా ఆయనను ఓప్పించలేకపోయారు. ట్రంప్‌ వేగంగా, స్థిరంగా నిర్ణయాలు తీసుకుంటారన్న పేరుంది. అదే ఆయనను బలమైన నాయకుడిగా మార్చింది. 
  
రెండు సార్లు అభిశంసన 
అధ్యక్షుడిగా ట్రంప్‌ పాలనాకాలం పలు వివాదాలతో గడిచింది. శృంగార తార స్మార్మీ డేనియల్స్‌కు చెల్లించిన సొమ్మును రికార్డుల్లో చూపించకుండా వాటిని తారుమారు చేసిన ‘హష్‌ మనీ’ కేసులో న్యూయార్క్‌ కోర్టు ఈ ఏడాది మే నెలలో ట్రంప్‌ను దోషిగా తేల్చింది. ఒక నేరంలో అమెరికా అధ్యక్షుడు దోషిగా తేలడం ఇదే మొదటిసారి. ఈ కేసులో ట్రంప్‌కు ఇంకా శిక్ష విధించలేదు. మరికొన్ని కేసుల్లోనూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అమెరికా కాంగ్రెస్‌లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో ట్రంప్‌ రెండుసార్లు అభిశంసనకు(ఇంపీచ్‌మెంట్‌) గురయ్యారు. ఉక్రెయిన్‌ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 2019 డిసెంబర్‌లో అభిశంసనను ఎదుర్కొన్నారు. 

తన మద్దతుదారులతో క్యాపిటల్‌ భవనం వద్ద  ఘర్షణను ప్రేరేపించినట్లు విమర్శలు వెల్లువెత్తడంతో 2021 జనవరిలో మరోసారి అభిశంసనకు గురయ్యారు. రెండుసార్లు అభిశంసనకు గురైన తొలి అధ్యక్షుడిగా అపకీర్తి పొందారు. అయితే, కాంగ్రెస్‌లో ఎగువ సభ అయిన సెనేట్‌ మాత్రం ఈ రెండు సందర్భాల్లో ట్రంప్‌ను నిర్దోషిగా తేల్చింది. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ రిపబ్లికన్‌ పార్టీలో ట్రంప్‌ ప్రభావం చెక్కుచెదరలేదు. అందుకే అదే పార్టీ నుంచి మరోసారి పోటీ చేయగలిగారు. ఈ ఏడాది ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనపై రెండుసార్లు హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. మాజీ అధ్యక్షుడిగానూ ట్రంప్‌ నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలవడం కావడం విశేషం. కేసులు, విచారణలతో ట్రంప్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రజల నోట్లో నానింది. 

3 వివాహాలు.. ఐదుగురు సంతానం 
78 ఏళ్ల డొనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబం పెద్దదే. మూడు వివాహాలు చేసుకున్నారు. తొలుత చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన మోడల్‌ ఇవానాను పెళ్లాడారు. 1977 నుంచి 1990 దాకా ఆమెతో కలిసున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. అనంతరం సినీ నటి మార్లా మాపిల్స్‌ను వివాహం చేసుకున్నారు. 1993 నుంచి 1999 దాకా వారి బంధం కొనసాగింది. విడాకులతో వేరయ్యారు. 2005లో స్లొవేనియా మోడల్‌ మెలాని యాతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఇరువురూ కలిసే ఉంటున్నారు. ట్రంప్‌కు ముగ్గురు భార్యలతో మొత్తం ఐదుగురు సంతానం ఉన్నారు.

 మొదటి భార్య ఇవానాతో డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్, ఇవాంక, ఎరిక్, రెండో భార్య మార్లాతో టిఫానీ జన్మించారు. మూడో భార్య మెలానియాతో బారోన్‌ ట్రంప్‌ జన్మించాడు. మద్యం, సిగరెట్, డ్రగ్స్‌ తీసుకోవడం తనకు అలవాటు లేదని ట్రంప్‌ పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన రోజుకు నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే నిద్రిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇస్తారు. గోల్ఫ్‌ ఆయనకు ఇష్టమైన క్రీడ. అదే ఆయన వ్యాయామం కూడా. ఇతర వ్యాయామాలేవీ చేయరు. నడక(వాకింగ్‌) కూడా పెద్దగా ఇష్టపడరు. మానవ శరీరం ఒక బ్యాటరీ లాంటిదని, అందులో సహజంగానే మనిషికి కావాల్సిన శక్తి ఉంటుందని, వ్యాయామాలతో ఆ శక్తి హరించుకుపోతుందని ట్రంప్‌ నమ్ముతారు. 

ట్రంప్‌ రికార్డులు
→ ట్రంప్‌ ఖాతాలో అరుదైన ఘనత చేరింది. ఒక విరామం తర్వాత మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇలా జరగడం గత 132 ఏళ్లలో ఇదే తొలిసారి. గ్రోవర్‌ క్లీవ్‌లాండ్‌ తర్వాత ఈ రికార్డు ట్రంప్‌ సొంతమైంది. క్లీవ్‌లాండ్‌ 1885 నుంచి 1889 దాకా 22వ అధ్యక్షుడిగా, 1893 నుంచి 1897 దాకా 24వ అధ్యక్షుడిగా పనిచేశారు. ట్రంప్‌ 2017 నుంచి 2021 వరకు ఒకసారి అధ్యక్షుడిగా వ్యవహరించారు. మధ్యలో ఒక విరామంతో 2025 నుంచి 2029 దాకా మరో సారి అధ్యక్షుడిగా పని చేయబోతున్నారు. 
→ 78 ఏళ్ల వయసులో ట్రంప్‌ మరోసారి అధ్యక్ష ఎన్నిక ల్లో గెలిచారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన అత్యంత వృద్ధుడు ట్రంప్‌. 
→ గత 20 సంవత్సరాల్లో పాపులర్‌ ఓటుతో గెలిచిన మొదటి రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌

చరిత్రలో అతిపెద్ద పునరాగమనం 
నాలుగేళ్ల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేక ఆయన అభిమానులు రాజధాని వాషింగ్టన్‌ డీసీలోని క్యాపిటల్‌ భవనం వద్ద వీరంగం సృష్టించారు. వారి నిరసన హింసాత్మకంగా మారింది. ఈ వ్యవహారం చివరకు ట్రంప్‌ మెడకు చుట్టుకుంది. 2020 నాటి ఎన్నికల్లో పరాజయంతో ట్రంప్‌ రాజకీయ జీవితం ముగిసినట్లేనని అప్పట్లో రాజకీయ పరిశీలకులు తేల్చిచెప్పారు. పలు వివాదాల్లో ఇరుక్కుపోవడంతోపాటు హష్‌ మనీ కేసులో దోషిగా తేలిన ట్రంప్‌ ఇక ఎప్పటికీ రాజకీయ రంగంలో కనిపించే అవకాశం లేదని వాదించారు. వారి అభిప్రాయాలను ఫటాపంచలు చేస్తూ ట్రంప్‌ మరోసారి సమరోత్సాహంతో దూసుకొచ్చారు. 78 ఏళ్ల వయసులో అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మరోసారి వైట్‌హౌస్‌లో కాలు పెట్టబోతున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement