పోరు హోరాహోరీ అంటూ విశ్లేషణలు. హారిస్‌దే పైచేయి అంటూ అమెరికా మీడియాలో కథనాల వెల్లువ. అందుకు తగ్గట్టు ట్రంప్‌తో ఏౖకైక డిబేట్‌లోనూ హారిస్ స్పష్టమైన ఆధిపత్యం. వీటికి తోడు ఆమె ఆఫ్రికన్, భారత మూలాలు. మహిళల దన్నుపై ధీమా. అబార్షన్ వంటి కీలకాంశాలు కలిసొస్తా యన్న అంచనాలు. సెలబ్రిటీల బహిరంగ మద్దతు. రిపబ్లికన్లతో పోలిస్తే ప్రచారానికి వరదలా వచ్చి పడ్డ నిధులు. కానీ తీరా చూస్తే ట్రంప్ హవా ముందు అన్నీ కొట్టుకుపో యాయి. హోరాహోరీ అనుకున్న పోటీ కాస్తా ఫలితాలొచ్చే సరికి ఏకపక్షంగా మారిపోయింది. ట్రంప్ విజయానికి, హారిస్ పరాజయానికి దారితీసిన కారణాలను పరిశీలిస్తే...
1. అమెరికా ఫస్ట్
2016లో ట్రంప్‌ను విజయతీరాలకు చేర్చిన ఈ నినాదం ఈసారి కూడా గట్టిగా పని చేసింది. ఉక్రెయిన్‌కు మద్దుతుగా బైడెన్ సర్కారు వందలాది కోట్ల డాలర్లను గుమ్మరించడం సగటు అమెరికన్లకు మింగుడు పడలేదు. దానికి తోడు చైనా తదితర దేశాల నుంచి కారుచౌకగా వచ్చిపడుతున్న వస్తూత్పత్తులు వారి పొట్టకొట్టడమే గాక ఉపాధికి కూడా ఎసరు పెడుతున్నాయి. అసలే ధరాభారంతో కుంగిపోతున్న అమెరికన్లకు ఈ పరిణామం కొన్నేళ్లుగా రోకటిపోటుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాను ప్రాభవం కొడిగడుతున్న దేశంగా ట్రంప్ అభివర్ణించడాన్ని వారు సమర్థించారు. సుంకాలను భారీగా పెంచడం ద్వారా కారుచౌక దిగుమతులకు అడ్డుకట్ట వేస్తానన్న ప్రకటన అమెరికన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఆర్థిక అవ్యవస్థ సహా అన్ని సమస్యలనూ చక్కదిద్దడానికి హారిస్‌తో పోలిస్తే ట్రంపే సరైన నేత అని మెజారిటీ ప్రజలు భావించారు. ‘అమెరికా ఫస్ట్’ నినాదానికి విపరీతమైన స్పందన దక్కింది. అంతర్జాతీయంగా అన్ని రంగాల్లోనూ అమెరికా ప్రాధాన్యాన్ని పునరుద్ధరిస్తానన్న వాగ్దానం శ్వేతజాతీయుల మనసు గెలుచుకుంది.
2. అక్రమ వలసలు
వలసదారులు తమ అవకాశాలను తన్నుకుపోతున్నారన్న ఆక్రోశం స్థానికుల్లో చాలా ఏళ్లుగా నెలకొని ఉంది. వారిలోని ఈ వ్యతిరేకతను ట్రంప్ పూర్తిస్థాయిలో సొమ్ముచేసుకోగలిగారు. బైడెన్ నాలుగేళ్ల పాలనలో అమెరికాలోకి రికార్డు స్థాయిలో అక్రమ వలసలు జరిగాయి. వలసదారులు అమెరికన్ల పొట్టకొడుతు న్నారన్న ట్రంప్ వాదనతో వారు ఏకీభవించారు. వాటికి అడ్డుకట్ట వేయడమే గాక అక్రమంగా వచ్చిన 10 లక్షల పై చిలుకు మందిని స్వదేశాలకు పంపేస్తానని ప్రకటించడం ట్రంప్‌కు భారీగా లాభించింది.
3.ఎకానమీ
ఈసారి ట్రంప్‌ను గద్దెనెక్కించిన అంశాల్లో అత్యంత ముఖ్యమైనది. బైడెన్ పాలనలో గత నాలుగేళ్లలో ద్రవ్యోల్బణం చుక్కలను తాకింది. నిత్యావసరాల ధరలు అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రెండు రెట్లకు పైగా పెరిగిపోయాయి. కరోనా తదితర సమస్యలూ దానికి కారణమైనా ఓటర్లు మాత్రం బైడెన్‌ను, ఆయన డెమొక్రటిక్ పార్టీనే దోషులుగా చూశారు. ట్రంప్ హయాంలోనే ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండేదన్నది అమెరికన్లలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. ఆర్థిక అవ్యవస్థను చక్కదిద్దే సామర్థ్యం విషయంలో ట్రంప్‌తో పోలిస్తే హారిస్ తేలిపోయారని అన్ని సర్వేల్లోనూ తేలింది.
4. గ్రామీణ ఓటర్ల బ్రహ్మరథం
తొలినుంచీ ట్రంప్‌కు గట్టి ఓటు బ్యాంకుగా నిలిచిన గ్రామీణ ఓటర్లు ఆయనకు ఈసారి మరింత దన్నుగా నిలిచారు. గత కొన్ని ఎన్నికలతో పోలిస్తే ఈసారి వారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగినట్టు ఫలితాల సరళి చెబుతోంది. ఈ ట్రెండు దేశవ్యాప్తంగా కొనసాగడం ట్రంప్‌కు బాగా కలిసొచ్చింది. ఎందుకంటే గ్రామీణ ఓట్లను ఆయన దాదాపుగా స్వీప్ చేశారు.
మైనారిటీ ఓటర్లలోనూ పాగా
మెక్సికో తదితర లాటిన్ అమెరికా దేశాల నుంచి తరాల కిందట వలస వచ్చి స్థిరపడ్డ స్పానిష్ మాట్లాడే వారిని హిస్పానియన్లుగా పిలుస్తారు. ఫలితాల్లో వీరి ఓట్లూ కీలకమే. డెమొక్రాటిక్ పార్టీ ఓటర్లలో 12 శాతం దాకా ఉండే హిస్పానియన్లు కొన్నేళ్లుగా రిపబ్లికన్ పార్టీవైపు మొగ్గుతున్నారు. ఆ ట్రెండ్ కూడా ఈసారి కూడా కొనసాగినట్టు కన్పిస్తోంది. దీనికి తోడు హిస్పానియన్లకు, ఇండియన్ అమెరికన్లకు దగ్గరయ్యేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పోలింగ్ సమీపించిన తరుణంలో బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై దాడులను ఖండిస్తూ చేసిన ప్రకటన ఇండియన్ అమెరికన్లపై ప్రభావం చూపింది.
2020తో పోలిస్తే ట్రంప్‌కు ఈసారి లాటిన్, ఇండియన్ అమెరికన్ ఓట్లు గణనీయంగా పెరిగినట్టు దేశవ్యాప్తంగా 1.15 లక్షల ఓటర్లతో జరిపిన ఏపీ వోట్‌కాస్ట్ ప్రాథమిక సర్వే తేల్చింది. 2020లో బైడెన్‌కు ప్రతి 10 మంది లాటిన్ ఓటర్లలో 9 మంది ఓటేయగా ఈసారి హారిస్‌కు 8 మందే వేసినట్టు పేర్కొంది. 2020లో 60 శాతం పడ్డ హిస్పానియన్ ఓట్లు ఈసారి 50 శాతానికి తగ్గాయి. 30 ఏళ్ల లోపు ఓటర్లలో 2020లో బైడెన్‌కు 60 శాతం మంది ఓటేయగా ఈసారి అది 50 శాతానికి పరిమితమైంది. వారిలో 2020లో ట్రంప్‌కు మూడో వంతే ఓటేయగా ఈసారి అది 40 శాతానికి పెరిగింది. ఈ చిన్న మార్జిన్లే తుది ఫలితాలను గట్టిగా ప్రభావితం చేశాయి.
5. భావజాలాలు
పైకి కన్పించకపోయినా అమెరికా సమాజంలో జాత్యహంకారం, పురుషాధిక్య భావజాలం బలంగా వేళ్లూనుకుని ఉన్నాయి. ట్రంప్‌కు శ్వేతజాతీయులు మొదటినుంచీ గట్టి మద్దతుదారులుగా ఉండటానికి ఇది కూడా కారణమేనని చెబుతారు. అందుకే ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ వంటి ట్రంప్ నినాదాల్లో అంతర్లీనంగా దాగున్న ఆ భావనలు ఓటర్లపై గట్టి ప్రభావమే చూపాయని భావిస్తున్నారు. వీటికి తోడు ట్రంప్‌పై కోర్టు కేసులు, క్రిమినల్ అభియోగాలను ప్రజలు పట్టించుకోకపోవడం కూడా ఆయనకు కలిసొచ్చింది. పైగా ప్రస్తుతం దేశానికి కావాల్సింది ఆ దూకుడేనని వారు భావించారు. దీన్ని ట్రంప్ కూడా అంగీకరించడం విశేషం. తనపై ఉన్న కేసులు, అభియోగాలు జనాదరణను మరింతగా పెంచాయని చెప్పుకొచ్చారాయన.
Comments
Please login to add a commentAdd a comment