అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 'ట్రంప్‌ 2.0' | Donald Trump Victory in the US presidential election 2024 | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 'ట్రంప్‌ 2.0'

Published Thu, Nov 7 2024 4:01 AM | Last Updated on Thu, Nov 7 2024 4:01 AM

Donald Trump Victory in the US presidential election 2024

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయభేరి

దేశ 47వ అధ్యక్షుడిగా ఎన్నిక.. హారిస్‌పై ఘనవిజయం

రిపబ్లికన్‌ పార్టీ 292

డెమొక్రటిక్‌ పార్టీ 223

స్వింగ్‌ స్టేట్స్‌ అన్నీ ట్రంప్‌ పరమే

జనవరి 6న అధికారిక ప్రకటన 

20వ తేదీన ప్రమాణస్వీకారం 

స్వర్ణయుగం తెస్తా: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ దుమ్ము రేపారు. హోరాహోరీ పోరు తదితర విశ్లేషణలన్నింటినీ తోసిరాజంటూ డెమొక్రాట్ల అభ్యర్ధి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై ఘనవిజయం సాధించారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి వెల్లడైన ఫలితాల్లో విజయానికి కావాల్సిన 270 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్ల మార్కును ట్రంప్‌ అలవోకగా దాటేశారు. తద్వారా నాలుగేళ్ల విరామం తర్వాత రెండోసారి అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు. 

గ్రోవర్‌ క్లీవ్‌లాండ్‌ తర్వాత అమెరికా చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక నేతగా నిలిచారు. ఆ క్రమంలో పలు ఇతర రికార్డులూ సొంతం చేసుకున్నారు. అత్యంత ఎక్కువ వయసులో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన వ్యక్తిగా కూడా 78 ఏళ్ల ట్రంప్‌ నిలిచారు. క్రిమినల్‌ అభియోగాల్లో దోషిగా తేలిన ఏకైక మాజీ అధ్యక్షునిగా ట్రంప్‌ ఇప్పటికే చెత్త రికార్డును మూటగట్టుకోవడం తెలిసిందే. తాజా విజయంతో అలాంటి చరిత్రతో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన తొలి నేతగా కూడా నిలిచారు. 

పైగా పాపులర్‌ ఓటు కూడా గెలుచుకోవడంతో ట్రంప్‌ విజయానికి పరిపూర్ణత చేకూరినట్టయింది. 2016లో ట్రంప్‌ తొలిసారి అధ్యక్షునిగా నెగ్గినప్పుడు ఆయన కంటే ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు 28 లక్షల ఓట్లు ఎక్కువగా రావడం తెలిసిందే. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో ట్రంప్‌ ఇప్పటికే హారిస్‌ కంటే ఏకంగా 50 లక్షలకు పై చిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు. 20 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన రిపబ్లికన్‌ అధ్యక్షునిగా నిలిచారు. 

అంతేగాక తనకు మాయని మచ్చగా మిగిలిన 2020 అధ్యక్ష ఎన్నికల ఓటమి తాలూకు చేదు గుర్తులను కూడా ఈ గెలుపుతో చెరిపేసుకున్నారు. బైడెన్‌ విజయాన్ని తిరస్కరిస్తూ తన మద్దతుదారులను క్యాపిటల్‌ హిల్‌పై దాడికి ఉసిగొల్పి క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కోవడంతో ట్రంప్‌ రాజకీయ భవితవ్యం ముగిసినట్టేనని అంతా భావించారు. అలాంటి స్థితి నుంచి పుంజుకుని నాలుగేళ్ల తర్వాత ఆయన సాధించిన ఘనవిజయం రిపబ్లికన్‌ పార్టీలో ఆనందోత్సాహాలు నింపగా 60 ఏళ్ల హారిస్‌ ఓటమితో డెమొక్రాట్లు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. 

విజయం ఖాయం కాగానే ట్రంప్‌ తన భార్య మెలానియాను ఆప్యాయంగా అక్కుని చేర్చుకుని ముద్దాడారు. ఫ్లోరిడాలోని తన వెస్ట్‌పామ్‌ బీచ్‌ నివాసం వెలుపల భారీగా గుమిగూడిన అభిమానులకు అభివాదం చేశారు. రన్నింగ్‌మేట్‌ జేడీ వాన్స్‌తో తన ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి అమెరికా ప్రజలనుద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. మరోసారి తనపై విశ్వాసముంచినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘అపూర్వమైన, అత్యంత శక్తిమంతమైన ఫలితమిది. 

అమెరికా చరిత్రలో స్వర్ణయుగానికి నా విజయం నాంది’’ అని ప్రకటించారు. ‘‘భగవంతుడు ఏదో పెద్ద కారణంతోనే నాకు ప్రాణదానం చేశాడని చాలామంది చెప్పింది నిజమేనని ఈ ఫలితాలు రుజువు చేశాయి’’ అని ప్రచార పర్వంలో తనపై జరిగిన హత్యా ప్రయత్నాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ఇది అమెరికా ప్రజల విజయం. అంతేగాక దేశ చరిత్రలోనే అతి గొప్పదైన, కనీవిని ఎరగని రాజకీయ ఉద్యమమిది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘నా చివరి శ్వాస దాకా ప్రతి రోజూ మీ కోసం, మీ కుటుంబాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పోరాడతా. 

మీ జీవితాల్లో వెలుగులు పంచుతా. ద్రవ్యోల్బణం, అక్రమ వలసలతో సహా అన్ని సమస్యలకూ సమర్థ పరిష్కారం చూపుతా’’ అని వాగ్దానం చేశారు. ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తయి ట్రంప్‌ను అధ్యక్షునిగా లాంఛనంగా ప్రకటించేందుకు మరో రెండు నెలలు పట్టనుంది. అనంతరం జనవరి 20న ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. రెండోసారి శ్వేతసౌధంలో అడుగు పెట్టనున్న ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశాధినేతల నుంచి అభినందనలు, శుభాకాంక్ష సందేశాలు వెల్లువెత్తాయి. 

ముందునుంచీ... 
అమెరికావ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలింగ్‌ ప్రక్రియ కొనసాగింది. ఆ వెంటనే రాష్ట్రాలవారీగా ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదటినుంచీ ట్రంప్‌ ఆధిపత్యమే సాగుతూ వచ్చింది. చూస్తుండగానే ఏడు స్వింగ్‌ రాష్ట్రాల్లోనూ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. వాటిలో ఒకటైన విస్కాన్సిన్‌లో గెలుపుతో ఆయన 270 ఓట్ల మెజారిటీ మార్కును దాటగానే రిపబ్లికన్‌ నేతలు, అభిమానులు, మద్దతుదారులు దేశవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయారు. 

బుధవారం రాత్రి తుది ఫలితాలు వెల్లడయ్యే సమయానికి 538 ఎలక్టోరల్‌ ఓట్లలో ట్రంప్‌ 294 సొంతం చేసుకున్నారు. మరోవైపు హారిస్‌ 223 ఎలక్టోరల్‌ ఓట్లకే పరిమితమయేలా కన్పిస్తున్నారు. ట్రంప్‌కు 7.1 కోట్ల పై చిలుకు ఓట్లు రాగా ఆమెకు 6.6 కోట్లే వచ్చాయి. 50 రాష్ట్రాలకు గాను అరిజోనా, నెవడా, మెయిన్‌ ఫలితమే తేలాల్సి ఉంది. అరిజోనాల్లో ట్రంప్‌ గెలుపు లాంఛనమే కాగా మెయిన్, నెవడాల్లోనూ ఆయన ఇప్పటికే 50 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

ఆ మూడు రాష్ట్రాల్లోని 21 స్థానాలనూ గెలుచుకుని మరోసారి 300 మార్కు అలవోకగా దాటేలా కన్పిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆయనకు 304 ఓట్లు దక్కడం తెలిసిందే. తన ఓటమి ఖాయం కావడంతో హార్వర్డ్‌ వర్సిటీలో బుధవారం రాత్రి తలపెట్టిన ప్రసంగ కార్యక్రమాన్ని హారిస్‌ రద్దు చేసుకున్నారు. 

అధ్యక్షుడు బైడెన్‌ అభ్యర్థిత్వం పట్ల డెమొక్రాట్ల నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయనకు బదులుగా అనూహ్యంగా బరిలో దిగిన హారిస్‌కు ఈ ఫలితాలు నిరాశ కలిగించేవే. గెలిచి ఉంటే అధ్యక్ష పదవిని అధిష్టించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించేవారు. ట్రంప్, హారిస్‌ మధ్య పోటాపోటీ నెలకొన్నట్టు కొద్ది నెలలుగా ఎన్నికల సర్వేలన్నీ పేర్కొంటూ రావడం తెలిసందే. స్వింగ్‌ స్టేట్లలోనూ అదే పరిస్థితి ఉందని చెప్పడంతో ఫలితాలపై సర్వత్రా నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement